మిత్రులారా, అయిదు రోజుల నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటనకు బయలుదేరబోతున్నాను. అధ్యక్షుడు శ్రీ బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమాఫ్రికా ప్రాంతంలో మనకు మిత్రదేశమైన నైజీరియాలో నేను తొలిసారిగా పర్యటించబోతున్నాను. ప్రజాస్వామ్యం, బహుళవాదాల పట్ల ఇరుదేశాలకూ గల నిబద్ధత పునాదిగా ఏర్పడ్డ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈ పర్యటన సందర్భంగా మరింత పటిష్ఠమవగలదు. ఇక ఎంతో అభిమానంతో నాకు హిందీలో ఆహ్వాన సందేశాలు పంపిన నైజీరియా మిత్రులనూ, స్థానిక భారతీయులనూ కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
బ్రెజిల్ పర్యటనలో భాగంగా 19వ జి-20 సమావేశాల్లో ట్రోయికా (మూడుగా కలిసి ఉన్న)లో ఒకరిగా నేను పాల్గొనబోతున్నాను. గతేడాది మన దేశ అధ్యక్షతన విజయవంతంగా ముగిసిన జి -20 సమావేశాలు, మన పౌరుల భాగస్వామ్యం వల్ల ‘ప్రజా జి-20’ సమావేశాలుగా మారిపోయాయి. అంతేకాక, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యాలకు జి-20 ఎజెండాలో చెదరని స్థానం దక్కేలా చేశాయి. తదుపరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బ్రెజిల్… భారత్ విజయాలను మరింత ముందుకు తీసుకువెళ్లింది. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” అన్న మన సూత్రానికి అనుగుణంగా అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. సమావేశాల్లో పాల్గొనే ఇతర దేశనాయకులతో కలిసి పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల గురించి చర్చిస్తాను.
గయానా దేశాధ్యక్షుడు శ్రీ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటన చేపడుతున్నాను. 50 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధాని గయానాలో పర్యటించనుండడం విశేషం. సంస్కృతి, వారసత్వం, విలువల పరంగా ఒకే ఆలోచనా ధోరణి గల దేశాలు భారత్ గయానాలు. ఇరుదేశాల విలక్షణ స్నేహం ఊతంగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన దిశను కల్పించే అంశాన్ని చర్చిస్తాం. 185 ఏళ్ళ కిందటే పుట్టిన గడ్డ నుంచి మరో దేశానికి వలస వెళ్ళిన అతి పురాతన భారతీయ సమాజ సభ్యులను గయానాలో కలుసుకుని వారికి నా అభినందనలు తెలియజేస్తాను. ప్రజాస్వామ్య దేశమైన గయానా పార్లమెంటునుద్దేశించి కూడా నేను ప్రసంగిస్తాను.
కరీబియన్ భాగస్వామ్య దేశాధినేతలతో కలిసి రెండో ‘భారత్–కేరికామ్’ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను. కూటమి సభ్యులైన మేం ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను కలిసి ఎదుర్కొన్నాం. చారిత్రిక సంబంధాల పునరుద్ధరణకు, నూతన రంగాలకు సహకార విస్తరణకు శిఖరాగ్ర సమావేశాలు దోహదపడతాయి.
***