అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా గురువారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ పరమాణు భద్రతకు ఎదురవుతున్న బెదిరింపులను గురించి మాట్లాడారు.
పరమాణు భద్రతపై వెలుగును ప్రసరింపచేసినందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామాను ప్రధాన మంత్రి అభినందించారు. ఇందుకు పూనుకోవడం ద్వారా శ్రీ ఒబామా విశ్వ భద్రత కు గొప్ప సేవ చేశారని ప్రధాన మంత్రి అన్నారు.
బ్రసెల్స్ లో ఇటీవల జరిగిన బీభత్స దాడులను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఉగ్ర వాదం నుంచి పరమాణు భద్రతకు ఎదురవుతున్న బెడద ఎంత వాస్తవికమైనదీ, తక్షణమైనదన్నది బ్రసెల్స్ మనకు చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి మూడు సమకాలీన అంశాలపై దృష్టి సారించవలసిన ఉన్నదని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వాటిలో ఒకటోది- ఇవాళ్టి ఉగ్రవాదం తీవ్రమైన హింసకు ఒడిగడుతోంది; రెండోది- మనం ఇప్పుడిక ఏదో గుహలో దాక్కుని ఉన్న వ్యక్తిని గాలించడం లేదు, నగర ప్రాంతంలో కంప్యూటర్ గాని, లేదా స్మార్ట్ ఫోన్ ను గాని ఉపయోగిస్తున్న ఉగ్రవాది కోసం వేటాడుతున్నాం; మూడోది- పరమాణు అస్త్రాలను అక్రమంగా చేరవేసే వారితోను, ఉగ్రవాదులతోను ప్రభుత్వ ప్రతినిధులు కుమ్మక్కు అవుతూ ఉండటం అత్యంత పెద్ద రిస్కుగా పరిణమించింది.. అని ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు.
అత్యంత భీతిని సృష్టించడమనేది పరిణామ క్రమం చెందుతోంది, ఉగ్రవాదులు 21వ శతాబ్దపు సాంకేతికతను వినియోగించుకొంటున్నారంటూ ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా మనం చేపడుతున్న చర్యలేమో పాత కాలపు నాటివే అయి ఉంటున్నాయని పెదవి విరిచారు. తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకొందని, కానీ మనం ఈ ముప్పునకు ఎదురొడ్డటానికి ఇప్పటికీ కేవలం దేశాల స్థాయి లోనే పనిచేస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. ఉగ్రవాద మూకలు, ఉగ్రవాద పరిధి దేశ దేశాలకు విస్తరిస్తూపోతుంటే, వేరు వేరు దేశాల మధ్య నికార్సయిన సహకారం మాత్రం వ్యాప్తి చెందడం లేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
ఉగ్రవాద చర్యలను నివారించకుండా ఉంటేను, ఉగ్రవాద చేష్టలపై విచారణ జరపకుండా ఉంటేను పరమాణు ఉగ్రవాదాన్ని నిరోధించలేకపోతాము అని ప్రధాన మంత్రి చెప్పారు. ఉగ్రవాదం అనేది ఎవరో వేరే వారికి సంబంధించిన సమస్య అనే భావనను, “అతడి” ఉగ్రవాది.. “నా” ఉగ్రవాది కాదు అనే భావనను వదలివేయండి అని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.
పరమాణు భద్రత అనేది ప్రతి ఒక్క దేశం కట్టుబడి ఉండాల్సిన ప్రాధాన్య అంశంగా ఉండి తీరవలసిందే, అన్ని దేశాల ప్రభుత్వాలు వాటి వాటి అంతర్జాతీయ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించి తీరవలసిందే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
PM @narendramodi and @POTUS in discussion at the NSS Dinner at the White House. pic.twitter.com/bbbD0fBqcC
— PMO India (@PMOIndia) March 31, 2016
Interacted with world leaders at the NSS dinner at the White House. Shared my thoughts on the threat of nuclear terrorism.
— Narendra Modi (@narendramodi) April 1, 2016