ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషింగ్ టన్ డిసి లో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అమెరికా లోని అగ్రగామి సిఇఒ లు 20 మందితో భేటీ అయ్యి, వారితో తన అభిప్రాయాలు పంచుకొన్నారు.
సిఇఒ లను సమావేశంలో పాల్గొనేందుకు స్వాగతిస్తూ, ప్రపంచం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై శ్రద్ధ చూపెడుతోందన్నారు. యువతరంతో నిండిన జనాభా, వర్ధిల్లుతున్న మధ్య తరగతి ప్రజానీకం.. ఇవి భారతదేశ ఆర్థిక రంగం పట్ల, ప్రధానంగా, తయారీ, వ్యాపారం & వాణిజ్యం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం కావడానికి కారణాలు అవుతున్నట్టు ఆయన చెప్పారు.
గత మూడు సంవత్సరాలలో, భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టిపెట్టిందన్నారు.
దీనికిగాను ప్రపంచ భాగస్వామ్యం అవసరమవుతుందని ప్రధాన మంత్రి అన్నారు. కాబట్టి, భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన వంటి సూత్రాలపై పనిచేస్తోందని ఆయన అన్నారు.
ఇటీవలి సంస్కరణలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 7 వేల సంస్కరణలను మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. భారతదేశం ప్రపంచ కొలమానాల అన్వేషణలో సాగుతోందని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. సమర్ధత, పారదర్శకత్వం, వృద్ధి, అందరికీ ప్రయోజనం.. వీటిపై ప్రభుత్వం పట్టుబట్టుతోందని అయన అన్నారు.
జిఎస్ టి గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి సాగిన ప్రయత్నం అనంతరం ఇది వాస్తవరూపాన్ని దాల్చుతోందన్నారు. దీనిని అమలుచేయడం ఒక సంక్షిష్టమైనటువంటి కార్యభారమని, బహుశా ఇది భావి అధ్యయనాలకు ఉపయోగపడగల ఒక విషయంగా కూడా కావచ్చని ఆయన అన్నారు. ఇది భారతదేశం పెద్ద నిర్ణయాలను తీసుకోగలుగుతుందని, వాటిని సత్వరం అమలుపరచగలదని నిరూపిస్తోందని ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి చేపట్టిన కార్యక్రమాలు, వ్యాపారం చేయడాన్ని సులభతరంగా మార్చే దిశగా ఇటీవల పూర్తి చేసిన పనుల పట్ల సిఇఒ లు అభినందనలు వ్యక్తంచేశారు. ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, నైపుణ్యాలకు పదును పెట్టడం, నోట్ల చెలామణి రద్దు, ఇంకా నవీకరణయోగ్య శక్తి కి ప్రాధాన్యం ఇవ్వడం వంటి కార్యక్రమాలు అనేక మంది సిఇఒ ల వేనోళ్ల ప్రశంసలకు పాత్రమయ్యాయి. నైపుణ్యాల పరిధి విస్తరణ, విద్యా సంబంధ కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవడానికి పలువురు సిఇఒ లు వారి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తమ కంపెనీలు భారతదేశంలో మహిళా సాధికారత, డిజిటల్ టెక్నాలజీ, విద్యావ్యాప్తి, ఫూడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో చేపడుతున్న సామాజిక కార్యకలాపాలను గురించి కూడా వారు సమావేశంలో వెల్లడించారు. అవస్థాపన, రక్షణ రంగ సామగ్రి తయారీ, శక్తి భద్రత కూడా చర్చకు వచ్చాయి.
ముగింపులో, ప్రధాన మంత్రి సిఇఒ లకు వారు వెల్లడించిన అభిప్రాయాలకు గాను ధన్యవాదాలు తెలిపారు. రేపు ప్రెసిడెంట్ శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో తన సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వారితో చెప్పారు. భారతదేశం, అమెరికా పరస్పరం విలువలను గౌరవించుకొంటున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా మరింతగా బలాన్ని పుంజుకొంటే, భారతదేశం సహజంగానే లబ్ధిని పొందుతుందని ఆయన అన్నారు. మహిళా సాధికారత, నవీకరణయోగ్య శక్తి, స్టార్ట్ అప్ లు, నవకల్పన వంటి రంగాలలో సిఇఒ లు మరింతగా శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. బడికి వెళ్లే బాలికల అవసరాలకు తగినట్లుగా పారిశుధ్య విధానాలు, ఉత్పత్తులు మరియు సాంకేతిక విజ్ఞానం.. వీటిని ముడిపెట్టడం జరగాలి అని ఆయన సూచించారు. భారతదేశంలో జీవన నాణ్యతను మెరుగుపరచడంలోనే తాను ప్రధానంగా శ్రద్ధ తీసుకొంటున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.
*****
PM @narendramodi interacted with top Indian and American CEOs in Washington DC. pic.twitter.com/oK908BmZJC
— PMO India (@PMOIndia) June 25, 2017
Interacted with top CEOs. We held extensive discussions on opportunities in India. pic.twitter.com/BwjdFM1DaZ
— Narendra Modi (@narendramodi) June 25, 2017