దిగువ పేర్కొన్న వివరాల ప్రకారం… అమెరికాలో టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)కు 100 శాతం యాజమాన్యంగల ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
i. టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)కు చెందిన ‘సి’ కార్పొరేషన్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఏర్పాటవుతుంది. అమెరికాలోని ఇతర రాష్ట్రాలలోనూ నమోదు చేసుకోవడంతోపాటు తదనంతరం వ్యాపారం నిర్వహించడానికి కూడా దీనికి అనుమతి ఉంటుంది.
ii. టీసీఐఎల్ ‘సి’ కార్పొరేషన్‌లో 100 శాతం ఈక్విటీ వాటా కింద 5 మిలియన్ల అమెరికా డాలర్ల (మారకం విలువను రూ.67.68గా పరిగణిస్తూ భారత కరెన్సీలో రూ.33.84 కోట్ల)ను దశలవారీగా పెట్టుబడి పెడుతుంది.
iii. అమెరికాలో ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా రుణదాతలు/సౌలభ్య సంస్థలు/విక్రేతలతోపాటు బిడ్ బాండ్లు/అడ్వాన్సులు/పనితీరు గ్యారంటీలు వగైరాల కోసం 5 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన కౌంటర్ గ్యారంటీలను టీసీఐఎల్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ కార్యకలాపాల ద్వారా ‘సి’ కార్పొరేషన్ దేశానికి అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతుంది. దీంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన టీసీఐఎల్ లాభదాయకతను పెంచుతుంది.
అమెరికాలో ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ఆ దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.
కొత్తగా ఏర్పాటయ్యే ‘సి’ కార్పొరేషన్ తొలి సంవత్సరాల్లో 10 మిలియన్ల అమెరికా డాలర్ల వార్షిక వ్యాపార పరిమాణం (టర్నోవర్)తో సుమారు 10 శాతం లాభాలను ఆర్జించగలదని అంచనా. తదనంతరం చేపట్టే పనుల పరిమాణాన్ని బట్టి లాభశాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
అమెరికాలో ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటుద్వారా టీసీఐఎల్ తన వ్యాపారం/టర్నోవర్/లాభాలను విస్తరించుకునే వీలు కలుగుతుంది. ఇది ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి అంతిమంగా ప్రభుత్వానికి లాభాల్లో వాటా కూడా పెరుగుతుంది.
వాటాల రూపేణా మొత్తం 5 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడుల కోసం నిధులను టీసీఐఎల్ తన అంతర్గత వనరులనుంచి సమీకరించుకుంటుంది. దీంతోపాటు వ్యాపార విస్తరణసహా బిడ్ బాండ్లు/గ్యారంటీల ముందస్తు చెల్లింపు/ప్రభుత్వ సంస్థలకు పనితీరు బ్యాంకు గ్యారంటీలు/‘సి’ కార్పొరేషన్ తరఫున అంతిమ కక్షిదారుల తరఫున అమెరికాలో ఆర్థిక సహాయం తదితరాల కోసం మరో 5 మిలియన్ అమెరికా డాలర్ల మేర టీసీఐఎల్ కౌంటర్ గ్యారంటీలను సమర్పించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.
నేపథ్యం:
వందశాతం భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టీసీఐఎల్ ఐఎస్ఓ-9001:2008, ఐఎస్ఓ-14001:2004 ధ్రువీకరణతో అగ్రగామి సంస్థగా ఉంది. అంతేగాక షెడ్యూల్-ఎ, మినీరత్న హోదా కూడా కలిగి ఉంది. టెలి కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక రంగంలో ఇప్పటికే 70 దేశాల్లో పలు ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఈ రెండు రంగాల్లోనే కాకుండా పౌర సదుపాయాల కల్పన రంగంలోనూ సంప్రదింపుల సేవలతోపాటు ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ప్రాజెక్టు సురక్షణ సేవలను కూడా అందిస్తుంది.
ఈ కంపెనీ ఏకీకృత నికరవిలువ 2017 మార్చి 31నాటికి రూ.2,433.66 కోట్లుగా, స్వతంత్ర నికర విలువ రూ.588.92 కోట్లుగా నమోదైంది. అలాగే ఇదే తేదీనాటికి భారత ప్రభుత్వానికి రూ.192.99 కోట్ల మేర సంచిత లాభాంశాన్ని చెల్లించింది/ప్రకటించింది.
అమెరికాలోని అన్ని నగరాలకూ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, కేబుల్ టీవీ సేవలందించేందుకు గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన ’ఫైబర్ టు ది ప్రెమిసెస్ ప్రాజెక్ట్’లో ‘గూగుల్ ఫైబర్’ అన్నది భాగంగా ఉంది. ఈ సేవలకు సంబంధించి తమ సాంకేతిక భాగస్వాములుగా గూగుల్ సంస్థ కొన్ని అంతర్జాతీయ కంపెనీలను ఎంపిక చేసుకుంది. ఎరిక్సన్, మాస్టెక్, ఏటీ అండ్ టీ, జోయా వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ తమకు దక్కిన పనులలో వివిధ కార్యకలాపాలను పలు కంపెనీలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చాయి. ఇందులో భాగంగా మాస్టెక్‌తో టెలిటెక్ సంస్థ మాస్టర్ సర్వీసు ఒప్పందం చేసుకోగా- ఆస్టిన్ (టెక్సాస్), శాన్ జోస్ (కాలిఫోర్నియా)లలో నెట్ వర్క్ విస్తరణ పనులు చేసేందుకు ఎరిక్సన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, వాణిజ్య, రవాణా సేవలను పూర్తిస్థాయిలో అందించాల్సిందిగా టెలిటెక్ సంస్థ బృందం టీసీఐఎల్‌ను సంప్రదించింది. అనంతరం 2016 ఏప్రిల్ 13న టెలిటెక్‌తో టీసీఐఎల్ అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అటుపైన 2016 మే 27న సంయుక్త సహకార ఒప్పందం కూడా కుదిరింది. అయితే, టీసీఐఎల్ విదేశీ సంస్థ కాబట్టి, ప్రత్యేక పన్ను చెల్లింపుదారు సంస్థగా ‘సి’ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీనివల్ల తన మానవ వనరులకు అవసరమైన ఎల్-1 వీసాలను టీసీఐఎల్ పొందగల సదుపాయం ఏర్పడింది.