భారత్ మాతాకీ – జై!
భారత్ మాతాకీ – జై!
భారత్ మాతాకీ – జై!
నమస్తే అమెరికా! ఇప్పుడు మన “నమస్తే” కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.
స్నేహితులారా,
మీరంతా దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. కొన్ని ముఖాలు సుపరిచితమైనవి, మరికొన్ని కొత్తవి. మీ ప్రేమపట్ల నాకు గొప్ప గౌరవం ఉంది. నేను ప్రధానినీ, ముఖ్యమంత్రినీ, నాయకుడినీ ఎంతమాత్రం కాని రోజులు గుర్తున్నాయి. అప్పట్లో ఈ దేశాన్ని చూడాలన్న, అర్థం చేసుకోవాలన్న ఆసక్తితో, మనసులో ఎన్నో ప్రశ్నలతో జిజ్ఞాసగల యాత్రికుడిగా ఇక్కడికి వచ్చే వాడిని. నేను ఎలాంటి అధికారిక పదవిలో లేకుండానే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించాను. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాక టెక్నాలజీ ద్వారా మీతో మమేకమయ్యాను. తరువాత ఒక ప్రధానమంత్రిగా కూడా మీ నుండి అపారమైన ప్రేమ, స్నేహాన్ని పొందాను. 2014లో మాడిసన్ స్క్వేర్, 2015లో శాన్ జోస్, 2019లో హ్యూస్టన్, 2023లో వాషింగ్టన్, ఇప్పుడు 2024లో న్యూయార్క్—ప్రతిసారీ, మీరు గత రికార్డును అధిగమిస్తూ వెళుతున్నారు.
స్నేహితులారా,
ప్రవాస భారతీయుల బలాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తిస్తాను. నేను ఏ అధికారిక పదవిలో లేనప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకున్నాను, ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ భారతదేశానికి అత్యంత శక్తిమంతమైన బ్రాండ్ అంబాసిడర్లు. అందుకే నేను మిమ్మల్ని ‘భారత దేశ దూతలు‘ అని పిలుస్తాను. మీరు అమెరికాను భారత దేశంతో, భారత్‌ను అమెరికాతో కలిపారు. మీ నైపుణ్యాలు, ప్రతిభ, నిబద్ధత అమోఘం. మీరు సప్త సముద్రాలు దాటినా, మీ హృదయంలో ఉన్న భారతదేశం నుండి మిమ్మల్ని వేరు చేసేంత లోతైన సముద్రం లేదు. భారతమాత నేర్పిన విషయాలను మనం ఎప్పటికీ మరచిపోలేం. ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాం. వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకోవడం, అందులో జీవించడం, చివరికి దానిని మనలోపలికి తీసుకోవడం—ఇవే మన విలువలు, మనలో అంతర్లీనంగా ఉన్న విశ్వాసాలు. మనం వందలాది భాషలు, మాండలికాలు, అనేక మతాలకు, తెగలకు పుట్టినిల్లు అయిన దేశం నుంచి వచ్చాం. అయినా ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ హాల్లోనే కొందరు తమిళం, మరికొందరు తెలుగు, మలయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ లేదా గుజరాతీ మాట్లాడే వారు ఉన్నారు. మన భాషలు వేరు కావచ్చు, కానీ మన ఆత్మ ఒక్కటే. “భారత మాతా కి జై”. ఇదే భారతీయ స్ఫూర్తి. ప్రపంచంతో కలవడంలో ఇదే మన అత్యంత గొప్ప శక్తి. ఈ విలువలు మనల్ని సహజంగానే ‘విశ్వబంధు‘ (ప్రపంచ మిత్రుడు)గా మారుస్తాయి. మన శాస్త్రాలు చెబుతున్నట్లుగా, “తేన త్యక్తేన భుజీథాః అంటే త్యాగం చేసే వారే నిజమైన ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు మంచి చేయడం ద్వారా, త్యాగం చేయడం ద్వారా ఆనందాన్ని పొందగలం. మనం ఎక్కడ నివసిస్తున్నా, ఈ స్ఫూర్తి ఇలాగే ఉంటుంది. మనం నివసించే సమాజాలకు మన వంతు సేవలను పూర్తిగా అందిస్తాం. అమెరికాలో డాక్టర్లు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు లేదా ఇతర వృత్తుల్లో ఉన్నా, మీరు అత్యున్నత స్థాయికి ఎదిగారు, దాన్ని ప్రపంచం కూడా చూచింది. కొద్ది రోజుల కిందట ఇక్కడ టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. అమెరికా జట్టు అద్భుతంగా ఆడింది. ఆ జట్టులో ఇక్కడ నివసించే భారతీయుల ప్రతిభను కూడా ప్రపంచం చూసింది.
స్నేహితులారా,
ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం, కానీ నేను ఏఐ అంటే అమెరికా– ఇండియా అని భావిస్తాను. ఈ అమెరికా– ఇండియా (భారత్ ) స్ఫూర్తి కొత్త ప్రపంచానికి ఏఐ శక్తి. ఇది ఇండో– అమెరికా సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ప్రవాస భారతీయులైన మీ అందరికీ నా వందనాలు.
స్నేహితులారా,
నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రతి నాయకుడి నుంచి ప్రవాస భారతీయుల గురించిన ప్రశంసలు మాత్రమే వింటాను. నిన్ననే అధ్యక్షుడు బైడెన్ నన్ను డెలావేర్ లోని తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన చూపించిన ఆప్యాయత, ఆతిథ్యం మనసుకు హత్తుకుంది. ఈ గౌరవం 140 కోట్ల భారతీయులకు, మీ కష్టానికి, ఇక్కడ నివసిస్తున్న లక్షలాది భారతీయులకే చెందుతుంది. ప్రెసిడెంట్ బైడెన్‌కు, మీ అందరికీ నా కృతజ్ఞతలు.
స్నేహితులారా,
2024 సంవత్సరం ప్రపంచానికి అత్యంత కీలకమైనది. ఒకవైపు దేశాల మధ్య సంఘర్షణలు, ఉద్రిక్తతలు కనిపిస్తాయి, మరొకవైపు కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంతో పరిఢవిల్లుతాయి. ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో భారత్, అమెరికా కలిసి ఉన్నాయి. ఇక్కడ అమెరికాలో ఎన్నికలు రాబోతున్నాయి. భారత్ ఇప్పటికే తన ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికలు భారతదేశంలోనే కాకుండా, మానవ చరిత్రలోనే అతి పెద్దవి. మీరు ఊహించవచ్చు, మీరు ఊహించుకోండి– అమెరికా మొత్తం జనాభాకు దాదాపు రెట్టింపు ఓటర్లు, యూరోప్ మొత్తం జనాభా కన్నా ఎక్కువ మంది ఓటర్లు! భారత్‌లో ఎంతో మంది తమ ఓటు ఉపయోగించుకున్నారు, భారత్ ప్రజాస్వామ్య విస్తీర్ణాన్ని చూస్తుంటే, అది మనలో గర్వాన్ని నింపుతుంది. మూడు నెలలపాటు సాగిన ఓటింగ్ ప్రక్రియ,1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది, 10 లక్షల ఓటింగ్ కేంద్రాలు, 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, 8,000 కంటే ఎక్కువ అభ్యర్థులు, అనేక భాషలలో వేలాది పత్రికలు, వందలాది రేడియో స్టేషన్లు, టీవీ న్యూస్ చానళ్లు, లక్షలాది సోషల్ మీడియా ఖాతాలు, లక్షల సోషల్ మీడియా చానళ్లు— ఇవన్నీ భారత ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తున్నాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ విస్తరిస్తున్న కాలం. మన ఎన్నికల ప్రక్రియ పున సమీక్షకు లోనవుతున్న సమయం.
స్నేహితులారా,
సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ ఈసారి భారత్ లో అనూహ్య పరిణామానికి దారితీసింది. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ‘అబ్కీ బార్ – ‘ ( మళ్లీ ఈసారి-), ‘అబ్కీ బార్ – ‘ ( మళ్లీ ఈ సారి-), ‘అబ్కీ బార్ – ‘ (ఈసారి మళ్లీ-)!
స్నేహితులారా,
మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత 60 ఏళ్లలో భారత్ లో ఇలా జరగలేదు. భారత ప్రజలు మనకు ఇచ్చిన తీర్పు చాలా ఘనమైనది, ముఖ్యమైనది. ఈ మూడోసారి అధికారంలో మనం ఇంకా ఎక్కువ లక్ష్యాలను సాధించాల్సి ఉంది. మూడు రెట్ల బలంతో, మూడు రెట్ల వేగంతో ముందుకు సాగాలి. మీకు ఒక పదం గుర్తుంటుంది: పుష్పం (పువ్వు). అవును, ఇది కమలం అనుకోండి – నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పుష్ప్ – పి యు ఎస్ హెచ్ పి – ని నేను ఇలా నిర్వచిస్తాను. పి – ప్రోగ్రెసివ్ (అభ్యుదయ) భారత్, యు– అన్ స్టాపబుల్ (ఎదురులేని) భారత్, ఎస్– స్పిరిచ్యువల్ (ఆధ్యాత్మిక) భారత్ , హెచ్– హ్యూమానిటీ ఫస్ట్ (మానవత్వం ప్రాధాన్య) భారత్ , పి– ప్రోస్పరస్ ( సంపన్న) భారత్. పువ్వు లోని ఈ అయిదు రేకులు కలిసి ‘వికసిత్ భారత్ ‘గా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చి దిద్దుతాయి.
స్నేహితులారా,
స్వాతంత్రం వచ్చిన తరువాత జన్మించిన తొలి భారత ప్రధానిని నేనే. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో లక్షలాది మంది భారతీయులు స్వరాజ్యం (స్వయం పాలన) కోసం తమ జీవితాలను అంకితం చేశారు. వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సుఖాల గురించి ఆలోచించ లేదు. అన్నీ వదిలిపెట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారిలో కొంతమందిని ఉరి తీశారు. కొందరిని కాల్చి చంపారు, కొందరు చిత్రహింసలకు గురయ్యారు, ఇంకా అనేక మంది యువకులు జైళ్లలో మగ్గిపోయారు.
స్నేహితులారా,
మనం మన దేశం కోసం చనిపోనక్కరలేదు. కానీ దాని కోసం జీవించగలగాలి. చనిపోవడం మన చేతుల్లో లేదు. కానీ జీవించడం మన చేతుల్లోనే ఉంది. మొదటి నుంచీ నా మనస్సు, లక్ష్యం స్పష్టంగా ఉంది. నేను ‘స్వరాజ్’ (స్వాతంత్ర్యం) కోసం నా జీవితం ఇవ్వలేకపోయాను, కానీ ‘ సురాజ్’ ( మంచి పాలన) ‘సమృద్ధ’ (సంపన్న ) భారత్‌కు నా జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఎక్కువ భాగం ఏళ్ల తరబడి దేశమంతటా తిరుగుతూ గడిపాను. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తిన్నాను. ఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడ పడుకున్నాను. సముద్ర తీరాల నుండి పర్వతాల వరకు, ఎడారి నుండి మంచుతో కప్పబడిన శిఖరం వరకు ప్రతి ప్రాంతంలో ప్రజలను కలుసుకుని వారి గురించి తెలుసుకున్నాను. అర్థం చేసుకున్నాను. నా దేశం గురించి, సంస్కృతి, సవాళ్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. నా మార్గం వేరైనప్పటికీ విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నేను ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదు. కానీ 13 ఏళ్ల పాటు గుజరాత్ లో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నన్ను ఆ తర్వాత ప్రజలు ప్రధానిగా పదోన్నతి ఇచ్చారు. దేశవ్యాప్తంగా పర్యటించి నేను నేర్చుకున్న పాఠాలు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నా పాలనా నమూనాను రూపొందించాయి. గత పదేళ్లలో, ఈ పాలనా నమూనా విజయం మీకు, ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో నమ్మకంతో భారత ప్రజలు నాకు మూడోసారి అవకాశం ఇచ్చారు. ఈ మూడో టర్మ్ ను మూడు రెట్ల బాధ్యతతో చూస్తున్నాను.
స్నేహితులారా,
నేడు, భారతదేశం ప్రపంచంలోని అతి పిన్నవయసు కలిగిన దేశాల్లో ఒకటి. భారత్ అనేది శక్తి, కలలతో నిండిన దేశం. ప్రతి రోజు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ కొత్త వార్తలు. ఈ రోజే గొప్ప శుభవార్త అందింది. చెస్ ఒలింపియాడ్ పురుషులు, మహిళల విభాగాల్లో– భారత్ స్వర్ణం సాధించింది. కానీ నేను మీకు మరొక విషయం చెబుతున్నాను. దీనికి మరింత చప్పట్లు అవసరం. దాదాపు వందేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి! చదరంగం క్రీడాకారులను చూసి యావత్ దేశం, ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారు. అన్నట్టు – భారత్‌ను నడిపించే మరో ఏఐ ఉంది. అది ఏమిటంటే? ఎ అంటే యాస్పిరేషనల్ , ఐ అంటే ఇండియా (భారత్). యాస్పిరేషనల్ ఇండియా అంటే ఆకాంక్షాత్మక భారత్. ఇది మన కొత్త శక్తి. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు భారత్ అభివృద్ధిని నడుపుతున్నాయి. ప్రతి ఆకాంక్ష కొత్త విజయానికి దారితీస్తోంది. ప్రతి విజయం కొత్త ఆకాంక్షకు ఊపిరి పోస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత్ 10వ స్థానం నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. భారత్ త్వరగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. నేడు, భారతదేశ జనాభాలో అధిక భాగం ప్రజల ప్రాథమిక అవసరాలు తీరాయి. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛమైన వంటగ్యాస్, కుళాయి నీరు, విద్యుత్, మరుగుదొడ్లు పొందారు. ఈ కోట్ల మంది ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలను ఆశిస్తున్నారు.
స్నేహితులారా,
భారత ప్రజలకు కేవలం రోడ్లు మాత్రమే అక్కర్లేదు. వారు అద్భుతమైన ఎక్స్ ప్రెస్ వేలను కోరుకుంటున్నారు. ఇప్పుడు భారత ప్రజలు కేవలం రైలు సౌకర్యాన్ని మాత్రమే కోరుకోవడం లేదు; హైస్పీడ్ రైళ్లు కావాలంటున్నారు. భారత్ లోని ప్రతి నగరం మెట్రో సేవలను ఆశిస్తోంది. అలాగే ప్రతి నగరం సొంత విమానాశ్రయం కోసం ఎదురుచూస్తోంది. గ్రామం నుంచైనా, నగరం నుంచైనా ప్రతి పౌరుడు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కోరుకుంటున్నారు. మేం ఈ ఆకాంక్షల ఫలితాలను చూస్తున్నాం. 2014లో భారత్ లో కేవలం అయిదు నగరాల్లో మాత్రమే మెట్రో సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం 23 నగరాల్లో మెట్రోలు ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో సర్వీసులు కలిగిన దేశం. భారత్ రోజురోజుకూ విస్తరిస్తోంది.
స్నేహితులారా,
2014లో భారత్ లో కేవలం 70 నగరాల్లో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయి. నేడు, 140 కి పైగా నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. 2014లో 100 కంటే తక్కువ గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉంది. నేడు, 200,000 కంటే ఎక్కువ పంచాయతీలు దీనిని కలిగి ఉన్నాయి. 2014 లో భారతదేశంలో 14 కోట్ల ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. నేడు, ఈ సంఖ్య 31 కోట్లకు పైగా పెరిగింది. ఏళ్ల తరబడి పట్టే పనులు ఇప్పుడు నెలల లోనే పూర్తవుతున్నాయి. భారతదేశ ప్రజలలో కొత్త విశ్వాసం కనబడుతోంది. తమ లక్ష్యాలను చేరుకునే సంకల్పం వారిలో ఉంది. భారత్‌లో అభివృద్ధి ప్రజల ఉద్యమంగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఈ అభివృద్ధి ఉద్యమంలో సమాన భాగస్వామిగా మారుతున్నారు. వారు భారత్ విజయంపై, అది సాధించే వాటిపై నమ్మకంతో ఉన్నారు.
స్నేహితులారా,
నేడు భారత్ లో ఎన్నో అవకాశాలు అందుబాటు లో ఉన్నాయి. ఇక అవకాశాల కోసం భారత్ ఎదురు చూడవలసిన పరిస్థితి లేదు. అవకాశాలను భారత దేశమే సృష్టిస్తుంది. గత పదేళ్లుగా ప్రతి రంగంలో అవకాశాలు తెరిచేందుకు భారత్ కొత్త ప్రయోగ వేదికను సిద్ధం చేసింది. ఇది చూడండి – గత దశాబ్దంలో, 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తెచ్చాం. ఇది మీకు గర్వకారణం. ఇది ఎలా జరిగింది? ఇది పాత ఆలోచన విధానాన్ని, పద్ధతులను మారిస్తేనే ఇది సాధ్యమైంది. పేదల సాధికారతపై దృష్టి పెట్టాం. 50 కోట్లకుపైగా ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం. 55 కోట్లకు పైగా ప్రజలకు 5,00,000 రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించాం. 4 కోట్లకు పైగా కుటుంబాలకు సరైన గృహాలను అందించాం. పూచీకత్తు లేకుండా లక్షలాది మందికి సులభంగా రుణాలను అందించాం. అలాంటి చొరవ ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావడానికి సహాయపడింది. పేదరికాన్ని అంత మొందించడానికి సహాయపడింది. పేదరికం నుండి బయటపడిన వారు నేడు కొత్త మధ్య తరగతిగా ఆవిర్భవించారు. ఆ వర్గమే నేడు భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేసే చోదక శక్తిగా మారింది.
స్నేహితులారా,
మహిళా సంక్షేమంతో పాటు మహిళా ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వం నిర్మించిన కోట్లాది ఇళ్లను మహిళల పేరిట రిజిస్టర్ చేయిస్తున్నాం. తెరిచిన బ్యాంకు ఖాతాల్లో సగానికిపైగా మహిళల పేరిటే ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది భారతీయ మహిళలు ‘‘సూక్ష్మ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకం’’లో మరో ఉదాహరణ చెబుతాను. భారతదేశంలో వ్యవసాయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడానికి మేం గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నాం. నేడు వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. డ్రోన్లు మీకు కొత్త కాకపోవచ్చు, కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, వాటికి ఎవరు బాధ్యత వహిస్తున్నారో మీకు తెలుసా? వారు గ్రామీణ మహిళలు. డ్రోన్ పైలట్లుగా మారేందుకు వేలాది మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయంలో ఈ అద్భుతమైన సాంకేతిక విప్లవానికి గ్రామీణ మహిళలే సారధ్యం వహిస్తున్నారు.
స్నేహితులారా,
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ఇప్పుడు జాతీయ ప్రాధాన్యాలుగా మారాయి. మునుపటి కంటే ఈ రోజు భారత్ ప్రపంచానికి మరింత చేరువ అయింది. భారతదేశ 5 జి మార్కెట్ ప్రస్తుత పరిమాణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను చెబితే మీకు అభ్యంతరం లేదుగా? నేడు, భారతదేశ 5 జి మార్కెట్ అమెరికా కంటే పెద్దది. ఈ ఘనత కేవలం రెండు సంవత్సరాలలో సాధ్యం అయింది. ప్రస్తుతం భారత్ మేడ్ ఇన్ ఇండియా 6జీపై పనిచేస్తోంది. ఇది ఎలా జరిగింది? ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేం విధానాలను రూపొందించడం వల్ల ఇది జరిగింది. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ, చౌకైన డేటా, మొబైల్ ఫోన్ల తయారీలో పెట్టుబడులు పెట్టాం. నేడు ప్రపంచంలోని ప్రతి ప్రధాన మొబైల్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు భారత్. నా పదవీకాలానికి ముందు, మేం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. కానీ, నేడు వాటిని ఎగుమతి చేస్తున్నాం.
స్నేహితులారా,
భారత్ ఇక వెనకడుగు వేయదు. భారత్ నేడు కొత్త వ్యవస్థలను సృష్టిస్తోంది. దిశా నిర్దేశం చేస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అనే కొత్త భావనను భారత్ ప్రపంచానికి పరిచయం చేసింది. డిపిఐ సమానత్వాన్ని ప్రోత్సహించి, అవినీతిని తగ్గించడంలో శక్తిమంతమైన సాధనంగా మారింది. భారత యూపీఐ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మీ జేబులో వాలెట్ ఉంది. భారతదేశంలో ప్రజలు తమ ఫోన్లలో ఫిజికల్ వాలెట్లు, ఇ–వాలెట్లు రెండింటినీ కలిగి ఉన్నారు. చాలా మంది భారతీయులు ఇప్పుడు అవసరమైన పత్రాలను వెంట తీసుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే వారు ఇప్పుడు డిజీలాకర్ ను ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయాలకు వెళ్ళడానికి వారు సులభంగా డీజీయాత్రను ఉపయోగిస్తున్నారు. ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఆవిష్కరణ, ఉద్యోగసృష్టి , సంబంధిత ప్రతి సాంకేతికతకు కొత్త వేదికగా మారింది.
స్నేహితులారా,
భారత్ ఇప్పట్లో ఆగదు. నెమ్మదించదు. భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు ఎక్కువ అంతర్జాతీయ సాంకేతిక పరికరాలు భారత్ తయారీ (మేడ్ ఇన్ ఇండియా) చిప్స్ తోనే పనిచేస్తాయి. సెమీకండక్టర్ రంగాన్ని భారత్ వేగవంతమైన వృద్ధికి పునాదిగా చేసుకున్నాం. గత ఏడాది జూన్ లో సెమీకండక్టర్ పరిశ్రమకు భారత్ ప్రోత్సాహకాలను ప్రకటించగా కొద్ది నెలలకే మైక్రాన్ తొలి సెమీకండక్టర్ యూనిట్ కు శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకు భారతదేశంలో అలాంటి అయిదు యూనిట్లకు అనుమతి లభించింది. అమెరికాలో కూడా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ చిన్న చిప్ భారత్ ను అభివృద్ధి దిశగా అపూర్వ శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇది మోదీ వాగ్దానం.
స్నేహితులారా,
నేడు భారత్ లో సంస్కరణల పట్ల అపూర్వమైన సంకల్పం, నిబద్ధత ఉన్నాయి. మా హరిత ఇంధన మార్పు కార్యక్రమం (గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్)’ దీనికి ప్రధాన ఉదాహరణ. ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్నప్పటికీ, ప్రపంచ కర్బన ఉద్గారాలలో భారత్ వాటా కేవలం 4 శాతం మాత్రమే. భూగోళానికి హాని కలిగించడంలో మా పాత్ర ఏమీ లేదు. వాస్తవానికి, మిగిలిన ప్రపంచంతో పోలిస్తే, మా వల్ల ప్రభావం చాలా తక్కువ. మేం కూడా కార్బన్ ఉద్గారాలపై ఆధారపడి మా అభివృద్ధిని పెంచుకోవచ్చు. కానీ ప్రకృతి పట్ల ఉన్న మా ప్రగాఢ గౌరవాన్ని ఆధారంగా చేసుకుని హరిత మార్గాన్ని ఎంచుకున్నాం. అందుకే మేం సౌర, గాలి, నీరు, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. జీ20లో పారిస్ పర్యావరణ లక్ష్యాలను సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. 2014 నుంచి మన సౌరశక్తి సామర్థ్యం 30 రెట్లు పెరిగింది. దేశంలోని ప్రతి ఇంటిని సౌరశక్తితో నడిచే ఇల్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. అందుకోసం విస్తృత రూఫ్ టాప్ సోలార్ మిషన్ ను ప్రారంభించాం. నేడు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సౌరశక్తి వినియోగ కేంద్రాలుగా మారుతున్నాయి. ఇళ్ల నుంచి వీధుల్లోకి భారత్ ఇంధన సమర్థవంతమైన లైటింగ్ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఈ ప్రయత్నాల వల్ల భారత్ లో పెద్ద సంఖ్యలో హరిత (గ్రీన్) ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.
స్నేహితులారా,
21వ శతాబ్దం భారత్ విద్య, నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చెందుతోంది. నలంద విశ్వవిద్యాలయం మీ అందరికీ సుపరిచితమే. భారతదేశ ప్రాచీన నలందా విశ్వవిద్యాలయాన్ని ఆధునిక రూపంలో పునరుద్ధరించారు. ఇవాళ, అది కేవలం విశ్వవిద్యాలయం మాత్రమే కాదు. పునర్జన్మ పొందిన నలందా ఆత్మ కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భారత్ కు వచ్చి చదువుకునేందుకు ఆకర్షించే ఆధునిక విద్యా అనుకూల వ్యవస్థను సృష్టిస్తున్నాం. గత పదేళ్లలో భారత్ లో చెప్పుకోదగిన సంఘటన ఒకటి జరిగింది. ఈ కాలంలో, భారతదేశంలో ప్రతివారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు స్థాపించాం. ప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐ ప్రారంభం అయింది. దశాబ్ద కాలంలో ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కు, ఐఐఎంల సంఖ్య13 నుంచి 21కి, ఎయిమ్స్ సంఖ్య మూడు రెట్లు పెరిగి 22కు చేరింది. ఇదే కాలంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయింది. నేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు భారత్ కు వస్తున్నాయి. భారత్ ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి పొందింది. ప్రపంచం భారతీయ డిజైనర్ల శక్తిని చాలా కాలంగా చూస్తోంది. ఇప్పుడు అది ‘డిజైన్ ఇన్ ఇండియా‘ అద్భుతాలను చూస్తుంది.
స్నేహితులారా,
ఈ రోజు, భారత్ భాగస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. గతంలో, భారత్ సమాన దూరం విధానాన్ని అనుసరించింది. కానీ ఇప్పుడు అందరూ దగ్గరే– అన్న విధానాన్ని తీసుకుంది. మనం ప్రపంచ దక్షిణాది బలమైన గొంతుగా కూడా మారుతున్నాం. భారత్ ప్రయత్నం వల్ల, ఆఫ్రికా యూనియన్ G20 లో శాశ్వత సభ్యత్వం పొందడాన్ని మీరు గమనించారు. ఈ రోజు, భారత్ ప్రపంచ వేదికపై మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం వినడమే కాదు, అర్థం చేసుకుంటోంది. ఇటీవలే “ఇది యుద్ధ కాలం కాదు” అని నేను చెప్పినప్పుడు, ఆ ప్రకటన ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా అర్థమైంది.
స్నేహితులారా,
ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం తలెత్తినప్పుడు ముందుగా స్పందించేది భారత్ మాత్రమే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు, మందులు పంపాం. భూకంపం అయినా, తుఫాను అయినా, అంతర్యుద్ధం అయినా మొదట సాయం అందించింది మేమే. ఇది మన పూర్వీకులు నేర్పిన విలువలు, బోధనలకు ప్రతిబింబం.
స్నేహితులారా,
ప్రపంచ వేదికపై భారత్ కొత్త ఉత్ప్రేరకంగా ఆవిర్భవిస్తోంది. దాని ప్రభావం అన్ని రంగాల్లోనూ కనబడుతోంది. ప్రపంచ వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం, పర్యావరణ చర్యలను ముందుకు తీసుకెళ్లడం, అంతర్జాతీయ నైపుణ్యాల లోటును పూడ్చడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం వంటి కార్యక్రమాల్లో భారత్ పాత్ర కీలకంగా మారింది.
స్నేహితులారా,
భారతదేశానికి శక్తి, సామర్థ్యాలు “జ్ఞానాయ దానాయ చ రక్షణాయ“, అంటే జ్ఞానం పంచడానికీ, ధనం ఆపన్నులను ఆదుకోవడానికీ, అధికారం ఇతరులను రక్షించడానికి అని అర్థం. అందుచేత ఆధిపత్యాన్ని ప్రదర్శించడం భారత్ ప్రాధాన్యం కాదు. ఇతరులను ప్రభావితం చేయడమే మా లక్ష్యం. మేం దహించే అగ్ని కాదు, వెలుగును అందించే సూర్య కిరణాలం. మనం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం లేదు, కానీ దాని శ్రేయస్సుకు కోసం ప్రయత్నిస్తాం. యోగాను ప్రోత్సహించడం అయినా, సూపర్ ఫుడ్ చిరుధాన్యాలకు మద్దతు ఇవ్వడం అయినా లేదా మిషన్ లైఫ్ విజన్ (పర్యావరణం కోసం జీవనశైలి) ను ముందుకు తీసుకు వెళ్ళడం అయినా భారత్ జిడిపి–కేంద్రిత అభివృద్ధితో పాటు మానవ –కేంద్రిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ సాధ్యమైనంత వరకు మిషన్ లైఫ్ ను ప్రమోట్ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. జీవనశైలిలో చిన్న మార్పులు పర్యావరణంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీరు విని ఉండవచ్చు ఇంకా భారత్ లో ఊపందుకుంటున్న ఉద్యమంలో ఇప్పటికే మీలో కొందరు పాల్గొని ఉండవచ్చు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ మాతృ మూర్తుల గౌరవార్థం ఒక చెట్టు (ఎక్ పేడ్.. మా కే నామ్) నాటుతున్నారు. మీ అమ్మ గారు జీవించి ఉంటే ఆమెతో కలసి ఒక మొక్క నాటండి. ఆమె జీవించి లేకపోతే ఆమె ఫోటో ను మీతో పెట్టుకుని ఆమె పేరు మీద ఒక మొక్క నాటండి. ఈ ఉద్యమం భారతదేశంలోని ప్రతి మూలలో జరుగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించడానికి నేను మీ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇది మనకు జీవితాన్ని ప్రసాదించిన తల్లులను మాత్రమే కాదు, భూమాతను కూడా గౌరవిస్తుంది.
స్నేహితులారా,
భారత్ ఈ రోజు పెద్ద కలలు కంటోంది. వాటిని నెరవేర్చు కోవడానికి ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. కొద్ది రోజుల కిందట పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. తదుపరి ఆతిథ్యం అమెరికాదే. త్వరలో భారత్ లో జరిగే ఒలింపిక్స్ ను కూడా మీరు చూడబోతారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. క్రీడలు, వ్యాపారం, వినోదం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచ ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ రోజు ఐపీఎల్ వంటి భారతీయ లీగ్ లు ప్రపంచంలోని అగ్ర లీగ్‌లలో ఒకటిగా ఉన్నాయి. ఉంటాయి. భారతీయ సినిమాలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టూరిజంలో కూడా భారత్ దూసుకెళ్తోంది. వివిధ దేశాల్లో భారతీయ పండుగలను జరుపుకోవడానికి ఆసక్తి పెరుగుతోంది. నవరాత్రి కోసం గర్భా నేర్చుకుంటున్న వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో కనిపిస్తున్నారు. ఇది భారత్ పట్ల వారి ప్రేమను ప్రతిబింబిస్తుంది.
స్నేహితులారా,
నేడు, ప్రతి దేశం భారతదేశం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మీకు ఆనందం కలిగించే మరో విషయం నా దగ్గర ఉంది. నిన్ననే, భారతదేశం నుండి దొంగతనానికి గురైన 1,500 నుండి 2,000 సంవత్సరాల పురాతన శిలాశాసనాలు, విగ్రహాలను అమెరికా భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇప్పటివరకు అమెరికా అటువంటి 500 కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇది కేవలం కొన్ని వస్తువులను తిరిగి ఇవ్వడం గురించి మాత్రమే కాదు. ఇది వెయ్యేళ్ల నాటి మరో గొప్ప వారసత్వానికి నివాళి. ఇది భారత్ కు, మీ అందరికీ గర్వకారణం. ఇందుకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
స్నేహితులారా,
భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యం రోజురోజుకూ బలపడుతోంది. సహకారం అన్నది ప్రపంచ ప్రయోజనం కోసం. మేం అన్ని రంగాలలో సహకారాన్ని పెంచుకుంటున్నాం. మీ సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. గత సంవత్సరం, నేను సియాటెల్ లో ఒక కొత్త కాన్సులేట్ ను ప్రారంభించాను. అది ఇప్పుడు పని ప్రారంభించింది. మరో రెండు కాన్సులేట్ల ప్రారంభానికి మీ సూచనలను నేను కోరాను. మీ సూచనల ఆధారంగా, బోస్టన్, లాస్ ఏంజిల్స్ లలో కొత్త కాన్సులేట్ ను తెరవాలని భారత్ నిర్ణయించిందని మీకు తెలియ చేయడానికి సంతోషిస్తున్నాను.
హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో తమిళ అధ్యయనాల కోసం తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం కూడా సంతోషంగా ఉంది. గొప్ప తమిళ ప్రవక్త తిరువళ్లువర్ తత్వాన్ని ప్రపంచానికి ప్రచారం చేయడానికి ఇది మరింత సహాయపడుతుంది.
స్నేహితులారా,
మీతో ఈ ఆత్మీయ సమావేశం నిజంగా మరపురానిది.. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం ఎంతో అద్భుతం.. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరు కావాలని కోరుకున్నారని, కానీ వేదిక చాలా చిన్నదని తెలిసింది. రాలేకపోయిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. వచ్చేసారి మీ అందరినీ మరో వేదికపై కలిసేందుకు ఎదురు చూస్తాను. ఏదేమైనా, ఉత్సాహం అలాగే ఉంటుందని, అభిరుచి తగ్గదని నాకు తెలుసు. మీరంతా ఆరోగ్య, సౌభాగ్యాలతో ఉండాలని, భారత్–అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నాతో కలసి చెప్పండి…
భారత్ మాతాకీ – జై!
భారత్ మాతాకీ – జై!
భారత్ మాతాకీ – జై!
ధన్యవాదాలు..
****
The warmth and energy of the Indian diaspora in New York is unparalleled. Addressing a community programme. Do watch! https://t.co/ttabGnATaD
— Narendra Modi (@narendramodi) September 22, 2024
Indian Diaspora has always been the country's strongest brand ambassadors. pic.twitter.com/1S85Xjdy4m
— PMO India (@PMOIndia) September 22, 2024
डायवर्सिटी को समझना, जीना, उसे अपने जीवन में उतारना...ये हमारे संस्कारों में है। pic.twitter.com/AQf8p0Bljv
— PMO India (@PMOIndia) September 22, 2024
भाषा अनेक हैं, लेकिन भाव एक है... और वो भाव है- भारतीयता। pic.twitter.com/STBOpaYnMQ
— PMO India (@PMOIndia) September 22, 2024
For the world, AI stands for Artificial Intelligence. But I believe AI also represents the America-India spirit: PM @narendramodi pic.twitter.com/B7Y2Ue29uj
— PMO India (@PMOIndia) September 22, 2024
These five pillars together will build a Viksit Bharat... pic.twitter.com/KRTlYuNIaY
— PMO India (@PMOIndia) September 22, 2024
मेरा मन और मिशन एकदम क्लीयर रहा है...
— PMO India (@PMOIndia) September 22, 2024
मैं स्वराज्य के लिए जीवन नहीं दे पाया... लेकिन मैंने तय किया सुराज और समृद्ध भारत के लिए जीवन समर्पित करूंगा: PM @narendramodi pic.twitter.com/U4EPBVg423
Today, India is a land of opportunities. It no longer waits for opportunities; it creates them. pic.twitter.com/E0UAncfzoa
— PMO India (@PMOIndia) September 22, 2024
India no longer follows; it forges new systems and leads from the front. pic.twitter.com/6ywujcBprk
— PMO India (@PMOIndia) September 22, 2024
Today, our partnerships are expanding globally. pic.twitter.com/1s6BQR5Uzv
— PMO India (@PMOIndia) September 22, 2024
Today, when India speaks on the global platform, the world listens. pic.twitter.com/ItATxrq4Dh
— PMO India (@PMOIndia) September 22, 2024
AI for me is also America-India. The scope of our friendship is unlimited. pic.twitter.com/b2bMacZtkI
— Narendra Modi (@narendramodi) September 23, 2024
पुष्प (PUSHP) की इन पांच पंखुड़ियों को मिलाकर ही हमें विकसित भारत बनाना है… pic.twitter.com/6uEnN142MI
— Narendra Modi (@narendramodi) September 23, 2024
Our Government is focused on making India prosperous and this reflects in our work culture as well as decisions. pic.twitter.com/dw3aIXZ5BU
— Narendra Modi (@narendramodi) September 23, 2024
Today’s India is filled with opportunities! Come, be a part of our growth story. pic.twitter.com/bROhptd0At
— Narendra Modi (@narendramodi) September 23, 2024
A ‘Made in India’ chip will become a reality and this is Modi’s Guarantee. pic.twitter.com/WkGW4RmSYS
— Narendra Modi (@narendramodi) September 23, 2024
मुझे आपको ये बताते हुए बहुत खुशी है कि... pic.twitter.com/B7eyYCjpQv
— Narendra Modi (@narendramodi) September 23, 2024