ఎక్స్లెన్సీస్,
అంటల్యాలో ఈ సమావేశం కోసం సుందరమైన పరిసరాల నేపథ్యంలో అత్యద్భుతమైన ఏర్పాట్లను చేసి చక్కటి ఆతిథ్యాన్నిస్తున్న టర్కీ దేశానికి, అధ్యక్షులు శ్రీ ఎర్డోగన్ కు నా కృతజ్ఞతలు.
ప్రపంచానికి శాంతి, సౌభాగ్యాలతో కూడి ఉండే భవిష్యత్తును నిర్మించడానికి ఈ జి-20 సమావేశాన్నిఏర్పాటు చేసుకున్నాం.
ఉగ్రవాద మూకల భయంకరమైన, నీచమైన చర్యల నేపథ్యంలో మనం సమావేశమయ్యాం. ఆవేదనతో, ఆక్రోశంతో, బాధతో అందరమూ ఇక్కడ ఈ కార్యక్రమాన్నినిర్వహించుకుంటున్నాం.
పారిస్ లో ఉగ్రవాదులు అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయి అత్యంత అనాగరికంగా చేసిన మారణహోమ దాడులను అందరమూ ఒక్క తాటిపై నిలిచి ఖండించాం. అలాగే ఈ మధ్య అంకారాలో, లెబనాన్ లో జరిగిన బాంబు దాడులను ఒకే గళంతో ఖండించాం. చినాయ్లో విమానం కూల్చివేత ఘటన సందర్భంగా రష్యా పడ్డ ఆవేదనలో పాలుపంచుకున్నాం.
ఈ ఘటనల నేపథ్యంలో చూసినప్పుడు మనం ఒక భయంకరమైన శక్తిని ఎదుర్కొంటున్నామనే వాస్తవాన్ని మరిచిపోవద్దు. ఏవో కొన్ని మూకలకో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని లక్ష్యాలకో ఆ శక్తి పరిమితం కాలేదు. అది వాటన్నిటికంటే చాలా పెద్దది.
ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది. ఈ ఉగ్రవాద భూతం ప్రాణాలను మాత్రమే తీయడం లేదు. ఆర్థికంగా దేశాలను అతలాకుతలం చేస్తోంది..అంతే కాదు మన జీవ విధానాలకు పెనుముప్పుగా కూడా పరిణమించింది.
ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇప్పుడు సమగ్రమైన ప్రపంచవ్యాప్త స్పందన ఎంత అవసరమో తెలుస్తోంది. దీనిపై చేసే యుద్ధమే జి-20 దేశాల ప్రధాన ప్రాధాన్యం కావాలి.
ఈ సవాళ్లపైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు టర్కీకి అభినందనలు.
ప్రముఖులారా! ఈ ఉగ్రవాదంతో పాటు మనం మరో రెండు ప్రధానమైన సవాళ్లపై చర్చించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. మనం అభివృద్ధిపై, వాతావరణ మార్పులపై మాట్లాడుకోవాలి.
ఈ సంవత్సరం ఓ మైలురాయి లాంటిది. ఐక్య రాజ్య సమితి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐక్య రాజ్య సమితిలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి వీలుగా తీర్మానాలు చేసుకున్నాం. అలాగే భూగోళం భవిష్యత్తు సుస్థిరంగా ఉండడానికి ఏం చేయాలో నిర్ణయించే సమావేశం మరికొద్ది రోజుల్లో జరగనున్నది.
ఎక్స్లెన్సీస్,
ఐక్య రాజ్య సమితిలో అంగీకరించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) చాలా సమగ్రంగా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది ఈ లక్ష్యాలలో ప్రధానమైనది. ఎస్డిజిలనేవి అభివృద్ధి, మానవాళి సంక్షేమం, పర్యావరణాల మధ్య సరైన సమన్వయాన్ని కుదురుస్తాయి.
ఎస్డిజిలకు జి-20 దేశాలు మద్దతునివ్వాలి. అలా చేస్తే వేగవంతమైన, విస్తారమైన పునాది గల ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించగలం.
ఎక్స్లెన్సీస్,
భారతదేశ అభివృద్ధి లక్ష్యాలు ఇప్పటికే ఎస్డిజిలకు అనుగుణంగా రూపొందాయి.
వృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మా యువత ఉపాధి పొందడానికిగాను నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతున్నాం. మౌలిక వసతుల విస్తరణలో నాణ్యతను, వేగాన్ని పెంచాం. ఎక్కువ ఉత్పాదకతను సాధించడానికి పెట్టుబడులు పెడుతున్నాం.
ప్రజలందరికీ ఆర్థిక సేవలు అందడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజల ప్రాధమిక అవసరాలను తీర్చే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితమైన తేదీలను ముందే నిర్ణయించుకున్నాం.
ఎంతో ధైర్యంగా చేపట్టిన ఆర్థిక, పాలనాపరమైన సంస్కరణల మూలంగా 7.5 శాతం వృద్ధి రేటును సాధించాం. అంతే కాదు మరింత వృద్ధి రేటును భవిష్యత్లో సాధించడానికి మా ముందు అనేక అవకాశాలున్నాయి.
దేశ పరిమాణం, సాధిస్తున్న అభివృద్ధి దృష్ట్యా భారతదేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి ఒక మూలస్తంభం కాగలదు.
పునర్వినియోగ ఇంధన రంగంలో
పరిశోధన పెరగాలి
ఎక్స్లెన్సీస్, మేం భారతదేశంలో అభివృద్ధిని, వాతావరణ మార్పులను ఒకదానితో ఒకటి పోటీపడుతున్న అంశాలుగా చూడడం లేదు. మానవాళి, ప్రకృతి ఐక్యత అనే నమ్మకంపైనే ఇది కేంద్రీకృతమైంది.
వాతావరణ మార్పులు విసరుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మా దగ్గర పటిష్టమైన కార్యాచరణ విధానాలున్నాయి.
2022 నాటికి 175 గిగావాట్ల అదనపు పునర్వినియోగ ఇంధనాన్ని తయారు చేసుకోవాలనే లక్ష్యం ఎలాగూ ఉంది.
శిలాజ ఇంధనాలకు ఇచ్చే రాయితీలను తగ్గించడం, బొగ్గుపైన పన్ను, మూడు బిలియన్ డాలర్ల విలువ కలిగిన జాతీయ స్వచ్ఛ ఇంధన నిధిని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛమైన సాంకేతికతలను అభివృద్ధి పరుచుకునే దిశగా చర్యలను చేపట్టాం.
అత్యున్నతమైన జాతీయస్థాయి ఉద్దేశిత సహాయక కార్యక్రమాల (నేషనల్లీ డిటర్మై న్ డ్ కంట్రిబ్యూషన్స్ ..ఐఎన్ డి సిలు) అమలు ద్వారా ప్రపంచ గమనంతో పాటే ఇండియా ఉంటుందనడంలో సందేహం లేదు.
వాతావరణ మార్పులపై ఐక్య రాజ్య సమితి సమావేశం రూపొందించిన విధివిధానాల వ్యవస్థకు అనుగుణంగానే పారిస్ సమావేశం సరైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నాం. ఉమ్మడి కార్యాచరణతో ఈ ఐక్య రాజ్య సమితి విధివిధానాల వ్యవస్థ సరైన సమన్వయాన్ని కలిగి ఉంది.
పునర్వినియోగ ఇంధనం అందరికీ అందుబాటులోకి రావడానికి ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధి పెరగాలి. ఇందుకుగాను జి-20 దేశాలు సమర్థనీయమైన పాత్రను పోషించి భరోసానిస్తే వివిధ దశల్లోని లక్ష్యాలను అందుకోగలం. ప్రపంచమంతా స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందాలని ఆకాంక్షిస్తోంది. ఈ ఆకాంక్షను అందుకోవడానికి ఆర్థికంగా, సాంకేతికపరంగా సహాయం లభించేలా మనం చూడాలి.
2020 నాటికి ప్రతి సంవత్సరం అందుకోవాల్సిన 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
ప్రజారవాణా వ్యవస్థద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను జి-20 దేశాలు 2030 నాటికి 30 శాతానికి పెంచాలి.
కార్బన్ అధిక ఉద్గారాలకు కారణమవుతున్న దేశాలు ఇప్పుడు ఆ పేరును వదులుకొని, పర్యావరణానికి, పచ్చదనానికి పెద్దపీట వేసే దేశాలుగా పేరు సంపాదించుకోవాలి.
శిథిల ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా మన జీవనవిధానాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటేనే మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకోగలం.
సౌరశక్తి అధికంగాగల దేశాలను కలుపుకొని ఒక సంస్థను ప్రారంభించాలనే ప్రతిపాదనను సిఓపి-21 సమావేశంలో అందరి ముందూ ఉంచబోతున్నాను. ఈ ప్రతిపాదనను ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ తో కలిసి ప్రతిపాదించబోతున్నాను.
ఎక్స్లెన్సీస్,
అభివృద్ధిపైన మరికొన్ని అంశాలను ప్రస్తావించి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను.
2018 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిని మరో రెండు శాతం పెంచాలని గత సంవత్సరం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది.
అత్యధిక వృద్ధి సామర్థ్యంగల దేశాలకు జి-20 దేశాలు సాయమందించాలి. అవి ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలిగేలా సహాయక వ్యవస్థలను రూపొందించి అందించాలి. తద్వారా ఆ యా దేశాల వ్యూహాలు అమలులోకి వస్తాయి.
మౌలిక వసతుల కల్పనపై జి-20 దేశాలు తాము పెడుతున్న ఫోకస్ ను కొనసాగించాలి. 2014 లో బ్రిస్బేన్ లో పెట్టుకున్న సంకల్పమిది.
పర్యావరణ అనుకూల మౌలిక వసతులు, స్వచ్ఛమైన ఇంధనం ద్వారా అటు అభివృద్ధిని సాధించవచ్చు, ఇటు వాతావరణ మార్పుల సమస్యలను ఎదుర్కోవచ్చు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమయ్యే నిధుల్లో కొరత ఉంది. ఈ కొరత సమస్యను పరిష్కరించడం ప్రస్తుతం మన ముందున్న ప్రధానమైన కర్తవ్యం.
వ్యవసాయంపైన జి-20 కార్యాచరణ పథకం చిన్న రైతులపై దృష్టిపెట్టడం నాకు ఆనందంగాఉంది. అలాగే ఆహార నష్టాలను అరికట్టడానికి ప్రాధాన్యమిచ్చారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అర్హత గల కుటుంబాలకు నేరుగా డబ్బు చెల్లించడం జరుగుతోంది. ఈ డబ్బు ఆ కుటుంబాలకు ప్రధానమైన ఆర్థిక వనరు. 2030లోపున ఓ తేదీని పెట్టుకొని, ఆ లోపు ఈ చెల్లింపుల బదిలీకయ్యే వ్యయాన్ని తగ్గించుకోవాలి.
ఫలవంతమైన చర్చల ద్వారా మేలైన ఫలితాలను పొందగలమని భావిస్తున్నాను.
అందరికీ అభినందనలు…
My lead intervention at the @G20Turkey2015 working lunch focussed on aspects of development & climate change. https://t.co/yCqZS2MUn9
— Narendra Modi (@narendramodi) November 15, 2015
Spoke about how India's development goals are aligned with SDGs. Also talked on the importance we are attaching to renewable energy.
— Narendra Modi (@narendramodi) November 15, 2015
G20 nations should build support systems with a focus on nations with high growth potential. Focus on infrastructure should also continue.
— Narendra Modi (@narendramodi) November 15, 2015