ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ అఫ్గానిస్థాన్ లో రూ. 1775.69 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో సల్మా డ్యామ్ ప్రాజెక్టు పునర్నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అనుమతి ఇచ్చింది.
కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. 2016 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అందుబాటులోకి వచ్చే విద్యు త్, జలవనరుల వల్ల అఫ్గానిస్థాన్ లోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భారత, అఫ్గానిస్థాన్ ల మధ్య సుహృద్భావ పూర్వక వాతావరణం నెలకొంటుంది. పశ్చిమ అఫ్గానిస్థాన్ ప్రాంతంలో ఇంధనం, నీటిపారుదల అవసరాలు తీరుతాయి.
ప్రాజెక్టును చేపట్టిన తర్వాత భారత కరెన్సీ రూపాయి, అమెరికన్ డాలర్ విలువలో మార్పులో పాటుగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు పొడిగింపు వల్ల పెరిగిన కన్సల్టెన్సీ ఛార్జీ లు, అఫ్గాన్ సిబ్బంది శిక్షణ వ్యయాల పెరుగుదల వంటివి పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు వ్యయాలను సవరించాల్సివచ్చింది.
నేపథ్యం
హీరత్ రాష్ట్రం లోని హరిరుద్ నది ఎగువ పరీవాహక ప్రాంతంలో 107.5 మీటర్ల ఎత్తున సల్మా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా ఫిల్ డ్యామ్, ఒక్కోటి 14 మెగావాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్లు గల 42 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం 75 వేల హెక్టార్లకు నీటిపారుదల వసతులు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే విద్యుత్, నీరు వల్ల అఫ్గానిస్థాన్ లోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందడం తో పాటు భారత, అఫ్గానిస్థాన్ల మధ్య సుహృద్భావపూర్వక వాతావరణం నెలకొంటుంది.