2016 సెప్టెంబర్ 14వ, 15వ తేదీల్లో భారతదేశంలో పర్యటించేందుకు వచ్చిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు డాక్టర్ మొహమ్మద్ అశ్ రఫ్ గనీ ని భారతదేశంలో సాదర స్వాగతం లభించింది. ఈ పర్యటన లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం రాష్ట్రపతి గారు కూడా ఆయనకు స్వాగతం పలకనున్నారు.
అధ్యక్షుడు శ్రీ అశ్ రఫ్ గనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై 2015 డిసెంబరు లో కాబుల్ లోను, ఈ సంవత్సరం జూన్‌లో హెరాత్ లోను తాను జరిపిన పర్యటనల విశేషాలను గుర్తుచేసుకొన్నారు. రెండు చోట్ల తనకు ఆత్మీయమైన స్వాగత సత్కారాలు లభించడం, అప్పట్లో జరిపిన చర్చలు, అలాగే తెహరాన్ (2016 మే) లోను, తాశ్ కంద్ (2016 జూన్) లోను అధ్యక్షుడితో తాను జరిపిన ఇతర సమావేశాలు ఫలప్రదం కావడం తనకు ఇంకా గుర్తున్నాయని ఆయన ప్రస్తావించారు.
భారతదేశానికి, అఫ్గానిస్తాన్ కు మధ్య అన్ని రంగాలలో పటిష్ట సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా అన్ని స్థాయిలలో క్రమం తప్పకుండా, అరమరికలు లేని విధంగా సంప్రతింపులు చోటు చేసుకొంటుండడం పట్ల ఇరువురు నేతలు వారి హర్షాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ, భద్రత, ఆర్థిక రంగాలలో పరివర్తన కోసం అఫ్గానిస్తాన్ చేస్తున్న ప్రయత్నానికి భారతదేశం- అఫ్గానిస్తాన్ ద్వైపాక్షిక ప్రగతిశీల సహకారంఎలా తోడ్పడుతోందో వీరు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి కాలంలో జరిగిన రెండు మైలురాళ్లనదగ్గ పరిణామాలు.. ఒకటి పార్లమెంటు భవనం, రెండోది అప్గాన్- భారత్ మైత్రి ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడం..పై నేతలిద్దరూ హర్షం వెలిబుచ్చారు. 2016 ఆగస్టు 22వ తేదీన వీడియో లింకు ద్వారా స్టోరే ప్యాలెస్ ను సంయుక్తంగా ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 125కోట్ల భారతీయులు అఫ్గాన్ సోదర సోదరీమణులకు మద్దతుగా ఉంటారంటూ ఇచ్చిన భరోసా చాలా ప్రభావవంతమైందని అఫ్గాన్ అధ్యక్షుడు స్పష్టంచేశారు.
ఐక్య, సార్వభౌమ, ప్రజాస్వామ్య, శాంతియుత, స్థిర, సంక్షేమ అఫ్గానిస్తాన్ నిర్మాణంలో భారతదేశం ఎప్పుడూ మద్దతును ఇస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. అఫ్గానిస్తాన్‌కు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత, విద్యుత్తు, మౌలిక వసతులు, ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం వంటి విషయాలలో సామర్థ్యం, యోగ్యత నిర్మాణంలో భారతదేశం ఎల్లప్పుడూ అండగా నిలచేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇందుకోసం పొరుగు మిత్ర దేశమైన అఫ్గానిస్తాన్‌కు 100 కోట్ల డాలర్లు కేటాయించగలమంటూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం నుండి తక్కువ ధరకే లభ్యమయ్యే ప్రపంచ శ్రేణి ఔషధాలను సరఫరా చేసేందుకు ప్రతిపాదించారు. దీంతో పాటు పరస్పర అంగీకార వ్యవస్థ ద్వారా సౌర శక్తి రంగంలో సహకారానికి కూడా భరోసా ఇచ్చారు.
ఆసియా ఖండంలో రాజకీయ లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకిగా మారిన ఉగ్రవాదం, హింస వంటి అంశాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఈ ప్రాంతంతో పాటు బయట కూడా శాంతికి, స్థిరత్వానికి, పురోగతికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఇందుకోసం ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. అఫ్గానిస్తాన్ ను, భారతదేశాన్ని లక్ష్యాలుగా చేసుకుని దాడులకు తెగబడుతున్నవారితో పాటు, ఉగ్రవాదులతోను, వారికి మద్దతు, ప్రోత్సాహం కల్పిస్తున్న వారితోనే కాక ఉగ్రవాద కేంద్రాల పైన కూడా కఠినంగా వ్యవహరించి దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం-అఫ్గానిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో పేర్కొన్నట్లుగా ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను, భద్రత వ్యవస్థను పటిష్టపరుచుకోవాలని, రక్షణ రంగంలో సహకారం అందించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
భారతదేశం, అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రుల అభివృద్ధి వ్యూహాత్మక భాగస్వామ్య మండలి త్వరలోనే సమావేశమై.. విభిన్న రంగాల్లో సహకారం, భవిష్యత్ మార్గదర్శనంపై ఏర్పాటుచేసిన నాలుగు సంయుక్త పని బృందాల ప్రతిపాదనలను సమీక్షించాలని అంగీకరించారు.
దోషుల అప్పగింత ఒప్పందం, పౌర, వాణిజ్య అంశాలలో పరస్పర సహకార ఒప్పందం, ఔటర్ స్పేస్ వినియోగంలోని శాంతియుత ఉపయోగాల విషయంలో సహకార ఒప్పందంపై కుదుర్చుకున్న ఒప్పందంపై అఫ్గాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 2016లో భారతదేశం, అఫ్గానిస్తాన్, ఇరాన్ ల మధ్య చాబహార్ ఓడరేవు విషయంలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాన్ని వేగంగా అమలు చేయడంపైనా చర్చించారు. ఈ ఓడరేవు ద్వారా ఈ ప్రాంతంతో పాటు బయటి ప్రపంచంతో సంధాన సామర్థ్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల (వ్యాపార, పారిశ్రామిక వర్గాలు)ను కలుపుకొని ఒక సంయుక్త వేదికను ఏర్పాటు చేయాలని మూడు దేశాలు నిర్ణయించడాన్ని ప్రశంసించారు.
అప్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం, పురోగతిల స్థాపనకు ప్రాంతీయంగా భారతదేశం, అప్ఘానిస్తాన్ లతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. భారతదేశం-ఇరాన్-అఫ్గానిస్తాన్ త్రైపాక్షిక సంప్రతింపుల ప్రభావంపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ అశ్ రఫ్ గనీ లు.. ఈ నెలలో న్యూ యార్క్‌లో జరిగే భారతదేశం- అమెరికా- అఫ్గానిస్తాన్ సంప్రతింపుల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అఫ్గానిస్తాన్‌కు అన్ని రంగాలలో సాధ్యమైనంత సహాయం చేసేలా అంతర్జాతీయ సమాజంతో భారతదేశం చర్చలు జరుపుతూనే ఉంటుందని శ్రీ అశ్ రఫ్ గనీకి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
రానున్న డిసెంబర్ 4న జరిగే హార్ట్ ఆఫ్ ఏషియా- ఇస్తాంబుల్ (హెచ్ ఒ ఎ) విధానంలో.. అమృత్‌సర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యత పైనా , అక్టోబర్ 5న జరిగే బ్రసెల్స్ సదస్సు పైనా ఈ సందర్భంగా చర్చించారు. ‘సవాళ్లను గుర్తించడం, లక్ష్యాలను సాధించడం’ నినాదంతో జరగనున్న ఈ ఏడాది హెచ్ ఒ ఎ సదస్సులో అనుసంధాన పక్రియకు పున:స్థాపించేందుకు ఏకంగా నిలవాలని నిర్ణయించారు. దీని ద్వారా భారతదేశం, అఫ్గానిస్తాన్ లు దక్షిణాసియా, మధ్య ఆసియా మధ్య రెండు వైపులా అనుసంధాన పక్రియను వేగవంతం చేయడంలో చిత్తశుద్ధితో ఉన్నాయన్నారు.
అమృత్‌సర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కు హాజరవ్వాలని అప్ఘానిస్తాన్ అధ్యక్షుడిని ప్రధాన మంత్రి ఆహ్వానించారు. దీనికి అధ్యక్షుడు అంగీకరించారు. అఫ్గానిస్తాన్ లో వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, సామర్థ్యాలను అధ్యక్షుడు భారత పారిశ్రామిక రంగానికి వివరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ అశ్ రఫ్ గనీ.. డిఫెన్స్ స్టడీస్‌కు చెందిన పలువురు వ్యూహాత్మక నిపుణుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ‘ఐదో తరంగపు రాజకీయ హింస, అంతర్జాతీయ ఉగ్రవాదం’ పై విశ్లేషణలను అందిస్తారు.
Glad to have met President @ashrafghani in Delhi. We had extensive talks on India-Afghanistan ties. @ARG_AFG pic.twitter.com/5EgOtwEXuN
— Narendra Modi (@narendramodi) September 14, 2016