”అద్దెగర్భం (నియంత్రణ) బిల్లు-2016” ను ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ బిల్లు కేంద్ర స్థాయిలో జాతీయ అద్దెగర్భం మండలులను, రాష్ట్రాల స్థాయిలో అద్దెగర్భం మండలులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమర్థ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో అద్దెగర్భాన్ని (సరోగసీ ని) క్రమబద్ధీకరిస్తుంది. వాణిజ్య అద్దెగర్భాలను నిషేధించి, అవసరం ఉన్న సంతానరహిత దంపతులకు నైతిక అద్దెగర్భాల సేవలను అనుమతిని ఇవ్వడం ద్వారా ఈ చట్టం అద్దెగర్భం క్రమబద్ధానికి హామీ ఇవ్వగలదు.
వంధ్యత్వంతో వేదన చెందుతూ నైతిక అద్దెగర్భం సహాయాన్ని పొందాలని కోరుకొనే భారతీయ వివాహిత జంటలకు ప్రయోజనం చేకూరగలదు. అంతేకాకుండా అద్దె గర్భాన్ని ధరించే తల్లి, అద్దెగర్భం వల్ల జన్మించిన పిల్లల హక్కులను పరిరక్షించడం జరుగుతుంది. జమ్ము- కశ్మీర్ మినహా యావత్తు భారతదేశానికి ఈ బిల్లు వర్తిస్తుంది.
ముసాయిదా బిల్లులో ఎటువంటి శాశ్వత వ్యవస్థ ఏర్పాటును గాని, కొత్త పదవులను సృష్టించడం గురించి గాని ప్రతిపాదించలేదు. కేంద్రంలోను, రాష్ట్రాల లోను ఇప్పటికే అమలవుతున్న నియంత్రణ వ్యవస్థలో పెద్ద జోక్యమేదీ చేసుకోని తరహాలో ప్రతిపాదిత చట్టం రూపొందింది. దీనికి తగినట్టే జాతీయ అద్దెగర్భం మండలులు, రాష్ట్రాలలోని అద్దెగర్భం మండలులు మరియు తగిన ప్రాధికార సంస్థల సమావేశాలకు అయ్యే ఖర్చులు తప్పవేరే ఆర్థిక భారం ఏమీ ఉండబోదు. జాతీయ అద్దెగర్భం మండలులు, రాష్ట్రాలలోని అద్దెగర్భం మండలులు మరియు తగిన ప్రాధికార సంస్థల సమావేశాలకు అయ్యే ఖర్చులను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల కాలిక బడ్జెటుల నుండి భరిస్తారు.
పూర్వ రంగం:
గత కొద్ది కాలంగా భారతదేశం వివిధ దేశాల నుండి వస్తున్న భార్యాభర్తలకు అద్దెగర్భాల కేంద్రంగా మారింది. అంతేకాక అనైతిక మార్గాలకూ వేదికైంది. మధ్యవర్తి రాకెట్లు పుట్టుకొచ్చాయి. అద్దెగర్భం అమ్మలకు, వారు జన్మనిచ్చిన పిల్లలకు ఇబ్బందులు మొదలయ్యాయి. గత కొద్దికాలంగా అద్దెగర్భం వాణిజ్యపరంగా మారి ఇబ్బందులు సృష్టిస్తోందని, దీనిని వ్యవస్థాబద్ధం చేయాలని వార్తలొస్తున్నాయి. వాణిజ్యపరమైన అద్దెగర్భాలను నిరోధించాలని, అవసరమైన భారతీయ దంపతులకు నైతిక పరోపకార పద్ధతులలో అద్దెగర్భాల వీలు కల్పించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా సైతం తన 228వ నివేదికలో సిఫారసు చేసింది.