Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అడ్మిరాలిటీ (క్షేత్రాధికారం, ఇంకా సముద్ర సంబంధి దావాల పరిష్కారం) బిల్లు, 2016కు మరియు అయిదు ప్రాచీన అడ్మిరాలిటీ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం


స‌ముద్ర‌యాన సంబంధిత‌ వాజ్యాల ప‌రిష్కారం, క్షేత్రాధికారాలకు సంబంధించిన అడ్మిరాలిటీ బిల్లు 2016కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అయిదు పురాతన అడ్మిరాలిటీ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలన్న షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలిపింది.

తాజా బిల్లు ప్ర‌స్తుతం స‌ముద్ర‌యాన సంబంధిత వ్య‌వ‌హారాల్లో, దావాల్లో కోర్టులకు ఉన్న ప‌రిధిని సుస్థిరం చేస్తుంది. అంతేకాకుండా 1840, 1861 అడ్మిరాలిటీ కోర్టు చట్టాల‌తో పాటు, 1890, 1891 క‌లోనియ‌ల్ కోర్ట్స్ ఆఫ్ అడ్మిరాలిటీ చ‌ట్టాల‌ను, ముంబై, కోల్‌క‌త‌, మ‌ద్రాసు హైకోర్టుల‌కు నౌకాధిక‌ర‌ణ ప‌రిధి వ‌ర్తింప‌జేసే 1865 లెట‌ర్స్ పేటెంట్ నిబంధ‌న‌ల‌ను ర‌ద్దు చేసింది. వీటి కోస‌మ‌ని స‌ముద్ర‌యాన న్యాయ వ‌ర్గాలు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. వారి కోరిక ఈ బిల్లు ద్వారా తీర‌బోతోంది. భార‌త వాణిజ్యంలో 95 శాతం స‌ముద్ర‌యానం ద్వారానే సాగుతోంది. ఎన్న‌డో బ్రిటిష్‌ కాలంలో చేసిన చ‌ట్టాలే ఇంకా కొన‌సాగుతున్నాయి. సుప‌రిపాల‌న‌కు అడ్డంకిగా నిలిచే చ‌ట్టాల‌ను తొల‌గించాల‌న్న ప్ర‌భుత్వ ఉద్దేశం మేర‌కు ఈ కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. కొత్త బిల్లు కీల‌కాంశాలు ఇలా ఉన్నాయి..:

• ఈ బిల్లు వ‌ల్ల నౌకాధిక‌ర‌ణ ప‌రిధి భార‌త తీర‌ప్రాంత రాష్ట్రాల్లోని హైకోర్టుల‌కు ఉంటుంది. స‌ముద్రంలో భార‌త ప‌రిధి ఎక్క‌డిదాకా ఉంటే అక్క‌డిదాకా ఈ ప‌రిధి విస్త‌రించి ఉంటుంది.

• కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఈ ప‌రిధిని విస్త‌రించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక ఆర్థిక‌ జోన్‌ల‌ దాకా, లేదంటే భార‌త భూభాగంలోని ఏదైనా స‌ముద్ర‌యాన జోన్, లేదా దీవుల‌ దాకా ప‌రిధిని పెంచవ‌చ్చు.

• స్థిర‌ నివాసం, స్థానిక యాజ‌మాన్యాల‌తో సంబంధం లేకుండా ఎక్క‌డివైనా ప్ర‌తి నౌక‌కు ఇది వ‌ర్తిస్తుంది.

• ఇక్క‌డి నౌక‌లు, నిర్మాణంలో ఉన్న నౌక‌ల‌ను వీటి నుండి మిన‌హాయింపును ఇచ్చారు. అయితే కేంద్రం అవ‌స‌ర‌మ‌నుకుంటే వీటికి కూడా వ‌ర్తింప‌జేసే అవ‌కాశ‌ం ఉంటుంది.

• వాణిజ్యేత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించే యుద్ధ‌ నౌక‌లు, నావికాద‌ళ నౌక‌ల‌కు ఇది వ‌ర్తించ‌దు.

• బిల్లులో పేర్కొన్న స‌ముద్ర‌యాన వాజ్యాల‌కే పరిధి నిర్దిష్టం.

• స‌ముద్ర‌యాన వ్యాజ్యాలలో భ‌ద్ర‌త‌ కోసం అవ‌స‌ర‌మైతే నౌక‌ను కొన్ని ప‌రిస్థితులలో నిర్బంధంలోకి తీసుకోవ‌చ్చు.

• బిల్లులో పేర్కొన‌ని అంశాలు ఏవైనా ఉంటే, వాటికి 1908 సివిల్ ప్రొసిజ‌ర్ కోడ్ వ‌ర్తిస్తుంది.