Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘అటల్ భూజల యోజన’కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


అటల్ భూజల యోజన (ATAL JAL) అమలుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర ప్రభుత్వరంగ పథకం కోసం 2020-21 నుంచి 2024-25 మధ్య ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ.6000 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఏడు రాష్ట్రాల్లో గుర్తించిన ప్రాధాన్య ప్రాంతాల్లో సామాజిక భాగస్వామ్యం ద్వారా భూగర్భ జల నిర్వహణను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పథకం అమలుతో ఆయా రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లోగల సుమారు 8,350 పంచాయతీలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆ మేరకు జల అవసరాల దిశగా నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ భూగర్భజల నిర్వహణసహా ప్రవర్తనాత్మక మార్పు తెచ్చేందుకు పంచాయతీల నేతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ పథకానికి నిర్దేశించిన రూ.6000 కోట్ల మొత్తంలో 50 శాతం ప్రపంచబ్యాంకు రుణం కాగా, దీన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను సాధారణ బడ్జెట్ పరమైన మద్దతుద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం కింద సమకూరుస్తుంది. ప్రపంచ బ్యాంకు రుణం మొత్తం, కేంద్ర అందించే సహాయం కూడా రాష్ట్రాలకు గ్రాంట్ రూపంలో అందుతుంది.

రెండు ప్రధాన భాగాలుగా ‘అటల్ జల్’:

ఎ. వ్యవస్థాగత బలోపేతం – సామర్థ్యం పెంపు కింద రాష్ట్రాల్లో భూగర్భజల సుస్థిర నిర్వహణ కోసం వ్యవస్థాగత ఏర్పాట్లు చేపడతారు. ఇందులో పర్యవేక్షణ చట్రాల మెరుగు, సామర్థ్య నిర్మాణం, నీటి వినియోగదారు సంఘాల బలోపేతం వగైరాలు కూడా భాగంగా ఉంటాయి.

బి. ప్రోత్సాహక భాగం కింద మెరుగైన భూగర్భజల నిర్వహణ విధానాల్లో రాష్ట్రాలు సాధించే విజయాలకు ప్రోత్సాహకాలుంటాయి. ఇందుకు సమాచార ప్రదానం, జలభద్రత ప్రణాళికల రూపకల్పన, ప్రస్తుత పథకాల ఏకీకరణతోపాటు జల అవసరాల నిర్వహణ విధానాల అనుసరణద్వారా నిర్వహణపరమైన చర్యల అమలు తదితరాలు ప్రాతిపదికగా ఉంటాయి.

‘అటల్ జల్’తో ప్రయోజనాలివే:

i. భూగర్భజల పర్యవేక్షణ చట్రాల మెరుగు, విభిన్న స్థాయులలో భాగస్వాముల సామర్థ్య నిర్మాణం దిశగా వ్యవస్థాగత బలోపేతం ద్వారా భూగర్భజల సమాచార నిల్వ, విశ్లేషణ-ప్రదానం వంటివి మెరుగుపడతాయి.

ii. మెరుగుపడిన సమాచార నిధి ఆధారిత వాస్తవిక జలబడ్జెట్ రూపకల్పనతోపాటు పంచాయతీల స్థాయిలో సామాజిక నేతృత్వాన జలభద్రత ప్రణాళికల తయారీకి వీలవుతుంది.

iii. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రస్తుతం/కొత్త పథకాల ఏకీకరణ ద్వారా జలభద్రత ప్రణాళికలను అమలు చేయడంవల్ల భూగర్భజల సుస్థిర నిర్వహణ కోసం నిధులను ప్రభావవంతంగా, హేతుబద్ధంగా వినియోగించడం సాధ్యమవుతుంది.

iv. సూక్ష్మ సేద్యం, పంటల మార్పిడి, విద్యుత్ సరఫరా వ్యవస్థల విభజనవంటి జల అవసరాల సంబంధిత చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడంద్వారా అందుబాటులోగల భూగర్భజల వనరులను సమర్థంగా వాడుకునే వీలుంటుంది.

ప్రభావం:

ఎ. స్థానిక ప్రజా సమూహాల చురుకైన భాగస్వామ్యంతో పథకం అమలయ్యే ప్రాంతంలో జల్ జీవన్ కార్యక్రమానికి సుస్థిరత్వం లభిస్తుంది.

బి. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా ప్రస్థానానికి తోడ్పడుతుంది.

సి. భాగస్వామ్య భూగర్భ జల నిర్వహణను ప్రోత్సహిస్తుంది.

డి. జల వినియోగ సామర్థ్యం భారీగా మెరుగుపడి పంటల సాగు పద్ధతి కూడా గణనీయంగా మెరుగవుతుంది.

ఇ. భూగర్భజల వనరులను సమర్థ, సమాన వినియోగాన్ని ప్రోత్సహించడంసహా సామాజికంగా ప్రవర్తనాపరమైన మార్పు సాధ్యమవుతుంది.

నేపథ్యం:

దేశంలోని మొత్తం సాగుభూమిలో 65 శాతానికి, గ్రామీణ తాగునీటి సరఫరాలో దాదాపు 85 శాతానికి ఆధారం భూగర్భ జలాలే. అయితే, జనాభా పెరుగుదలతోపాటు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ తదితర కారణాల దృష్ట్యా అవసరాలు పెరుగుతున్నందున దేశంలోని పరిమిత భూగర్భ జలవనరులకు ముప్పు ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో క్రమపద్ధతి లేకుండా, ముమ్మరంగా భూగర్భ జలాలను తోడేస్తున్న ఫలితంగా భూగర్భజల మట్టం వేగంగా, విస్తృతంగా పడిపోతోంది. దీంతోపాటు భూగర్భజల పునఃపూరక నిర్మాణాల సుస్థిరత కూడా తగ్గిపోవడం ఇందుకు మరో కారణం. దీనికితోడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భజల నాణ్యత క్షీణించడం కూడా జల లభ్యత తగ్గిపోవడానికి దారితీస్తోంది. అవసరానికి మించి భూగర్భ జలాన్ని తోడేయడం, జలకాలుష్యం, సంబంధిత పర్యావరణ ప్రభావాలతో భూగర్భ జలంపై ఒత్తిడి పెరుగుతూ జాతి ఆహార భద్రతకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యం మేరకు అవసరమైన నివారణ, పరిష్కార చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

కాబట్టే దేశంలో భూగర్భజల వనరుల దీర్ఘకాలిక సుస్థిరత కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు-నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనం మంత్రిత్వ శాఖ ‘అటల్ భూజల యోజన’ (అటల్ జల్)ద్వారా వినూత్న చర్యలు చేపట్టాయి. ఆ మేరకు ఏడు రాష్ట్రాల పరిధిలో భూగర్భజల ఒత్తిడి అధికంగా ఉన్న సమితులను గుర్తించి భౌగోళిక, శీతోష్ణ, జల-భూసంబంధ, సాంస్కృతిక కూర్పుల విస్తృత శ్రేణిని అనుసరిస్తూ ‘ఎగువనుంచి దిగువకు-దిగువనుంచి ఎగువకు’ పద్ధతుల మేళవింపుతో ముందడుగు వేశాయి. భాగ‌స్వామ్య‌ భూగర్భజల నిర్వహణ కోసం వ్య‌వ‌స్థాగ‌త చట్రాన్ని బలోపేతం చేయడం, సుస్థిర భూగర్భజల వనరుల నిర్వహణ దిశ‌గా సామాజిక స్థాయి ప్రవర్తనాప‌ర‌మైన మార్పులు తేవ‌డం ప్రధాన లక్ష్యంగా ‘అటల్ జ‌ల్’ రూపొందించబడింది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు, సామర్థ్యం పెంపు, ప్రస్తుత/కొత్త పథకాల ఏకీక‌ర‌ణ‌తోపాటు మెరుగైన వ్యవసాయ పద్ధ‌తులు పాటేంలా చూడ‌టంవంటి వివిధ చర్యలు చేపట్టాలని ఈ పథకం నిర్దేశిస్తోంది.

******