Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన


ల‌ఖ్‌న‌వూ లో అటల్ బిహారీ వాజ్ పేయీ వైద్య విశ్వవిద్యాలయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు.

యుపి ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించే భవనం లో అటల్ జీ విగ్రహం ఆవిష్కరించిన సందర్భం గా మాట్లాడుతూ, ఇదే రోజు సత్పరిపాలన దినోత్సవం కావడం కూడా యాదృచ్ఛికమని ఈ సందర్భం గా ప్రధాన మంత్రి అన్నారు. లోక్ భవన్ లో పని చేసే వారందరి కీ ఈ అద్భుతమైన విగ్రహం సత్పరిపాలన లోను, ప్రజాసేవ లోను స్ఫూర్తి గా నిలుస్తుందని ఆయన అన్నారు.

ఎన్నో సంవత్సరాల పాటు అటల్ జీ ప్రాతినిథ్యం వహించిన పార్లమెంటరీ నియోజకవర్గం ల‌ఖ్‌న‌వూ లో ఆయన కు అంకితం చేసిన వైద్య విద్యాకేంద్రాని కి శంకుస్థాపన చేయడం తన అదృష్టమని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా అన్నారు. జీవితాన్ని ఒక సమగ్ర రూపం లోనే చూడాలి తప్పితే, ముక్కలు ముక్కలు గా చూడకూడదని అటల్ జీ చెప్పేవారన్న విషయం ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికైనా, సత్పరిపాలనకైనా కూడా అదే సూత్రం వర్తిస్తుందని ఆయన అన్నారు. సమస్యల ను సమ్యక్ దృక్పథం తో చూడగలిగితే తప్ప సత్పరిపాలన సాధ్యం కాదని ఆయన వక్కాణించారు.

తమ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగాని కి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళిక ను ప్రధాన మంత్రి వివరించారు. నివారణీయ ఆరోగ్య సంరక్షణ, అందరి కీ అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ తో పాటుగా, ఆరోగ్య సంరక్షణ రంగాని కి అవసరం అయిన అన్ని వస్తువులు, పరికరాలు అందుబాటు లో ఉండేలా సరఫరాల మెరుగుదల కు చర్యలు తీసుకోవడం, ఉద్యమ స్ఫూర్తి తో అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం తమ ప్రణాళిక లోని ప్రధానాంశాలని ఆయన తెలిపారు. స్వచ్ఛ భారత్ నుంచి యోగ వరకు, ఉజ్వల నుంచి ఫిట్ ఇండియా కార్యక్రమం వరకు, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం సహా, ప్రతి ఒక్క కార్యక్రమం వ్యాధి వచ్చిన తర్వాత కన్నా రోగనివారణకు దోహదపడే ఆరోగ్య సంరక్షణ సేవల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేవేనని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.25 లక్షల కు పైబడి వెల్ నెస్ కేంద్రాల నిర్మాణం కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో భాగమేనని ఆయన చెప్పారు. ఈ కేంద్రాలు రోగాల కు సంబంధించిన సంకేతాల ను ముందుగానే కనిపెట్టడం ద్వారా వాటికి సరైన చికిత్స ప్రారంభించడానికి సహాయకారిగా ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లో భాగం గా దేశం లో 70 లక్షల మంది పేద రోగుల కు ఉచిత చికిత్స అందిస్తున్నారని, వారిలో 11 లక్షల మంది యుపి కి చెందిన వారేనని ఆయన తెలిపారు.

పారిశుధ్యం, ఆరోగ్య సదుపాయాలు ప్రతీ ఒక్క గ్రామానికి అందుబాటు లో ఉండాలన్న సంకల్పం తో ప్రభుత్వం చేపట్టిన ప్రచారోద్యమం యుపి ప్రజల జీవితాన్ని సరళం చేసే దిశగా ఒక పెద్ద అడుగు అని ప్రధాన మంత్రి అన్నారు. తన ప్రభుత్వాని కి సంబంధించినంత వరకు సత్పరిపాలన అంటే ప్రతి ఒక్కరి మాట వినడం, ప్రతి ఒక్క పౌరుని కి సేవలు అందేలా చూడడం, ప్రతి ఒక్క భారతీయుని కి అవకాశాలు అందుబాటులో ఉంచడం, ప్రతి ఒక్క భారతీయుడు తనకు భద్రత ఉన్నదనే భావం కలిగేలా చేయడం, ప్రభుత్వం లోని ప్రతి ఒక్క వ్యవస్థ ప్రజల కు అందుబాటు లో ఉంచడమేనని ప్రధాన మంత్రి వివరించారు. స్వాతంత్య్రానంతర సంవత్సరాల్లో మనం హక్కుల కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామంటూ ఇప్పుడు తాము విధులు, బాధ్యతల కు కూడా సమ ప్రాధాన్యం ఇస్తూ వాటిని పాటించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రజల ను కోరుతున్నామని ఆయన చెప్పారు. హక్కులు, బాధ్యత లు ఎప్పుడూ ఒక దానితో ఒకటి కలిసి అడుగేస్తాయని అందరం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మంచి విద్య, అందుబాటులో విద్య మన హక్కులైతే విద్యాలయాల్లో భద్రత, ఉపాధ్యాయులను గౌరవించడం మన బాధ్యతలని ఆయన వివరించారు. ఈ సత్పరిపాలన దినోత్సవం రోజున అన్ని బాధ్యతలు పూర్తి చేయడం, లక్ష్యాలన్నీ చేరుకోవడం సంకల్పం కావాలని, అదే తమ నుంచి ప్రజలు కోరేది, అటల్ జీ స్ఫూర్తి కూడా అని వక్కాణిస్తూ ప్రధాన మంత్రి ముగించారు.