ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొని, అజెండాలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పుంఛీ సంఘం సూచనల పైన ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు సమావేశంలో తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయాలు ఒక మంచి ప్రారంభానికి మార్గం వేశాయన్నారు. ఈ అంశంపై చర్చలు ముందు ముందు కొనసాగుతాయని, పుంఛీ కమిషన్ సూచనలపై ఏకాభిప్రాయం రాగానే వాటి అమలు ప్రక్రియ వెనువెంటనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
ఉత్తమ పరిపాలనను, పారదర్శకతను సాధించడానికిగాను ‘ఆధార్’ ప్రక్రియను ఉపయోగించుకోవాలనే అంశంపైన ఈ సమావేశంలో దాదాపుగా అందరూ ఏకీభవించడంపైన ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఆధార్’ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన స్థాయిలో మేలు జరిగిందని ఆయన వివరించారు. ఎంతమేరకు మేలు జరిగిందనేది తెలుసుకోవడానికిగాను కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వెంటనే రాష్ట్రాల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలను పేమెంట్ బ్యాంకులుగా గుర్తించడం జరిగిందని, దీని వల్ల ప్రజలకు ఆయా పథకాల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చడం సులువవుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి విద్యారంగాన్ని గురించి మాట్లాడుతూ కేవలం విద్యారంగ విస్తరణ సరిపోదని, నాణ్యమైన విద్యను అందించడంపైన దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. విద్యారంగంలో నాణ్యతా లోపాన్ని సాంకేతిక విజ్ఞానం ద్వారా భర్తీ చేయవచ్చన్నారు.
శాంతి భద్రతల గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న పలు సంఘటనలను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించరాదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సంబంధిత వ్యక్తులు రాజకీయాలను పక్కన పెట్టి వ్యవహరించాలని, జాతి భద్రతకు అన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు. గతంలో మూడు రోజుల సమావేశం సందర్భంగా తాను రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్స్ జనరల్ తో సంభాషించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆ సమావేశంలో జరిగిన చర్చల తదుపరి పరిణామాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసుకోవాలని సూచించారు. పోలీసు బలగాల నిర్వహణ అందరికీ తెలిసేలా, అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. నేరాలను నియంత్రించడంలో సిసిటివి నెట్ వర్క్ ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సిసిటీవీలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అసాంఘిక శక్తులను అణచివేయడానికి రాష్ట్రాల మధ్య సహకారం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి వివరించారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు ఇచ్చిన అన్ని సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.