ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజధానిలో నారీశక్తి పురస్కార విజేతల తో సమావేశమయ్యారు. లేహ్, కాశ్మీర్, ఆంద్ర ప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది మహిళా సాధకులు ప్రధాన మంత్రి తో సమావేశమై వారి జీవిత కథ ను పంచుకొన్నారు. ప్రధాన మంత్రి వారి తో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించి వారి జీవితానుభవాలను, కష్టసుఖాలను, వారు తమ లక్ష్యాన్ని సాధించిన తీరును అడిగి తెలుసుకున్నారు.
ప్రధానితో సమావేశమైన మహిళా సాధకులలో 103 ఏళ్ళ మాన్ కౌర్ ఒకరు. ఆమె 93 సంవత్సరాల వయసులో వ్యాయామక్రీడలు ప్రారంభించి పోలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో 4 బంగారు పతకాలు సాధించారు.
జమ్ము కశ్మీర్ కు చెందిన అరీఫా జాన్ కూడా హాజరయ్యారు. ఆమె కనుమరుగవుతున్న నుందా హస్తకళ ల పునరుజ్జీవనానికి కృషి చేశారు. అంతరించి పోయి అవసాన దశ కు చేరిన నుందా హస్తకళల ను తిరిగి కనుగొని మళ్ళి వెలుగు లోకి తెచ్చిన ఘనత ఆమె ది. కశ్మీర్ లో 100కు పైగా మహిళల కు నుందా హస్తకళ లో శిక్షణ ఇవ్వడం లో తన అనుభవాన్ని, హస్తకళ పునరుద్ధరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె ప్రధాన మంత్రి తో పంచుకొన్నారు.
భారతీయ వైమానిక దళ యుద్దవిమానంలో మొట్టమొదటి మహిళా పైలెట్ లు (ఫైటర్ పైలెట్ లు) మోహన సింహ్, భావన కాంత్, అవని చతుర్వేది లు కూడా వారి అనుభవాల ను పంచుకొన్నారు. యుద్ద విమానాల పైలెట్ లుగా మహిళల కు ప్రయోగాత్మకం గా అవకాశాన్ని కల్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన తరువాత మొదటి సారి గా ఈ ముగ్గురి ని యుద్ద విమాన పైలెట్ లుగా చేర్చుకొన్నారు. ఈ ముగ్గురూ భారతీయ వైమానిక దళం లో మొదటి మహిళా పైలెట్ లు అయ్యారు. వారు 2018లో మిగ్ -21 విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ పైలెట్లు అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గిరిజన మహిళ మరియు గ్రామీణ పారిశ్రామికవేత్త పడాల భూదేవి, బిహార్ లోని ముంగేర్ కు చెందిన, పుట్టగొడుగుల సాగును బాగా వ్యాప్తి లోకి తెచ్చి అందరి చేత ‘మష్రూమ్ మహిళ’ అని ఆప్యాయం గా పిలిపించుకొనే బీనాదేవి కూడా సేద్యం లో, మార్కెటింగ్ లో తమ అనుభవాల ను ప్రధాన మంత్రి తో పంచుకొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాకు చెందిన కళావతి దేవి తాపీ పని కార్మికురాలు. బహిరంగ మల విసర్జన నుండి జిల్లా కు విముక్తి ని కలిగించడంలో ఆమె ప్రధాన భూమిక ను నిర్వహించారు. కాన్ పుర్ లో, ఆ చుట్టుపక్కల 4000కు పైగా మరుగుదొడ్లను నిర్మించడం లో ఆమె కీలకమైన పాత్ర ను పోషించారు. బహిరంగ మల విసర్జన ను తగ్గించడానికి కాన్ పుర్ లో, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి దాని వల్ల కలిగే దుష్పలితాలను గురించి అవగాహన కలిగించడానికి ప్రచారం చేయడం, గంటల కొద్దీ గ్రామాలలో పర్యటించడం గురించి ఆమె తన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.
ఝార్ ఖండ్ కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు చామీ ముర్ము 30,000 మందికి పైగా మహిళల తో 2800 బృందాల ను ఏర్పాటు చేసి బంజరు భూముల లో 25 లక్షల కు పైగా మొక్కలు నాటించడంలో తన అనుభవాన్ని ప్రధానమంత్రి తో పంచుకొన్నారు.
కేరళకు చెందిన 98 సంవత్సరాల కాత్యాయని అమ్మ 90వ పడిలో చదువుకోవడంలో తన అనుభవాన్ని ప్రధానమంత్రి తో పంచుకున్నారు. కేరళ అక్షరాస్యతా మిశన్ వారు 2018 ఆగస్టులో నిర్వహించిన అక్షరలక్ష్మం పథకం కింద నాల్గవ తరగతికి సమానమైన పరీక్షలో ఆమె ఉత్తీర్ణులయ్యారు. అంతేకాక 98% మార్కుల తో మొదటి ర్యాంకు పొందారు.
సమాజ నిర్మాణం లో మరియు జాతి జనులకు స్పూర్తిని కలుగజేయడంలో నారీశక్తి అవార్డు విజేతల తోడ్పాటు ఎంతో ఉందని సమావేశంలో మాట్లాడిన ప్రధాన మంత్రి అన్నారు.
మహిళల ముఖ్యమైన సహకారం లేకుండా మన దేశం బహిరంగ మల మూత్రాదుల విసర్జన బారి నుండి విముక్తి ని పొందగలిగి ఉండేది కాదని ఆయన అన్నారు. అదేవిధం గా మహిళల ప్రాతినిధ్యం ద్వారా మాత్రమే పోషకాహారలోపం సమస్యను కూడా పరిష్కరించుకోగలమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని జలసంరక్షణను గురించి కూడా ప్రస్తావించారు. జల్ జీవన్ మిశన్ లో మహిళల ప్రాతినిధ్యం పెరగవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు.
మహిళా సాధకులందరి ని ఆయన అభినందించారు. వారు దేశానికంతటి కి స్పూర్తిప్రదాత లు అని ప్రధాన మంత్రి అన్నారు.
PM @narendramodi interacted with the Nari Shakti Puraskar winners earlier today. pic.twitter.com/v5D7Xro4D1
— PMO India (@PMOIndia) March 8, 2020