సమగ్రాభివృద్ధి కోసమని విస్తృత స్థాయిలో సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగుతోంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జామ్) ల వినియోగం ద్వారా భారత్ విప్లవాత్మకమైన సంస్కరణలకు మార్గదర్శిగా నిలుస్తోంది. సంక్షేమపథకాలను, వాటి ప్రయోజనాలను లక్షిత ప్రజలకు జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జామ్)- మూడింటి సమ్మేళనం ద్వారా అందిచటం విశేషం. ఈ వినూత్న పద్ధతి ద్వారా ఎలాంటి లోపాల్లేకుండా, అవినీతి లేకుండా, నగదు రహితంగా ప్రయోజనాలు లక్షిత ప్రజలకు బదిలీ అవుతాయి. ఈ పద్ధతి ద్వారా సబ్సిడీల్లో కోత ఉండదు. సబ్సిడీలను అందించే లొసుగుల్లోనే కోత!
దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం వస్తువులు, సేవల (జీఎస్‌టీ)పన్నును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 2016 ఏప్రిల్ 1 నుంచి దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్‌టీ ప్రవేశపెడుతుంది. దీనివల్ల ప్రస్తుతం కొనసాగుతున్న భిన్న పన్నుల అస్తవ్యస్త వ్యవస్థ, తద్వారా ప్రజలపై పడుతున్న భారాలు తొలగి పన్నుల వ్యవస్థ సరళీకృతం అవుతుంది.
ప్రభుత్వం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనే విశిష్ట పథకాన్ని ఆరంభించిది. వారి నియోజకవర్గంలోని ఏదైనా ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా ఎంపీలను ప్రోత్సహించటం ఈ పథక ఉద్దేశం. తద్వారా వివిధ పథకాలతో పాటు తమ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటానికి ఎంపీలకు ఈ పథకం స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది.
యూరియా ఉత్పత్తి కోసం గ్రిడ్ కు అనుసంధానమైన అన్ని ఫర్టిలైజర్ ప్లాంట్లకు ఏకీకృత ధరకు సమీకృత సహజవాయువును సరఫరా చేయాలన్న పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేగాకుండా ఆగిపోయిన 16000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను కూడా పునరుద్ధరించే పథకానికి కూడా అంగీకారం తెలిపింది. పెట్టుబడులపై కట్టుబాట్లను, నియంత్రణలను తొలగించటం ద్వారా భారత్‌లో అత్యంత విలువైన పారిశ్రామిక రంగాలు రక్షణ, నిర్మాణ, రైల్వే రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యానికి అవకాశం కలిగింది. రక్షణోత్పత్తుల రంగంలో విదేశీ పెట్టుబడులపై నియంత్రణను 26శాతం నుంచి సడలించి 49 శాతానికి వెసులుబాటు కల్పించారు. అటోమెటిక్ మార్గంలో పోర్టిఫోలియో పెట్టుబడులను రక్షణోత్పత్తుల రంగంలో 24శాతం దాకా అనుమతిస్తారు. నిర్మాణ రంగంలో, రైల్వేల నిర్వహన రంగంలో అటోమెటిక్ మార్గంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు.