సామాజిక, ఆర్థికాభివృద్ధికోసం గట్టి పోరాటం సలిపిన, సుసంపన్నమైన భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద పట్ల ప్రగాఢ అభిమానం కలిగిన హెచ్.డి. దేవె గౌడ 1933 మే 18న కర్ణాటకలోని హసన్ జిల్లా హోళె నర్సిపుర తాలూకా, హరదనహళ్ళిలో జన్మించారు.
సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తీసుకున్న దేవెగౌడ 20 ఏళ్ళ వయసులో చదువు పూర్తయిన వెంటనే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గౌడ 1962 వరకు అదే పార్టీలో కొనసాగారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దేవె గౌడ రైతు జీవితంలోని కష్టాలకు ప్రభావితులయ్యారు. సమాజంలో పేద రైతులు, అణగారిన వర్గాలు, అణచివేతలకు గురైన తరగతుల అభ్యున్నతికి పోరాట దీక్ష బూనారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో కింది స్థాయి నుంచి జీవితం ప్రారంభించిన దేవె గౌడ క్రమంగా రాజకీయంగా ఉన్నతిస్థాయికి చేరారు. హోళె నర్సిపురాలో ఆంజనేయ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుగా, తరువాత తాలూకా అభివృద్ధి మండలి సభ్యునిగా అందించిన సేవల ద్వారా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
సమాజంలో నెలకొన్న అసమానతలను చక్కదిద్దే లక్ష్యంతో ఆయన ఎల్లవేళలా ఆదర్శవంతమైన రాష్ట్రం కోసం కలలు గనేవారు. కేవలం 28 ఏళ్ళ వయసులో యువ దేవె గౌడ 1962లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించి కర్ణాటక అసెంబ్లీ సభ్యునిగా ఆశయ సాధనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీకి సమర్థత కలిగిన స్పీకర్‌గా తన సీనియర్లతో సహా ప్రతి ఒక్కరి అభిమానం పొందారు. ఆ తరువాత వరుసగా మూడు పర్యాయాలు, అనంతరం 1967 – 71, 1972 – 77, 1978 – 83 ఎన్నికల్లో హొళె నర్సిపూర్ నియోజకవర్గం ప్రజలు ఆయనను అసెంబ్లీకి పంపారు.
1972 మార్చి నుంచి 1976 మార్చి వరకు, 1976 నవంబరు నుంచి 1977 డిసెంబర్ వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగా తన సత్తా చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.
1982 నవంబరు 22న 6వ అసెంబ్లీ సభ్యత్వానికి దేవె గౌడ రాజీనామా చేశారు. 7, 8 అసెంబ్లీలలో సభ్యునిగా ఆయన ప్రజా పనులు, సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇరిగేషన్ మంత్రిగా ఆయన హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. సాగునీటి రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేస్తూ దేవె గౌడ 1987లో మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
స్వాతంత్రం, సమానత్వంపై పోరాట యోధునిగా 1975 – 76లో కేంద్ర స్థాయిలో తిరుగుబాటు సాగించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన విపరీతంగా పుస్తకాలు చదవడం ద్వారా తన విజ్ఞనాన్ని మరింత సుసంపన్నం చేసుకున్నారు. పుస్తక జ్ఞానంతోపాటు ఎమర్జెన్సీలో జైళ్‌కు వచ్చిన ఇతర రాజకీయ ఉద్దండులతో పరిచయాల వల్ల వ్యక్తిగతంగా ఆయన మరింత బలపడ్డారు. ఆయన ఆలోచనలు కూడా పరిపక్వత చెందాయి. నిర్భందం నుంచి బయటపడే నాటికి ఆయన పరిపూర్ణ వ్యక్తిగా ఆవిర్భవించారు.
1991లో హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు దేవె గౌడ ఎన్నిక రాష్ట్ర సమస్యలను ముఖ్యంగా రైతుల సమస్యలను జాతీయ దృష్టికి తీసుకురావడానికి దోహదపడింది. పార్లమెంటులో రైతుల దుస్థితిని ఏకరువు పెట్టడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు. పార్లమెంటు ఇతర సంబంధిత సంస్థల గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింపచేయడంలో కూడా దేవె గౌడ తనదైన ముద్ర వేసుకున్నారు.
రాష్ట్రస్థాయిలో జనతాపార్టీకి రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన దేవె గౌడ 1994లో రాష్ట్ర జనతాదళ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 1994లో కర్ణాటకలో జనతాదళ్ అధికారం చేపట్టడంలో ఆయన పాత్ర కీలకం. జనతాదళ్ లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడుగా ఎన్నికైన దేవెగౌడ 1994 డిసెంబర్ 11న కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు రమానగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
క్రియాశీల రాజకీయాల్లో ఆయన సుదీర్ఘ అనుభవం, అట్టడుగు స్థాయిలో ఆయనకు గల పటిష్ఠమైన స్థానం అప్పట్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన సునాయసంగా పరిష్కరించడానికి దోహదం చేశాయి. హుబ్లీలోని ఈద్గా మైదాన్ వివాదం తెరపైకి వచ్చినప్పుడు ఆయన రాజకీయ చతురతకు మరోసారి అగ్ని పరీక్ష ఎదురైంది. మైనార్టీలకు చెందిన స్థలం కావడంతో తలెత్తిన రాజకీయ వివాదానికి దేవె గౌడ శాంతియుత పరిష్కారాన్ని సాధించడంలో సఫలీకృతులయ్యారు.
1995 జనవరిలో దేవె గౌడ స్విట్జర్లాండ్‌లో పర్యటించి అంతర్జాతీయ ఆర్థికవేత్తల సదస్సులో పాల్గొన్నారు. అంకితభావం కలిగిన రాజకీయవేత్తగా ఆయన సాధించిన విజయాలకు యూరోప్, మధ్య ప్రాత్య దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలు సాక్షీ భూతాలుగా నిలిచాయి. సింగపూర్‌లో ఆయన జరిపిన పర్యటన కర్ణాటక రాష్ట్రానికి ఎంతో అవసరమైన విదేశీ పెట్టుబడులను సమకూర్చడానికి దోహదపడడమే కాక దేవె గౌడ వ్యాపార చతురత కూడా ప్రదర్శితమైంది.
1970వ దశకంలో దేవె గౌడ రాజకీయ జీవితంలో స్నేహితులతోపాటు శత్రువులు కూడా పెరిగారు. తన రాజకీయాలన్నీ ప్రజా రాజకీయాలని, ప్రజలు తనతో వుంటే సంతోషమనీ, వారికోసం కొంతైనా చేస్తానని దేవె గౌడ అనేవారు.
1989లో జనతాపార్టీలోని తన వర్గం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంది. మొత్తం 222 అసెంబ్లీ సీట్లలో ఈ వర్గానికి కేవలం రెండు సీట్లు మాత్రమే లభించాయి. తన జీవితంలో మొట్టమొదటిసారి దేవెగౌడ కూడా ఓటమిని చవిచూశారు. పోటీ చేసిన రెండు స్థానాలో్లను ఆయన ఓడిపోయారు. రాజకీయాల్లో అదృష్టం, దురదృష్టం సమానమన్న వాస్తవం ఆయన విషయంలోను రుజువైంది.
ఈ ఓటమి ఆయనలో మరింత పట్టుదల పెంచింది. పోయిన గౌరవాన్ని అధికారాన్ని తిరిగి పొందాలన్న సంకల్పం దృఢంగా మారింది. తనదైన రాజకీయ వ్యవహార శైలిని ఆయన పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్‌్డింది. ఇటు కర్ణాటకలోను, అటు ఢిల్లీలో కూడా స్నేహితులను సంపాదించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో వైరానికి స్వస్తి చెప్పారు. నిరాడంబరత, తక్కువ స్థాయిలో వ్యవహరించే జీవనశైలి కలిగిన దేవె గౌడ వాస్తవానికి దృఢంగా, సమర్థంగా వ్యవహరించగల నాయకుడిగానే గుర్తింపు పొందారు.
రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు దేవె గౌడ ఒక కాంట్రాక్టరుగా చిన్న చిన్న పనులు చేసేవారు. ఇండిపెండెంట్‌గా 7 సంవత్సరాలు పనిచేసిన కాలం వెలుపల నుంచి పార్టీ రాజకీయలను అవగాహన చేసుకోవడానికి ఆయనకు సహాయపడింది. అసెంబ్లీ లైబ్రరీలో ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. 1967లో మళ్ళీ ఎన్నిక కావడం ఆయనకు అమిత విశ్వాసాన్ని అందించింది. 1969లో కాంగ్రెస్ చీలిపోయినప్పుడు ఆయన నిజలింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్ (ఓ)లో చేరారు. అప్పటికి ఆ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది. కాగా, 1971 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఓ) తుడిచిపెట్టుకుపోయిన అనంతరం దేవె గౌడ ముందు భారీ అవకాశం వచ్చి వాలింది. ఇంధిరాగాంధీ ప్రభంజనంలో కుదించుకుపోయిన ప్రతిపక్షానికి దేవెగౌడ నాయకుడయ్యాడు.
దొడ్డె గౌడ, దేవమ్మ దంపతులకు జన్మించిన దేవె గౌడ తన నిరాడంబర వ్యవసాయ కుటుంబ నేపథ్యానికి ఎంతో గర్వపడతారు. శ్రీమతి చెన్నమ్మను వివాహమాడిన దేవె గౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుల్లో ఒకరు కర్ణాటకలో శాసనసభ్యుడు కాగా, మరొకరు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
తృతీయ ఫ్రంట్ (ప్రాంతీయ పార్టీలు, నాన్-కాంగ్రెస్, నాన్-బిజెపి పార్టీల కూటమి) నాయకత్వం దేవె గౌడ గట్టిగా కోరకుండానే ఆయనను వరించింది.
1996 మే 30న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన దేవె గౌడ తృతీయ ఫ్రంట్ నేత హోదాలో 11వ భారత ప్‌్ధానిగా ప్రమాణస్వీకారం చేశారు.