1931 జూన్ 25న అలహాబాద్‌లో జన్మించిన వి.పి.సింగ్ రాజాబహదూర్ రాంగోపాల్‌సింగ్ కుమారుడు. అలహాబాద్, పూనా విశ్వవిద్యాలయాల్లో ఆయన విద్యను అభ్యసించారు. 1955 జూన్ 25న సీతాకుమారిని వివాహమాడిన వి.పి.సింగ్ కు ఇద్దరు కుమారులు. విద్యావంతుడైన వి.పి.సింగ్ అల్హబాద్‌లోని కొరాన్‌లో గోపాల్ విద్యాలయ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజీని స్థాపించారు. 1947 – 48లో వారణాసిలోని ఉదయ్‌ప్రతాప్ కళాశాల విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 1957లో భూదాన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలహాబాద్‌లోని పస్నా గ్రామంలో సుసంపన్నమైన భూ క్షేత్రాన్ని విరాళంగా ఇచ్చారు.
1969 – 71 మధ్య ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగాను, అలహాబాద్ యూనివర్శిటీ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. 1969 – 71 మధ్య ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. 1970 -71లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ విప్ గా పనిచేశారు. 1971 – 74 మధ్య లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1974 అక్టోబర్ నుంచి 1976 నవంబర్ వరకు కేంద్ర వాణిజ్యశాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. 1976 నవంబర్ నుంచి 1977 మార్చి వరకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 1980 జనవరి 3 నుంచి జులై 26 వరకు లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు. 1980 జూన్ 9 నుంచి 1982 జూన్ 28 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980 నవంబర్ 21 నుంచి 1981 జూన్ 14 వరకు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగాను, 1981 జూన్ 15 నుంచి 1983 జులై 16 వరకు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగాను పనిచేశారు.
H1983 జనవరి 29న కేంద్ర వాణిజ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వి.పి.సింగ్ 1983 ఫిబ్రవరి 15 సరఫరాల శాఖ అదనపు బాధ్యతలు చేపట్టారు. 1983 జులై 16న రాజ్యసభ్యునిగా ఎన్నికయ్యారు. 1984 సెప్టెంబర్ 1న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1984 డిసెంబర్ 31న కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.