ప్రస్తుతం గుజరాత్‌లోని బల్సర్ జిల్లాలో ఉన్న భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29న శ్రీ మొరార్జీ దేశాయ్ జన్మించారు. ఆయన తండ్రి గట్టి క్రమశిక్షణ కలిగిన పాఠశాల ఉపాధ్యాయుడు. చిన్నతనం నుంచే మొరార్జీ దేశాయ్ తన తండ్రి నుంచి కష్టపడి పనిచేయడం, ఎటువంటి సందర్భంలోనైనా సత్యాన్నే పలకడం వంటి మంచి లక్షణాలు అలవర్చుకున్నారు. సెయింట్ బూసర్ హైస్కూల్‌లో చదువుకుని మెట్రిక్ ఉత్తీర్ణులయ్యారు. 1918లో అప్పటి బోంబే రాష్ట్రంలోని విల్సన్ సివిల్ సర్వీస్ నుంచి డిగ్రీ తీసుకుని 12 ఏళ్ళపాటు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు.
1930లో మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న సమయంలో బ్రిటీష్ న్యాయ సూత్రాల పట్ల విశ్వాసం కోల్పోయిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ ఇది దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన విషయంగాను, కుటుంబం తలవంచుకొని పనిచేయవలసిన సమస్యగాను భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో మొరార్జీ దేశాయ్ మూడుసార్లు జైలుకు వెళ్ళారు. 1931లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగాను, 1937లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించారు.
1937లో తొలి కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పు అప్పటి బోంబే రాష్ట్రంలో బి.జి. ఖేర్ నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, సహకార శాఖల మంత్రిగా పనిచేశారు. 1939లో ప్రజల ఆమోదం లేకుండా ప్రపంచ యుద్ధంలో భారత్ భాగస్వామి కావడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామాలు చేశాయి.
మహాత్మాగాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహంలో పాలుపంచుకున్నందుకు నిర్భంధానికి గురైన మొరార్జీదేశాయ్ 1941 అక్టోబర్‌లో విడుదలయ్యారు. అయితే, తిరిగి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 ఆగస్టులో మళ్ళీ అరెస్టయ్యారు. 1945లో విడుదలయ్యారు. 1946లో రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల అనంతరం ఆయన బోంబేలో హోం, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన హయాంలో మొరార్జీ దేశాయ్ లాండ్ రెవెన్యూకు సంబంధించి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కౌలుదారుల హక్కులకు భద్రత కల్పించారు. పోలీస్ యంత్రాంగంలో ప్రజలకు పోలీసులకు అంతరం తొలగించి విధానాలు అమలుచేశారు. ప్రజల అవసరాలకు తక్షణం సానుకూలంగా స్పందించేలా పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించారు. 1952లో బోంబే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
గ్రామాలు, పట్టణాల్లో నివసించే పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనంత వరకు సామ్యవాదానికి తగిన అర్థం ఉండదని మొరార్జీ దేశాయ్ భావించేవారు. ఈ దిశలోనే రైతులు, కౌలుదారుల కష్టాలు తొలగించే అనేక అభ్యుదయకర చట్టాలను ఆయన రూపొందించారు. ఈ విషయంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. బోంబేలో మొరార్జీ దేశాయ్ అందించిన విస్తృత స్థాయిలో గుర్తింపు పొందింది.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ తరువాత మొరార్జీదేశాయ్ 1956 నవంబర్ 14న కేంద్ర మంత్రివర్గంలో వాణిజ్య, పరిశ్రమల శాఖను చేపట్టారు. 1958 మార్చి 22న ఆర్థిక మంత్రి అయ్యారు.
ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించి తన భావాలకు, ఆలోచనలకు మొరార్జీ దేశాయ్ ఆచరణ రూపం కల్పించారు. రక్షణ, అభివృద్ధి అవసరాలకు వీలుగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు వృధా వ్యయాన్ని తగ్గించి, ప్రభుత్వ వ్యయంలోను, పాలనలోను పొదుపునకు తెర తీశారు. ఆర్థిక లోటును సాధ్యమైనంత వరకు ఆర్థిక క్రమశిక్షణ ద్వారా చాలా తక్కువ స్థాయిలో ఉంచారు. సమాజంలో సంపన్నవర్గాలు అనుభవించే విలాసాలపై ఆంక్షలు అమలుచేశారు.
1963లో కామరాజ్ ప్లాన్ కింద ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థానంలో ప్రధానిగా నియమితులైన లాల్ బహదూర్ శాస్త్రి ఆయనను పాలనా వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ కోసం పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ బాధ్యతలను చేపట్టేందుకు ఒప్పించారు. సుదీర్ఘమైన, వైవిధ్యభరితమైన మొరార్జీ దేశాయ్ ప్రజా జీవనానుభవం ఆయనకు లక్ష్య సాధనలో ఎంతో ఉపయోగపడింది.
1967లో మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉప ప్రధానిగా ఆర్థిక మంత్రిత్వశాఖను చేపట్టారు. 1969 జులైలో ఇందిరాగాంధీ ఆయన వద్ద నుంచి ఆర్థిక శాఖను తీసేసుకున్నారు. శాఖలను మార్చే విచక్షణాధికారం ప్రధానమంత్రికి ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ తమను సంప్రదించాలన్న కనీస మర్యాదను పాటించకుండా, తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించారన్న అభిప్రాయంతో మొరార్జీ దేశాయ్ ఉప ప్‌యధాని పదవికి రాజీనామా చేశారు.
1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు మొరార్జీ దేశాయ్ పార్టీకి మాతృక అయిన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ప్రతిపక్షానికి సారధ్య పాత్ర పోషించారు. 1971లో పార్లమెంట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. 1975లో రద్దయిన గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణ అంశంపై ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్ష ఫలితంగా 1975 జూన్‌లో ఎన్నికలు జరిగాయి. ఇండిపెండెంట్ల మద్దతుతో నాలుగు ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటుచేసిన జనతా ఫ్రంట్ ఆ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించింది. లోక్ సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఇందిరాగాంధీ రాజీనామా సమర్పించి ఉండవలసిందని మొరార్ఝీ దేశాయ్ అభిప్రాయ పడ్డారు.
1975 జూన్ 26న ఎమెర్జెన్సా ప్రకటించినప్పుడు మొరార్జీ దేశాయ్‌ను అరెస్టు చేశారు. ఒంటరి నిర్బంధం నుంచి 1977 జనవరి 18న మొరార్జీ విడుదలయ్యారు. అంతకు కొద్ది సమయం ముందే లోక్ సభ ఎన్నికలను ప్రకటించారు. మొరార్జీ దేశాయ్ దేశమంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహించి 1977 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయానికి ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచారు. గుజరాత్‌లోని సూరత్ నియోజకవర్గం నుంచి మొరార్జీ లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో జనతా పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై, 1977 మార్చి 24న భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మొరార్జీ దేశాయ్ 1911లో గుజ్రాబెన్‌ను వివాహమాడారు. వారి ఐదుగురు పిల్లలలో ఒక కుమార్తె, కుమారుడు ప్రస్తుతం సజీవంగా ఉన్నారు.
ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ – భారత ప్రజలు ఎల్లవేళలా నిర్భయంగా ఉండాలని, ఎంత గొప్పవారైనా ప్రశ్నించగలిగే స్థాయిలో ప్రజలు ఉండాలని ఆకాంక్షించేవారు. ప్రధానితో సహా ఏ ఒక్కరూ కూడా చట్టానికి అతీతులు కారాదని ఆయన పదే పదే చెబుతూండేవారు.
మొరార్జీ దేశాయ్ దృష్టిలో నిజాయితీ అనేది ఒక విశ్వాసం తప్ప అవసరం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉండేవారు. క్లిష్టమైన సందర్భాల్లో కూడా ఆయన రాజీపడిన దాఖలాలు లేవు. ‘జీవితంలో ప్రతి ఒక్కరూ నిజాయితీకి కట్టుబడి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్న ధర్మ సూత్రాన్ని’ మొరార్జీ దేశాయ్ ఆచరించి చూపించారు. .