శ్రీ చంద్రశేఖర్ 1927 ఏప్రిల్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా ఇబ్రహీంపట్టి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. 1977 నుంచి 1988 వరకు జనతాపార్టీ అధ్యక్షునిగా ఉన్నారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన చంద్రశేఖర్ విప్లవాత్మక భావాలతో ఫైర్ బ్రాండ్ ఆదర్శవాదిగా పేరు గాంచారు. 1950 – 51లో అలహాబాద్ యూనివర్శిటీ నుంచి పొలిటకల్ సైన్సు లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తరువాత ఆయన సోషలిస్ట్ ఉద్యమంలో చేరారు. ఆచార్య నరేంద్రదేవ్తో అతి సన్నిహింతంగా కలిసి పనిచేసిన ఘనత ఆయనకు ఉంది. బలియా జిల్లా ప్రజా సోషలిస్ట్ పార్టీకి ఆయన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏడాది వ్యవధిలోనే ఉత్తరప్సదేశ్ రాష్ట్ర ప్రజా సోషలిస్ట్ పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1955-56లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజా సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు.
1962లో ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1965 జనవరిలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1967లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్లమెంటు సభ్యునిగా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను సభ దృష్టికి తేవడంలో అమితమైన శ్రద్ధ చూపడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్నారు. సత్వర సామాజిక మార్పు కోసం విధానాలు రూపొందించాలంటూ పార్లమెంటులో వత్తిడి తెచ్చేవారు. ఈ సందర్భంలో ప్రభుత్వ సహాయంతో గుత్తాధిపత్య సంస్థలు విచక్షణారహితంగా ఎదగడాన్ని ఆయన పలుసార్లు ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో ఘర్షణకు తలపడేవారు. స్వార్థపర శక్తులపై పోరాటంలో ఆయన స్ఫూర్తి, సాహసం కారణంగా ఆయనకు ‘యంగ్‌టర్క్’ నేతగా పేరు వచ్చింది.
యంగ్ ఇండియన్ పేరుతో ఆయన 1969లో ఢిల్లీ నుంచి ఒక వార పత్రికను నిర్వహించారు. ఆ పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు ఎంతో పదునుగా ఉండేవి. ఎమర్జెన్సీ (1970 జూన్ నుంచి 1977 మార్చి కాలంలో) యంగ్ ఇండియన్ పత్రిక మూత పడింది. మళ్ళీ 1989లో తిరిగి ప్రారంభమైన తరువాత ఆ పత్రిక సంపాదక సలహామండలి ఛైర్మన్‌గా చంద్రశేఖర్ వ్యవహరించారు.
వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయాలను చంద్రశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధాంతాలు, సామాజిక మార్పుకు ఉద్దేశించిన రాజకీయాలవైపే మొగ్గు చూపేవారు. ఈ తత్వం ఆయనను శ్రీ జయప్రకాష్ నారాయణ్ వైపు, ఆయన సిద్ధాంతాలవైపు ఆకర్షించింది. క్రమంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి కేంద్ర బిందువు అయ్యారు.
1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ఉన్నత సంస్థలైన కేంద్ర ఎన్నికల కమిటీ, వర్కింగ్ కమిటీ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆంతరంగిక భద్రతా చట్టం కింద ఆయన్ను అరెస్టు చేశారు.
అత్యవసర పరిస్థితి సమయంలో అప్పటి అధికార పార్టీ నుంచి అరెస్టయిన కొద్ది మంది వ్యక్తుల్లో చంద్రశేఖర్ ఒకరు.
అధికార రాజకీయాలను ఎల్లప్పుడూ తిరస్కరించే చంద్రశేఖర్ ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక మార్పులకు కట్టుబడిన రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు.
ఎమర్జెన్సీలో జైలులో ఉన్న సమయంలో హిందీలో ఆయన రాసుకున్న డైరీని తరువాత ‘మేరీ జైల్ డైరీ’ పేరుతో ప్రచురించారు. ఆయన రచనల్లో ‘డైనమిక్స్ ఆఫ్ సోషల్ ఛేంజ్’ ఒక సుప్రసిద్ధ సంకలనం.
ప్రజలతో మమేకం కావడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి చంద్రశేఖర్ సుదీర్ఘ పాత్ర నిర్వహించారు. 1983 జనవరి 6వ తేదీ నుంచి 1983 జూన్25 వరకు ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు సుమారు 4, 260 కిలో మీటర్ల దూరం పాద యాత్ర జరిపారు.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రశేఖర్ దాదాపు 15 భారత్ యాత్రా కేంద్రాలు నెలకొల్పారు. దేశంలోని సామాజిక, రాజకీయ కార్యకర్తలకు వెనుకబడిన ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి నుంచి పనిచేయడానికి సామూహిక విద్యావ్యాప్తికి శిక్షణ ఇచ్చేందుకు భారత్ యాత్రా కేంద్రాలను ఉద్దేశించారు.
చంద్రశేఖర్ 1984 నుంచి 1989 మధ్య స్వల్పకాలం మినహా 1962 నుంచి పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. 1989లో ఆయన తమ స్వంత నియోజకవర్గం బీహార్‌లోని బలియాతోపాటు పొరుగున ఉన్న మహరాజ్‌గంజ్ నుంచి కూడా పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత మహరాజ్‌గంజ్ స్థానాన్ని వదులుకున్నారు.
చంద్రశేఖర్ భార్య పేరు శ్రీమతి దుజా దేవి, వారికి ఇద్దరు కుమారులు. వారు పంకజ్, నీరజ్.