ప్రజల్లోంచి వచ్చిన మనిషిగా రాజకీయ దృఢ సంకల్పం కలిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి 1999న అక్టోబర్ 13న భారత ప్రధానిగా రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టి కొత్త సంకీర్ణ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు నాయకత్వం వహించారు. అంతకుముందు 1966లో స్వల్పకాలంపాటు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు.
సీనియర్ పార్లమెంటేరియన్‌గా నాలుగు దశాబ్దాలపాటు ఆయన జీవితం సాగింది. శ్రీ వాజ్‌పేయి లోక్‌సభకు తొమ్మిదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
భారత ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పార్లమెంట్‌కు చెందిన వివిధ ముఖ్యమైన స్థాయి సంఘాలకు ఛైర్ పర్సన్‌గా, స్వాతంత్రానంతర భారత దేశీయ, విదేశాంగ విధానానికి ఒక సమగ్రమైన, స్పష్టమైన, అర్థవంతమైన రూపాన్ని ఇవ్వడంలో వాజ్‌పేయి క్రియాశీలక పాత్ర పోషించారు.
విద్యార్థి దశలోనే శ్రీ వాజ్‌పేయి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1942లో బ్రిటీష్ వలస పాలన అంతానికి దారితీసిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్, లా విద్యార్థిగా వాజ్‌పేయి కళాశాల స్థాయిలోనే విదేశీ వ్యవహారాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా ఏళ్ళ తరబడి పెంచుకున్న ఆసక్తిని తరువాత వివిధ వేదికలపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సందర్భాల్లో నేర్పుగా, చాకచక్యంగా ప్రదర్శించారు.
తొలుత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన వాజ్‌పేయి 1951లో భారతీయ జనసంఘ్‌లో చేరడంతో దానిని అర్థంతరంగా ముగించారు. భారతీయ జనసంఘ్ ఆ తరువాత రూపాంతరం చెంది ఇప్పటి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు నాయకత్వ బాధ్యతలు వహిస్తోంది. విమర్శనాత్మక కవిగా పేరుగాంచిన వాజ్‌పేయి ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని సంగీతం వినడానికి, రుచికరమైన వంటకాలు తయారుచేయడానికి వెచ్చించడం అలవాటుగా మార్చుకున్నారు.
పూర్వపు గ్వాలియర్ రాజ్యం (ఇప్పుడు మధ్యప్‌దేశ్ రాష్ట్రంలో భాగం)లో 1924 డిసెంబర్ 25 వాజ్‌పేయి ఒక గౌరవప్రదమైన ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. తన రాజకీయ ఎదుగుదలకు, భారత ప్రజాస్వామ్య వికాసానికి కూడా దోహదపడే విధంగా ఆయన ప్రజా జీవనం సాగింది. దశాబ్దాలపాటు ప్రపంచం పట్ల ఉదార వైఖరి, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల అంకితభావం ఆయనను అసాధారణ నాయకునిగా నిలబెట్టాయి.
మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వాజ్‌పేయి ముందు చూపునే విశ్వసించేవారు. ఇండియాను ముందుకు తీసుకువెళ్ళాలని తపన పడేవారు. భారత్‌ను ప్రపంచ దేశాల సరసన శక్తివంతమైన, సౌభాగ్యవంతమైన దేశంగా నిలబెట్టాలని ఆరాటపడేవారు. 5 వేల సంవత్సరాల నాటి నాగరిక చరిత్ర నుంచి వచ్చే వెయ్యేళ్ళలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే స్థాయికి భారత్‌ను ఆధునీకరించటం, శక్తివంతంగా చేయడం లక్ష్యంగా ఆయన ఆలోచనలు, విధానాలు సాగేవి.
తాను అమితంగా ప్రేమించే భారతదేశం పట్ల ఆయన నిస్వార్థ అంకితభావానికి, అర్థ శతాబ్దంపాటు సమాజానికి, దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను వాజ్‌పేయి అందుకున్నారు. 1994లో ఆయన ఉత్‌ుమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కార ప్రశంసా పత్రంలో ‘పేరుకు తగ్గట్టుగానే అటల్‌జీ ప్రముఖ జాతీయ నాయకుడు, నిష్కలంక రాజకీయవేత్త, నిస్వార్థ సంఘ సేవకుడు, శ్రోతలను కట్టిపడేసే మహోపన్యాసకుడు, కవి, సాహితీవేత్త, జర్నలిస్ట్ ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి… అటల్‌జీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఆయన సేవలు జాతీయత పట్ల పూర్తి నిబద్ధతకు నిండు నిదర్శనం’ అని పేర్కొన్నారు.