లాల్బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో వారణాసికి ఏడు మైళ్ల దూరంలోని చిన్న పట్టణం మొఘల్ సరాయ్లో 2 అక్టోబర్ 1904న జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. లాల్బహదూర్ ఏడాదిన్నర వయసులో ఉన్నప్పుడే ఆయన మరణించారు. తల్లి తన ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండి పోయారు.
చిన్నపట్టణంలో లాల్బహదూర్ చదువు అంత గొప్పగా ఏమీ సాగలేదు. అయితే, పేదరికం వెంటబడి తరుముతున్నప్పటికీ ఆయన బాల్యం సంతోషంగానే గడిచింది. ఉన్నతపాఠశాల చదువు కోసం లాల్బహదూర్ను వారణాసిలోని ఒక బంధువు దగ్గరికి పంపించారు. ఇంట్లోవాళ్లంతా నన్హే (చిన్నవాడు) అని ముద్దుగా పిల్చుకునే లాల్బహదూర్.. పాఠశాలలో చదువుకోవటం కోసం కాళ్లకు చెప్పులు లేకుండా మైళ్లకు మైళ్లు నడిచేవాడు. వేసవికాలం ఎండతో వీధులు మండిపోతున్న సమయంలో కూడా ఆయన అదేవిధంగా పాఠశాలకు వెళ్తుండేవాడు.
వయసు పెరుగుతున్నాకొద్దీ లాల్బహదూర్కు నాడు జరుగుతున్న దేశ స్వాతంత్ర్య సంగ్రామంపై ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా, భారత్లో బ్రిటీష్ పాలనకు మద్దతు పలికిన సంస్థానాదీశులను మహాత్మాగాంధీ తీవ్రంగా ఖండించటం ఆయన మీద అమితమైన ప్రభావం చూపింది. అప్పటికి లాల్బహదూర్ వయస్సు కేవలం 11 సంవత్సరాలే. కానీ తర్వాతకాలంలో ఆయన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే అంతర్మథనం అప్పటికే ఆయనలో మొదలైంది.
దేశవాసులను సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిందిగా గాంధీజీ పిలుపునిచ్చిన సమయానికి లాల్బహదూర్ వయస్సు 16 ఏళ్లు. మహాత్ముడి పిలుపునకు స్పందించి చదువును వదిలివేయాలని లాల్బహదూర్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయన తల్లి ఆశలను పటాపంచలు చేసింది. ఆయన ఎంచుకున్న మార్గం వినాశకరమైనదని కుటుంబసభ్యులు భావించారు. ఆయినప్పటికీ ఆయనను నిలువరించలేకపోయారు. అప్పటికే లాల్బహదూర్ తన మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆయన మనసు ఎన్నటికీ మారదని లాల్బహదూర్ను దగ్గరి నుంచి చూసిన వారందరికీ తెలుసు. బయటకు ఎంతో మెతకమనిషిగా కనిపించే ఆయన సంకల్పం దృఢమైనదని వారికి తెలుసు.
బ్రిటీష్ పాలనకు నిరసనగా నెలకొల్పిన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన వారణాసిలోని కాశీ విద్యాపీఠ్లో లాల్బహదూర్ చేరారు. అక్కడ ఆయన ఎంతోమంది గొప్ప మేధావులు, జాతీయవాదుల నుంచి స్ఫూర్తిని పొందారు. కాశీవిద్యాపీఠ్లో ‘శాస్త్రి’గా పిలిచే స్నాతకోత్సవ పట్టాను విద్యాభ్యాసం అనంతరం లాల్బహదూర్కు అందజేశారు. అది ఆయన పేరులో కలిసిపోయి జనహృదయంలో నిలిచిపోయింది.
1927లో లలితాదేవితో లాల్బహదూర్ శాస్త్రి వివాహం జరిగింది. ఆయన స్వస్థలానికి దగ్గరలోనే ఉన్న మీర్జాపూర్కు చెందినవారు లలితాదేవి. వారి పెళ్లి ఒక్క విషయంలోతప్ప పూర్తి సంప్రదాయబద్ధంగానే జరిగింది. ఆ ఒక్క విషయం.. వరుడు తీసుకున్న కట్నం. కొన్ని గజాల చేనేత వస్త్రం, రాట్నం తప్ప మరే కానుకలూ తీసుకోవటానికి లాల్బహదూర్ అంగీకరించలేదు.
1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. దండి తీరానికి వెళ్లి బ్రిటీష్ చట్టాన్ని ఉల్లంఘించారు. మహాత్ముడి ఈ చర్య యావత్దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. లాల్బహదూర్శాస్త్రి స్వాతంత్ర్య సమరాంగణంలోకి దూకారు. అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం ఏడేళ్లపాటు జైళ్లలో గడిపారు. ఈ పోరాటమే ఆయన వ్యక్తిత్వాన్ని రాటుదేల్చి పరిపక్వతను ఇచ్చింది.
స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే లాల్బహదూర్శాస్త్రి అపార శక్తి సామర్థ్యాలను జాతీయ నేతలు గుర్తించారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దానిని ఆయన అందుకున్నారు. స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్లో పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు స్వీకరించిన లాల్బహదూర్ స్వయంకృషితో కొద్దికాలంలోనే రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగారు. కఠోరశ్రమకు, సామర్థ్యానికి ఉత్తరప్రదేశ్లో లాల్బహదూర్ ఒక సమున్నత సంకేతంగా నిలిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వపెద్దలు ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. 1951లో లాల్బహదూర్ ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తర్వాత కాలంలో రైల్వే మంత్రిగా, రవాణా సమాచార మంత్రిగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిగా, హోంమంత్రిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఆయన రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగింది. ఎంతోమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ లాల్బహదూర్శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని పార్లమెంటుతోపాటు యావత్దేశం శ్లాఘించింది. ఈ ఘటనపై పార్లమెంటులో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్నెహ్రూ మాట్లాడుతూ.. లాల్బహదూర్శాస్త్రి నిజాయితీని, ఆయన పాటించే ఉన్నత విలువలను ఎంతగానో కొనియాడారు. జరిగిన ప్రమాదానికి లాల్బహదూర్ బాధ్యుడు కాకపోయినా ఆయన రాజీనామా దేశంలో ఒక సమున్నత ప్రమాణాన్ని నెలకొల్పుతుంది కాబట్టే ఆ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు నెహ్రూ స్పష్టం చేశారు. ప్రమాదం ఘటనపై పార్లమెంటులో జరిగిన సుదీర్ఘచర్చకు సమాధానమిస్తూ లాల్బహదూర్శాస్త్రి మాట్లాడారు… ” నా చిన్న ఆకారాన్ని, నా మెత్తని మాటలను చూసి నేను దృఢంగా వ్యవహరించలేనేమోనని జనం భావిస్తుంటారు. నేను శారీరకంగా బలమైన వ్యక్తిని కాకపోయినా అంతర్గతంగా అంత బలహీనుడినేమీ కాను” అని ఆయన చెప్పారు.
ఓవైపు కేంద్రప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు కాంగ్రెస్పార్టీ కార్యకలాపాల్లో లాల్బహదూర్శాస్త్రి చురుకుగా పాల్గొనేవారు. 1952, 1957, 1962ల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ ఏకపక్షంగా సాధించిన ఘనవిజయాల వెనుక ఆయన కృషి ఎంతగానో ఉంది. లక్ష్యంతో సంపూర్ణంగా మమేకమయ్యేతీరు, సంస్థాగతంగా ఆయనకున్న అపారమైన మేధస్సు కాంగ్రెస్ విజయాల్లో కీలకపాత్ర పోషించింది.
లాల్బహదూర్శాస్త్రి మూడుదశాబ్దాలకుపైగా దేశానికి సేవలందించారు. ఈ వ్యవధిలో నీతికి, నిజాయితీకి, సామర్థ్యానికి ఆయన పర్యాయపదమయ్యారు. వినయం, సహనం, దృఢచిత్తం, అద్భుతమైన అంతశ్శక్తితో కూడిన లాల్బహదూర్శాస్త్రి.. ప్రజల మనసును అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు.. గొప్ప దూరదృష్టితో దేశాన్ని ప్రగతి బాటన ముందుకు తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ బోధనలతో లాల్బహదూర్శాస్త్రి ఎంతగానో ప్రభావితులయ్యారు. గాంధీజీ చెప్పిన ”కఠినశ్రమ ప్రార్థనతో సమానమైనది” అనే సూక్తిని ఆయన గుర్తు చేసేవారు. గాంధీజీ విలువల వారసత్వంలో ముందుకొచ్చిన లాల్బహదూర్శాస్త్రి భారతీయ సంస్కృతికి సమున్నత సంకేతంగా నిలిచారు.