పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. ఆయన తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లండ్కు వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రకృతిశాస్త్రాలను చదివారు. అనంతరం ఇన్నర్టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ.. విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేశారు. నాడు ఐర్లాండ్లో జరుగుతున్న షిన్ ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించారు. ఈ అనుభవంతో 1912లో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన స్వాతంత్రోద్యమంలోకి చేరారు.
1912లో బీహార్లోని బంకీపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా నెహ్రూ హాజరయ్యారు. అనంతరం 1916లో మహాత్మాగాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తొలి సమావేశంలోనే గాంధీజీ ప్రభావం ఆయనపై అమితంగా పడింది. హోంరూల్ లీగ్ అలహాబాద్ శాఖకు నెహ్రూ 1919లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1920లో ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో మొట్టమొదటిసారిగా రైతుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం సందర్భంగా 1920-22 మధ్య కాలంలో నెహ్రూ రెండుసార్లు జైలుకు వెళ్లారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు. 1926లో ఇటలీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, బెల్జియం, జర్మనీ, రష్యా దేశాలలో పర్యటించారు. బెల్జియంలో జరిగిన ” అణగారిన జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అదే ఏడాది మద్రాస్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో.. దేశస్వాతంత్ర్య సాధనకు పోరాడే సంకల్పాన్ని కాంగ్రెస్ తీసుకోవటంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. 1927లో రష్యాలోని మాస్కోలో జరిగిన సోషలిస్టు విప్లవం 10వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లక్నోలో ఒక ప్రదర్శన నిర్వహిస్తూ బ్రిటీష్ పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. 29 ఆగస్టు 1928న జరిగిన అఖిలపక్ష కాంగ్రెస్కు నెహ్రూ హాజరయ్యారు. భారత రాజ్యాంగ సంస్కరణలపై తన తండ్రి మోతీలాల్నెహ్రూ రూపొందించిన నివేదికపై ఇతర నేతలతో కలిసి నెహ్రూ సంతకం చేశారు. అదే ఏడాది ”భారత స్వాతంత్ర్య లీగ్ ” అనే సంస్థను స్థాపించి దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.
1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే తీర్మానాన్ని ఈ మహాసభల్లోనే ఆమోదించారు. 1930-35 మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతోపాటు ఇతర అనేక నిరసన కార్యక్రమాల సందర్భంగా నెహ్రూ పలుమార్లు అరెస్టై జైలుకెళ్లారు. 14 ఫిబ్రవరి 1935న అల్మోరా జైలులో తన జీవితచరిత్ర పుస్తక రచనను నెహ్రూ ముగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత.. స్విట్జర్లాండ్లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వెళ్లారు. అక్కడి నుంచి 1936 ఫిబ్రవరి-మార్చిలో లండన్కు వెళ్లారు. 1938లో అంతర్యుద్ధం మధ్యన ఉన్న స్పెయిన్లో పర్యటించారు. రెండో ప్రపంచయుద్ధం మొదలుకావటానికి కొంతకాలం ముందు చైనాకు కూడా వెళ్లి వచ్చారు.
రెండో ప్రపంచయుద్ధంలో భారతదేశాన్ని బలవంతంగా పాల్గొనేలా చేయటాన్ని నిరసిస్తూ 31 అక్టోబర్ 1940న నెహ్రూ వ్యక్తిగత సత్యాగ్రహం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇతర నేతలతో కలిసి 1941 డిసెంబరులో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ చారిత్రక ”క్విట్ ఇండియా” తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1942 ఆగస్టు 8న ఆయనను మరోసారి అరెస్టు చేసి అహ్మద్నగర్ కోట జైలుకు తరలించారు. ఇదే ఆయన జీవితంలో అత్యంత సుదీర్ఘకాలపు, ఆఖరి నిర్బంధం. మొత్తంగా నెహ్రూ తొమ్మిదిసార్లు జైలుకు వెళ్లారు. 1945 జనవరిలో ఆయన విడుదలయ్యారు. ”ఇండియన్ నేషనల్ ఆర్మీ”కి చెందిన అధికారులు, సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం మోపిన కుట్ర అభియోగాలను ఎదుర్కోవటానికి నెహ్రూ న్యాయవాదులను సమన్వయపరిచారు. 1946 మార్చిలో ఆగ్నేయాసియాలో పర్యటించారు. 1946 జులై 6న కాంగ్రెస్కు అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 1951 నుంచి 1954 వరకూ మరో మూడు పర్యాయాలు ఆయన తిరిగి ఈ పదవిని చేపట్టారు.