Search

పిఎంఇండియాపిఎంఇండియా

శ్రీ‌ గుల్జారీలాల్నందా

మే 27, 1964 – జూన్ 9, 1964 | కాంగ్రెస్‌

శ్రీ‌ గుల్జారీలాల్నందా


గుల్జారీలాల్నందా 4 జులై 1898లో పంజాబ్లోని (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న) సియాల్కోట్లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో కొనసాగింది. 1920-1921 లో గుల్జారీలాల్నందా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన జరిపారు. 1921లో బొంబాయిలోని జాతీయ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1922లో అలహాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సంఘం కార్యదర్శిగా ఎన్నికై 1946 వరకూ ఆ పదవిలో కొనసాగారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను గుల్జారీలాల్నందాను నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1932లో జైలుకు పంపింది. అనంతరం 1942 నుంచి 44 వరకూ కూడా ఆయన జైలులో ఉన్నారు.

1937లో శ్రీ నందా బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. 1937 నుంచి 39 వరకూ బొంబాయి ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శిగా (కార్మిక, ఎక్సైజ్) బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1946-50లలో బొంబాయి ప్రభుత్వ కార్మికమంత్రిగా కార్మిక వివాదాల బిల్లును విజయవంతంగా తీసుకురాగలిగారు. కస్తూరిబా మెమోరియల్ ట్రస్టు ట్రస్టీగా శ్రీ నందా సేవలు అందించారు. హిందుస్థాన్ మజ్దూర్ సేవక్ సంఘ్ కార్యదర్శిగా, బొంబాయి హౌసింగ్ బోర్డు ఛైర్మన్గా, జాతీయ ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. భారత జాతీయ కార్మిక సంఘం కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) నిర్మాణంలో శ్రీ నందా కీలకపాత్ర పోషించటమేగాక ఆ తర్వాతకాలంలో ఆ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

1947లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభకు శ్రీ నందా ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ మహాసభ ఏర్పాటు చేసిన సంఘస్వేచ్ఛా కమిటీకి ఆయన ఎంపికయ్యారు. కమిటీ పనిలో భాగంగా స్వీడన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, ఇంగ్లండ్లను సందర్శించి ఆయాదేశాల్లో కార్మికుల స్థితగతులను ఆయన అధ్యయనం చేశారు.

1950 మార్చిలో శ్రీ నందా ప్రణాళికాసంఘం ఉప ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్లో ఆయన కేంద్రప్రభుత్వంలో ప్రణాళికశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అదనంగా సాగు, విద్యుత్తు శాఖలను కూడా ఆయనకు అప్పగించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్రీ నందా బొంబాయి నుంచి లోక్సభకు ఎన్నికై సాగు, విద్యుత్తు మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. 1955లో సింగపూర్లో జరిగిన ప్రణాళిక సంప్రదింపుల కమిటీ సమావేశానికి, 1959లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభకు హాజరైన భారత ప్రతినిధి బృందానికి శ్రీ నందా నేతృత్వం వహించారు.

1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్రీ నందా లోక్సభకు ఎన్నికై కేంద్రప్రభుత్వంలో కార్మిక, ఉపాధి, ప్రణాళిక మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం ప్రణాళికసంఘం ఉప ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 1959లో జర్మనీ, యుగోస్లేవియా, ఆస్ట్రియా దేశాలను ఆయన సందర్శించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్రీ నందా గుజరాత్లోని సబర్కాంతా నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అదే ఏడాది కాంగ్రెస్ ఫోరం ఫర్ సోషలిస్ట్ యాక్షన్ అనే వేదికను ఆయన ప్రారంభించారు. 1962 నుంచి 63 వరకూ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 66 వరకూ కేంద్ర హోంమంత్రిగా శ్రీ నందా దేశానికి సేవలు అందించారు.

పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణం అనంతరం 27 మే 1964న శ్రీ నందా భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, రష్యాలోని తాష్కెంట్లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో శ్రీ నందా 11 జనవరి 1966న మరోసారి భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.