అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 నవంబర్ 19న జన్మించిన శ్రీమతి ఇందిరాగాంధీ స్వతంత్య్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఇకోలే నౌవెల్, బెక్స్ (స్విట్జర్లాండ్) ఇకోలే ఇంటర్నేషనల్ – జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్ – పూనె, బొంబే, బాడ్మింటన్ స్కూల్ – బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్ విల్ కాలేజ్ – ఆక్స్ ఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఆమె చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యా సంస్థల నుంచి విద్యను అభ్యసించిన నేపథ్యం కలిగిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్శిటీ నుంచి విశిష్ట ప్రశంసా పత్రం అందుకున్నారు. సాతంత్య్ర పోరాటంలో ఇందిరాగాంధీ చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె ‘బాల్ చరఖా సంఘ్’ స్థాపించారు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలసి ‘వానర్ సేన’ ఏర్పాటుచేశారు. 1942 సెప్టెంబర్‌లో జైలుకు వెళ్ళారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
ఇందిరాగాంధీ 1942 మార్చి 26న ఫిరోజ్‌గాంధీని వివాహమాడారు. ఆమెకు ఇద్దరు కుమారులు. 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీలలో సభ్యురాలిగా నియమితులయ్యారు. 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఏఐసిసి జాతీయ సమగ్రతా మండలి ఛైర్ పర్సన్‌గాను, 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గాను పనిచేశారు. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1978లో మళ్ళీ అదే పదవిని చేపట్టారు.
1964 నుంచి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 1977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 5 నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోం మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక్ష వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు. 1980 జనవరి 14న మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
పెద్ద సంఖ్య సంఘాలు, సంస్థలతో శ్రీమతి ఇందిరాగాంధీకి సంబంధం ఉంది. కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, గాంధీ స్మారక నిధి, కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టుతో ఆమెకు సంబంధం ఉంది. స్వరాజ్ భవన్ ట్రస్టుకు ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 1950లో బాల్ సహయోగ్, బాల్ భవన్ బోర్డు, చిల్డ్రన్స్ నేషనల్ మ్యూజియం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అల్హాబాద్ కమలా నెహ్రూ విద్యాలయాన్ని ప్రారంభించారు. 1966-77 మధ్య జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, నార్త్ ఇస్ట్రన్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పనిచేశారు. ఢిల్లీ యూనివర్శిటీ కోర్టు సభ్యురాలిగాను, యునెస్కోకు (1960-64) భారత ప్రతినిధివర్గం సభ్యురాలిగాను, 1960-64లో యునెస్కో కార్యవర్గ మండలి సభ్యురాలిగాను, 1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ సభ్యురాలిగాను వ్యవహరించారు. సంగీత, నాటక అకాడమీ, జాతీయ సమగ్రతా మండలి, హిమాలయ పర్వతారోహణ సంస్థ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ – జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ తో కూడా ఆమెకు సంబంధముంది.
1964 ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన శ్రీమతి ఇందిరాగాంధీ 1967 ఫిబ్రవరి వరకు పనిచేశారు. నాలుగు, ఐదు, ఆరు లోక్‌సభలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఏడవ 1980లో లోక్ సభకు ఆమె రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), మెదక్ (ఆంధ్రప్రదేశ్) నుంచి ఎన్నికయ్యారు. తరువాత మెదక్ స్థానాన్ని ఉంచుకుని రాయ్ బరేలీ స్థానాన్ని వదులుకున్నారు. 1967-77లోను తిరిగి 1980లోను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
విభిన్నమైన విస్తృతాంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు. కార్యకలాపాలు, వివిధ రకాల ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా రంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు.
శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నో విజయాలు అందుకున్నారు. 1972లో భారత రత్న పురస్కారాన్ని స్వీకరించారు. మెక్సికన్ అకాడమీ అవార్డు ఫర్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (1972), ఎఫ్ఏఓ రెండవ వార్షిక మెడల్ 1973, నగరి ప్రచారిణీ సభకు చెందిన సాహిత్య వాచస్పతి (హిందీ) అవార్డు (1976) అందుకున్నారు. 1953లో అమెరికాకు చెందిన మదర్స్ అవార్డును స్వీకరించారు. దౌత్యవేత్తగా అందించిన సేవలకు గాను ‘ఇసిబెల్లా డి ఎస్టే అవార్డు ఆఫ్ ఇటలీ’ని, ఏల్ యూనివర్శిటీకి చెందిన హాలెండ్ మెమోరియల్ ప్రైజ్‌ను అందుకున్నారు. 1967, 1968 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో అత్యంత అభిమాన మహిళగా అవార్డు అందుకున్నారు. 1971 అమెరికాలోని ప్రత్యేక గ్యాలప్ పోల్ సర్వేలో ప్రపంచ అత్యంత అభిమాన నేతగా గౌరవం అందుకున్నారు. జంతు సంరక్షణకు చేసిన కృషికిగాను 1971లో అర్జెంటీనా సొసైటీ ఆమెకు గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది.
ఇందిరాగాంధీ ప్రముఖ రచనల్లో ‘ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్’ (1966 – 69) , ‘ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్’ (1969 – 72), ‘ఇండియా’ (లండన్) (1975), ఇండే లాసన్నే(1979) మొదలైనవి ఉన్నాయి. ఇంకా అసంఖ్యాకమైన సంకలనాలు, ప్రసంగాలు, రచనలు వెలువరించారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా, చైనా, నేపాల్, శ్రీలంక దేశాలను సందర్శించారు. ఫ్రాన్స్, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, గుయాన్, హంగేరీ, ఇరాన్, ఇరాక్, ఇటలీ వంటి దేశాల్లో అధికార పర్యటనలు జరిపారు. అల్జీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, చిలీ, చెకొస్లవాకియా, బొలివియా, ఈజిప్ట్ దేశాలను కూడా సందర్శించారు. ఇండోనేషియా, జపాన్, జమైకా, కెన్యా, మలేషియా, మారిషస్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, ఒమన్, పోలెండ్, రుమేనియా, సింగపూర్, స్విట్జర్లాండ్, సిరియా, స్వీడన్, టాంజేనియా, థాయ్‌లాండ్ ట్రినిడాడ్-టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, రష్యా, ఉరుగ్వే, వెనెజులా, యుగొస్లావియా, జాంబియా, జింబాబ్వే మొదలైన అనేక యురోపియన్, అమెరికన్, ఆసియన్ దేశాల్లో కూడా ఇందిరాగాంధీ పర్యటించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు.