సేవ చేయడమే మన భారతీయ సంస్కృతి లోని విశిష్ట గుణాలలోకెల్లా అంతిమమైన గుణం. దీనినే ‘సేవా పరమో ధర్మ’ అని అంటున్నారు. మీ ప్రధాన సేవకుడిగా ఉండి మీకు సేవ చేయాలనే బాధ్యతనూ, గౌరవాన్నీ మీరు నాకు అప్పగించారు.ఈ ధర్మాన్ని పూర్తి నీతి, నిజాయతీ లతో నిర్వర్తించడానికి ప్రతి రోజూ ప్రతి క్షణమూ నా శరీరంలోని అణువణువును అంకితం చేశాను.
భారతదేశ విజయ గాథ పట్ల విశ్వాసం సన్నగిలుతున్న వేళలో మేం అధికార బాధ్యతలను స్వీకరించాం. ఎంత మాత్రం అణగని అవినీతి, నిర్ణయ రాహిత్యం ప్రభుత్వాన్ని కుంటుపరిచాయి. అంతే కాక, నానాటికీ పెచ్చుపెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అభద్రత ల నడుమ నలుగుతూ సహాయం అందని స్థితిలో ప్రజలు చిక్కుకుపోయారు. తక్షణ ప్రాతిపదికన నిర్ణయాత్మక చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మేం ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాము. పరుగుతీస్తున్న ధరలను వెనువెంటనే అదుపులోకి తీసుకువచ్చాము. శక్తిని కోల్పోయిన ఆర్థిక వ్యవస్థను నిలకడ కలిగిన విధానాలను అవలంబిస్తూ, సంస్కరణలకు అనుకూలమైన పరిపాలనను అందించడం ద్వారా మళ్లీ ఉత్తేజితం చేశాము. అమూల్యమైన మన ప్రకృతి వనరులను ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే కేటాయించిన వైఖరి స్థానంలోకి దాపరికానికి తావు లేని వేలంపాటల పద్ధతిని ప్రవేశపెట్టాము. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎస్ఐటి ని ఏర్పాటు చేయడం, నల్లధన చట్టాన్ని ఆమోదించడం, నల్లధనానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించడం వంటి ధృడమైన చర్యలు చేపట్టాము. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, కఠినమైన వంటి చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఉద్దేశాలలో గాని, చర్యలలోగాని స్వచ్ఛతపై రాజీ పడని ధోరణిని అవలంబించడంతో అవినీతికి చోటు లేని ప్రభుత్వాన్ని అందించేందుకు దోహదపడింది. పనిచేసే సంస్కృతిలో చెప్పుకోదగిన మార్పులను తీసుకురావడం జరిగింది. వృత్తిపరమైన నైపుణ్యం, సానుభూతి గల వ్యవహార శైలి, గిరి గీసుకొని ఉండే వైఖరిని విడనాడడం వంటి పద్ధతుల ద్వారా దీనిని సాధ్యం చేశాము. జాతీయ పురోభివృద్ధి కోసం చేసే కృషిలో రాష్ట్రాల ప్రభుత్వాలను సమాన భాగస్వాములుగా చేర్చుకున్నాము. తద్వారా, టీమ్ ఇండియా స్ఫూర్తిని అలవరచాము. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని మేము పునరుద్ధరించగలిగాము.
అంత్యోదయ సిద్ధాంతాన్ని మార్గదర్శకంగా తీసుకొని మా ప్రభుత్వం పేద ప్రజలకు, అణగారిన వర్గాల వారికి, చిన్నచూపునకు గురైన వారికి అంకితమై పనిచేస్తోంది. పేదరికంపై జరుపుతున్న పోరాటంలో ఆయా వర్గాల వారు సైనికులుగా మారేటట్లు ఆయా వర్గాలకు సాధికారితను ప్రదానం చేసేందుకు పాటు పడుతున్నాము. అనేక చర్యలను, పథకాలను ప్రారంభించడం జరిగింది. వాటిలో.. పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం నుండి ఐఐటి లు, ఐఐఎం లు, ఎఐఐఎమ్ఎస్ లను ఏర్పాటు చేయడంవరకు; చిన్నపిల్లలకు టీకాలు వేయించడం నుండి ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడం వరకు, సామాన్యుడికి సామాజిక భద్రతను కల్పించడం కోసం మన శ్రామిక వర్గానికి కనీస పెన్షన్ ను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడం నుండి ప్రకృతి విపత్తుల బారిన పడి నష్టపోయిన రైతులకు అందించే మద్దతును పెంచడం.. ఇంకా డబ్ల్యుటిఒ లో వారి ప్రయోజనాలను కాపాడడం వరకు; అందరికీ స్వీయ ధ్రువీకరణ అధికారాన్ని దత్తం చేయడం నుండి సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం వరకు; నిధులు అందడం కష్టంగా ఉన్న చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందేటట్లు బ్యాంకింగ్ వ్యవస్థను సర్వవ్యాప్తం చేయడం నుండి వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందించడం వరకు; తల్లి గంగా నదిని పరిశుభ్రపరిచే చర్యలకు నడుం బిగించడం నుండి ప్రతి రోజు 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్తు ను సరఫరా చేయడం అనే గమ్యం వైపునకు ప్రయాణించడం వరకు; రైలు, రహదారి మార్గాల నిర్మాణం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలను జోడించడం నుండి ఇళ్లు లేని వారికి ఇళ్లను నిర్మించడం- స్మార్ట్ సిటీలను ప్రవేశపెట్టడం వరకు; ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను అనుసంధానించడం నుండి ఈశాన్య భారతవని వికాసానికి ప్రాధాన్యం ఇవ్వడం వరకు మేం అమలుపరుస్తున్న పథకాలలో ఉన్నాయి.
మిత్రులారా, ఇది ఆరంభం మాత్రమే. జీవితంలోను, మౌలిక సదుపాయాలలోను, సేవలలోను నాణ్యతను మెరుగుపరచుకోవాలన్నదే మన ధ్యేయం. మనమూ, మన స్వాతంత్య్ర సమర యోధులూ కలలు గన్న భారతదేశాన్ని ఆవిష్కరించుకోవడానికి మనమంతా కలసి పాటుపడదాము. ఈ క్రమంలో మీ ఆశీస్సులను, నిర్విరామ మద్దతును నేను కోరుకుంటున్నాను.
ఎప్పటికీ మీ సేవలో పాల్గొంటూ ఉంటాను.
జయ్ హింద్!