పారదర్శకత, జవాబుదారీతనం ఏ ప్రజానుకూల ప్రభుత్వానికైనా రెండు మూల స్తంభాలని ప్రధాని నరేంద్రమోదీ దృఢంగా నమ్ముతారు. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజలను ప్రభుత్వానికి సన్నిహితం చేయడం మాత్రమే కాక, వారిని విధాన నిర్ణయ ప్రక్రియలో సమాన భాగస్వాములను చేస్తాయి.
రికార్డు స్థాయిలో నాలుగుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ జవాబుదారీతనంతో కూడిన పారదర్శకత ప్రభుత్వాన్ని అందించడంపట్ల తన నిబద్దతను చాటుకున్నారు. నిబంధనలు, విధానాలు ఎయిర్ కండీషన్డ్ గదుల్లో గాక, ప్రజల మధ్యే రూపుదిద్దుకున్నాయి. ముసాయిదా విధానాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా అభివృద్ధి ఫలాలను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేదలకు చేర్చడానికి ఉద్దేశించిన ‘గరీబ్ కళ్యాణ్ మేళాస్’ వంటి వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు. ఈ-గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా నిర్ణీత వ్యవధిలో ప్రజలకు సేవలు అందించడంపై దృష్టి పెట్టే ‘వన్ డే’ పాలన కూడా మరో నూతనావిష్కరణ. పౌర హక్కుల పత్రం కింద ప్రభుత్వం నుంచి అన్ని రకాల పౌర సేవలను అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
పారదర్శకత కోసం నరేంద్రమోదీ దృఢమైన దీక్ష వెనుక భారత ప్రజలకు ఎటువంటి గోప్యత లేని జవాబుదారీతనంతో కూడిన, ప్రజలే కేంద్ర బిందువుగా ఉండే ప్రభుత్వాన్ని అందించడం ఏకైక లక్ష్యం.