Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైసినా చర్చలు-2021 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

రైసినా చర్చలు-2021 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం


విశిష్ట అతిథులు… మిత్రులారా…

నమస్కారం!

   మానవాళి చరిత్ర కీలక మలుపు తిరుగుతున్న ప్రస్తుత సమయంలో రైసినా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ మహమ్మారి ఒక సంవత్సరానికిపైగా కాలం నుంచి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇటువంటి చివరి అంతర్జాతీయ మహమ్మారి ఓ శతాబ్దం కిందట అన్ని దేశాలనూ వణికించింది. ఆనాటినుంచీ మానవాళఙ అనేక అంటువ్యాధులను  ఎదుర్కొన్నప్పటికీ, నేటి కోవిడ్‌-19 మహమ్మారిని నిలువరించడంలో అవసరమైన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదు. అయితే, మన శాస్త్రవేత్తలు-పరిశోధకులు-పరిశ్రమల సంయుక్త కృషితో కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించింది.

వైరస్ అంటే ఏమిటి?

ఇది ఎలా వ్యాపిస్తుంది?

దీన్ని నిలువరించడం ఎలా?

మనం టీకా తయారుచేయడం ఎలా?

టీకాలిచ్చే కార్యక్రమాన్ని ఏ స్థాయిలో… ఎంత వేగంతో నిర్వహించగలం?

వీటితోపాటు మరికొన్ని ఇతర ప్రశ్నలకూ అనేక పరిష్కారాలు ఆవిష్కృతమయ్యాయి. ఇంకా కొన్ని త్వరలో అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం లేదు. అయితే, ప్రపంచ దేశాల నాయకులుగా, మేధావులుగా మనకుమనం మరికొన్ని ప్రశ్నలు సంధించుకోవాల్సి ఉంది.

   ఇప్పటికి ఏడాదికిపైగా గడచిన నేపథ్యంలో మన సమాజాల్లోని అత్యుత్తమ మేధావులు మహమ్మారిపై పోరులో నిమగ్నమై ఉన్నారు. ప్రపంచ దేశాల్లోని అన్ని ప్రభుత్వాలూ, అన్ని స్థాయులలో మహమ్మారి నియంత్రణకు శ్రమిస్తున్నాయి. అసలిది మనకెలా దాపురించింది? మానవాళి శ్రేయస్సు కోసం పాటుపడటాన్ని విస్మరించి ఆర్థికాభివృద్ధి కోసం సాగుతున్న అర్థంలేని పరుగు పందెం బహుశా దీనికి కారణమా? ప్రస్తుత పోటీ యుగంలో సహకార స్ఫూర్తిని మరచిపోవడమా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మన ఇటీవల గతంలోనే జవాబులున్నాయి. మిత్రులారా… తొలి, మలి ప్రపంచ యుద్ధాల భయానక అనుభవాలు ఓ కొత్త ప్రపంచ క్రమం ఆవిర్భావానికి దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని దశాబ్దాలపాటు అనేక వ్యవస్థలు, సంస్థలు సృష్టించబడ్డాయి. కానీ, రెండు ప్రపంచ యుద్ధాల పీడకలల మధ్య మూడో ప్రపంచ యుద్ధాన్ని తప్పించడం ఎలా? అన్న ఒకేఒక ప్రశ్నకు సమాధానం అన్వేషించడమే ఈ వ్యవస్థలు, సంస్థల ప్రధాన కర్తవ్యంగా మారింది.

   అయితే ఈ ప్రశ్న సరైనది కాదని మీకు నేనివాళ విన్నవిస్తున్నాను. మనం తీసుకున్న చర్యలన్నీ- వ్యాధికి దారితీసిన అంతర్లీన కారణాలను వదిలి దాని లక్షణాలను బట్టి చికిత్సచేసే తరహాలో ఉండటమే నేనిలా చెప్పడానికి కారణం. మరోవిధంగా చెప్పాలంటే- చివరి యుద్ధాన్ని తప్పించడం కాకుండా తదుపరి యుద్ధం నివారణకే అన్ని చర్యలూ పరిమితమయ్యాయి. వాస్తవానికి మానవాళి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొనలేదన్న మాటేగానీ, హింస ముప్పుపై భయం మాత్రం ప్రజానీకం మనసులనుంచి తొలగిపోలేదు. అనేకానేక ప్రచ్ఛన్న యుద్ధాలు, ఉగ్రవాద దాడులు వంటివాటితో హింసాదౌర్జన్యాల భయానక భావన సదా కొనసాగుతూనే ఉంది. మరి… దేన్ని సముచిత ప్రశ్నగా పరిగణిద్దాం?

ఈ కిందివాటిని చేరుద్దామా:

మనకు కరువులు… ఆకలి బాధ ఎందుకు తప్పడం లేదు?

మనకింకా పేదరికం ఎందుకు?

లేదా మరింత ప్రాథమికంగా-

  మొత్తం మానవాళిని పీడించే సమస్యల పరిష్కారంలో మనమంతా ఎందుకు సహకరించుకోరాదు? అని ప్రశ్నించుకోవచ్చు. మన ఆలోచనలు ఈ మార్గంలో పయనిస్తే విభిన్నమైన సత్ఫలితాలు ఇప్పటికే అంది ఉండేవని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

   సమయం ఇప్పటికీ మించిపోలేదు. భవిష్యత్తుపై మన ఆలోచనా విధానానికి గత ఏడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న తప్పులు, పొరపాటు చర్యలు అడ్డుపడే అవసరం లేదు. ప్రపంచ క్రమం పునర్నిర్మాణం, మన ఆలోచనా విధానం నవీకరణ దిశగా కోవిడ్‌-19 మహమ్మారి మనకో అవకాశాన్నిచ్చింది. ఆ మేరకు నేటి సమస్యలను పరిష్కరించగల, రేపటి సవాళ్లను ఎదుర్కొనగల వ్యవస్థలను మనం సృష్టించుకోవడం తప్పనిసరి. కాబట్టి మనం మొత్తం మానవాళి గురించి ఆలోచించాలి తప్ప మన సరిహద్దుల్లో ఉన్నవారి గురించి కానేకాదు. మానవాళి కేంద్రస్థానంగా మాత్రమే మన ఆలోచనలు, కార్యాచరణ సాగాలి.

మిత్రులారా!

   ఈ మహమ్మారి సమయాన మాదైన సవినయ శైలిలో, మా సొంత పరిమిత వనరులతో, భారతదేశంలో మేం చేయగలిగిందేదో చేసేందుకు ప్రయత్నించాం. మా 130 కోట్ల జనాభాను మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి కృషిచేశాం. అదే సమయంలో ఇతర దేశాల్లో మహమ్మారిపై ప్రతిస్పందన కృషికి మా వంతు మద్దతు ఇవ్వడానికీ ప్రయత్నించాం. మా పొరుగు దేశాల్లో ఈ సంక్షోభంపై ప్రాంతీయస్థాయి ప్రతిస్పందనలో సమన్వయాన్ని మా వంతుగా ప్రోత్సహించాం. అంతేకాకుండా నిరుడు 150కిపైగా దేశాలతో మందులు, వ్యక్తిగత రక్షణ సామగ్రిని పంచుకున్నాం. మన పాస్‌పోర్టుల రంగుతో నిమిత్తం లేకుండా మనమంతా దీన్నుంచి బయటపడితేగానీ మానవాళి మహమ్మారిని ఓడించడం సాధ్యం కాదని మేం పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నాం. అందుకే ఈ సంవత్సరం ఎన్నో ఆటంకాలున్నా 80కిపైగా దేశాలకు మేం టీకాలు సరఫరా చేశాం. ప్రస్తుత అవసరాలకు ఈ సరఫరా సరిపోదని, డిమాండ్‌ భారీగా ఉందనే వాస్తవం కూడా మాకు తెలుసు. మొత్తం మానవాళికి టీకాలు వేయాలంటే చాలాకాలం పడుతుందనీ మేం గ్రహించాం. అయినప్పటికీ, ఆశాభావంతో ముందడుగు వేయడం ఎంతో అవసరమని కూడా మాకు తెలుసు. ఇది ధనిక దేశాల ప్రజలకు ఎంత ముఖ్యమో, పేద దేశాల పౌరులకూ అంతే ముఖ్యం. కాబట్టి మహమ్మారిపై పోరాటంలో మా అనుభవాలను, నైపుణ్యాన్ని, వనరులను మొత్తం మానవాళితో పంచుకుంటాం.

మిత్రులారా!

   ఈసారి రైసినా చర్చల్లో మనం ప్రత్యక్ష సాదృశ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మానవాళి కేంద్ర విధానంపై శక్తిమంతంగా గళం వినిపించాలని మిమ్మల్నందర్నీ నేను కోరుతున్నాను. ఏదైనా సమస్యకు మా వద్ద ప్రణాళిక ‘ఎ బి’ ఉన్నాయని మనం అడపాదడపా చెబుతుంటాం! కానీ, మనకున్నది భూ గ్రహం ఒక్కటే తప్ప ‘బి’ గ్రహం అన్నదేదీ లేదు. అందువల్ల ఈ గ్రహంపై మనం కేవలం భవిష్యత్తరాలకు ధర్మకర్తలం మాత్రమేననే వాస్తవాన్ని సదా గుర్తుంచుకోవాలి. ఈ మేరకు ఈ ఆలోచన దిశగా మీకు దారిచూపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. రాబోయే రోజుల్లో సాగే చర్చలు అత్యంత ఉత్పాదకంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నా ఉపన్యాస సమాప్తికి ముందు- ఈ చర్చల్లో పాల్గొంటున్న  ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ చర్చల కార్యక్రమంలో పాల్గొంటున్న మాననీయులైన రువాండా అధ్యక్షుడికి, డెన్మార్క్‌ ప్రధానమంత్రికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ చర్చల్లో పాలుపంచుకోనున్న నా గౌరవనీయ మిత్రులు ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి, ఐరోపా మండలి అధ్యక్షుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా- అన్నిరకాల సవాళ్లనూ అధిగమించి ఈ ఏడాది రైసినా చర్చలకు చక్కని ఏర్పాట్లు చేయడంలో కృషి చేసిన అన్ని సంస్థలకూ నా హృదయపూర్వక, అపార కృతజ్ఞతలు చెబుతున్నాను.

 

ధన్యవాదాలు… థ్యాంక్యూ వెరీమచ్‌!

***