ఫిజి ప్రధానిగారు,
ఇటలీ ప్రధాని గారు,
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని గారు,
జాతీయ ప్రభుత్వాల తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు,
అంతర్జాతీయ సంస్థల నిపుణులు,
విద్యా సంస్థలు, ప్రైవేటు రంగంలోని
మహాశయులారా!
విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి లేదా ‘సీడీఆర్‌ఐ’ మూడో వార్షిక సదస్సు అసాధారణ సమయంలో జరుగుతోంది. వందేళ్లకొకసారి సంభవించేది విపత్తుగా పేర్కొంటున్న పరిణామానికి మనం ప్రత్యక్ష సాక్షులం. కోవిడ్-19 మనందరికీ ఒక పాఠం నేర్పింది. ప్రస్తుత పరస్పర ఆధారిత, అనుసంధానిత ప్రపంచంలో పేద-ధనిక, తూర్పు-పశ్చిమం, ఉత్తరం-దక్షిణం వంటి దేశాలేవైనా అంతర్జాతీయ విపత్తు దుష్ప్రభావానికి అతీతం కాదని తేల్చేసింది. క్రీస్తుశకం 2వ శతాబ్దంనాటి భారతీయ మహా పండితుడైన సాధుపుంగవుడైన నాగార్జునుడు “ప్రతీత్యసముత్పాద” పేరిట ‘పరస్పరాశ్రిత ఆవిర్భావం’పై పద్యరచన చేశాడు. సృష్టిలో మానవాళిసహా అన్నిటి మధ్యగల అనుసంధానాన్ని అందులో సుస్పష్టంగా విశదీకరించాడు. సహజ, సామాజిక ప్రపంచాల్లో మానవ జీవితం ఏ విధంగా పరిణామం చెందుతుందో ఈ రచన వివరిస్తుంది. ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనం లోతుగా అవగాహన చేసుకోగలిగితే మన ప్రస్తుత ప్రపంచ క్రమంలో దుర్బలత్వాన్ని తగ్గించే వీలుంటుంది. ఒకవైపు దుష్ప్రభావాలు ప్రపంచాన్ని ఎంత వేగంగా చుట్టుముడతాయో చూపిన ప్రపంచ మహమ్మారి… మరోవైపు ఉమ్మడి సవాలుపై పోరాటంలో ప్రపంచం మొత్తం ఏ విధంగా ఏకం కాగలదో విశదం చేసింది. ఆ మేరకు అత్యంత సంక్లిష్ట సమస్యలను మానవ నైపుణ్యం ఎలా పరిష్కరించగలదో ప్రత్యక్షంగా చూశాం. రికార్డు సమయంలో మనం టీకాలను అభివృద్ధి చేయగలిగాం. ఆ మేరకు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగల ఆవిష్కరణలు ప్రపంచంలో ఏ మూలనైనా సాధ్యమేనని కూడా ప్రపంచ మహమ్మారి మనకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు మద్దతునిచ్చే అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధితోపాటు అత్యంత అవసరంగల ప్రాంతాలకు దాన్ని బదలాయించడంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ మహమ్మారి నుంచి వేగంగా కోలుకోగల సంవత్సరంగా 2021 ఆశాభావం కల్పిస్తోంది. అయితే, ఈ మహమ్మారి నేర్పిన పాఠాలను మనం విస్మరించకూడదు. ఈ పాఠాలు ప్రజారోగ్య విపత్తులకు మాత్రమేగాక ఇతరత్రా విపత్తులకూ వర్తించేవే. మరోవైపు వాతావరణ సంక్షోభం నేడు కమ్ముకొస్తోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగాధిపతి ఇటీవల చెప్పినట్లు “వాతావరణ సంక్షోభానికి టీకా లేదీ ఉండదు.” కాబట్టి వాతావరణ మార్పు సమస్య నుంచి ఉపశమనం కోసం నిరంతర, సమష్టి కృషి కావాలి. అంతేగాక మనం ఇప్పటికే గమనించిన, ప్రపంచంలోని పలు దేశాలపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులకు మనం అలవాటు పడాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ కూటమి ప్రాముఖ్యం ఏమిటో మరింత స్పష్టమవుతోంది. మౌలిక వసతులలో మన పెట్టుబడులను ప్రతిరోధకం చేయగలిగితే మార్పుల విస్తృత అనుసరణ కృషికి అది కేంద్రకం కాగలదు. ఆ మేరకు మౌలిక వసతుల కోసం భారీగా వెచ్చిస్తున్న భారత్ వంటి దేశాలు ఆ పెట్టుబడులను ముప్పు తప్పించేవిగా కాకుండా ప్రతిరోధక పెట్టుబడులుగా పరిగణించాలి. కానీ, ఇటీవలి వారాల్లో చోటుచేసుకున్న ఉదంతాలను గమనిస్తే- ఇది కేవలం వర్ధమాన దేశాల సమస్య మాత్రమే కాదని తేలుతోంది. ఓ నెల కిందట సంభవించిన శీతాకాలపు తుఫాను ‘ఉరి’ అమెరికాలోని టెక్సాస్‌లో దాదాపు మూడోవంతు విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని ధ్వంసం చేసింది. ఫలితంగా 30 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గిపోవాల్సి వచ్చింది. ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడైనా సంభవించవచ్చు. ఈ అంధకారానికి దారితీసిన సంక్లిష్ట కారణాలను అవగతం చేసుకంటున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకుని, ముందస్తు చర్యలకు ఉపక్రమించేలా సిద్ధం కావాలి.
అనేక మౌలిక సదుపాయాల వ్యవస్థలు- డిజిటల్ మౌలిక వసతులు, నౌకా రవాణా, విమానయాన సదుపాయాలు ప్రపంచమంతటా ఉన్నవే! కాబట్టి ఏదో ఒక దేశంలో విపత్తు దుష్ప్రభావం ప్రపంచమంతటా వేగంగా విస్తరించగలదు. అందువల్ల ప్రపంచ వ్యవస్థలో ప్రతిరోధకతకు ప్రాధాన్యం దిశగా సహకారం తప్పనిసరి. మౌలిక వసతులను దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అభివృద్ధి చేస్తాం… అయితే, ఆ వసతులు ప్రతిరోధకమైనవి కాగలిగితే మన కోసమేగాక భవిష్యత్తరాలకూ విపత్తులను తప్పించినవాళ్లం కాగలం. ఒక వంతెన కొట్టుకుపోయినా, ఒక టెలికామ్ టవర్ కూలినా, విద్యుత్ వ్యవస్థ విఫలమైనా లేదా ఒక పాఠశాల ధ్వంసమైపోయినా అది సంబంధిత ప్రత్యక్ష నష్టం ఒక్కటే కాదు. వాటి ఫలితంగా సంభవించే మొత్తం నష్టాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంతరాయాల వల్ల చిన్న వ్యాపారాలకు పరోక్ష నష్టాలు, విద్యార్థుల చదువులు దెబ్బతినడం వంటి రూపాల్లో ఆ నష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. పరిస్థితిపై సమగ్ర అంచనాల కోసం సరైన గణన రూపం మనకిప్పుడు అవసరం. మౌలిక వసతులను మనం ప్రతిరోధకం చేయగలిగితే ఇలాంటి ప్రత్యక్ష, పరోక్ష నష్టాలను కనీస స్థాయికి తగ్గించి, లక్షలాది ప్రజల జీవనోపాధిని రక్షించగలం.
సీడీఆర్‌ఐ రూపుదిద్దుకుంటున్న తొలినాళ్లలో భారత్‌తోపాటు యునైటెడ్ కింగ్‌డమ్ దాని నాయకత్వ బాధ్యతలు పంచుకున్నందుకు మేం కృతజ్ఞులం. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 2021 సంవత్సరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన, ప్యారిస్ ఒప్పందం అమలు, సెండై చట్రం అమలు మార్గంలో మనమిప్పుడు మధ్య స్థాయికి చేరువలో ఉన్నాం. అందువల్ల ఈ ఏడాది చివరలో యనైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ దేశాలు నిర్వహించనున్న ‘కాప్-26’ శిఖరాగ్ర సదస్సుపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలలో కొన్నిటిని అందుకునేలా తోడ్పాటు ఇవ్వడంలో ప్రతిరోధక మౌలిక వసతుల భాగస్వామ్యం ప్రముఖ పాత్ర పోషించడం తప్పనిసరి. ఈ మేరకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని కీలక రంగాల గురించి చెప్పదలిచాను.
మొదటిది- సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో “ఏ ఒక్కరినీ వదిలివేయరాదు” అన్న కీలక హామీకి సీడీఆర్‌ఐ ఒక రూపమివ్వాలి. అంటే… అత్యంత దుర్బల దేశాలు, సమాజాల సమస్యలకు మనం అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. దీనికి సంబంధించి- నానాటికీ తీవ్రమవుతున్న విపత్తుల దుష్పరిణామాలను ఇప్పటికే అనుభవిస్తున్న చిన్న వర్ధమాన ద్వీపదేశాలకు తొలుత చేయూతనివ్వాలి. ఆ మేరకు ఆయా దేశాలు అవసరమని భావిస్తున్న అన్నిరకాల సాంకేతికత, శాస్త్ర పరిజ్ఞానం, సహాయ సహకారాలను అందించాలి. అంతర్జాతీయ పరిష్కారాలను స్థానిక సందర్భాలకు తగినట్లు అనుసరించడానికి మనకు సామర్థ్యంతోపాటు మద్దతు కూడా ఉండాలి.
రెండోది- కొన్ని కీలక మౌలిక సదుపాయాల రంగాల పనితీరును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మహమ్మారి పీడించిన సమయంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య, డిజిటల్ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగాల నుంచి మనం నేర్చిన పాఠాలేమిటి? భవిష్యత్తు కోసం వాటిని మరింత ప్రతిరోధకంగా రూపొందించడం ఎలా? జాతీయ, ఉప-జాతీయ స్థాయులలో సమగ్ర ప్రణాళికలు, నిర్మాణ స్వరూపం, ఆధునిక సరంజామా లభ్యతసహా అన్ని మౌలిక వసతుల రంగాలకూ నైపుణ్యంగల సిబ్బందిని సమకూర్చడం వంటి అంశాల్లో సామర్థ్యం పెంపుపై మనం పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఈ రంగాలన్నిటిలోనూ పరిశోధన-అభివృద్ధి అవసరమూ ఉంది.
మూడోది- ప్రతినిరోధకత కోసం మన అన్వేషణలో ఎలాంటి సాంకేతిక వ్యవస్థనైనా మరీ ప్రాథమికమైనదిగా లేదా అత్యంత అధునాతనమైనదిగా పరిగణించాల్సిన అవసరం లేదు. సాంకేతికత వినియోగ ప్రభావ ప్రదర్శనను గరిష్ఠం చేయడానికి సీడీఆర్‌ఐ ప్రయత్నించాలి. గుజరాత్‌లో ‘పునాదిని వేరుపరచే’ (బేస్ ఐసొలేషన్) సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశపు తొలి ఆస్ప్రతిని మేం నిర్మించాం. ఇప్పుడు భూకంపం నుంచి రక్షణనిచ్చే ‘బేస్ ఐసోలేటర్లు’ (పునాదిని వేరుపరచే ఉపకరణాలు) భారత్‌లోనే తయారవుతున్నాయి. అయితే, నేడు ఇందుకు మరెన్నో అవకాశాలున్నాయి. భౌగోళిక సమాచార సాంకేతికత, అంతరిక్ష-ఆధారిత సామర్థ్యాలు, డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు, పదార్థ విజ్ఞాన శాస్త్రాలు తదితరాల సంపూర్ణ సామర్థ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రతినిరోధకత కోసం దానిని స్థానిక పరిజ్ఞానంతో జోడించాలి. చివరగా- “ప్రతినిరోధక మౌలిక వసతులు” అనే భావన నిపుణులు, అధికార సంస్థలు మాత్రమే కాకుండా సమాజాలు… ముఖ్యంగా యువతరం శక్తిసామర్థ్యాలను పెంచే ఓ భారీ ప్రజా ఉద్యమంగా రూపొందాలి. ప్రతినిరోధక మౌలిక సదుపాయాల కోసం సామాజికంగా ఏర్పడే డిమాండు ప్రమాణాలకు తగినట్లు మెరుగుపడేలా చేస్తుంది. ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించడానికి కృషి చేయడం చాలా కీలకం. మన విద్యా విధానం- స్థానికంగా సంభవించే నిర్దిష్ట విపత్తులు, మౌలిక సదుపాయాల మీద చూపగల దుష్ప్రభావాలపై అవగాహనను మరింత పెంచేదిగా ఉండాలి.
నా ఉపన్యాసం ముగించే ముందు- సీడీఆర్‌ఐ తనకుతానే ఒక సవాలుతో కూడిన, అత్యవసర కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీని ఫలితాలను త్వరలోనే మనం చూడబోతున్నాం. ఈసారి తుఫాను, వరద, భూకంపం వంటివి సంభవించే సమయానికల్లా మన మౌలిక వసతుల వ్యవస్థలు మెరుగైన సంసిద్ధత కలిగి ఉన్నాయని, కాబట్టే నష్టాలను నివారించగలిగామని మనం చెప్పగలగాలి. ఒకవేళ ఎక్కడైనా నష్టం వాటిల్లితే మనం సత్వరమే సేవలను పునరుద్ధరించి, మరింత మెరుగ్గా పునర్నిర్మాణం చేయాలి. ప్రతినిరోధకత కోసం అన్వేషణ దిశగా మనమంతా ఇప్పుడు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం! ఎందుకంటే- ప్రతి ఒక్కరూ ‘సురక్షితం అయ్యేదాకా ఏ ఒక్కరూ సురక్షితం కాదు’ అని ప్రపంచ మహమ్మారి ఇప్పటికే మనకు పాఠం నేర్పింది. కాబట్టి సమాజం, ప్రదేశం, పర్యావరణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలలో ఏదీ వెనుకబడదన్న భరోసాను మనం కల్పించాలి. ప్రపంచంలోని 700 కోట్ల ప్రజానీకం శక్తిసామర్థ్యాలను ప్రపంచ మహమ్మారిపై పోరు ఏకీకృతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతినిరోధకత కోసం మన అన్వేషణ ఈ భూగోళం మీద నివసించే ప్రతి వ్యక్తి ఆలోచన, చొరవకు అనుగుణంగా ముమ్మరం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
థ్యాంక్యూ వెరీమచ్!
***
Addressing the International Conference on Disaster Resilient Infrastructure. https://t.co/S5RVIl2jqn
— Narendra Modi (@narendramodi) March 17, 2021
COVID-19 pandemic has taught us that in an inter-dependent and inter-connected world, no country- rich or poor, in the east or west, north or south- is immune to the effect of global disasters: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2021
On one hand, the pandemic has shown us how impacts can quickly spread across the world.
— PMO India (@PMOIndia) March 17, 2021
And on the other hand, it has shown how the world can come together to fight a common threat: PM @narendramodi
Many infrastructure systems- digital infrastructure, shipping lines, aviation networks-cover the entire world!
— PMO India (@PMOIndia) March 17, 2021
Effect of disaster in one part of the world can quickly spread across the world.
Cooperation is a must for ensuring the resilience of the global system: PM
Just as the fight against the pandemic mobilized the energies of the world's seven billion people, our quest for resilience must build on the initiative and imagination of each and every individual on this planet: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2021