Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

28.02.2021 న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. నిన్న మాఘ పూర్ణిమ పండుగ. మాఘ మాసం నదులు, చెరువులు, నీటి వనరులతో ముడిపడి ఉంది.

“మాఘే నిమగ్నా: సలీలే సుశీతే, విముక్త పాపా: త్రిదివం ప్రయాన్తి ||”

అని మన గ్రంథాలలో చెప్పారు..

అంటే మాఘ మాసంలో ఏదైనా పవిత్ర జలాశయంలో స్నానం చేయడాన్ని పవిత్రమైందిగా పరిగణిస్తారు. ప్రపంచంలోని ప్రతి సమాజంలో, నదికి సంబంధించిన సంప్రదాయం ఉంది. నదుల ఒడ్డున అనేక నాగరికతలు అభివృద్ధి చెందాయి. మన సంస్కృతి వేల సంవత్సరాల నాటిది కాబట్టి, నదుల నాగరికత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఏదో ఒక మూలలో నీటి సంబంధిత పర్వదినం లేని రోజు ఉండదు. మాఘ మాసంలో ప్రజలు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలిపెట్టి నెల మొత్తం నదుల ఒడ్డుకు వెళతారు. ఈసారి హరిద్వార్‌లో కుంభ మేళాకూడా జరుగుతోంది. నీరు మనకు జీవితం. నీరే విశ్వాసం. నీరే ప్రగతి ధార కూడా. నీరు చాలా ముఖ్యమైంది. నీటి స్పర్శతో ఇనుము బంగారంగా మారుతుందని ఒక తత్వవేత్త అంటారు. అదేవిధంగా జీవితానికి నీటి స్పర్శ అవసరం. అభివృద్ధికి కూడా ఇది చాలా అవసరం.

 

మిత్రులారా! మాఘ మాసాన్ని నీటితో అనుసంధానించడానికి మరొక కారణం ఉండవచ్చు. ఈ మాసం నుండి శీతాకాలం ముగుస్తుంది. వేసవి ప్రారంభమవుతుంది. నీటిని పరిరక్షించడానికి ఇప్పటినుండే ప్రయత్నాలను ప్రారంభించాలి. కొన్ని రోజుల తరువాత మార్చి 22 వ తేదీ నాడు ప్రపంచ జల దినోత్సవం కూడా ఉంది.

ప్రపంచంలోని కోట్లాది ప్రజలు నీటి కొరతను తీర్చడానికి మాత్రమే తమ జీవితంలో ఎక్కువ భాగం కష్టపడుతున్నారని ఉత్తరప్రదేశ్ నుండి ఆరాధ్య గారు రాశారు. ‘నీరు లేకుంటే అంతా శూన్యం’ అని కూడా చెప్పలేదు.నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దీనాజ్‌పూర్‌కు చెందిన సుజిత్ గారు నాకు చాలా మంచి సందేశం పంపారు. ప్రకృతి మనకు నీటి రూపంలో ఉమ్మడి బహుమతిని ఇచ్చిందని, కాబట్టి దాన్ని ఆదా చేయడం కూడా ఉమ్మడి బాధ్యత అని సుజిత్ గారు రాశారు. సామూహిక బహుమతి ఉన్నట్లే, సామూహిక బాధ్యత కూడా ఉంటుంది. . సుజిత్ గారి మాట ఖచ్చితంగా నిజమైంది. నది, చెరువు, సరస్సు, వర్షం, భూగర్భ జలాలు అందరికోసం.

మిత్రులారా! గ్రామంలోని బావులు, సరస్సులను ఊరంతా కలిసి చూసుకునే ఒక కాలం గతంలో ఉండేది. ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం తమిళనాడులోని తిరువన్నామలైలో జరుగుతోంది. అక్కడ స్థానిక ప్రజలు తమ బావులను కాపాడుకోవాలని ప్రచారం చేశారు. ఈ ప్రజలు తమ ప్రాంతంలో కొన్నేళ్లుగా పూడుకుపోయిన ఉమ్మడి బావులను పునరుద్ధరిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని అగరోథ గ్రామానికి చెందిన బబితా రాజ్‌పుత్ గారి ప్రయత్నం అందరికీ స్ఫూర్తినిస్తుంది. బబిత గారి గ్రామం బుందేల్‌ఖండ్‌లో ఉంది. ఒకప్పుడు ఆ గ్రామానికి సమీపంలో చాలా పెద్ద సరస్సు ఎండిపోయింది. అప్పుడు బబిత గారు గ్రామంలోని ఇతర మహిళలను వెంట తీసుకెళ్ళి సరస్సు వరకు నీరు వెళ్లేందుకు ఒక కాలువ నిర్మించారు. ఆ కాలువ నుండి వర్షపు నీరు నేరుగా సరస్సులోకి వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ సరస్సు నీటితో నిండి ఉంది.

 

మిత్రులారా! ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో నివసిస్తున్న జగదీష్ కునియాల్ గారి కృషి కూడా చాలా బోధిస్తుంది. జగదీష్ గారి  గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతం నీటి అవసరాలకు సహజ వనరులపై ఆధారపడింది. కానీ చాలా సంవత్సరాల కిందట ఆ నీటి వనరు ఎండిపోయింది. ఈ కారణంగా ప్రాంతంలో నీటి సంక్షోభం తీవ్రమైంది. జగదీష్ గారు చెట్లను నాటడం ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన గ్రామ ప్రజలతో కలిసి ఆ ప్రాంతమంతా వేలాది చెట్లను నాటారు. దాంతో ఎండిపోయిన జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ పెరిగాయి.

మిత్రులారా! నీటి నుండి మొదలుకొని మన సామూహిక బాధ్యతలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మే-జూన్ నెలల్లో వర్షం మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న నీటి వనరులను శుభ్రపరచడానికి, వర్షపునీటిని సేకరించడానికి 100 రోజుల ప్రచారాన్ని ఇప్పటి నుండే ప్రారంభించగలమా? ఈ ఆలోచనతో కొన్ని రోజుల తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ ‘క్యాచ్ ది రెయిన్’ అనే పేరుతో జల్ శక్తి అభియాన్ ను ప్రారంభిస్తోంది. ‘వర్షం ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా వెంటనే ఒడిసిపట్టుకోవాలి’ అనేది ఈ ప్రచారం ప్రాథమిక సూత్రం. మనం మొదటి నుండి చేస్తున్న వాన నీటి సంరక్షణను మనం ఇప్పటి నుండి మళ్ళీ మొదలుపెట్టాలి. వర్షపు నీటి సేకరణ విధానం ఇప్పటినుండే అమల్లోకి తేవాలి. గ్రామాల్లో చెరువులు, జలాశయాల మార్గాలలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాలి. నీటి మార్గానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా మరింత ఎక్కువ వర్షపునీటిని నిల్వ చేయగలుగుతాం.

 

నా ప్రియమైన దేశవాసులారా! మాఘ మాసం గురించి, ఈ మాస ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చర్చ జరిగినప్పుడల్లా, ఈ చర్చ సంత్ రవిదాస్ గారి పేరు లేకుండా పూర్తి కాదు. మాఘ పూర్ణిమ రోజే సంత్ రవిదాస్ గారి జయంతి. సంత్ రవిదాస్ గారి మాటలు, ఆలోచనా ధోరణి, ఆయన జ్ఞానం మనకు ఈ రోజు కూడా మార్గ నిర్దేశం చేస్తాయి.

 

మనమంతా ఒకే తల్లి ముద్దుబిడ్డలం

అందరి సృష్టికర్త ఒకరే

అన్నీ ఒకే మట్టి మృణ్మయ పాత్రలే||

అని సంత్ రవిదాస్ చెప్పేవారు.

అంటే మనమంతా ఒకే మట్టి పాత్రలమని అర్థం. మనందరినీ ఒక్కరే తయారు చేశారని ఆయన భావం. సమాజంలో ప్రబలంగా ఉన్న వక్రీకరణల గురించి సంత్ రవిదాస్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడేవారు. ఆయన ఈ వక్రీకరణలను సమాజం ముందు ఉంచారు. వాటిని సరిచేయడానికి మార్గం చూపించారు. అందుకే ‘రవి దాస్ రూపంలో గురువు దొరికారు.. ఇదే జ్ఞాన మార్గం’ అని మీరా బాయి గారు అన్నారు. సంత్ రవిదాస్ గారి జన్మస్థలమైన వారణాసితో అనుసంధానం కావడం నా అదృష్టం. సంత్ రవిదాస్ గారి ఆధ్యాత్మిక సమున్నత స్థాయిని, ఆ తీర్థక్షేత్రంలో ఆయన శక్తిని నేను అనుభవించాను.

 

 

 

 

మిత్రులారా!

‘కర్మ బంధనాలకు కట్టుబడి ఉండండి

ఫలాల ఆశ వద్దు.

కర్మ మనుష్య ధర్మం

నిజాయితీ రవిదాస్ మతం ||’ అని సంత్ రవిదాస్ చెప్పేవారు.

అంటే మన పనిని నిరంతరం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఫలం వస్తుంది. అంటే కర్మ నుండి సిద్ధి ఎలాగూ ఉంటుంది. దాని గురించిన ఆలోచన వద్దు అని. మన యువత సంత్ రవిదాస్ గారి నుండి ఇంకొక విషయం నేర్చుకోవాలి. యువకులు ఏదైనా పని చేయడానికి పాత మార్గాలకు, విధానాలకు తమను తాము బంధించుకోకూడదు. మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ స్వంత మార్గాలను కూడా తయారు చేసుకోండి. మీ లక్ష్యాలను మీరు స్వంతంగా నిర్ధారించుకోండి. మీ వివేకం, మీ విశ్వాసం బలంగా ఉంటే, మీరు ప్రపంచంలో దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన యువత చాలా సార్లు పని చేయాలనుకుంటున్నా కొనసాగుతున్న ఆలోచనల ఒత్తిడిలో పని చేయలేకపోతుంది. అందువల్ల మీరు ఎప్పుడూ ఆలోచించడానికి, ఆవిష్కరించడానికి వెనుకాడకూడదు. సంత్ రవిదాస్ గారు మరో ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ‘ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి’ అనేది ఆ సందేశం. మన కలల కోసం మనం వేరొకరిపై ఆధారపడడం సరైనది కాదు. రవిదాస్ గారు ఎప్పుడూ ఆ ఆలోచనకు సానుకూలంగా లేరు. ఈ రోజు దేశ యువత కూడా ఆ ఆలోచనా ధోరణికి అనుకూలంగా లేరని మనం చూస్తున్నాం. ఈ రోజు దేశంలోని యువతలో వినూత్న స్ఫూర్తిని చూసినప్పుడు సంత్ రవిదాస్ గారు కూడా గర్వపడతారని నేను భావిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు ‘నేషనల్ సైన్స్ డే’ జరుపుకుంటున్నాం. భారతదేశ గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. రామన్ గారు చేసిన రామన్ ఎఫెక్ట్ పరిశోధనకు గుర్తుగా ఈ రోజు ‘నేషనల్ సైన్స్ డే’ జరుగుతోంది. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ మొత్తం సైన్స్ దిశను మార్చిందని కేరళకు చెందిన యోగేశ్వరన్ గారు నమోఆప్‌లో రాశారు. దీనికి సంబంధించిన చాలా మంచి సందేశాన్ని నాసిక్ కు చెందిన స్నేహిల్ గారు కూడా నాకు పంపారు. మన దేశంలో లెక్కలేనంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారని, శాస్త్రవేత్తల కృషి లేకుండా సైన్స్ ఇంత పురోగతి సాధించలేదని స్నెహిల్ గారు రాశారు. ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తల గురించి మనకు తెలిసినట్టే భారతదేశ శాస్త్రవేత్తల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ‘మన్ కి బాత్’ శ్రోతల అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. భారతదేశ శాస్త్రీయ చరిత్రను గురించి, మన శాస్త్రవేత్తల గురించి మన యువత తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, అధ్యయనం చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను.

మిత్రులారా! మనం సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు ప్రజలు దీనిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా ప్రయోగశాలలకు పరిమితం చేస్తారు. కాని, సైన్స్ దీని కంటే చాలా ఉన్నతమైంది. ‘స్వయం సమృద్ధి భారత ప్రచారంలో’ సైన్స్ శక్తి చాలా దోహద పడుతుంది. ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే మంత్రంతో మనం ముందుకు వెళ్ళాలి.

ఉదాహరణకు హైదరాబాద్ లో చింతల వెంకట రెడ్డి గారు ఉన్నారు. రెడ్డిగారి డాక్టర్ స్నేహితుడు ఒకసారి ఆయనకు విటమిన్-డి లోపం వల్ల కలిగే వ్యాధులు, వాటి అనర్థాల గురించి చెప్పారు. రెడ్డి గారు ఒక రైతు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలా అని ఆయన ఆలోచించారు. దీని తరువాత ఆయన చాలా కష్టపడ్డారు. విటమిన్-డి అధికంగా ఉండే గోధుమ, వరి పంటలను అభివృద్ధి చేశారు. అదే నెలలో ఆయన జెనీవాలోని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ నుండి పేటెంట్ కూడా పొందారు. గతేడాది వెంకట్ రెడ్డి గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం మన ప్రభుత్వ సౌభాగ్యం.

లద్దాఖ్‌కు చెందిన ఉర్ గెన్ ఫుత్ సౌగ్ గారు కూడా చాలా వినూత్న పద్ధతిలో పనిచేస్తున్నారు. ఉర్ గెన్ గారు ఇంత ఎత్తులో సేంద్రీయ విధానంలో సుమారు 20 పంటలను పండిస్తున్నారు. చక్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఒక పంట వ్యర్థాలను ఇతర పంటలలో ఎరువుగా ఉపయోగిస్తారు. ఇది అద్భుతమైన విషయం కదా!

అదేవిధంగా గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో కామరాజ్ భాయ్ చౌదరి గారి ఇంట్లో మంచి మునగ కాయ విత్తనాలను అభివృద్ధి చేశారు. మంచి విత్తనాల సహాయంతో ఉత్పత్తి అయ్యే మునగ కాయ నాణ్యత కూడా మంచిది. ఆయన ఇప్పుడు తన ఉత్పత్తులను తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

మిత్రులారా! ఈ రోజుల్లో మీరు చియా విత్తనాల పేరు తప్పక వింటూ ఉండవచ్చు. ఆరోగ్య అవగాహన ఉన్న వ్యక్తులు దీనికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ప్రపంచంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. భారతదేశంలో ఇది ఎక్కువగా విదేశాల నుండి వస్తోంది. కానీ ఇప్పుడు ప్రజలు చియా విత్తనాల విషయంలో స్వయం సమృద్ధి దిశలో ముందడుగు వేస్తున్నారు. ఈ విధంగా యూపీలోని బారాబంకిలో హరిశ్చంద్ర గారు చియా విత్తనాల సాగు ప్రారంభించారు. ఈ విత్తనాల సాగు వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది. స్వావలంబన భారత ప్రచారానికి సహాయపడుతుంది.

మిత్రులారా! వ్యవసాయ వ్యర్థాల నుండి సంపదను సృష్టించడానికి అనేక ప్రయోగాలు కూడా దేశవ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు, మదురైకి చెందిన మురుగేషన్ గారు అరటి వ్యర్థాల నుండి తాడు తయారు చేసే యంత్రాన్ని రూపొందించారు. మురుగేషన్ గారి ఈ ఆవిష్కరణ పర్యావరణ సమస్యలను, వ్యర్థ పదార్థాల నిర్మూలన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అదనపు ఆదాయానికి రైతులకు ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది.

మిత్రులారా! మన్ కీ బాత్ శ్రోతలకు ఇలా చాలా మంది గురించి చెప్పడం వెనుక నా ఉద్దేశ్యం మనమందరం వారి నుండి ప్రేరణ పొందుతాం. దేశంలోని ప్రతి పౌరుడు తన జీవితంలోనూ ప్రతి రంగంలోనూ విజ్ఞాన శాస్త్రాన్ని విస్తరిస్తే పురోగతికి మార్గాలు కూడా తెరుచుకుంటాయి. దేశం కూడా స్వయం సమృద్ధిగా మారుతుంది. ఈ దేశంలోని ప్రతి పౌరుడు దీన్ని చేయగలడన్న నమ్మకం నాకుంది.

నా ప్రియమైన మిత్రులారా! కోల్‌కతాకు చెందిన రంజన్ గారు తన లేఖలో చాలా ఆసక్తికరమైన, ప్రాథమిక ప్రశ్నలను అడిగారు. అదే సమయంలో వాటికి ఉత్తమ సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. మనం స్వావలంబన గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? “స్వావలంబన భారత ప్రచారం కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, జాతీయ స్ఫూర్తి” అని ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్వయంగా రాశారు. స్వయం సమృద్ధిగా ఉండడం అంటే తమ స్వంత విధిని నిర్ణయించడమని ఆయన అభిప్రాయం. అంటే తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవడమని ఆయన  నమ్ముతారు. రంజన్ బాబు గారి అభిప్రాయం వంద శాతం సరైంది. ఆయన చెప్పిన విషయాన్ని మరింత వివరిస్తే- మన దేశ విషయాల గురించి గర్వపడడం, మన దేశ ప్రజలు చేసిన పనుల గురించి గర్వపడడం స్వయం సమృద్ధిలో మొదటి అంశం. ప్రతి దేశ వాసీ గర్వపడుతున్నప్పుడు, ఈ ప్రక్రియలో అందరూ దేశవాసులూ పాలుపంచుకున్నప్పుడు స్వావలంబన భారతదేశం కేవలం ఆర్థిక ప్రచారం కాకుండా జాతీయ స్ఫూర్తిగా మారుతుంది. మన దేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానాల విన్యాసాలను ఆకాశంలో చూసినప్పుడు; భారతదేశంలో తయారైన యుద్ధ ట్యాంకులు, క్షిపణులు మన గౌరవాన్ని పెంచినప్పుడు; ధనిక దేశాలలోని మెట్రో రైళ్లలో మేడ్ ఇన్ ఇండియా కోచ్ లను చూసినప్పుడు; మేడ్ ఇన్ ఇండియా కరోనా వ్యాక్సిన్‌ విదేశాలకు చేరుకున్న విషయం చూసినప్పుడు, మన నుదురు మరింత ఉన్నతమవుతుంది. పెద్ద విషయాలు మాత్రమే భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తాయని కాదు. భారతదేశంలో తయారైన దుస్తులు, భారతదేశంలోని ప్రతిభావంతులైన హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులు, భారతదేశ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, దేశ మొబైల్ రంగం.. ఇలా ప్రతి రంగంలోనూ మనం ఈ ప్రతిష్ఠను పెంచుకోవాలి. ఈ ఆలోచనతో మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే మనం నిజంగా స్వావలంబన సాధించగలుగుతాం. ఈ స్వావలంబన భారతదేశ మంత్రం దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. బీహార్‌లోని బేతియాలో ఇదే జరిగింది. దీని గురించి నేను మీడియాలో చదివాను.

బేతియాలో నివసించే ప్రమోద్ గారు ఢిల్లీ లో ఎల్‌ఈడీ బల్బ్ తయారీ కర్మాగారంలో టెక్నీషియన్‌గా పనిచేసేవారు. ఆ కర్మాగారంలో పనిచేసేటప్పుడు మొత్తం ప్రక్రియను చాలా దగ్గరగా అర్థం చేసుకున్నాడు. కానీ కరోనా సమయంలో ప్రమోద్ గారు తన ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ప్రమోద్ గారు ఏం చేశారో తెలుసా? ఎల్‌ఈడీ బల్బుల తయారీకి స్వయంగా ఒక చిన్న యూనిట్‌ను ప్రారంభించారు. ఆయన తన ప్రాంతం నుండి కొంతమంది యువకులను తీసుకొని ఫ్యాక్టరీ కార్మికుడి నుండి ఫ్యాక్టరీ యజమానిగా తన ప్రయాణాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేశారు. అది కూడా తన తన సొంత ఇంట్లోనే నివసిస్తూ..

మరో ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లోని గఢ్ ముక్తేశ్వర్ కు సంబంధించింది. కరోనా కాలంలో విపత్తును అవకాశంగా తాను ఎలా మార్చుకున్నారో గఢ్ ముక్తేశ్వర్ నుండి సంతోష్ గారు రాశారు. సంతోష్ గారి పూర్వికులు అద్భుతమైన హస్తకళాకారులు. చాపలు తయారు చేసేవారు. కరోనా సమయంలో ఇతర పనులు ఆగిపోయినప్పుడు వారు గొప్ప శక్తితో, ఉత్సాహంతో చాపలను తయారు చేయడం ప్రారంభించారు. త్వరలో ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాపల కోసం ఆర్డర్లు పొందారు. దీనివల్ల ఈ ప్రాంతానికి చెందిన శతాబ్దాల పూర్వపు పురాతన అందమైన కళకు కొత్త బలం లభించిందని సంతోష్ గారు చెప్పారు.

 

మిత్రులారా! దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు స్వావలంబన భారత ప్రచారానికి సహకరిస్తున్నారు. ఈ రోజు అది ఒక భావోద్వేగ అంశంగా మారింది. ఈ భావోద్వేగం సాధారణ ప్రజల హృదయాల్లో ప్రవహిస్తోంది.

నా ప్రియమైన దేశవాసులారా! గుర్గావ్‌లో నివసిస్తున్న మయూర్ గారి ఆసక్తికరమైన పోస్ట్ ను నమోఆప్‌లో చూశాను. ఆయన పక్షుల వీక్షకుడు. ప్రకృతి ప్రేమికుడు. తాను హర్యానాలో నివసిస్తున్నానని మయూర్ గారు రాశారు. కానీ అస్సాం ప్రజలపై– ముఖ్యంగా కాజీరంగ ప్రజలపై చర్చించాలని తాను కోరుకుంటున్నానని ఆయన రాశారు. అస్సాంకు గర్వకారణమైన ఖడ్గమృగం గురించి మయూర్ గారు మాట్లాడతారని నేను అనుకున్నాను. కానీ కాజీరంగాలో వాటర్ ఫౌల్స్ సంఖ్య పెరిగినందుకు అస్సాం ప్రజలను మయూర్ గారు అభినందించారు. వాటర్‌ ఫౌల్స్ ను సులువైన భాషలో ఎలా చెప్పవచ్చో నేను అన్వేషిస్తున్నాను. ఒక పదం కనుగొన్నాను. ఆ పదం ‘జలపక్షి’. చెట్ల మీద కాకుండా నీటి పై గూడు ఉండే పక్షి. బాతులు మొదలైనవి. కాజీరంగ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ అథారిటీ కొంతకాలంగా వార్షిక వాటర్ ఫాల్స్ సెన్సస్ చేస్తున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం నీటి పక్షుల సంఖ్య తెలుస్తుంది. వాటికి ఇష్టమైన ఆవాసాలేమిటో తెలుస్తుంది. రెండు-మూడు వారాల కిందట మళ్ళీ సర్వే జరిగింది. ఈసారి నీటి పక్షుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 175 శాతం పెరిగిందని తెలుసుకోవడం మీకు కూడా సంతోషంగా ఉంటుంది.

ఈ జనాభా లెక్కల ప్రకారం కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో మొత్తం 112 జాతుల పక్షులు కనిపించాయి. వీటిలో 58 జాతుల పక్షులు యూరప్, మధ్య ఆసియా, తూర్పు ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి శీతాకాలంలో వలస వస్తాయి. మెరుగైన నీటి సంరక్షణతో పాటు ఇక్కడ చాలా తక్కువ మానవ ప్రమేయం ఉండడం కూడా దీనికి ముఖ్య కారణం. కొన్ని సందర్భాల్లో సానుకూల మానవ జోక్యం కూడా చాలా ముఖ్యమైంది.

 

అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ ను చూడండి. మీలో కొందరికి ఆయన గురించి తెలిసి ఉండవచ్చు. ఆయన చేసిన కృషికి పద్మ అవార్డు అందుకున్నారు. అస్సాంలోని మజులి ద్వీపంలో సుమారు 300 హెక్టార్ల తోటల పెంపకంలో తన చురుకైన సహకారాన్ని ఆయన అందించారు. ఆయన అటవీ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. తోటల పెంపకంలో, జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రజలను ప్రేరేపించడంలో కూడా పాల్గొన్నారు.

మిత్రులారా! అస్సాంలోని మన దేవాలయాలు కూడా ప్రకృతి పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. మీరు దేవాలయాలను పరిశీలిస్తే ప్రతి ఆలయానికి ఒక చెరువు ఉందని మీకు తెలుస్తుంది. హజోలోని హయగ్రీవ మధేబ్ ఆలయం, సోనిత్‌పూర్‌లోని నాగశంకర్ ఆలయం, గువహతిలోని ఉగ్రతార ఆలయం మొదలైన ఆలయాల సమీపంలో ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి. అంతరించిపోయిన జాతుల తాబేళ్లను కాపాడటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అస్సాంలో అత్యధిక జాతుల తాబేళ్లు ఉన్నాయి. దేవాలయాల సమీపంలోని ఈ చెరువులు తాబేళ్ల సంరక్షణ, పెంపకంతో పాటు తాబేళ్ల పెంపకంలో శిక్షణ కోసం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారతాయి.

 

 

 

 

 

 

 

నా ప్రియమైన దేశవాసులారా! ఆవిష్కరణ చేయడానికి శాస్త్రవేత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కొంతమంది భావిస్తారు. ఇతరులకు ఏదైనా నేర్పడానికి ఉపాధ్యాయుడిగా ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు భావిస్తారు. ఈ ఆలోచనను సవాలు చేసే వారికి ఎల్లప్పుడూ ప్రశంసలు లభిస్తాయి. ఎవరైనా సైనికుడిగా మారడానికి శిక్షణ పొందితే అతను సైనికుడిగా ఉండాల్సిన అవసరం ఉందా? అవును.. అది అవసరం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఇక్కడే చిన్న మెలిక ఉంది.

మైగవ్‌లో కమలకాంత్ గారు ఒక మీడియా నివేదికను పంచుకున్నారు. ఇది భిన్నమైన విషయం. ఒడిశాలోని అరాకుడలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నాయక్ సర్. ఆయన పేరు సిలూ నాయక్ అయినప్పటికీ అందరూ ఆయన్ని నాయక్ సర్ అని పిలుస్తారు. నిజానికి ఆయన మ్యాన్ ఆన్ ఎ మిషన్. సైన్యంలో చేరాలని కోరుకునే యువకులకు ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆయన సంస్థ పేరు మహాగురు బెటాలియన్. శారీరక దృఢత్వం నుండి ఇంటర్వ్యూల వరకు, రాయడం నుండి శిక్షణ వరకు అన్ని అంశాలను అక్కడ నేర్పిస్తారు. ఆ సంస్థలో శిక్షణ పొందిన వ్యక్తులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి సైనిక దళాలలో స్థానం పొందారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒడిశా పోలీసులలో నియామకం కోసం ప్రయత్నించిన సిలూ నాయక్ విజయం సాధించలేకపోయారని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ తన శిక్షణ ఆధారంగా ఆయన చాలా మంది యువకులను జాతీయ సేవకు అర్హుడుగా చేశారు. రండి.. మన దేశానికి మరింతమంది నాయకులను సిద్ధం చేయాలని నాయక్ సర్ కు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

మిత్రులారా! కొన్నిసార్లు చాలా చిన్న, సాధారణమైన ప్రశ్న కూడా మనస్సును కదిలిస్తుంది. ఈ ప్రశ్నలు చాలా పెద్దవి కావు.. అవి చాలా సరళమైనవి. అయినప్పటికీ అవి మనల్ని ఆలోచింపజేస్తాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన అపర్ణరెడ్డి గారు అలాంటి ఒక ప్రశ్న నన్ను అడిగారు. “మీరు చాలా సంవత్సరాలు ప్రధానమంత్రి గా ఉన్నారు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదో ఇంకా తక్కువ ఉందని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా?” అని అపర్ణ గారు అడిగారు. అపర్ణ గారి ప్రశ్న చాలా సులభం. కాని జవాబు కష్టమైంది కూడా. నేను ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించాను. నా లోపాలలో ఒకటి, ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళాన్ని నేర్చుకోవడానికి నేను పెద్దగా ప్రయత్నం చేయకపోవడమని, నేను తమిళం నేర్చుకోలేకపోయానని నాలో నేను అనుకున్నాను. తమిళం చాలా సుందర భాష. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. తమిళ సాహిత్యంలోని నాణ్యత, ఆ భాషలో రాసిన కవితల లోతు గురించి చాలా మంది నాకు చాలా చెప్పారు. మన సంస్కృతికి, గౌరవానికి ప్రతీక అయిన అనేక భాషల ప్రదేశం భారతదేశం. భాష గురించి మాట్లాడుతూ, మీతో ఒక చిన్న ఆసక్తికరమైన క్లిప్‌ను పంచుకోవాలనుకుంటున్నాను.

సౌండ్ క్లిప్- స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – బైట్‌ను లిప్యంతరీకరించాల్సిన అవసరం లేదు)

 

 

## (sound clip Statue of Unity-no need to transcribe the byte)

 

ప్రపంచంలో అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహంపై ఒక గైడ్ ప్రజలకు సంస్కృతంలో చెప్పే విషయాన్ని మీరు ఇప్పుడు విన్నారు. కేవాడియాలో 15 మంది కి పైగా గైడ్‌లు సంస్కృతంలో ప్రజలకు మార్గానిర్దేశం చేస్తారని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మరో గొంతు వినిపిస్తాను.

## (sound clip Cricket commentary- no need to transcribe the byte)

## (సౌండ్ క్లిప్ క్రికెట్ వ్యాఖ్యానం- బైట్‌ను లిప్యంతరీకరించాల్సిన అవసరం లేదు)

ఇది కూడా మీరు విని ఆశ్చర్యపోయి ఉంటారు. వాస్తవానికి, ఇది సంస్కృతంలో జరుగుతున్న క్రికెట్ వ్యాఖ్యానం. వారణాసిలో సంస్కృత మహావిద్యాలయాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కళాశాలలు శాస్త్రార్థ్ కళాశాల, స్వామి వేదాంతి వేద విద్యాపీఠం, శ్రీ బ్రహ్మ వేద విద్యాలయ , అంతర్జాతీయ చంద్రమౌళి ఛారిటబుల్ ట్రస్ట్. ఈ టోర్నమెంట్ మ్యాచ్‌ల సందర్భంగా సంస్కృతంలో కూడా కామెంటరీ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యానంలో చాలా చిన్న భాగం మీకు వినిపించాను. ఇది మాత్రమే కాదు.. ఈ టోర్నమెంట్ లో ఆటగాళ్ళు, వ్యాఖ్యాతలు సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. మీకు శక్తి, ఉత్సాహం, సస్పెన్స్ ఒకేసారి కావాలంటే మీరు ఆటల వ్యాఖ్యానాన్ని వినాలి.

టీవీ. రాకముందు క్రికెట్, హాకీ వంటి క్రీడల వ్యాఖ్యానం దేశ ప్రజలను రోమాంచితం చేసే మాధ్యమం. టెన్నిస్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వ్యాఖ్యానం కూడా చాలా బాగా జరుగుతుంది. వ్యాఖ్యానం గొప్పగా ఉండే ఆటలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని మనం చూశాం. మనకు ఇక్కడ చాలా భారతీయ క్రీడలు ఉన్నాయి. కాని వాటిలో వ్యాఖ్యాన సంస్కృతి రాలేదు. ఈ కారణంగా అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. నా మనసులో ఒక ఆలోచన ఉంది. విభిన్న క్రీడలలో- ముఖ్యంగా భారతీయ క్రీడలలో ఎక్కువ భాషలలో మంచి వ్యాఖ్యానం ఎందుకు లేదని. వ్యాఖ్యానాన్ని క్రీడలలో ప్రోత్సహించడం గురించి మనం ఆలోచించాలి. దీని గురించి ఆలోచించాలని క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రైవేటు సంస్థల సహచరులను నేను కోరుతున్నాను.

 

నా ప్రియమైన యువ మిత్రులారా! రాబోయే నెలలు మీ అందరి జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చాలా మంది యువ మిత్రులకు పరీక్షలున్నాయి. మీరు వారియర్స్ గా మారాలి గానీ వర్రీయర్స్ గా మారకూడదని మీకు గుర్తుంది కదా. మీరు యోధులుగా మారాలి. ఆందోళన చెందకూడదు. మీరు నవ్వుతూ పరీక్షకు వెళ్ళాలి. నవ్వుతూ తిరిగి రావాలి. ఇతరులతో పోటీ కాదు. మీతో మీరు పోటీ పడాలి. తగినంత సమయం నిద్ర పోవాలి. సమయ నిర్వహణ కూడా ఉండాలి. ఆడడం కూడా ఆపవద్దు. ఎందుకంటే ఆడేవారు వికసిస్తారు. పునర్విమర్శలో , జ్ఞాపకశక్తి లో ఆధునిక పద్ధతులను అవలంబించాలి. మొత్తంమీద ఈ పరీక్షలలో మీరు మీలోని ఉత్తమమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మనందరం కలిసి ఈ కృషి చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తాం. మార్చిలో ‘పరీక్షా పే చర్చ’ జరగడానికి ముందు మీ అనుభవాలను, మీ చిట్కాలను పంచుకోవాలని పరీక్ష యోధులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నేను కోరుతున్నాను. ఈ విషయాలను మీరు MyGov లో పంచుకోవచ్చు. నరేంద్రమోడి యాప్‌లో షేర్ చేయవచ్చు. ఈసారి యువతతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ‘పరీక్షా పే చర్చ’ కు ఆహ్వానిస్తారు. ఎలా పాల్గొనాలి, బహుమతిని ఎలా గెలుచుకోవాలి, నాతో చర్చించే అవకాశాన్ని ఎలా పొందాలో మీకు సమస్త సమాచారం మైగవ్‌లో లభిస్తుంది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా విద్యార్థులు, సుమారు 40 వేల మంది తల్లిదండ్రులు, సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా పాల్గొనండి. ఎగ్జాం వారియర్ పుస్తకంలో నేను కొత్త అంశాలను జోడించేందుకు ఈ కరోనా కాలంలో నేను కొంత సమయం తీసుకున్నాను. పరీక్ష యోధుల పుస్తకంలో చాలా కొత్త విషయాలను జోడించాను. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా కొన్ని అంశాలను అందజేయడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన కార్యకలాపాలు నరేంద్రమోడి యాప్‌లో ఉన్నాయి. ఇవి మీలోని పరీక్ష యోధుడిని ప్రజ్వలింపజేసి, విజయం పొందేందుకు దోహదపడుతుంది. మీరు వాటిని తప్పక ప్రయత్నించాలి. రాబోయే పరీక్షల సందర్భంగా యువ మిత్రులందరికీ చాలా అభినందనలు.

 

 

నా ప్రియమైన దేశవాసులారా! మార్చి నెల ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. కాబట్టి మీలో చాలా మంది తీరిక లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు అధికమవుతుండడం వల్ల వ్యాపారులు, వ్యవస్థాపక సహోద్యోగుల పని కూడా పెరుగుతోంది. ఈ పనులన్నిటి మధ్య కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండడాన్ని తగ్గించకూడదు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. మీ విధులలో ఉంటారు. అప్పుడు దేశం వేగంగా ముందుకు సాగుతుంది.

మీకు రాబోయే పండుగల శుభాకాంక్షలు. అలాగే కరోనాకు సంబంధించిన నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం ఉండకూడదు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

 

***