Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రాంతీయ ఆరోగ్యాధికారులు, నిపుణుల వర్చువల్‌ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రాంతీయ ఆరోగ్యాధికారులు, నిపుణుల వర్చువల్‌ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QV9E.jpg

 

నిపుణులారా..

నమస్కారం.

   మా సామీప్య, విస్తరిత ఇరుగుపొరుగు దేశాల ఆరోగ్యాధికారులు, నిపుణులు ఇవాళ సమావేశం కావడం నాకెంతో సంతోషంగా కలిగిస్తోంది. ఈ రోజు మీ నిర్మాణాత్మక చర్చలకు ముందుగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగం ప్రారంభిస్తున్నాను. మహమ్మారి విజృంభించిన వేళ మన ఆరోగ్య వ్యవస్థల సహకరించిన తీరుపై మీకందరికీ నా అభినందనలు. గత సంవత్సరం కోవిడ్‌-19 ప్రపంచం మీద విరుచుకుపడినప్పుడు చాలామంది నిపుణులు అధిక జన సాంద్రతగల మన ప్రాంత దేశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఆదినుంచీ మనమంతా సమన్వయంతో కూడిన ప్రతిస్పందనద్వారా ఈ సవాలును దీటుగా ఎదుర్కొన్నాం. నిరుడు మార్చిలోనే ముప్పును గుర్తించి సమష్టి పోరాటానికి కట్టుబడి చేయి కలిపాం. అనేక ఇతర ప్రాంతాలు, బృందాలు మన ముందస్తు జాగ్రత్త ఉదాహరణనే ఆదర్శంగా తీసుకున్నాయి.

   మహమ్మారిపై యుద్ధం దిశగా తక్షణ వ్యయాలను భరించడం కోసం మేం కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశాం. మా వనరులు- మందులు, పీపీఈ కిట్లు, పరీక్ష పరికరాలు, తదితరాలను పంచుకున్నాం. అన్నిటికీ మించి మన ఆరోగ్య కార్యకర్తలకు సంయుక్త శిక్షణద్వారా అత్యంత విలువైన- విజ్ఞానాన్ని మనం పంచుకున్నాం. వెబినార్లు, ఆన్‌లైన్‌ కోర్సులు, ఐటీ పోర్టళ్ల ద్వారా మన అనుభవాలను పంచుకున్నాం. రోగనిర్ధారణ పరీక్షలు, వ్యాధి నియంత్రణ, ఔషధ వ్యర్థాల నిర్వహణ తదితరాలపై పరస్పర ఉత్తమాచరణల నుంచి నేర్చుకున్నాం. మనకు ఉత్తమమైనదానిపై కృషి చేయడంద్వారా మనకంటూ ఉత్తమ ఆచరణలను రూపొందించుకున్నాం. ఈ విజ్ఞాన, అనుభవ సమీకరణకు మనలో ప్రతి ఒక్కరం అపారంగా కృషిచేశాం.

మిత్రులారా,

   మహమ్మారి బారి నుంచి బయటపడటంలో సంయుక్త కృషి స్ఫూర్తి ఎంతో విలువైనది. దాపరికంలేని మన తత్వం, దీక్ష తోడ్పాటుతో మరణాలను ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలో ఉంచగలిగాం. ఇందుకు మనమంతా అభినందనీయులమే. ఇవాళ మన ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచమంతా టీకాల సత్వర అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ విషయంలోనూ మనం ఇదే సంయుక్త, సహకారాత్మక స్ఫూర్తిని కొనసాగిద్దాం

మిత్రులారా,

   గడచిన ఏడాది కాలంనుంచీ ఆరోగ్య రంగంలో కొనసాగుతున్న మన సహకారం ఇప్పటికే ఎంతో సాధించింది. ఇక మన లక్ష్యాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకుందామా? ఈ మేరకు నేటి మీ చర్చల కోసం కొన్ని సూచనలు చేసేందుకు నాకు అనుమతిని ఇవ్వండి:

   మన వైద్యులు, నర్సుల కోసం ప్రత్యేక వీసా ల సృష్టి ని పరిశీలించగలమా? ఈ సౌకర్యం ఉంటే ఆరోగ్య అత్యవసర స్థితిలో ఏ దేశమైనా సహాయం కోరినపుడు వారు మన ప్రాంతంలో వేగంగా ప్రయాణించి అందుబాటులోకి రాగలరు కదా?

   యాదృచ్ఛిక వైద్య అత్యవసర పరిస్థితులకు తగినట్లు ప్రాంతీయ విమాన అంబులెన్స్‌ ఒప్పందం కుదుర్చుకోవడంలో మన పౌర విమానయాన మంత్రిత్వశాఖలు సమన్వయం చేసుకోలేవా?

   మన జనాభా పై కోవిడ్‌-19 టీకా ల ప్రభావం పై సమాచారాన్ని కలబోయడం, సంకలనం చేయడం, అధ్యయనం కోసం ప్రాంతీయ వేదిక ను సృష్టించలేమా?

   అలాగే భవిష్యత్ మహమ్మారుల నివారణ దిశ గా సాంకేతిక-తోడ్పాటు గల సాంక్రమిక వ్యాధి విజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రాంతీయ నెట్‌వర్క్‌ సృష్టించలేమా?

   ఇక కోవిడ్‌-19 తరువాత విజయవంతమైన మన ప్రజారోగ్య విధానాలు, పథకాలను పంచుకోలేమా? ఈ ప్రాంతం లోని మిత్ర దేశాలకు భారత్‌ నుంచి మా ఆయుష్మాన్‌ భారత్‌, జనారోగ్య పథకంఉపయోగకర అధ్యయనానికి ఉదాహరణలు కాగలవు. ఇటువంటి సహకారం ప్రాంతీయంగా ఇతర రంగాల్లోనూ మరింత లోతైన సమష్టి కృషికి మార్గం కాగలదు. మనముందు- వాతావరణ మార్పు; ప్రకృతి విపత్తులు, పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక-లింగ అసమతౌల్యం వంటి ఉమ్మడి సవాళ్లెన్నో ఉన్నాయి. అయితే, శతాబ్దాలుగా ప్రజల నడుమ సౌహార్దత, సాంస్కృతిక సంబంధాల రూపేణా మన దేశాలకు అపారశక్తి కూడా అందుబాటులో ఉంది. వీటన్నిటిపైనా దృష్టి సారిస్తే మనమంతా ఏకం కావడానికి అవే దోహదం చేస్తాయి. తద్వారా మన ప్రాంతం ప్రస్తుత మహమ్మారి నుంచి బయటపడటమేగాక, మన ఇతర సవాళ్లు కూడా పరిష్కారం కాగలవు.

మిత్రులారా,

   ఈ 21వ శతాబ్దం ఆసియాకు చెందినది కావాలంటే దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ద్వీప దేశాల మధ్య మరింత ఏకీకరణ తోనే అది సాధ్యం.  అయితే, ఇటువంటి ఏకీకరణ సాధ్యమేనని మహమ్మారి వ్యాప్తి సమయం లో మీరంతా చూపిన ప్రాంతీయ సంఘీభావ స్ఫూర్తి స్పష్టం చేస్తోంది.  ఈ నేపథ్యం లో నేడు ఫలప్రదమయ్యే చర్చ లు జరగాలి అని కోరుకొంటూ మీకందరికీ మరో మారు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

***