కరోనాపై పోరాటం సమయంలో దేశ ప్రజలు బలమైన నిస్వార్ధ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్యక్రమాన్నిఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన సంవత్సరంలో భారతీయులు వ్యక్తులుగా, కుటుంబాలుగా, ఒక దేశంగా ఎంతో నేర్చుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు మాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మనం ఎప్పుడూ నిస్వార్ధంగా ఇతరుల కోసం పనిచేయాలన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవిగురజాడ సూక్తిని ఆయన ప్రస్తావించారు. దేశమంటి మట్టి,బండరాళ్లు,నీళ్లు కాదని భారత ప్రజలమైన మేము అన్న సంఘటిత భావన దేశాన్ని ఉ న్నతంగా నిలబెడుతుందని ప్రధానమంత్రి అన్నారు. కరోనాపై పోరాటాన్ని దేశం ఈ స్ఫూర్తితో సాగించిందని ప్రధానమంత్రి అన్నారు.
కరోనా వచ్చిన తొలి రోజులలో ఈ వ్యాధి బారిన పడిన తమ వారిని కూడా కలుసుకోలేని నిస్సహాయ పరిస్థితి, అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్న రోజులను ప్రధానమంత్రి బాధాతప్త హృదయంతో గుర్తు చేసుకున్నారు. ఈ మహమ్మారి బారిన పడినవారు ఒంటరి తనం అనుభవించాల్సి వచ్చిందన్నారు. ఈ వైరస్ బారిన పడిన చిన్నపిల్లలు తల్లులకు దూరం అయ్యారని, వయోధికులు ఒంటరిగా ఆస్పత్రులలో ఉండి ఈ వైరస్‌పై పోరాడాల్సి వచ్చిందని అన్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి బంధువులు తుది వీడ్కోలుపలకలేని పరిస్థితి కూడా ఏర్పడిందని ప్రధాని గుర్తుచేశారు. ఇలాంటి జ్ఞాపకాలు ఇప్పటికీ వెన్నంటుతున్నాయని ప్రధానమంత్రి బాధాతప్త హృదయంతో అన్నారు.
కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న ఆ చీకటి రోజులలో కూడా కొందరు ప్రజలు ఆశను, ధైర్యాన్ని ఇచ్చి ఇతరులకు ఊరటనిచ్చారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్సిబ్బంది, అంబులెన్సు డ్రైవర్లు , పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశా వర్కర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. వారు వ్యక్తిగత ప్రయోజనాలనుపక్కన పెట్టి తమ విధులను మానవాళి కోసం నిర్వర్తించారని ప్రధానమంత్రి కొనియాడారు. వీరిలో కొంతమంది తిరిగి తమ ఇళ్లకు కూడా వెళ్లలేక పోయారని, కరోనా వైరస్‌పై పోరాటంలో వారు తమ ప్రాణాలు కోల్పోయారని ప్రధానమంత్రి బాధాతప్త హృదయంతో అన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు భయం,నిరాశాపూరిత వాతావరణంలో ఒక ఆశను కల్పించారని ప్రధాని అన్నారు. వీరికి ఇవాళ వాక్సిన్ అందించడం ద్వారా దేశం వారి సేవలను గుర్తించి వారిపట్ల తన కృతజ్ఞతను చాటుకుంటున్నదని ప్రధానమంత్రి అన్నారు.
*****