Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పూర్తిపాఠం

80వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పూర్తిపాఠం


నమస్కారం,
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాజీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీజీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ జీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ మేఘ్వాల్ జీ, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ, దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రిసైడింగ్ అధికారులు, ప్రముఖులు, సోదర, సోదరీమణులారా..
నర్మదానది ఒడ్డున, సర్దార్ పటేల్ విగ్రహ సమీపంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరగడం సంతోషకరం. నాతోటి భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మన:పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ రాజ్యాంగ దినోత్సవంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారుల సదస్సు కూడా జరగడం ముదావహమన్నారు. దీంతోపాటుగా ప్రిసైడింగ్ అధికారుల సదస్సుకు వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ కీలకమైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
రాజ్యాంగ సభలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా ముఖ్య సభ్యులందరినీ గుర్తుచేసుకోవాల్సిన దినమిది. వారందరి నిరంతర శ్రమ కారణంగానే.. మనందరికీ ఇంత చక్కటి రాజ్యాంగం మనకు అందుబాటులోకి వచ్చింది. మహాత్మాగాంధీ స్ఫూర్తికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధతను గౌరవించుకుని నమస్కరించే రోజు ఇది. అలాంటి ఎందరో నాయకులు స్వాతంత్ర్య భారతానికి బలమైన పునాదిని వేయడంలో త్యాగాలు చేశారు. వీరందరి త్యాగాలను గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఐదేళ్ల క్రితం రాజ్యాంగదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కీలకమైన ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడి కూడా ఈ రోజే  జరిగింది. 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ దేశాలకు చెందిన వారు కూడా చనిపోయారు. ఈ సందర్భంగా ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈ దాడిలో ఎందరోమంది పోలీసు వీరులు అమరులయ్యారు. వారికి కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ముంబై దాడి గాయాలను భారతదేశం ఎన్నటికీ మరిచిపోదు. నేటి భారతం ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు కొత్త విధానం, సరికొత్త మార్గాల్లో ముందుకెళ్తోంది. ముంబై దాడులవంటి కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ.. శత్రుమూకలకు ధీటైన సమాధానం ఇస్తున్న మన భద్రతా బలగాలకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రిసైడింగ్ అధికారులుగా ప్రజాస్వామ్యంలో మీ పాత్ర కీలకం. సామాన్య ప్రజలను, రాజ్యాంగాన్ని అనుసంధానం చేయడంలో ప్రిసైడింగ్ అధికారులుగా మీ పాత్ర ప్రముఖమైనది. మీరు ఎమ్మెల్యేతోపాటు.. సభలో స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. అందుకే మీరు రాజ్యాంగంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల వ్యవస్థల మధ్య కీలమైన సమన్వయానికి మీ వారథులు. ఈ సదస్సులో మీరు దీని గురించి కూలంకశంగా చర్చించారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో న్యాయవవ్యస్థ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. కానీ స్పీకర్ అనే వ్యక్తి చట్టాల రూపకల్పనకు కీలకమైన వ్యక్తి. అందుకే స్పీకర్‌ను రాజ్యాగ భద్రతావలయానికి తొలి కాపలాదారుడు.
మిత్రులారా,
ఈ మూడు విభాగాలు నిర్వర్తించాల్సిన విధులను రాజ్యాంగంలోనే చక్కగా వివరించారు. 1970లో ఈ విధుల్లోనుంచి ఒక భాగానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని మనమంతా చూశాం. దానికి కూడా పరిష్కారం రాజ్యాంగంలోనుంచే లభించింది. వాస్తవానికి అత్యవసర పరిస్థితి తర్వాత వ్యవస్థలోని నియంత్రణ, సంతులనం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతోంది. ఈ ఘటన తర్వాత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సరికొత్త పాఠాలను నేర్చుకుని ముందుకెళ్తున్నాయి. ఈ పాఠాలు నేటికీ సందర్భోచితంగానే ఉంటాయి. గత ఐదారేళ్లుగా ఈ మూడు విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఈ ప్రయత్నాలు.. ప్రజావిశ్వాసంపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. కఠినమైన, విపత్కర పరిస్థితుల్లోనే ఈ మూడు వ్యవస్థలపై ప్రజల విశ్వాసం కొనసాగుతుంది. కరోనా మహమ్మారి సందర్భంగా ఈ పరిస్థితిని మనం గమనించాం. 130కోట్ల మంది భారతీయులు రాజ్యాంగంలోని ఈ మూడు వ్యవస్థలపై నమ్మకాన్ని చూపించారు. ఈ విశ్వాసాన్ని పెంపొందించడంలో నిరంతర ప్రయత్నాలు జరిగాయి.
జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంటు ఉత్సాహంగా, చిత్తశుద్ధితో చేస్తున్న చట్టాలు.. ఆత్మనిర్భర భారత నిర్మాణం కోసం కరోనా సమయంలోనూ తీసుకొచ్చిన కీలకమైన చట్టాలు అనన్యసామాన్యమైనవి, అపూర్వమైనవి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పార్లమెంటు ఉభయసభలు పనిచేశాయి. వారి వేతనాలను తగ్గించుకునేందుకు అంగీకరించడం ద్వారా పార్లమెంటేరియన్లు తమ చిత్తశుద్ధిని, అంకితభావాన్ని చాటుకున్నారు. చాలా రాష్ట్రాల్లో కూడా చట్టసభ్యులు తమ వేతనాలను తగ్గించుకుని కరోనాపై పోరాటానికి తమవంతు సహాయాన్ని అందించారు. ఈ ప్రయత్నాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కరోనా సమయంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేవిగా ఉన్నాయి.
మిత్రులారా,
కరోనా సమయంలో ప్రపంచం మొత్తం మన ఎన్నికల వ్యవస్థ బలాన్ని చూసింది. ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం, సరైన సమయానికి ఫలితాల వెల్లడి, ఎలాంటి సమస్యల్లేకుండా కొత్త ప్రభుత్వాల ఏర్పాటు జరగడం  అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. రాజ్యాంగం నుంచి మనం పొందిన ఈ శక్తే మనందరి జీవితాల్లోని కష్టాలను సులభతరం చేస్తోంది. 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం కనుగొనడంతోపాటు కొత్త తరాన్ని ముందుకు నడిపించడంలో మన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లడం మనందరి బాధ్యత.
భారత రాజ్యాంగం 75 వసంతలను పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇదే విధంగా మన స్వాతంత్ర్యానికి కూడా 75 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సమయంలో మన అవసరాలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పుల చేసుకుంటూ మన చిత్తశుద్ధిని చాటుకునే సమయం ఇది. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చక్కటి సమన్వయంతో సామరస్యంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగంలోని మూడు విభాగాలపై ఉంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం జాతి ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకునే జరగాలి. దేశహితమే మనకు సర్వోన్నతం కావాలి. ప్రజాప్రయోజనాలు, దేశ హితంపై మన రాజకీయాలు పైచేయి సాధించే పరిస్థితి తలెత్తినపుడు దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే విషయాన్ని మనమంతా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఆలోచిస్తున్నపుడు దాని దుష్ప్రభావం ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా దీనికి ఓ పెద్ద ఉదాహరణ.
మిత్రులారా,
కెవాడియా పర్యటన సందర్భంగా సర్దార్ సరోవర్ డ్యామ్ విస్తీర్ణం, వైభవం, శక్తిని మీరు గమనించే ఉంటారు. కానీ ఈ డ్యామ్ పని ఏళ్ల పాటు ఆగిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలోనే ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ దాదాపు దేశ స్వాతంత్ర్యానికి దాదాపుగా 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసుకుంటూ.. పదే పదే అడ్డంకులు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాల కారణంగానే ప్రజాప్రయోజనాలకోసం ఉద్దేశించిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. నేడు గుజరాత్ ప్రజలతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు ఈ డ్యామ్ వల్ల లబ్ధి పొందుతున్నారు. గుజరాత్‌లోని 10 లక్షల హెక్టార్లు, రాజస్థాన్‌లోని 2.5 లక్షల హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. కేవలం సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కారణంగానే గుజరాత్‌లోని 9వేలకు పైగా గ్రామాలు, రాజస్థాన్, గుజరాత్‌ల్లోని పలు పట్ణణాలకు తాగునీరు అందుతోంది.
నీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి.. దీనికి సంబంధించిన ఓ విషయం నాకు గుర్తొచ్చింది. నర్మద జలాలకోసం ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. కానీ పలు కఠినమైన పరిస్థితుల అనంతరం.. శ్రీ భైరాన్‌సింగ్ షెకావత్ జీ, శ్రీ జస్వంత్ సింగ్ జీ గాంధీనగర్‌లో నాతో సమావేశమైన తర్వాతే ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. వారు మొదట మాట్లాడి కలుద్దాం అన్నప్పుడు.. ఏమైనా ముఖ్యమైన అంశమా అని అడిగాను. దానికి.. వ్యక్తిగతంగా మాట్లాడదామని వారు చెప్పారు. వారు వచ్చి నన్ను కలిసి వారి ఆశీస్సులు అందించిన తర్వాత.. ఇంత అత్యవసరంగా సమావేశానికి కారణమేంటని అడిగినపుడు.. చుక్క నీటికోసం రెండు కుటుంబాలు విడిపోయిన చరిత్రను కూలంకషంగా వివరించారు. గుజరాత్‌నుంచి ఎలాంటి పోరాటం లేకుండా రాజస్థాన్ లోని బీడు భూములకు నర్మదా నది నీరు చేరడాన్ని చెబుతూ.. తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మీరే చెప్పండి.. ఈ ప్రయత్నం ముందుగానే జరిగి ఉంటే.. ఎలా ఉండేది. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యు్త్తు వల్ల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చాలా లబ్ధిపొందుతున్నాయి.

***