Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ప్రారంభ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం


మిత్రులారా,
లాంఛ‌న‌ప్రాయంగా ఈ ప‌థ‌కం ప్రారంభించ‌డానికి ముందు నేను ఖ‌గారియాలోని నా సోద‌ర‌సోద‌రీమ‌ణుల‌తో మాట్లాడుతున్నాను.

మీ అంద‌రితో మాట్లాడ‌డం ఈ రోజు నాకు ఎంతో  ఊర‌ట‌గా, సంతృప్తిక‌రంగా ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా సంక్షోభం  ప్రారంభ‌మైన‌ప్పుడు కేంద్ర‌ప్ర‌భుత్వం, రాష్ట్రప్ర‌భుత్వాలు మీ అంద‌రి గురించి ఎంతో ఆందోళ‌న చెందాయి. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు ఎక్క‌డుంటే అక్క‌డికే స‌హాయం అందించ‌డం జ‌రిగింది. కాని సోద‌ర‌సోద‌రీమ‌ణులారా వ‌ల‌స కార్మికులంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేర‌డానికి శ్రామిక్ స్పెష‌ల్ రైళ్ల‌ను మేం ప్రారంభించాం.

నిజంగా ఈ రోజున మీ అంద‌రితో మాట్లాడిన త‌ర్వాత మీలోని శ‌క్తితో నాలో ఎంతో తాజాద‌నం నిండిన భావ‌న ఏర్ప‌డింది. మీ ప‌ట్ల గౌర‌వం, విశ్వాసం క‌లిగాయి. క‌రోనా మ‌హ‌మ్మారి వంటి క‌నివిని ఎరుగ‌ని సంక్షోభం ప్ర‌పంచం యావ‌త్తును వ‌ణికించిన స‌మ‌యంలో మీరంతా ఎంతో దృఢంగా నిలిచారు. క‌రోనాకు వ్య‌తిరేకంగా గ్రామాల్లో జ‌రిగిన పోరాటం దేశంలోని న‌గ‌రాల‌కు అత్యంత ప్ర‌ధాన‌మైన పాఠం నేర్పింది.

ఒక్క సారి ఊహించండి! మ‌న‌దేశంలో 6 ల‌క్ష‌ల‌కు పైగా గ్రామాలున్నాయి. జ‌నాభాలో మూడింట రెండు వంతుల మంది అంటే సుమారు 80 నుంచి 85 కోట్ల మంది గ్రామాల్లోనే నివ‌శిస్తున్నారు. గ్రామీణ భారతంలో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌కుండా మీరంద‌రూ నిరోధించ‌గ‌లిగారు. మ‌న దేశంలో గ్రామీణ జ‌నాభా మొత్తం యూర‌ప్ దేశాల‌న్నింటి జ‌నాభా క‌న్నా అధికం. మొత్తం అమెరికా, ర‌ష్యా, ఆస్ర్టేలియా దేశాల‌న్నింటి జ‌నాభాను క‌లిపినా కూడా వాటి క‌న్నా గ్రామీణ భార‌త జ‌నాభానే అధికం. ఇంత పెద్ద జ‌నాభా ఎంతో ధైర్యంతో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌కుండా విజ‌య‌వంతంగా పోరాడ‌డం అద్భుత‌మైన విజ‌యం. ప్ర‌తీ ఒక్క భార‌తీయుడు ఈ విజ‌యం ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నాడు. గ్రామీణ భార‌తంలో గ‌ల చైత‌న్య‌మే  ఈ విజ‌యం వెనుక గ‌ల కార‌ణం. పంచాయ‌తీ రాజ్ వ‌ర‌కు విస్త‌రించిన మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌, మ‌న వైద్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, స్వ‌చ్ఛ‌తా ప్ర‌‌చారం ఈ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి.

అంతే కాదు క్షేత్ర స్థాయిలో ప‌ని చేస్తున్న గ్రామ అధిప‌తులు, అంగ‌న్ వాడీ సిబ్బంది, ఆశా ప‌నివారు, జీవికా దీదీలు అంద‌రూ ప్ర‌శంస‌నీయ‌మైన కృషి చేశారు. వారంద‌రికీ నా అభినంద‌న‌లు.

మిత్రులారా,
ఇదే విజ‌యం ఒక పాశ్చాత్య దేశంలో సాధించిన‌ట్ట‌యితే అంత‌ర్జాతీయ స్థాయిలో ఆ విజ‌యంపై లోతుగా చ‌ర్చ జ‌రిగి విస్తృత‌మైన ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చి ఉండేవి.  కొంద‌రు ఇలాంటివి అంగీక‌రించ‌డానికి సిద్ధంగా ఉండ‌ర‌న్న విష‌యం మ‌న‌కి తెలిసిందే. అలాగే గ్రామీణ భార‌తాన్ని ప్ర‌శంసించిన‌ట్ట‌యితే తాము ప్ర‌పంచానికి ఏ జ‌వాబు చెప్పాల్సివ‌స్తుందో అని కొంద‌రు భావిస్తారు. కాని మీరు చూపిన సాహ‌సం, గ్రామీణుల జీవితాల‌ను వైర‌స్ నుంచి కాపాడేందుకు మీరు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌డిన శ్ర‌మ నిస్సందేహంగా ప్ర‌శంస‌నీయ‌మే. కాని కొంద‌రు మిమ్మ‌ల్ని వీపు త‌ట్టి ప్రోత్స‌హించేందుకు విముఖంగా ఉండ‌డం విచార‌క‌రం.

ఒక‌రు మ‌న‌ని వీపు త‌ట్టి ప్రోత్స‌హించారా, లేదా అన్న అంశంపై ప‌ని లేకుండా మీ అంద‌రినీ నేను అభినందిస్తూనే ఉంటాను. మీ అద్భుత‌మైన శ‌క్తి గురించి ప్ర‌పంచం ముందు మాట్లాడుతూనే ఉంటాను. అందుకే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించే ముందు భార‌తదేశంలోని గ్రామాలు, గ్రామీణులంద‌రికీ నేను అభివాదం చేస్తున్నాను.
దేశంలోని పేద‌వారు, కార్మికులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు అంద‌రి శ‌క్తికి నా శాల్యూట్‌. నా గ్రామాల‌న్నింటికీ శాల్యూట్‌. మ‌రో ముఖ్య విష‌యం మీకు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా వైర‌స్ ను గుర్తించేందుకు పాట్నాలో ఆధునిక ప‌రీక్షా యంత్రాలు కూడా ఎల్లుండి నుంచి ప‌ని చేయ‌బోతున్న‌ట్టు నా దృష్టికి తెచ్చారు. ఈ యంత్రం స‌హాయంతో ఒక్క రోజులోనే 1500 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు. ఈ అద్భుత‌మైన ప‌రీక్షా యంత్రాల‌ను పొందినందుకు బీహార్ ప్ర‌జ‌ల‌కు నా అభినంద‌న‌లు.

ఈ రోజు ఈ ప‌థ‌కం ప్రారంభ కార్య‌క్ర‌మంలో టెక్నాల‌జీ మాధ్య‌మంగా నాతో పాటుగా పాలు పంచుకుంటున్న నా కేబినెట్ స‌హ‌చ‌రులు; ముఖ్య‌మంత్రులు శ్రీ‌ నితీశ్ బాబు, శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, శ్రీ శివ‌రాజ్ జీ, శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ జీ; ఎంపిలు, ఎమ్మెల్యేలు అధికారులు, పంచాయ‌తీ ప్ర‌తినిధులు, ల‌క్ష‌లాది గ్రామాల్లో అవిశ్రాంతంగా శ్ర‌మిస్తున్న మిత్రులు అంద‌రికీ నా అభివాదాలు.

ఇది చారిత్ర‌క‌మైన దినం. పేద‌లు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఈ రోజున అతి పెద్ద కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతోంది. గ్రామాల్లో నివ‌శిస్తున్న‌ కార్మిక సోద‌రులు, సోద‌రీమ‌ణులు, యువ‌త‌, కుమార్తెలు  అంద‌రికీ ఇది అంకితం. వారిలో ఎక్కువ మంది లాక్ డౌన్ కార‌ణంగా ప‌ట్ట‌ణాల నుంచి సొంత గ్రామాల‌కు తిరిగి వ‌చ్చిన వారే. త‌మ‌కు గ‌ల నైపుణ్యాల‌ను ఉప‌యోగించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏదో ఒక‌టి చేయాల‌నే ఆకాంక్ష వారంద‌రిలోనూ ఉంది. తాము గ్రామాల్లో ఉన్నంత వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల పురోగ‌తికి స‌హాయ‌ప‌డాల‌నే త‌ప‌న వారంద‌రికీ ఉంది.

నా ప్రియ మిత్రులారా,
మీ అవ‌స‌రంతో పాటు మీ భావ‌న‌లు దేశం అర్ధం చేసుకుంది. దాన్ని సాకారం చేయ‌డానికి ఈ రోజున ఖ‌గారియా నుంచి గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ యోజ‌న ప్రారంభిస్తున్నాం. మొత్తం ఆరు రాష్ర్టాలు -బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ ల‌లో ని 116 జిల్లాల్లో దీన్ని ఉదృతంగా అమ‌లు ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా కార్మికులు, శ్రామికులంద‌రికీ వారు ఉంటున్న ప్ర‌దేశాల‌కు ద‌గ్గ‌ర‌లోనే ప‌నులు చూపించ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీ నైపుణ్యాలు, శ్ర‌మ‌శ‌క్తితో న‌గ‌రాల పురోభివృద్ధికి స‌హాయ‌ప‌డ్డారు. ఇప్పుడు అదే గ్రామాల‌ను పురోగ‌మింప‌చేసే ప‌ని మీరు చేప‌ట్ట‌వ‌చ్చు. మిత్రులారా, కొంద‌రు శ్రామికుల ద్వారానే నేను కార్య‌క్ర‌మం ప్రారంభించే స్ఫూర్తి పొందానంటే మీకు ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

మిత్రులారా,
నేను మీడియాలో ఒక వార్త చూశాను. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావ్ కు సంబంధించిన వార్త అది. అక్క‌డ ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల క్వారంటైన్ కేంద్రంగా మారింది. ప‌ట్ట‌ణాల నుంచి తిరిగి వ‌చ్చిన శ్రామికుల‌ను అక్క‌డ సేవ‌కు పెట్టారు. హైద‌రాబాద్ కు చెందిన శ్రామికుల‌ను అక్క‌డ నియ‌మించారు. వారంతా పెయింటింగ్‌, పిఓపి ప‌నిలో నిపుణులు. వారు త‌మ గ్రామం కోసం ఏదైనా చేయాల‌నుకున్నారు. తాము కాలం వృధా చేస్తున్నామ‌నే భావ‌న వారిలో క‌లిగింది. అలా వృధా చేయ‌డానికి బ‌దులు త‌మ నైపుణ్యాల‌ను ఉప‌యోగంలో పెట్టాల‌ని భావించారు. ఆ భావ‌న‌తోనే ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో నియ‌మితులైన స‌మ‌యంలో త‌మ నైపుణ్యాల‌ను ఉప‌యోగించి ఆ పాఠ‌శాల రూపాన్ని స‌రికొత్త‌గా మార్చి వేశారు.

నా ఈ వ‌ల‌స సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రి కృషి గురించి, వారి దేశ‌భ‌క్తి, నైపుణ్యాల గురించి విన్న త‌ర్వాత నాలో స్ఫూర్తి క‌లిగింది. వారంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల‌కు ఏదైనా చేయ‌గ‌ల శ‌క్తి సామ‌ర్థ్యాలు గ‌ల వారేన‌ని నేను గుర్తించాను. ఆ ఆలోచ‌న నుంచి ఉద్భ‌వించిందే ఈ స్కీమ్. ఎంత ప్ర‌తిభ ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల‌కు తిరిగి వ‌చ్చింది ఒక్క సారి ఊహించండి. వారి శ్ర‌మ‌శ‌క్తి, నైపుణ్యాలు ప‌ట్ట‌ణాల అభివృద్ధి, పురోగ‌తి వేగ‌వంతం అయిన‌ప్పుడు అదే శ‌క్తి ఖ‌గారియా వంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్త‌రిస్తే బీహార్ ఎంత‌గా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి.

మిత్రులారా,
గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద మీ గ్రామాల అభివృద్ధికి, మీకు ఉపాధి క‌ల్పించ‌డానికి రూ.50 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రుగుతుంది. ఈ ధ‌నంతో గ్రామాల్లో చేప‌ట్ట‌గ‌ల 25 అభివృద్ధి ప‌నుల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. ఈ 25 ప‌నులు లేదా ప్రాజెక్టుల‌న్నీ గ్రామీణ ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌రిచే మౌలిక స‌దుపాయాల‌తో ముడిప‌డి ఉన్న‌వే. మీ కుటుంబాల‌తో గ్రామాల్లో ఉన్న స‌మ‌యంలో ఈ ప‌నులు చేప‌ట్టే అవ‌కాశం మీకు క‌లుగుతోంది.

అందులో భాగంగానే ఈ రోజున ఖ‌గారియా జిల్లాకు చెందిన తెలిహార్ గ్రామంలో అంగ‌న్ వాడీ భ‌వ‌నాలు, సామాజిక మ‌రుగుదొడ్లు, గ్రామీణ మండిల నిర్మాణం, బావుల త‌వ్వ‌కం ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇప్పుడు గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ యోజ‌న ద్వారానే ఈ సౌక‌ర్యాలు ఏర్పాట‌వుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మం కింద గ్రామీణ పేద‌ల‌కు ప‌క్కా ఇళ్ల నిర్మాణం, ప‌శువుల‌కు షెడ్ల నిర్మాణం కూడా జ‌రుగుతుంది. చెట్లు నాటే ప‌నులు కూడా చేప‌డ‌తారు. గ్రామ స‌భ‌ల స‌హ‌కారంతో జ‌ల్ జీవ్ కార్య‌క్ర‌మం కింద మంచినీటి స‌దుపాయాలు క‌ల్పించే ప‌నులు కూడా చేప‌డ‌తారు.
వీటితో పాటు ఎక్క‌డ అవ‌స‌రం అయితే అక్క‌డ రోడ్ల నిర్మాణం, పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణం కూడా జ‌రుగుతుంది.

మిత్రులారా,
ఈ కార్య‌క్ర‌మం కింద గ్రామాల‌కు ఆధునిక వ‌స‌తుల అనుసంధాన‌త కూడా క‌లుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి న‌గ‌రాల్లో ఇంట‌ర్నెట్ వ‌స‌తి అందుబాటులో ఉన్న‌ట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌కి వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ స‌దుపాయం ఎంతో అవస‌రం. మ‌న గ్రామాల్లోని బాల‌బాలిక‌లంద‌రికీ చ‌క్క‌ని విద్య కూడా ఎంతో ప్ర‌ధానం. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల అవ‌స‌రాల‌న్నింటినీ గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ యోజ‌న‌కు అనుసంధానం చేశాం. న‌గ‌రాల క‌న్నా అధికంగా గ్రామాల్లో ఇంట‌ర్నెట్ వినియోగంలో ఉండ‌డం దేశ చ‌రిత్ర‌లోనే ప్ర‌థ‌మం. అందుకు దీటుగానే గ్రామాల్లో ఇంట‌ర్నెట్ స్పీడ్ పెంపు, ఫైబ‌ర్ కేబుళ్ల నిర్మాణం వంటివి చేప‌డుతున్నారు.

మిత్రులారా,
ఈ ప‌నుల‌న్నీ ఎవ‌రు చేస్తున్నారు?  కేవ‌లం గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లే చేప‌డుతున్నారు. నా శ్రామిక సోద‌రులంద‌రూ చేస్తున్నారు. కార్మికులు, మెకానిక్ లు, నిర్మాణ సామ‌గ్రి విక్ర‌యించే చిన్న దుకాణ‌దారులు, డ్రైవ‌ర్లు, ప్లంబ‌ర్లు, ఎల‌క్ర్టీషియ‌న్లు వంటి మిత్రులంద‌రికీ దీని వ‌ల్ల ఉపాధి ల‌భిస్తుంది. అలాగే సోద‌రీమ‌ణులంద‌రినీ స్వ‌యంస‌హాయ‌క బృందాల‌తో అనుసంధానం చేయ‌డం వ‌ల్ల వారు కూడా కుటుంబాల‌కు అద‌న‌పు వ‌న‌రులు సంపాదించుకోగ‌లుగుతారు.

మిత్రులారా,
కార్మికులంద‌రి నైపుణ్యాల మ్యాపింగ్ ప‌ని కూడా ప్రారంభ‌మ‌యింది. అంటే గ్రామీణ స్థాయిలోనే మీ నైపుణ్యాల‌ను గుర్తించ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా మీ నైపుణ్యానికి అనుగుణంగా మీకు ప‌ని ల‌భిస్తుంది. మీకు తెలిసిన ప‌ని చేయించుకునేందుకు ప్ర‌జ‌లే మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు.

మిత్రులారా,
క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న స‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల్లో నివ‌శించే మీరు ఎవ‌రి ద‌గ్గ‌ర అప్పు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా అన్ని జాగ్ర‌త్త‌లు ప్ర‌భుత్వం తీసుకుంది. పేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని మేం అర్ధం చేసుకున్నాం. స‌త్య‌మేవ జ‌య‌తే అనే  నానుడికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా మీరు నిలుస్తారు. మీకు ప‌నులు కావాలి, మీకు ఉపాధి కావాలి. ఆ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకునే ప్ర‌భుత్వం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసి అమ‌లులోకి తెచ్చింది. అంత‌క‌న్నా ముందే లాక్ డౌన్ ప్రారంభ స‌మ‌యంలోనే కోట్లాది మంది దేశ‌వాసుల త‌క్ష‌ణ అవ‌స‌రాలు తీర్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది.

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌తో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌యింది. మేం పేద‌ల కోసం ఈ ప‌థ‌కం ప్రారంభించిన తొలి రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల సంగ‌తేమిటి?  వ్యాపారాల ప‌రిస్థితి ఏమిటి?  ఎంఎస్ఎంఇలకు ఏం జ‌రుగుతుంది?  వంటి గ‌గ్గోలు స‌ర్వ‌త్రా వినిపించింది. ఎంద‌రో న‌న్ను విమ‌ర్శించారు. కాని సంక్షోభ స‌మ‌యంలో పేద‌ల‌ను చేయి ప‌ట్టుకు న‌డిపించ‌డం ప్ర‌ధానం అని నాకు తెలుసు. ఆ త‌ర్వాత కొద్ది వారాల వ్య‌వ‌ధిలోనే రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు ఆ ప‌థ‌కంపై ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది.

ఈ మూడు నెల‌ల కాలంలో 80 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు రేష‌న్ లో ప‌ప్పుల పంపిణీ జ‌రిగింది. రేష‌న్ తో పాటుగా వారికి ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు కూడా అందించాం. అలాగే 20 కోట్ల మంది త‌ల్లులు, సోద‌రిల జ‌న్ ధ‌న్‌ ఖాతాల్లోకి  రూ.10 వేల కోట్ల‌కు పైగా బ‌దిలీ చేయ‌డం జ‌రిగింది. పేద‌లు, వృద్ధులు, త‌ల్లులు, సోద‌రీమ‌ణులు, దివ్యాంగుల ఖాతాల్లోకి రూ.1000 వంతున ఆర్థిక స‌హాయం నేరుగా బ‌దిలీ చేయ‌డం జ‌రిగింది.
ఒక్క‌సారి ఊహించండి.

జ‌న్ ధ‌న్ ఖాతాలు గ‌నుక తెరిచి ఉండ‌క‌పోతే, ఆ ఖాతాల‌ను ఆధార్ కార్డులు, మొబైల్ నంబ‌ర్ల‌తో అనుసంధానం చేయ‌క‌పోయి ఉంటే ఏం జ‌రిగి ఉండేది?  పాత కాలం నాటి స్మృతులు మీకు గుర్తుండే ఉంటాయి. మీ పేర్ల మీద డ‌బ్బు ఖ‌ర్చు చేసి ఉండ‌వ‌చ్చు. కాని అది ఎన్న‌డూ మీకు చేర‌లేదు.

ఈ రోజున అదంతా మారిపోయింది. ప్ర‌భుత్వ రేష‌న్ దుకాణాల ద్వారా మీరు ఎలాంటి అవ‌రోధాలు లేకుండా ఆహార‌ధాన్యాలు పొంద‌డానికి వీలుగా ఒక జాతి, ఒక రేష‌న్‌కార్డు ప‌థ‌కం అమ‌లులోకి తెచ్చాం. దీని ద్వారా పేద సోద‌ర‌సోద‌రీమ‌ణులంద‌రూ దేశంలోని ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ న‌గ‌రంలో అయినా ఒకే రేష‌న్ కార్డు ఉప‌యోగించుకునే అవ‌కాశం క‌లిగింది.

మిత్రులారా,
స్వ‌యంస‌మృద్ధ భార‌తానికి స్వ‌యం స‌మృద్ధ రైతులు కూడా ఎంతో అవ‌స‌రం. కాని ఎన్నో సంవ‌త్స‌రాలుగా దేశంలోని వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ‌దారులు అన‌వ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు, చ‌ట్టాల ఉచ్చులో చిక్కుకుపోయి ఉన్నారు. నా ముందు కూచుని ఉన్న రైతు సోద‌రులంద‌రూ ఎన్నో సంవత్స‌రాల పాటు నిస్స‌హాయులం అని భావించుకునే వారు.

తాము పంట‌ను ఎక్క‌డ విక్ర‌యించుకోవాలి అని నిర్ణ‌యించుకునే హ‌క్కు వారికి అందించ‌లేదు. త‌మ పంట‌ను నిల్వ చేసుకోవ‌చ్చునా లేదా అనేది కూడా వారికి తెలియ‌దు. రెండు వారాల క్రితం మేం ఈ వివ‌క్షాపూరిత‌మైన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశాం. ఇప్పుడు రైతు త‌న పంట ఎక్క‌డ విక్ర‌యించాల‌నేది ప్ర‌భుత్వం గాని, అధికారులు గాని నిర్ణ‌యించ‌రు. రైతు స్వ‌యంగానే నిర్ణ‌యించుకుంటాడు.

ఈ రోజున రైతు త‌న పంట‌ను ఏ రాష్ట్రంలో అయినా,  ఏ మార్కెట్ లో అయినా  విక్ర‌యించుకోవ‌చ్చు.  ఈ రోజున మీరు మీ ఉత్ప‌త్తుల‌కు మంచి ధ‌ర పొంద‌డానికి ట్రేడ‌ర్లు, కంపెనీల‌తో నేరుగా అనుసంధానం కావ‌చ్చు లేదా నేరుగానే అమ్ముకోవ‌చ్చు. పంట‌లు నిల్వ చేసుకోవ‌డాన్ని నిషేధించిన చ‌ట్టం కూడా ఈ రోజు మారింది.

మిత్రులారా,
ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజి కింద రైత‌న్న‌లు త‌మ ఉత్ప‌త్తులు నిల్వ చేసుకునేందుకు శీత‌ల గిడ్డంగుల నిర్మాణానికి రూ. ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు కేటాయించాం. దీని వ‌ల్ల రైతులు నేరుగా మార్కెట్ తో అనుసంధానం అయ్యే అవ‌కాశం క‌లిగింది. రైతు మార్కెట్ తో నేరుగా అనుసంధానం అయిన‌ప్పుడు త‌న పంట‌ను అధిక ధ‌ర‌కు విక్ర‌యించుకోగ‌లుగుతాడు.

“ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్”లో మ‌రో ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యం గురించి కూడా మీరు వినే ఉంటారు. మీ గ్రామాల‌కు చేరువ‌లోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనే భిన్న‌మైన పంట దిగుబ‌డుల‌తో స్థానికంగానే ఉత్ప‌త్తుల‌ త‌యారీ, ప్యాకేజింగ్ వ‌స‌తుల కోసం పారిశ్రామిక క్ల‌స్ట‌ర్ల నిర్మాణం జ‌రుగుతోంది. ఇది కూడా రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

ఖ‌గారియాలో మొక్క‌జొన్న ఇతోథికంగా ఉత్ప‌త్తి అవుతుంది. అలాంటి రైతులు మొక్క‌జొన్న ఉత్ప‌త్తులు త‌యారుచేసే కంపెనీలతో అనుసంధానం అయిన‌ట్ట‌యితే, ఖ‌గారియాకు చెందిన మొక్క‌జొన్న‌తో స్థానికంగా ఉత్ప‌త్తులు త‌యార‌యితే వారి లాభాలు ఎంతో పెరుగుతాయి.  అదే విధంగా బీహార్ లో మ‌ఖానా, లీచ్‌, అర‌టి కూడా అధికంగా పండిస్తారు. అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మామిడి; రాజ‌స్తాన్ లో మిర్చి;  మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పప్పులు; ఒడిశా, జార్ఖండ్ ల‌లో అట‌వీ ఉత్ప‌త్తులు అధికంగా అందుబాటులో ఉంటాయి. అలాగే వివిధ జిల్లాల్లో అధికంగా ఉత్ప‌త్తి అయ్యే స్థానిక ఉత్ప‌త్తులు ఎన్నో ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఆయా ప్ర‌దేశాల‌కు స‌మీపంలో స్థానిక ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం అయ్యాయి.

మిత్రులారా,
గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా నిరంత‌రాయంగా జ‌రుగుతున్న ఈ ప్ర‌య‌త్నాల‌న్నింటి ల‌క్ష్యం ఒక్క‌టే. మ‌న గ్రామాలు, పేద‌లు స్వ‌తంత్రం, శ‌క్తివంతం కావ‌డం. పేద‌లు, కార్మికులు, రైతులు వెలుప‌లి మ‌ద్ద‌తు కోసం ఏ మాత్రం ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌కూడ‌దు. వాస్త‌వానికి మ‌నంద‌రం ఎలాంటి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేని విధంగా శ్ర‌మ‌శ‌క్తి ఆధారంగా గౌర‌వంతో బ‌త‌కాల‌నే భావిస్తాం.

గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఆత్మ‌గౌర‌వానికి ర‌క్ష‌ణ క‌లుగుతుంది. మీ శ్ర‌మ‌శ‌క్తి మీ గ్రామాభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది.  ఈ రోజున మీ ఈ సేవ‌కుడు దేశం యావ‌త్తుతో క‌లిసి అదే ఆలోచ‌న‌తో, మీ ఆత్మ‌గౌర‌వాన్ని ప‌రిర‌క్షించే సంక‌ల్పంతో ప‌ని చేస్తున్నాడు.

మ‌రో ముఖ్య విష‌యం. మీరు ప‌నుల‌కు వెళ్లే ముందు అవ‌స‌ర‌మైన అన్ని ముందు జాగ్ర‌త్తలు పాటించండి. మాస్కులు ధ‌రించ‌డం లేదా మీ ముఖం మొత్తం ఒక వ‌స్త్రంతో క‌ప్పి ఉండేలా చూసుకోవ‌డం, క‌నీస పారిశుధ్యం పాటించ‌డం, సామాజిక దూరం ఆచ‌రించ‌డం వంటివ‌న్నీ అనుస‌రించాల‌ని నేను అభ్య‌ర్థిస్తున్నాను.  ఈ జాగ్ర‌త్త‌లు మీరు పాటించిన‌ట్ట‌యితే మీ గ్రామానికి, మీ ఇంటికి కూడా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. మీ జీవితాలు, జీవ‌నోపాధికి ఇది అత్యంత ప్ర‌ధానం.

మీరంతా ఆరోగ్యంగా ఉండి పురోగ‌మ‌న ప‌థం కొన‌సాగిస్తారు గాక‌. మీతో పాటు దేశం కూడా పురోగ‌మించుగాక‌. ఈ ఆకాంక్ష‌ల‌తో మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. గౌర‌వ ముఖ్య‌మంత్రుల‌కు ప్ర‌త్యేకించి బీహార్ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు. ఈ కీల‌క‌మైన ప‌థ‌కాన్ని రూపొందించడం, ముందుకు తీసుకెళ్ల‌డంలో మీరు అందించిన మ‌ద్ద‌తు అత్యంత అభినంద‌నీయం. మ‌రోసారి ధ‌న్య‌వాదాలు.