Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-20 సదస్సు నేపథ్యంలో “భూగోళం పరిరక్షణ : సి.ఎస్.ఐ. విధానం” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం

జి-20 సదస్సు నేపథ్యంలో “భూగోళం పరిరక్షణ : సి.ఎస్.ఐ. విధానం”  అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం


గౌరవనీయులైన దేశాధినేతలారా !

ఈ రోజు, మనం, ప్రపంచ మహమ్మారి ప్రభావాల నుండి మన పౌరులను, మన ఆర్థిక వ్యవస్థలను రక్షించడంపై దృష్టి కేంద్రీకరించాము. అదే సమయంలో, వాతావరణ మార్పులపై పోరాడటానికి మన దృష్టిని కేంద్రీకరించడం కూడా అంతే ముఖ్యం.  వాతావరణ మార్పు అనేది కేవలం భూ సంబంధమైన విషయంగా మాత్రమే కాకుండా సమగ్రమైన, విస్తృతమైన, సంపూర్ణ మార్గంలో పోరాడాలి.  పర్యావరణానికి అనుగుణంగా మన సాంప్రదాయ జీవన విధానాలతో పాటు, నా ప్రభుత్వం యొక్క నిబద్ధతతో ప్రేరణ పొందిన భారతదేశం తక్కువ స్థాయి కార్బన్ మరియు వాతావరణ-స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులను అనుసరించింది.

భారతదేశం మన పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని మించిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.  భారతదేశం అనేక విషయాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంది. మేము ఎల్.ఈ.డి. దీపాలకు ప్రాచుర్యం కల్పించాము.  ఇది సంవత్సరానికి 38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది.  మా ఉజ్జ్వల పథకం ద్వారా 80 మిలియన్ల గృహాలకు పొగ లేని పొయ్యిలను సమకూర్చడం జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద స్వచ్ఛ ఇంధన కార్యక్రమాలలో  ఇది ఒకటి.

ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) ‌లను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి;   మా అటవీ ప్రాంతం పరిధి విస్తరిస్తోంది;  సింహాలు, పులుల సంఖ్య పెరుగుతోంది;  2030 సంవత్సరానికి 26 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము;  మేము వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాము. మెట్రో రైలు మార్గాలు, జల మార్గాలు వంటి అనేక రేపటి తరం మౌలిక సదుపాయాలను భారతదేశం తయారు చేస్తోంది.  సౌలభ్యం మరియు సామర్థ్యంతో పాటు, ఇవి, పరిశుభ్రమైన వాతావరణానికి కూడా దోహదం చేస్తాయి.  175 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి ని 2022 లోపు చేరుకోవాలనే లక్ష్యాన్ని అంతకంటే ముందే చేరుకుంటాము.  ఇప్పుడు, మేము 2030 నాటికి 450 గిగా వాట్ల రికార్డును సాధించాలనే ప్రయత్నంలో పెద్ద అడుగు వేస్తున్నాము.

గౌరవనీయులైన దేశాధినేతలారా !

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) 88 సభ్య దేశాల కలయికతో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ సంస్థలలో ఒకటి.  వేలాది మంది వాటాదారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు పునరుత్పాదక ఇంధనంలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి, బిలియన్ డాలర్లను సమీకరించే ప్రణాళికలతో, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఐ.ఎస్.ఏ. దోహదం చేస్తోంది.  ఇందుకు మరో ఉదాహరణ – విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి. 

జి-20 లోని 9 దేశాలతో సహా మొత్తం 18 దేశాలు,  4 అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే కూటమిలో చేరాయి.  ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్ఫ్రా డ్యామేజ్ అనే విషయానికి అనుకున్నంత ప్రాచుర్యం లభించలేదు. దీనివల్ల పేద దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. కాబట్టి, ఈ కూటమి అవసరం చాలా ముఖ్యం.

గౌరవనీయులైన దేశాధినేతలారా !

నూతన మరియు స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల విభాగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను మరింత పెంచడానికి ఇది ఉత్తమ సమయం.  ఈ విషయంలో, మనం సహకారం మరియు భాగస్వామ్యంతో  కుందుకు వెళ్ళాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికత, మరియు ఆర్ధిక సహకారాల మద్దతుఎంత ఎక్కువగా ఉంటే, తద్వారా  ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. 

గౌరవనీయులైన దేశాధినేతలారా !

మానవత్వం అభివృద్ధి చెందాలంటే, ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలి.  శ్రమను ఉత్పత్తి యొక్క కారకంగా మాత్రమే చూడకుండా, ప్రతి కార్మికుడి మానవ గౌరవం మీద దృష్టి ఉండాలి.  అటువంటి విధానం మన భూ గ్రహాన్ని సురక్షితంగా కాపాడటానికి ఉత్తమమైన హామీ అవుతుంది.

ధన్యవాదములు … 

*****