Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మెక్సికో ప‌ర్య‌ట‌న‌ సమయంలో భార‌తదేశం, మెక్సికో ల సంయుక్త ప్ర‌క‌ట‌న ( జూన్ 8, 2016)

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మెక్సికో ప‌ర్య‌ట‌న‌ సమయంలో భార‌తదేశం, మెక్సికో ల సంయుక్త ప్ర‌క‌ట‌న ( జూన్ 8, 2016)


1. మెక్సికో అధ్యక్షుడు శ్రీ ఎన్ రిక్ పెనా నీతో ఆహ్వానించిన మీదట భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జూన్ 8, 2016న మెక్సికోలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఐక్య‌ రాజ్య‌ స‌మితి సెప్టెంబ‌ర్ 28, 2015న‌ సర్వ ప్రతినిధి సభ 70వ స‌ద‌స్సులో చేసుకొన్న ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాల నేత‌లు వారి సంప్ర‌దింపుల‌ను కొన‌సాగించాలన్న ధ్యేయంతో ఈ పర్యటన సాగింది.

2. ఇరు దేశాధినేత‌లు 21వ శ‌తాబ్దంలో భార‌త్ – మెక్సికో సంబంధాల ఆవశ్య‌క‌త‌ను చాటిచెప్పేలా భేటీ అయ్యారు. ఇరు దేశాలు ఉభ‌య తార‌కంగా పనిచేసేలా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు ప‌రుచుకునేందుకు శాస్త్ర- సాంకేతిక విజ్ఞాన రంగంలోనూ, అలాగే ఆర్థిక రంగంలోనూ దీర్ఘ‌కాలిక స‌హ‌కారం దిశ‌గా ఒప్పందాలు చేసుకున్నారు. ఆర్థిక, రాజ‌కీయ సంబంధాలు మెరుగుప‌డేటందుకు వ్యూహాత్మ‌క ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

3. అధ్యక్షుడు శ్రీ ఎన్ రిక్ పెనా నీతో మెక్సికోలో చేప‌ట్టిన ప‌లు నిర్ణ‌యాత్మ‌క మార్పులపై ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీకి విశ‌దీక‌రించారు. ముఖ్యంగా మెక్సికో ఆర్థికాభివృద్ధి కోసం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ భారతదేశంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, స‌ర‌ళీకృత ఆర్థిక విధానాలను, అభివృద్ధి కి సంబంధించిన ప‌లు అంశాలను ఆయన దృష్టికి తీసుకువ‌చ్చారు.

రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌

4. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భార‌త్ – మెక్సికో బంధాల‌ను దృఢ ప‌రుచుకునే దిశ‌గా మార్గసూచీని రూపొందించడం, 21 వ శ‌తాబ్దంలో భార‌త్ – మెక్సికో ద్వైపాక్షిక బంధాల‌ను ప‌టిష్ట ప‌రుచుకోవ‌డంతో పాటు భార‌త్ – మెక్సికో ఏడో సంయుక్త భేటీని 2016 లోనే మెక్సికోలో ఏర్పాటు చేయ‌డం వంటి విష‌యాల‌పై ఒప్పందాలు జ‌రిగాయి.

5. గ‌తంలో నిర్వ‌హించిన భారత్ – మెక్సికో ఆరో సంయుక్త భేటీలో భాగంగా ఇరు దేశాలు శాస్త్ర- సాంకేతిక రంగంలో స‌హాయ‌స‌హ‌కారాలపై చ‌ర్చించగా వాటి ఫ‌లితాల కోసం గ‌మ‌నిస్తున్నారు. అలాగే నాలుగో భేటీలో భాగంగా వాణిజ్యంలో అత్యున్న‌త స్థాయి స‌మావేశం, పెట్టుబ‌డి, స‌హకారం అంశాల్లో చ‌ర్చ సాగ‌నుంది. ఈ స‌మావేశం 2016 రెండో అర్థ భాగంలో సాగనుంది.

6. ఇరు దేశాలు స‌హాయ స‌హ‌కారాలు అందించుకోవ‌డంలో స‌మ‌ర్థ‌మైన‌, ప్ర‌ణాళికయుత‌మైన ఆచ‌ర‌ణ‌పై దృష్టి సారించారు. అలాగే వివిధ రంగాల్లో స‌హాయ స‌హ‌కారాలు, సంయుక్త‌ ఒప్పందాలు, నూత‌న రంగాల వైపు దృష్టి సారించ‌డం ద్వారా ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌ల‌ప‌రుచుకోనున్నాయి.

7. ఇరు దేశాల నేత‌లు ప్ర‌పంచ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు, సంయుక్త కార్యాచ‌ర‌ణపై వారి అభిప్రాయాల‌ను ఒకరితో మరొకరు పంచుకొన్నారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో రాజ‌కీయ‌, ఆర్థిక పరిణామాలు, సి ఇ ఎల్ ఎ సి పసిఫిక్ అల‌య‌న్స్, అలాగే ఆసియా- పసిఫిక్ ప్రాంత దేశాల్లోని ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

ఆర్థిక భాగస్వామ్యం..

8. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగ‌స్వామ్యం పెంపొందించేలా వాణిజ్యం పెట్టుబ‌డి మొద‌లగు రంగాల్లో ఆర్థిక సంబంధాల‌ను మెరుగుపర‌చుకునేందుకు చ‌ర్య‌లపై ఒప్పందం జ‌రిగింది.

9. ఇరు దేశాలు మ‌ధ్య ప్రధానంగా దృఢ‌మైన భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకొనేలా ప‌లు రంగాల‌పై దృష్టి సారించారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, చిన్న, మ‌ధ్య త‌ర‌హా వాణిజ్య‌సంస్థ‌లు, అలాగే ఫార్మాస్యూటిక‌ల్ రంగం, ఆటోమొబైల్‌, ఐ టి, వ్య‌వ‌సాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో స‌హాయ స‌హ‌కారాల‌పై చ‌ర్చించారు.

10. ప్ర‌ధానంగా మెక్సికోలోని విద్యుత్ రంగంలో భార‌తీయ కంపెనీల పెట్టుబ‌డుల‌పై చ‌ర్చ‌లు కొన‌సాగాయి. మెక్సికోలో చేప‌ట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు మొద‌లైన అంశాల‌పై చ‌ర్చించారు. అలాగే భార‌త్‌లో మెక్సిక‌న్ కంపెనీల వ్యాపార అవ‌కాశాల‌పై సైతం చ‌ర్చ‌లు జ‌రిగాయి.

11. సౌర విద్యుత్ రంగంపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. ముఖ్యంగా అంత‌ర్జాతీయ సౌర కూటమి సభ్య దేశాలు గుర్తించిన అవ‌స‌రాల‌ను అంగీకరించాయి.

12. ఇరు దేశాల న‌డుమ సంబంధాల‌ను మెరుగు ప‌రుచుకోవ‌డంలో భాగంగా సాంస్కృతిక, విద్య‌, ప‌ర్యాటక రంగాల‌లో స‌హాయ స‌హ‌కారాల‌పై దృష్టి సారించారు.

ద్వైపాక్షిక స‌హ‌కారం..

13. ఇరు దేశాలు ఐటీ రంగంలో ఎంచుకున్న మార్గంపై విశ్లేషించుకున్నారు. మెక్సికో లో చేప‌ట్టిన నేష‌న‌ల్ డిజిట‌ల్ స్ట్రాట‌జీ, అలాగే మ‌న దేశంలో చేప‌ట్టిన డిజిటల్ ఇండియా లక్ష్యాలపై ఇరు దేశాలు వివరాలను పంచుకున్నారు. అలాగే ఇరు కార్యక్రమాల్లో ఉన్న సారూప్యాన్ని రెండు దేశాల అధినేతలు గుర్తించారు.

14. ఇరు దేశాలు పలు రంగాల్లో సహాయసహకారాలు అందించుకునే అంశాలను గుర్తించారు. ముఖ్యంగా అంతరిక్ష జ్ఞానం, భూ సాంకేతిక శాస్త్రం, పర్యావరణ, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు మెక్సికన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఎ ఇ ఎమ్), భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ – ఇస్రో) లు కలసి సంయుక్తంగా పని చేయడంపై సమాచారం మార్పిడిపై ఒప్పందాలు చేసుకున్నారు.

15. ఇరు దేశాలు వేర్వేరు భౌగోళిక సంస్కృతులు నేపథ్యంలో ఎదిగాయి. అంతే కాకుండా విభిన్న సంస్కృతులతో కూడిన విశాల భూభాగాలు కలిగిన దేశాలుగా భారతదేశం, మెక్సికోలు ఎదిగాయి. ఈ నేపథ్యంలో పలు రంగాల్లో సహాయ సహకారాలు అందించుకోవడంపై నేతలు దృష్టి సారించారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇరు దేశాల ప్రజల రక్షణ ఆవశ్యకతను ఇరు దేశాధినేతలు గుర్తించారు.

ప్రపంచ సంబంధాలపై ఇరు దేశాల ఒప్పందాలు

16. ఇరు దేశాలు అణ్వాయుధాల నిరాయుధీకరణ , అలాగే శాంతి ఒప్పందాల ద్వారా సామరస్య వాతావరణం వంటి అంశాలపై అంగీకారం కుదిరింది. అలాగే ప్రపంచ దేశాల భద్రతపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదిరాయి.

17. తీవ్రవాద ముప్పు అన్ని రూపాల్లోనూ, అన్ని స్థాయాల్లోనూ ఇరు దేశాలు ఖండించాయి.

18. ఇరు దేశాలు ప్రత్యామ్నాయ పలు అంచెల వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో సమర్థించాయి. ఇరు దేశాలు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మార్పులపై ఆవశ్యకతను గుర్తించారు. అలాగే ఇరు దేశాలు పలు అంతర్జాతీయ అంశాలపై ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

19. జి – 20 దేశాల సదస్సులో పాల్గొనే ఆవశ్యకతను గుర్తించాయి. అలాగే జి -20 దేశాలు ఒప్పందాల ఆధారంగా పరస్పర సహకారాన్ని గుర్తించాయి.

20. డిసెంబర్‌ 2015న ప్యారిస్‌లో జరిగిన వాతావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సదస్సు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఇరు దేశాలు ఏప్రిల్‌ 22, 2016 న ప్యారిస్‌ ఒప్పందంపై చేసుకున్న తీర్మానంపై సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఇరు దేశాలు ప్యారిస్‌ ఒప్పందం అమలుపై ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి, వినియోగం ఆవశ్యకతను గుర్తించారు.

21. మెక్సికో అధ్యక్షుడు శ్రీ ఎన్ రిక్‌ పెనా నీతో సాదరంగా మరో సారి భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని మరో సారి తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. మెక్సికో అధ్యక్షుడు శ్రీ ఎన్ రిక్‌ పెనా నీతో ను భారతదేశంలో పర్యటనకు తరలిరావలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ కూడా ఆహ్వానించారు. అనువైన తేదీలను దౌత్య వర్గాలు ఖరారు చేసేటట్లు ఒక అంగీకారానికి వచ్చారు.