Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’’ ను పొడిగించినట్లు ప్రకటించిన ప్రధాన మంత్రి


 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’’ ను నవంబరు ఆఖరు వరకు పొడిగించినట్లు ప్రకటించారు.

పేదల కు చేయూత :

లాక్ డౌన్ కాలం లో అవసరమైన వారి కి ఆహారాన్ని అందించడం దేశం యొక్క ప్రథమ ప్రాధాన్యమని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. లాక్ డౌన్ ను ప్రకటించిన వెనువెంటనే, ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ను తీసుకువచ్చింది, దీనిలో భాగం గా పేదల కు 1.75 లక్షల కోట్ల రూపాయల తో ఒక ప్యాకేజీ ని ప్రకటించడమైంది.

గడచిన మూడు నెలల్లో ఇంచుమించు 20 కోట్ల పేద కుటుంబాల జన్- ధన్ ఖాతాల లో 31,000 కోట్ల రూపాయలు బదిలీ చేయడమైందని, అలాగే 9 కోట్ల కు పైగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల లోకి 18,000 కోట్ల రూపాయలు బదిలీ చేయడమైందని, ఇంకా ఉపాధి అవకాశాల ను కల్పించడం కోసం ప్రారంభించినటువంటి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పై 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

నవంబర్ వరకు ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కాల విస్తరణ :

80 కోట్ల కు పైగా ప్రజల కు మూడు మాసాల పాటు ఉచిత రేశను ను సమకూర్చడం; అంటే కుటుంబం లోని ప్రతి ఒక్కరి కి 5 కిలో ల ఉచిత బియ్యం / గోధుమల ను అందించడం తో పాటు, ప్రతి కుటుంబాని కి ప్రతి నెల 1 కిలో పప్పులను అందించాలనేటటువంటి నిర్ణయాన్ని యావత్తు ప్రపంచం గమనిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఎంత మంది కి ఉచితం గా రేశను ను అందించడం జరిగిందో, వారి సంఖ్య అనేక పెద్ద దేశాల యొక్క జనాభా కంటే చాలా రెట్లు గా ఉంటుంది అని ఆయన అన్నారు.

వర్ష రుతువు ప్రారంభం కావడం తో వ్యవసాయ రంగంలో ఎక్కువ గా పనులు జరుగుతాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అలాగే, గురు పూర్ణిమ, రక్షాబంధన్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, గణేశ చతుర్థి, ఓణమ్, దసరా, దీపావళి, ఛఠ్ పూజ లతో పాటు అనేక పండుగ లు ఒకదాని తరువాత మరొకటి గా వస్తున్నాయి. ఈ సమయం లో పెరిగే అవసరాల ను, ఖర్చుల ను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’’ ను దీపావళి మరియు ఛఠ్ పూజ వరకు పొడిగించాలన్న నిర్ణయాన్ని తీసుకొందని ఆయన ప్రకటించారు. ఈ పథకం జూలై నుండి నవంబర్ నెలాఖరు వరకు అమలు లో ఉంటుంది అని దీని అర్థం. ఈ ఐదు నెల ల కాలం లో 80 కోట్ల మందికి పైగా ప్రజల కు ప్రతి నెల 5 కిలోల గోధుమలు గాని, లేదా బియ్యం గాని ఉచితం గా అందించబడుతుంది. కుటుంబం లోని ప్రతి ఒక్కరి కి 5 కిలోల చొప్పున బియ్యాన్ని లేదా గోధుమలను ఉచితం గా అందించడం తో పాటు, ప్రతి ఒక్క కుటుంబాని కి నెలకు 1 కిలో శనగలను కూడా ఉచితం గా అందించడం జరుగుతుంది.

ఈ పథకం అమలు ను పొడిగించడం కోసం ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు చేస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. దీనికి, గత మూడు నెలల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని కలిపినట్లయితే గనక ఈ పథకం కోసం రమారమి 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లే అని ఆయన చెప్పారు. ప్రభుత్వం ద్వారా ఆహారధాన్యాల కొనుగోలు, మరియు ఆ ఆహారధాన్యాల ను ఉచితం గా పంపిణీ చేసిన ఘనత కఠోరం గా పరిశ్రమించేటటువంటి రైతుల కు మరియు నిజాయితీ గా పన్నులను చెల్లించేవారికి దక్కుతుంది అని ప్రధాన మంత్రి చెప్తూ మరి వారి కి ఆయన ధన్యవాదాలు పలికారు.

‘ఒక దేశం, ఒక రేశన్ కార్డు’ విధానం దిశ గా దేశం పయనిస్తున్నదని ప్రధాన మంత్రి వివరిస్తూ, ఇది
ఉపాధి ని అన్వేషిస్తూ అన్య రాష్ట్రాల కు తరలివెళ్ళే పేద ప్రజ కు ఎంతో ప్రయోజనకారి గా ఉంటుందని వక్కాణించారు.

అన్ లాక్- 2 దశ లో సురక్షితం గా ఉండాలి :

కరోనావైరస్ ‌కు వ్యతిరేకం గా పోరాటం అన్ ‌లాక్ 2 దశ కు చేరే కాలం లో మారే వాతావరణం పలు రోగాల కు దారితీయవచ్చని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని ఆయన కోరారు. లాక్ డౌన్ వంటి నిర్ణయాల ను సకాలం లో తీసుకోవడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాల ను కాపాడ గలిగినట్లు, మన దేశం లో మరణాల రేటు ప్రపంచం లోని అన్ని దేశాల కంటే చాలా తక్కువ గా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే, అన్ లాక్-1 సమయం లో బాధ్యత లేనట్లు గా ప్రవర్తించడం ఇంకా బాగా ఉదాసీనం గా మెలగడం గమనింపు లోకి వచ్చాయి అని ఆయన అన్నారు. ఇంతకు ముందు ప్రజలు, మాస్క్ ధరించడం, పగటిపూట ఎక్కువ సార్లు 20 సెకన్ల కన్నా ఎక్కువ సేపు చేతులు కడుక్కోవడం తో పాటు ‘దో గజ్ దూరీ’ ని ఖచ్చితం గా పాటించే అంశాల లో మరింత జాగ్రత్తగా ఉండేవారని ఆయన చెప్పారు. అధిక సావధానం గా ఉండడం ఆవశ్యకం అని, కాగా నిర్లక్ష్యం పెరగడం ఆందోళన కలిగించే విషయం అని ఆయన నొక్కిచెప్పారు.

లాక్ డౌన్ వేళ, ముఖ్యంగా కంటైన్ మెంట్ జోన్ లలో ఎంత గంభీరం గా నియమాల ను పాటించామో, ఇప్పుడు కూడా అంతే అప్రమత్తం గా ఉంటూ, జాగ్రత్త లు తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అటువంటి నియమ నిబంధనల ను పాటించని వారి లో అవగాహన ను కలిగించండి అంటూ ప్రజల ను ఆయన ప్రోత్సహించారు. బహిరంగ స్థలం లో మాస్క్ ను ధరించనందుకు ఒక దేశ ప్రధాని కి 13,000 రూపాయల జరిమానా ను విధించిన ఉదాహరణ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశం లోని స్థానిక పాలనయంత్రాంగం అంతే సజీవత తో వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉన్నదని, ఎందుకంటే ఎవ్వరూ కూడా- ప్రధాన మంత్రి తో సహా- చట్టాన్ని అనుసరించడం కంటే మిన్న కాదు అని ఆయన స్పష్టం గా చెప్పారు.

భవిష్యద్దర్శనం..

రాబోయే కాలం లో పేదల కు మరియు ఇతర అవసరార్థుల కు సాధికారిత ను కల్పించడం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యల ను చేపడుతుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. తగిన జాగ్రత్త లు తీసుకొంటూ, ఆర్థిక కార్యకలాపాల ను కూడా మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశ గా సాగుతామని ప్రతిన బూనాలని, స్థానిక త కై గళం కలపాలని (వోకల్ ఫర్ లోకల్) ఆయన పునరుద్ఘాటించారు; అలాగే, ప్రజలు అప్రమత్తం గా నడుచుకోవాలని, మాస్క్ ను లేదా ఫేస్ కవర్ ను ఉపయోగించాలని, ఇంకా ‘దో గజ్ దూరీ’ ని నిభాయించే మంత్రాన్ని అనుసరించాలని కూడా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

**