ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో స్పందనపై చర్చించడానికి సోమవారం సాయంత్రం జరిగిన అలీనోద్యమ దేశాల (నామ్) కాంటాక్ట్ గ్రూప్ ఆన్ లైన్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
కోవిడ్-19పై ఐక్య పోరాటం అనే అంశంపై ఈ సమావేశాన్ని అజర్ బైజాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు, ప్రస్తుత నామ్ చైర్మన్ గౌరవ ఇల్హామ్ అలియేవ్ నిర్వహించారు. కోవిడ్-19పై పోరాటంలో అంతర్జాతీయ సంఘీభావం సాధించడం, భిన్న దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను సంఘటితం చేయడం ఈ సదస్సు లక్ష్యం. అంతర్జాతీయ బహుముఖీనత, శాంతి దౌత్యం దినోత్సవానికి గుర్తుగా కూడా ఈ సమావేశం నిర్వహించారు.
నామ్ వ్యవస్థాపక సభ్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ఆ బృందానికి చెందిన సిద్ధాంతాలు, విలువలకు ప్రకటిస్తున్న దీర్ఘకాలిక కట్టుబాటుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం యావత్తు సమన్వయపూర్వక, సమ్మిళిత, సమానత్వ ప్రాతిపదికన కదలిరావలసిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కోవిడ్-19పై పోరాటానికి భారత్ దేశీయంగాను, అంతర్జాతీయంగాను తీసుకున్న చర్యలను వివరిస్తూ నామ్ బృందానికి కూడా తన వంతుగా వీలైనంత ఎక్కువ సంఘీభావం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఉగ్రవాదం, వాస్తవవిరుద్ధమైన వార్తల వ్యాప్తి వంటి ఇతర వైరస్ ల మీద కూడా ప్రపంచం యావత్తు కఠిన వైఖరితో పోరాట వలసిన అవసరం ఉన్నదని ఆయన గట్టిగా చెప్పారు.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కారీబియన్ ప్రాంతం, యూరప్ లలోని నామ్ సభ్య దేశాల నాయకులతో పాటు మొత్తం 30 మంది ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు ప్రొఫెసర్ తిజ్జానీ మహమ్మద్ బండే, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ చైర్ పర్సన్ ఆంటానియో గుటెరిస్, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ ముసా ఫకీ మహమత్, యూరోపియన్ యూనియన్ అత్యున్నత ప్రతినిధి జోసెఫ్ బోరెల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేసస్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.
నామ్ నాయకులు ఈ సమావేశంలో కోవిడ్-19 ప్రభావాన్ని మదింపు చేయడంతో పాటు అందుబాటులో ఉండే నివారణ చర్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరాన్ని, మరిన్ని చర్యలు తీసుకోవడానికి అవసరమైన తదుపరి కార్యాచరణను కూడా చర్చించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా అంతర్జాతీయ సంఘీభావం సాధించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ సదస్సులో నాయకులు ఒక ప్రకటన కూడా ఆమోదించారు. కోవిడ్-19కి సంబంధించి సభ్యదేశాల వైద్య, సామాజిక, మానవతా అవసరాలతో ఉమ్మడి డేటా బేస్ రూపొందించి దాని ఆధారంగా వాటి అవసరాలు గుర్తించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు నాయకులు ప్రకటించారు.
Spoke at the NAM Summit, held via video conferencing. https://t.co/yRaIbCtpkq
— Narendra Modi (@narendramodi) May 4, 2020