ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు జర్మనీ ఛాన్సెలర్ గౌరవనీయురాలు డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 మహమ్మారి గురించీ, తమ తమ దేశాల్లో దాని పరిస్థితి గురించీ, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించీ ఇరువురు నాయకులు చర్చించారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో మందులు, వైద్య పరికరాల కొరత పై తమ అభిప్రాయాలు ఒకరికొకరు తెలియజేసుకున్నారు. ఈ విషయంలో సహకరించుకోడానికి మార్గాలను అన్వేషించాలని అంగీకరించాయి.
ఆధునిక చరిత్రలో ఈ కోవిడ్-19 మహమ్మారి ఒక ముఖ్యమైన మలుపు అన్న ప్రధానమంత్రి వ్యాఖ్యతో జర్మన్ ఛాన్సలర్ ఏకీభవించారు. మొత్తం మానవాళి భాగస్వామ్య ప్రయోజనం పై దృష్టి కేంద్రీకరించి, కొత్త ప్రపంచీకరణ విధానాన్ని రూపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఇద్దరు నాయకులు అంగీకరించారు.
ప్రపంచ ప్రజలకు సాధారణ యోగా వ్యాయామాలను వ్యాప్తి చేయడానికి ఇటీవల భారత్ చేపట్టిన కార్యక్రమాల గురించీ, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద నివారణల గురించీ, ప్రధానమంత్రి, గౌరవనీయులైన ఛాన్సలర్ కు తెలియజేశారు.
మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పెంచడానికి, ముఖ్యంగా ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇటువంటి పద్ధతులు, విధానాలు చాలా ప్రయోజకరంగా ఉంటాయని ఛాన్సలర్ అంగీకరించారు.