Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2016 మే 22న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమం ప్రసంగ పాఠానికి తెలుగు అనువాదం ఇది.


ప్రియమైన నా దేశ ప్రజలారా.. నా మనసులో మాటలను మీకు వెల్లడించే అవకాశం మరొకసారి నాకు లభించింది. నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) ఒక మత ఆచారం కాదు; మీతో మాట్లాడాలని నేనెంతో ఉత్సాహంగా ఉంటాను. భారతదేశంలో ప్రతి చోట మనసు లోని మాట కార్యక్రమం ద్వారా దేశం మూల మూల లోని మీ అందరితోను కలిసిపోవడం నిజంగా నాకెంతో నచ్చింది. ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో రాత్రి 8 గంటలకు విజయవంతంగా ప్రసారం చేస్తున్నందుకు ఆకాశవాణి వారికి నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. నా మాటలు వింటున్న వారు ఆ తరువాత వారి ఆలోచనలను లేఖల ద్వారా, టెలిఫోన్ కాల్స్ ద్వారా, Mygov.in వెబ్ సైట్ ద్వారా, NarendraModiApp ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీరు చెబుతున్న దాంట్లో చాలా మాటలు ప్రభుత్వాన్ని నడపడంలో నాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వం ఎంత క్రియాశీలంగా ఉండాలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అనే విషయాలలో ఈ సంభాషణలు, మీతో నాకు ఉన్న లంకె.. చాలా బాగా ఉపయోగపడుతోంది. మన ప్రజాస్వామ్యం ప్రజల ప్రాతినిధ్యంతో పనిచేసేటట్లు చూడటంలో మీరు మరింత చురుకుగాను, ఉత్సాహం తోను పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను.

వేసవి వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. కొంతయినా ఉపశమనం లభిస్తుందని మనం భావిస్తున్నాం. కానీ అందుకు బదులుగా ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇంతలోనే రుతుపవనాలు బహుశా ఒక వారం రోజులు ఆలస్యం రావచ్చని వచ్చిన కబురు కలతను పెంచివేసింది. దాదాపు యావత్తు దేశం తీవ్రమైన ఎండల ప్రభావంలో చిక్కుకుపోయింది. ఉష్ణ తీవ్రత పెచ్చవుతూనే ఉంటోంది. పశువులు, పక్షులు, లేదా మానవులు.. ప్రతి ఒక్క ప్రాణి బాధను అనుభవిస్తున్నారు. పర్యవారణం అధ:పతనం కారణంగా ఈ సమస్యలు విషమంగా మారుతున్నాయి. చెట్లను విచక్షణరహితంగా నరికివేస్తుండడంతో వన కవచం తరిగిపోతున్నది. ఒక రకంగా చెప్పాలంటే, మానవ జాతే ప్రకృతిని ధ్వంసం చేయడం ద్వారా స్వీయ విధ్వంసానికి బాట వేసింది. జూన్ 5న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకొంటాం. ఆ రోజున ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణం గురించి చ‌ర్చ జ‌రుగుతుంది.. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ. ఈ సారి ఐక్య‌ రాజ్య స‌మితి ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వానికి ‘జీరో టాలరెన్స్ ఫర్ ఇల్లీగ‌ల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణ‌యించింది. ఈ ఇతివృత్తంపై చ‌ర్చ అయితే జ‌రుగుతుంది. కానీ మ‌నం వృక్ష జంతుజాల గురించి, నీటిని పొదుపుగా వాడుకోవడం గురించి, మన వనాల విస్తీర్ణాన్ని పెంచడం ఎలాగన్నదానిని గురించి కూడా చ‌ర్చ జ‌రిపే తీరాలి. గత కొంత కాలంగా మీరు చూసే ఉంటారు.. ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్‌, జ‌మ్ము & కశ్మీర్‌ లోని హిమాలయ శ్రేణులలోని అడ‌వులలో అగ్గి రాజుకున్నది. వనాలలోని మంటలకు మూల‌ కార‌ణం ఏంటంటే – ఎండిపోయిన ఆకుల‌కు మ‌న నిర్ల‌క్ష్యం తోడవడం. ఇదే పెద్ద అగ్నిశిఖకు తావు ఇచ్చింది. అందుక‌నే అడ‌వుల‌ను కాపాడుకోవ‌డం, జలాలను పరిరక్షించుకోవ‌డం మ‌న అంద‌రి విధ్యుక్త ధర్మంగా మారిపోయింది. ఇటీవ‌ల నేను అత్య‌ధిక దుర్భిక్ష ప‌రిస్థితి నెల‌కొన్న 11 రాష్ట్రాల.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఝార్ ఖండ్‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, ఒడిశా..ల ముఖ్య‌మంత్రుల‌తో సంభాషించాను.

ఇదివరకటి ప్ర‌భుత్వం పాటించిన సంప్ర‌దాయం ప్ర‌కారమైతే నేను అనావృష్టికి లోనైన రాష్ట్రాలన్నిటి ముఖ్య‌మంత్రుల‌తోను ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వ‌హించ‌వ‌చ్చు, కానీ నేను అలా చేయకూడదనుకున్నాను. ప్ర‌తి రాష్ట్రంతో విడి విడిగా సమావేశమయ్యాను, ఒక్కొక్క రాష్ట్రానికి సుమారు రెండు గంటల నుండి రెండున్నర గంట‌లు కేటాయించాను. ప్రతి రాష్ట్రం చెప్పిన‌దంతా నేను శ్రద్ధగా ఆలకించాను. సాధార‌ణంగా అటువంటి చర్చలు కేంద్ర‌ ప్ర‌భుత్వం రాష్ట్రాల వారీగా ఎంత డ‌బ్బును మంజూరు చేసింది, ప్రతి రాష్ట్రం ఎంత డబ్బును ఖ‌ర్చు పెట్టిందనే విష‌యానికి మించి సాగవు. ఈ విధంగా చూసినపుడు నీరు, పర్యావరణం, దుర్బిక్షాన్ని ఎదుర్కోవడంలో, బాధిత జంతువుల పట్ల, అలాగే.. బాధిత మానవుల పట్ల శ్రద్ధ తీసుకోవడంలో కొన్ని రాష్ట్రాలు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినట్లు తెలుసుకొని కేంద్ర ప్ర‌భుత్వ అధికారులకే ఆశ్చ‌ర్యమేసింది. దేశం నలుమూలల నుండి అందిన సమాచారం బట్టి చూస్తే- అక్కడ పాలక పక్షంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ సరే.. శాశ్వత పరిష్కారాలను కనుగొనడం గురించి ఆలోచన చేయాల్సివున్నదని, అంతే కాకుండా ఎంతోకాలంగా ఎదురవుతున్న స‌మ‌స్య‌ను తీర్చగల ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాలను కూడా అనుసరించవలసివున్నదని మేం గ్రహించాం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే, ఇది నాకు కూడా ఒక నేర్వదగిన పాఠం వంటి అనుభూతిని కలిగించింది. రాష్ట్రాలన్నింటా ఉత్త‌మ‌మైన పద్ధతులను ఎలా ప్రవేశపెట్టాలో నీతి ఆయోగ్ కసరత్తు చేయాలంటూ వారికి నేను ఆదేశాలిచ్చాను.

కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి గుజరాత్, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ సాంకేతిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకొన్నాయి. ఈ రాష్ట్రాలు చేపట్టిన అమిత విజయవంతమైన ప్రయత్నాలను భవిష్యత్తులో నీతి ఆయోగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాల‌ని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించడానికి ప్రజ‌ల భాగస్వామ్యం ఒక బలమైన పునాదిగా నిలబడుతుంది. ఆ విష‌యంలో స‌రిగ్గా ఆలోచ‌న చేసి.. స‌రైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి.. నిర్ధారించిన స‌మ‌యంలోగా పూర్తి చేసే కార్యాచరణను చేపట్టినట్ల‌యితే కరవును సంబాళించడంలో సాధ్యమైనంత అధిక ఫలితాలను సాధించవచ్చు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్క నీటి చుక్కను దాచుకోవాలి. నీరు దైవం ఇచ్చిన వ‌రం అని నా నమ్మకం. మ‌నం ఆల‌యాల‌కు వెళ్లినప్పుడు మనకు ప్ర‌సాదం అందిస్తారు. అందులో నుండి ఏ కొంచెం కింద‌ప‌డినా మనం మన అంతరంగంలో వేదన పడిపోతాం. మనం దానిని వెంట‌నే ఏరుకోవడంతో పాటు దైవం క్షమను కోరుతూ అయిదు సార్లు ప్రార్థిస్తాం. జలం కూడా దైవ ప్రసాదితమే. ఒక్క చుక్క‌ నీరు వృథా అయినా సరే మ‌నం ఖేదం చెందాలి; పశ్చాత్తాపపడాలి. అందుక‌ని నీటిని నిల్వ చేయ‌డం, నీటిని పొదుపుగా వాడుకోవడం, సేద్యపు నీటిని సద్వినియోగించడం ఇవన్నీ కూడా సమ ప్రాధాన్యం ఇవ్వదగ్గవే. సూక్ష్మ సేద్యం పద్ధతిని అవలంబించడం ద్వారా, త‌క్కువ నీటిని మాత్రమే తీసుకొనే పంటలను సాగు చేయడం ద్వారా ‘ప్రతి చుక్క నీటితో ఎక్కువ పంట’ను అమలు చేయవలసిన అవసరం ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో మ‌న చెర‌కు పండించే రైతులు సైతం సూక్ష్మ సేద్యపు నీటి పారుద‌ల ప‌ద్ధతులను అవ‌లంబిస్తున్నారన్నా, ఇంకొంత‌ మంది జల్లు సేద్య ప‌ద్ధ‌తిని పాటిస్తున్నారన్నా.. ఈ విషయాలు నిజంగా శుభ వార్త వంటివే. పదకొండు రాష్ట్రాల‌తో నేను చర్చ జరిపినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం పండించడానికి కూడా స‌మ‌ర్థంగా బిందు సేద్యం ప‌ద్ధ‌తిని విజయవంతంగా అమ‌లు చేశారన్న సంగతిని గమనించాను. దీని మూలంగా పంట దిగుబ‌డి అధికం అయింది. నీరు వృధా అవ‌లేదు. శ్రామికులపై పెట్టే ఖ‌ర్చు కూడా త‌గ్గింది. ఈ రాష్ట్రాలు చెప్పేదేమిటంటే – వారు పెద్ద‌పెద్ద అంచ‌నాలు వేసుకున్నారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర, ఆంధ్ర ఇంకా గుజ‌రాత్ ! ఈ మూడు రాష్ట్రాలు బిందు సేద్యంలో గొప్ప‌గా శ్ర‌మించాయి. ప్ర‌తి ఏడాది రెండేసి, మూడేసి హెక్టార్ల భూమిని సూక్ష్మ నీటిపారుద‌ల‌లోకి తీసుకురావాల‌న్న‌దే వాటి ధ్యేయం. ఈ మార్పు అన్ని రాష్ట్రాల‌లో తీసుకురాగ‌లిగితే వ్య‌వ‌సాయంలో ఎంతో లాభం పొంద‌గ‌లం. నీటిని దాచుకోగ‌లం. మ‌న తెలంగాణ రైతు సోద‌రులు ‘మిష‌న్ భ‌గీర‌థ’ ద్వారా కృష్ణా, గోదావ‌రి న‌దుల నీటిని స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ‘నీరు- ప్రగతి మిష‌న్’ ! అందులో కూడా భూగర్భ నీటి మట్టం పెంపునకు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగం. భూగ‌ర్భ నీటిని పూర్తిగా వాడుకోవ‌డం కోసం చేసే ప్ర‌య‌త్నాలు. మ‌హారాష్ట్ర చేప‌ట్టిన ప్రజా ఆందోళ‌నలో ప్ర‌జ‌లు చెమ‌టోడుస్తున్నారు; ధ‌న స‌హాయం చేస్తున్నారు. వాళ్లు చేప‌ట్టిన ‘జ‌ల‌యుక్త శిబిర అభియాన్’ మహారాష్ట్ర‌ను భ‌విష్య‌త్‌లో క‌ష్టాలు రాకుండా కాపాడుతుంద‌న్న‌దే నా న‌మ్మ‌కం. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ‘లోక సురాజ్ – జ‌ల సురాజ్’ అభియాన్ ను చేప‌ట్టింది. మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ‘బ‌ల‌రాం తాలాబ్ యోజ‌న’ను అనుసరించింది.. దాదాపు 22 వేల చెరువులలో. ఇవేమీ మామూలు లెక్క‌లు కావు. వీట‌న్నింటి మీద ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే ‘క‌పిల్ ధారా కూప్ యోజ‌న’ మ‌రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ‘ముఖ్య‌మంత్రి జ‌ల్‌ బ‌చావో యోజ‌న’ ! క‌ర్ణాట‌క‌లో బావుల‌ను తిరిగి బ‌తికించుకునేందుకు ‘క‌ల్యాణి యోజ‌న’ పేరుతో ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌ ల‌లో – ఎక్కువ‌గా పాత బావులు ఉన్న ప్ర‌దేశాల్లో వాటిని నీటి దేవాల‌యాలుగా తిరిగి బ‌తికించుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. రాజ‌స్థాన్‌లో ‘ముఖ్య‌మంత్రి జ‌ల – స్వావ‌లంబ‌న్ యోజ‌న’ ను చేప‌ట్టారు. ఝార్ ఖండ్ అట‌వీ ప్రాంతమే అయినా – కొన్ని కొన్ని చోట్ల నీటి ఎద్ద‌డి ఉంది. అక్క‌డ చెక్‌ డ్యాం పేరుతో పెద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. వృథాగా పోయే నీటిని ఆపే ప్ర‌య‌త్నం ! కొన్ని రాష్ట్రాల్లో న‌దుల మీద చిన్న‌చిన్న ఆన‌క‌ట్ట‌లు క‌ట్టి 10 కిలోమీటర్ల నుండి 20 కిలోమీట‌ర్ల నీటిని ఆపే దిశ‌లో ప‌నులు చేప‌ట్టారు.

ఇదంతా ఒక అద్బుతమైన అనుభ‌వం. నేను ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాను.. రాబోయే జూన్‌, జులై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెలల్లో రండి- మ‌న‌మంతా ఒక్క‌నీటి చుక్క కూడా వృథా కానివ్వం అనే నిర్ణ‌యాన్ని తీసుకుందాం అంటూ. ఎక్క‌డెక్క‌డ నీటిని ర‌క్షించ‌గ‌లం..? ఎలా నీటిని ఆప‌గ‌లం. .? వీటి గురించి ఏర్పాట్లు చేద్దాం. మ‌న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు భ‌గ‌వంతుడు నీటిని అనుగ్ర‌హించాడు. ప్ర‌కృతి మ‌న అవ‌స‌రాల‌ను నెరవేరుస్తోంది. కానీ – మ‌నం ఒక‌వేళ నీటిని వృథాగా పోనిస్తే; ఇదే ప‌నిగా ఉంటే..? వ‌ర్షాకాలం ముగిసిన తరువాత నీరులేక‌పోతే అల్లాడిపోతాం? అప్పుడు ఎలా? నీటిని గురించి అంటే, ఒక్క రైతుల గురించే కాదండి. ప‌ల్లెవాసులు, పేద‌వారు, డ‌బ్బున్న‌వారు, కూలీలు, రైతులు, ప‌ట్న‌వాసులు, గ్రామీణులు అంద‌రికీ సంబంధించిన విష‌యం ఇది. వ‌ర్షాకాలం వ‌స్తోంది. మనకు నీరు కావాలి. అది లేనిదే, మ‌న‌కు మ‌నుగ‌డే లేదు. ఈసారి దీపావ‌ళి సంబ‌రాలు జ‌రుపుకునేట‌ప్పుడు ఎంత నీటిని దాచుకోగ‌లిగాం, ఎంత నీటిని వృథాకాకుండా ఆప‌గ‌లిగాం అనే విష‌యాన్ని సంతోషంగా చెప్పుకోగ‌ల‌గాలి. అప్పుడు మ‌న ఆనందానికి హ‌ద్దులంటూ ఉండ‌వు. నీటికి ఎంత శ‌క్తి ఉందంటే – మ‌నం ఎంత అలసిపోయి వ‌చ్చినా మొహం మీద ఇన్ని నీళ్లు చిల‌క‌రించుకున్నామ‌నుకోండి. ఫ్రెష్ అయిపోతాం. అంత శ‌క్తి ! బాగా అలిసిపోయినా, ఒక పెద్ద చెరువును చూసిన‌ప్పుడు.. లేదూ. అనంత‌మైన స‌ముద్రాన్ని చూసిన‌ప్పుడు- ఆ అనుభ‌వ‌మే గొప్ప‌గా ఉంటుంది. అవునా ! ఇంత అమూల్య‌మైన సంప‌దను దైవం ద్వారా మనం పొందాం. కాస్త మ‌న‌సు పెట్టి ఆ సంప‌ద‌ను కాపాడుకుందాం. నీటి వ‌న‌రుల్ని పెంచుకుందాం. నీటినీ పెంచుకుందాం. వాడిన నీటిని తిరిగి ఉప‌యోగంలోకి తెచ్చుకుందాం. ఈ విష‌యాన్ని మీకు నొక్కి చెబుతున్నాను. రాబోయే కాలాన్ని వృథాగా వ‌దిలివేయ‌కండి. ఆ నాలుగు నెల‌ల్నీ చుక్క‌చుక్క నీటిని కాపాడుకునేందుకు ‘జల్ బచావో అభియాన్ ‘గా మార్చుకుందాం. ఇది ప్ర‌భుత్వాల‌ది కాదు. మంత్రుల‌ది కాదు. మ‌న‌ది. మ‌న అంద‌రి బాధ్య‌త‌ ఇది. ప్ర‌చార‌ మాధ్యమాలు, ప్ర‌సార మాధ్య‌మాలు గ‌తంలో నీటి ఎద్ద‌డిని గురించి విస్తృతంగా వివ‌రించాయి. నీటిని కాపాడుకునే విష‌యంలో కూడా ఈ మాధ్య‌మాలు ప్ర‌జ‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌నం కావాల‌ని, ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని, నీటి ఇబ్బంది నుంచి మ‌న‌ల్ని సంపూర్ణంగా త‌ప్పించే విష‌యంలో భాగ‌స్వాములు కావాల‌ని కోరుకుంటూ.. ఆ మాధ్య‌మాల‌ను కూడా నేను స్వాగ‌తిస్తున్నాను.

ప్రియమైన నా దేశ ప్రజలారా.. మ‌న దేశాన్ని మ‌నం ఆధునిక రంగంలోకి తీసుకువెళ్లాలి. మ‌న దేశం పార‌ద‌ర్శ‌కం కావాలి .ఎన్నో వ‌న‌రులు స‌మాన స్థాయిలో దేశంలోని అన్ని మూల‌ల‌కు చేరేట్టు చూడాలి. అందుకోసం.. మ‌న పాత అల‌వాట్ల‌ను కొంచెంగా మార్చుకోవాలి. ఒక్క విష‌యం గురించి ప్ర‌స్తావించ‌ద‌ల్చుకున్నాను. ఆ విష‌యంలో మీరు గ‌నుక నాకు స‌హాయ‌ప‌డిన‌ట్ల‌యితే ఆ దిశ‌లో త‌ప్ప‌కుండా మ‌నం అభివృద్ధిని సాధించ‌గ‌ల‌మ‌నే నా న‌మ్మ‌కం. మ‌నంద‌రికీ తెలుసు; చిన్న‌ప్పుడు చ‌దువుకున్నాం కూడా. ఒక‌ప్పుడు నాణేలు ఉండేవి కావు, నోట్లు ఉండేవి కావు. బార్ట‌ర్ సిస్ట‌మ్ న‌డిచేది. అంటే మీకు కూర‌లు కావాలంటే, దానికి బ‌దులుగా కొంత ధాన్యం ఇచ్చేవాళ్లు. ఉప్పు కావాలంటే, కూర‌లు ఇచ్చేవాళ్లు. ఒక వ‌స్తువుకు బ‌దులుగా ఇంకొక వ‌స్తువు. బార్ట‌ర్ సిస్ట‌మ్ అంటే ఇదే. మెల్ల‌మెల్ల‌గా నాణేలు, అదే ‘కాయిన్స్’ వ‌చ్చాయి, నోట్లు వ‌చ్చాయి. కానీ, కాలం మారింది. ప్ర‌పంచం న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ వైపు ప‌రుగులు తీస్తోంది. ఎల‌క్ట్రానిక్ టెక్నాలజి ద్వారా మ‌నం డ‌బ్బులు తీసుకోగ‌లం, ఇవ్వ‌గ‌లం. దీనివ‌ల్ల జేబు నుంచి ప‌ర్స్ కాజేస్తార‌న్న భ‌య‌మే ఉండ‌దు. లెక్క‌లు రాసుకునే అవ‌స‌రం ఉండ‌దు. ఆటోమేటిక్ లెక్క‌లు ఉంటాయి. మొద‌ట్లో ఇది క‌ష్టంగా ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మదిగా అల‌వాటు అయిపోతే.. ఈ వ్య‌వ‌స్థ సులువైపోతుంది. మేము ఈ మ‌ధ్య ప్ర‌వేశ‌పెట్టిన ‘ప్ర‌ధాన‌ మంత్రి జ‌న్‌ ధ‌న్ యోజ‌న’ వ‌ల్ల దేశంలోని దాదాపు అన్ని కుటుంబాలు బ్యాంకులో ఖాతాలు తెరిచాయి. ఇంకొక వైపు ఆధార్ నంబ‌ర్ ల‌భించింది. ఇప్పుడు భార‌త‌దేశంలో ప్ర‌తి ఒక్క భార‌తీయుడి చేతిలో మొబైల్ ఉంది. ‘జ‌న్‌ ధ‌న్’, ‘ఆధార్’ మ‌రియు ‘మొబైల్’ – ‘JAM’ను జోడిస్తూ క్యాష్‌లెస్ సొసైటీ వైపు ముందుకు న‌డ‌వ‌వ‌చ్చు. జ‌న్‌ ధ‌న్ అకౌంట్‌తో పాటు.. రూపే కార్డు ఇవ్వ‌బ‌డింది. వ‌చ్చేరోజుల్లో ఈ కార్డు క్రెడిట్ మ‌రియు డెబిట్ – రెండు విధాలుగా ప‌నికొస్తుంది. ఈ మ‌ధ్య ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ వ‌చ్చింది. దానిపేరు ‘పాయింట్ ఆఫ్ సేల్’ – POS‌. మీ ఆధార్ నంబ‌ర్‌, రూపే కార్డు సాయంతో ఎవ‌రికైనా డ‌బ్బులు చెల్లించగ‌ల‌రు. జేబులో నుండి డ‌బ్బులు తీసి, లెక్క‌పెట్ట‌న‌వ‌స‌రం లేదు. డ‌బ్బును మోసుకుంటూ తిర‌గ‌న‌క్కర లేదు. కేంద్ర‌ ప్ర‌భుత్వం కొన్ని చొర‌వలు తీసుకుంటోంది. అందులో ఒక‌టి POS ద్వారా చెల్లింపు ఎలా చేయాలి? డ‌బ్బులు ఎలా తీసుకోవాలి? అన్న‌ది. మేము మొద‌లుపెట్టిన రెండో ప‌ని ‘బ్యాంక్ ఆన్ మొబైల్ – యూనివ‌ర్స‌ల్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ బ్యాంకింగ్ ట్రాన్‌సాక్ష‌న్స్‌-UPI విధానాన్ని మార్చేస్తుంది. మొబైల్ ఫోన్ ద్వారా మ‌నీ ట్రాన్‌సాక్ష‌న్ చేయ‌డం సుల‌భ‌మైపోతుంది. సంతోష‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే, NPCI మ‌రియు బ్యాంకులు ఈ ప్లాట్‌ఫాంను మొబైల్ యాప్ ద్వారా ప్రారంభించే దిశ‌గా కసరత్తు చేస్తున్నాయి. ఒక‌వేళ ఇది క‌నుక జ‌రిగితే, బ‌హుశా మీకు రూపే కార్డును మీతో కూడా అట్టిపెట్టుకునే పని ఉండ‌దు. దేశ‌వ్యాప్తంగా సుమారు 1.25 ల‌క్ష‌ల బ్యాంకింగ్ క‌రెస్పాండెంట్లుగా న‌వ‌యువ‌కుల‌కు భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతున్న‌ది. ఒక‌ర‌కంగా బ్యాంకు మీ గుమ్మం ముందుకు వ‌చ్చే దిశ‌లో ప‌నిచేస్తున్న‌ది. పోస్టాఫీసును కూడా బ్యాంకింగ్ సేవ‌ల కోసం ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతున్న‌ది. ఒక‌వేళ మ‌నం ఈ వ్య‌వ‌స్థ‌ను వినియోగించుకోవ‌డం నేర్చుకున్నామంటే, మ‌న‌కు క‌రెన్సీ అవ‌స‌రం ఉండ‌దు; నోట్ల అవ‌స‌రం ఉండ‌దు; డ‌బ్బుల అవ‌స‌రం ఉండ‌దు. వ్యాపారం దానంత‌ట అదే న‌డుస్తుంది. తత్ఫలితంగా పార‌ద‌ర్శ‌క‌త చోటు చేసుకొంటుంది. రెండో ర‌కం లావాదేవీలు ఆగిపోతాయి. న‌ల్ల‌ ధ‌నం ప్ర‌భావం త‌గ్గిపోతుంది. అందుకే నేను దేశ ప్ర‌జ‌ల‌ను దీనిని మొద‌లుపెట్ట‌వలసిందిగా కోరుతున్నాను. ఒక్క‌సారి మొదలుపెడితే నెమ్మది నెమ్మదిగా, సులభంగా ముందుకు వెళ్ల‌గ‌లం. 30 సంవ‌త్స‌రాల క్రితం మ‌న చేతిలో మొబైల్ ఉంటుంద‌ని మ‌నం ఊహించామా..? మెల్లగా అది అల‌వాటైపోయింది. ఇప్పుడు మొబైల్ లేకుండా ఉండమంటే, ఉండ‌లేం. ఈ న‌గ‌దు ర‌హిత స‌మాజం కూడా అలాంటి రూపాన్నే ధ‌రించ‌వ‌చ్చు. కానీ అది ఎంత త్వరగా జ‌రిగితే, అంత బాగుంటుంది.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా.. ఒలింపిక్స్ మొదలైన‌ప్పుడు మ‌నం త‌ల‌ ప‌ట్టుకుని కూర్చుంటాం. మ‌న‌కు బంగారు పతకం ద‌క్క‌లేదు. రజతం వ‌చ్చిందా.. లేదా కాంస్యంతో సరిపెట్టుకుందామా అనే ఆలోచనే ఉంటుంది. ఈ క్రీడ‌ల‌లో మ‌న‌ ముందు సవాళ్లు ఉన్నాయి. కానీ మ‌నం ఒక మంచి వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేయాలి. రియో ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులను ప్రోత్స‌హించ‌డానికి, వారి ప‌ట్టుద‌ల‌ని రెండింతలు చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌ త‌మ‌ పద్ధతులలో; కొంద‌రు కార్టూన్స్ ను గీసి, శుభాకాంక్ష‌లు తెలియజేస్తారు. ఎవ‌రు ఏ క్రీడ‌ను ప్రోత్స‌హించినా.. దేశ‌ ప్ర‌జ‌లు ఈ క్రీడాకారుల ప‌ట్ల సానుకూల వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేయాలి. ఆట ఆటే. ఇందులో గెలుపూ ఉంటుంది. ఓట‌మీ ఉంటుంది. పతకాలు వ‌స్తాయి. ఒక్కొక్క‌సారి రావు కూడా. కానీ గ‌ట్టి ప‌ట్టుద‌ల ఉండాలి. ఈ విష‌యంలో మ‌న క్రీడా మంత్రి శ్రీ స‌ర్బానంద్ సోనోవాల్ చేసిన ఒక ప‌ని నా మ‌న‌సుకు హ‌త్తుకుపోయింది. దానిని మీకు వెల్లడించాల‌నుకుంటున్నాను. మేమంతా గ‌త‌ వారం ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నాం. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయో.. అస‌లేం జ‌రుగుతుందో అని చూస్తున్నాం. స‌ర్బానంద్ గారు స్వ‌యంగా అస్సాం ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. కానీ వారు అప్ప‌టికే కేంద్ర‌ ప్ర‌భుత్వంలో మంత్రి. నాకు ఈ విష‌యం తెలిసి చాలా సంతోషం అనిపించింది. వారు అస్సాం ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా ప‌టియాలా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ – NIS లో ఒలింపిక్స్ కు వెళ్లే ఆట‌గాళ్లు శిక్షణ పొందుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వారు అక‌స్మాత్తుగా అక్క‌డికి చేరుకోవ‌డం అక్క‌డ ఉన్న క్రీడాకారుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది క్రీడా జ‌గ‌త్తునే అచ్చెరువుకు గురిచేసే విష‌యం. ఒక మంత్రి ఈ విధంగా క్రీడాకారుల గురించి ఆలోచించడం, క్రీడాకారుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు ఇవ్వ‌బ‌డ్డాయి..?, భోజ‌నం ఎలా ఉంది..?, వారి శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పౌష్టికాహారం అంద‌జేయ‌బ‌డుతున్న‌దా.. లేదా..? స‌రైన శిక్షకులు ఉన్నారా.. లేదా..? శిక్ష‌ణకు కావ‌ల‌సిన ప‌రిక‌రాలు స‌రిగ్గా ప‌నిచేస్తున్నాయా.. లేదా..? అన్న విష‌యాలను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఒక్కొక్క క్రీడాకారుడి గ‌దిలోకి వెళ్లి చూశారు. క్రీడాకారుల‌తో క‌లసి భోజ‌నం చేశారు. ఎన్నిక‌ల ఫలితాలు వ‌స్తున్నాయి.. ముఖ్య‌మంత్రిగా కొత్త బాధ్య‌త‌లు స్వీక‌రించాలి; కానీ, నా ఒక స్నేహితుడొకరు క్రీడా మంత్రిగా త‌మ కర్తవ్యం పట్ల ఇంతగా ఆలోచించ‌డం నాకు ఆనందాన్ని క‌ల‌గ‌జేసింది. ఇదే విధంగా మ‌నం క్రీడ‌ల యొక్క ప్రాముఖ్య‌త‌ను తెలుసుకుంటామ‌ని నా పూర్తి న‌మ్మ‌కం. క్రీడా జ‌గత్తులో ఉన్న‌వారిని ప్రోత్స‌హిద్దాం, క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిద్దాం. ఇది వారికి అతి పెద్ద బ‌లంగా మారుతుంది. 125 కోట్ల మంది ప్ర‌జ‌లు త‌మతో ఉన్నార‌ని క్రీడాకారుడికి తెలిసిన‌ప్పుడు ఆ ఉత్సాహం ద్విగుణీకృతం అవుతుంది.

పోయిన‌సారి నేను ఎఫ్ఐఎఫ్ఎ అండ‌ర్‌-17 వ‌ర‌ల్డ్‌క‌ప్ గురించి మాట్లాడాను. దేశం న‌లుమూల‌ల నుంచి నాకు చాలా స‌ల‌హాలు అందాయి. ఈ మ‌ధ్య నేను చూసిందేమిటంటే ఫుట్‌బాల్ యొక్క వాతావ‌ర‌ణం దేశ‌మంతటా క‌న‌ప‌డుతోంది. చాలా మంది చొర‌వ తీసుకుని త‌మ‌ త‌మ జ‌ట్ల‌ను త‌యారు చేస్తున్నారు. NarendraModi Mobile App ద్వారా నాకు చాలా స‌ల‌హాలు అందాయి. చాలామంది ఆట‌లు ఆడ‌రు. కానీ వేల‌ కోట్ల ప్ర‌జ‌లు ఈ క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్నారు. ఈ విష‌యం నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్న‌ది. క్రికెట్‌తో మ‌న దేశానికున్న అనుబంధం గురించి అంద‌రికీ తెలిసిందే. కానీ ఫుట్‌బాల్ ప‌ట్ల కూడా ఈ మ‌క్కువ మంచి భ‌విష్య‌త్తుకు శుభ‌ సంకేతం. రియో ఒలింపిక్స్‌కు వెళ్లే మ‌న ప్రియ‌మైన క్రీడాకారుల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన‌, ఉత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఇద్దాం. ప్ర‌తి దానినీ గెలుపోట‌ముల‌తో ముడిపెట్ట‌కండి. క్రీడా స్ఫూర్తితో భార‌త‌దేశం ప్ర‌పంచంలో గుర్తింపు తెచ్చుకుంటోంది. క్రీడా ప్ర‌పంచంలో ఉన్న‌వారిని ప్రోత్స‌హించి, ఉత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో త‌మ‌ త‌మ‌ వంతు ప్ర‌య‌త్నించ‌మ‌ని దేశ‌ ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాను.

గ‌త ఎనిమిది, తొమ్మిది రోజుల నుండి ఏదో ఒక చోట నుండి ఫ‌లితాలు వ‌స్తున్నాయి.. నేను ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి మాట్లాడ‌టం లేదు. సంవ‌త్స‌రం పొడ‌వునా క‌ష్ట‌ప‌డి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను. ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.. ఒక‌దాని త‌రువాత మరొక‌టిగా ప‌రీక్షా ఫ‌లితాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో మ‌న అమ్మాయిలు వారి మేథాశక్తిని చాటి చెప్పారు. సంతోష‌క‌ర‌మైన వార్త‌.

ఈ ప‌రిణామాల‌లో నెగ్గిన‌వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఉత్తీర్ణులు కాని వారికి మ‌రోసారి నేను చెప్పేదేమిటంటే, జీవితంలో చేయ‌డానికి చాలా ఉంది. మ‌నం అనుకున్న ప‌రిణామాలు రాక‌పోతే, జీవితం అక్క‌డే ఆగిపోదు. ఆత్మ‌ విశ్వాసంతో జీవించాలి, ఆత్మ‌ విశ్వాసంతో ముందుకు సాగాలి.

కానీ ఒక కొత్త‌ ర‌కం స‌మ‌స్య నా ముందుకు వ‌చ్చింది. నేను ఈ విష‌యం ఎప్పుడూ ఆలోచించ‌లేదు. నా mygov.in సైట్ లో ఒక ఇ-మెయిల్ వ‌స్తే, నా దృష్టి అటు వైపు వెళ్లింది. మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌కు చెందిన గౌర‌వ్ ప‌టేల్ అనే ఆయన త‌న సమ‌స్యను నా ముందు ఉంచారు. గౌర‌వ్ ప‌టేల్ చెప్పింది ఇదీ.. నేను ఎమ్. పి. బోర్డ్ ప‌రీక్ష‌ల‌లో 89.33 శాతం మార్కులు సంపాదించి, ఉత్సాహంగా ఇంటికి చేరాను. నాలుగు వైపుల నుంచి నాకు అభినంద‌న‌లు అందుతాయి అని ఊహించాను. కానీ అంద‌రూ ”అయ్యో! ఇంకో నాలుగు మార్కులు వ‌స్తే, 90 శాతం అయ్యేది క‌దా! అన‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అంటే- నా కుటుంబం, నా స్నేహితులు, నా టీచ‌ర్.. ఎవ‌రూ కూడా నా 89.33 శాతం మార్కుల‌తో సంతోష‌ప‌డ‌లేదు. అంద‌రిదీ ఒకే మాట‌.. ”ఇంకో నాలుగు మార్కులు వ‌స్తే, 90 శాతం అయ్యేది క‌దా” అనే. ఇటువం

టి ప‌రిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావ‌డంలేదు. జీవితంలో ఇదే స‌ర్వ‌స్వ‌మా..? నేను చేసింది క‌రెక్ట్ క‌దా…? నేను త‌క్కువ చ‌దివానా..? ఏమో.. నా మ‌న‌సుపై ఇది ఒక భారంగా అనిపిస్తుంది అంటూ ఆయన రాసి పంపారు.

గౌర‌వ్‌.. మీరు చెప్పింది ఎంతో జాగ్ర‌త్త‌గా విన్నాను. అందులో క‌నిపించే ఆవేద‌న మీ ఒక్క‌రిదే కాదు. అది మీలాంటి ల‌క్ష‌ల, కోట్ల విద్యార్థుల‌ది అయి ఉండాలి. ఎందుకంటే. వాతావ‌ర‌ణ‌మే అలా మారిపోయింది కాబ‌ట్టి. సాధించిన దానికి సంతోషప‌డ‌కుండా సాధించ‌ని దాని గురించి వెతుకులాడ‌టం – ఇది ఏమీ చేయ‌లేక‌పోవ‌డానికి, వెనుక‌డుగు వేయ‌డానికి దారి తీస్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ అసంపూర్ణ‌త్వాన్నే అంటే – వెలితినే వెతుకుతుంటే, మ‌నం స‌మాజాన్ని సంతోషం వైపు న‌డిపించ‌గ‌ల‌మా…? లేదు. మీరు సాధించిన 89.33 శాతం మార్కుల్ని మీ వాళ్లు, మీ మిత్రులు, మీ సాటి వారు మెచ్చుకుని ఉంటే బాగుండేది. ముందుముందు మ‌రింత అభివృద్ధి సాధించాల‌ని మీకు తోచుండేది. మీ అంద‌రినీ నేను కోరేది ఏమిటంటే – మీ పిల్ల‌లు ప‌రీక్ష ఫ‌లితాలు ఇంటికి తెచ్చిన‌ప్పుడు, వాటిని వాస్త‌వాలుగా ఒప్పుకోండి. సంతోషంగా, మ‌న‌స్ఫూర్తిగా మెచ్చుకోండి అని. మ‌రింత అభివృద్ధిని సాధించేందుకు వాళ్ల‌ను ప్రోత్స‌హించండి. లేక‌పోతే, వాళ్లు నూటికి నూరు తెచ్చుకున్నా – ”వంద‌కి వంద వ‌చ్చాయి, స‌రే. ఇంకా ఏదైనా చేసి ఉంటే బాగుండేది” అనే రోజు కూడా వ‌స్తుంది! ప్ర‌తి విష‌యానికి హ‌ద్దులుంటాయి. అది మ‌రిచిపోవద్దు.

జోధ్‌పూర్ నుంచి సంతోష్ గిరిస్వామి కూడా దాదాపు ఇలాగే రాశారు. ఆయ‌న అన‌డం ఏమిటంటే .. నా చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాళ్లు మ‌న ప‌రిస్థితుల్ని గుర్తించ‌డం లేదు అని. ఏదో ఒక‌టి- ఏదో ఒక‌టి మంచి చెయ్యాలంటారాయ‌న. చాలాకాలం క్రితం ఒక క‌విత చ‌దివాను. ఆ పంక్తులు స‌రిగా గుర్తులేవు. కానీ ఆ క‌వి ఏం రాశారంటే – జీవితం అనే బొమ్మలు వేసే గుడ్డ మీద నా వేద‌న‌ని చిత్రించాను. ఆ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచిన‌ప్పుడు చూసిన‌ వాళ్లు ”దీనికి మెరుగులు దిద్దాలి, నీలం రంగు బ‌దులు ప‌సుపు రంగు వాడుంటే బాగుండేది, ఆ గీత‌లు ఇటునుంచి కాకుండా అటునుంచి ఉండుంటే బాగుండేది” అని సూచనలు చేశారు ! నా చిత్రాన్ని చూసిన‌ వాళ్ల‌లో క‌నీసం ఒక‌రైనా క‌న్నీళ్లు పెట్టుకుంటారేమోన‌ని ఆశ‌ప‌డ్డాను అన్నారు. ఆయన సరిగ్గా ఈ మాట‌లే అన్న‌ట్లు నాకు గుర్తు లేదు. చాలా కాలం క్రితం రాసిన క‌విత అది. అయితే దాని భావం మాత్రం ఇదే. ఆ చిత్రంలో క‌నిపించే వేద‌న‌ను అర్థం చేసుకోవ‌డం లేదు కానీ, దానికి మెరుగులు దిద్దాల‌ని చెప్పేవాళ్లే ఎక్కువ మంది. సంతోష్‌గిరి గారు.. మీ ఆవేద‌న కూడా గౌర‌వ్ ఆవేద‌న లాగా .. కోటానుకోట్ల విద్యార్థుల వేద‌న‌ మాదిరిగానే ఉంది. ప్ర‌జ‌ల కోరిక‌ల‌ను పూర్తి చేసే బాధ్య‌త మీ మీద ఉంది. మిమ్మ‌ల్ని నేను కోరేది ఒక‌టే. ఇటువంటి స్థితిలో మీ నిబ్బ‌రాన్ని కోల్పోకండి. ఇత‌రులు చెప్పేది వింటుండండి. కానీ, మీ సంకల్పం నుండి మాత్రం దూరం కాకండి. మీర‌నుకున్న‌ది మ‌రింత బాగా చెయ్య‌డానికి ప్ర‌య‌త్నించండి. అయితే, ఫ‌లితాన్ని చూసి సంతోషించ‌క‌పోతే, కొత్త‌కొత్త నిర్మాణాలను ఎప్పుడూ చేప‌ట్ట‌లేరు. సాధించాం అన్న సంతోష‌మే, మ‌రింత సాధించ‌డానికి తోడ్ప‌డుతుంది. సాధించిన దాంట్లో కొద్దిపాటి నిరుత్సాహం కూడా మ‌రింత సాధించ‌డానికి మెట్టు కాలేదు. కానీ త‌ప్ప‌కుండా వెన‌క్కులాగుతుంది.

అందుక‌ని నేను మిమ్మ‌ల్ని కోరేది ఒక్క‌టే. మీరు ఎంత స‌ఫ‌లీకృతుల‌వుతారో, దాన్ని గుర్తించండి. లోతుల్లోకి వెళ్లండి. అందులో నుండే కొత్త‌వి సాధించ‌డానికి అవ‌కాశం ఉంది. అయితే ముఖ్యంగా మీ చుట్టుప‌క్క‌ల వారితో, మీ త‌ల్లితండ్రుల‌తో, మీ మిత్రుల‌తో చెప్ప‌ద‌ల్చుకున్న‌దేమిటంటే – మీ కోరిక‌ల భారాన్ని ద‌య‌చేసి మీ పిల్ల‌ల‌పై మాత్రం మోప‌కండి. ఒక్క‌టి మిత్రులారా..! జీవితంలో ఎప్పుడైనా సాధించ‌లేక‌పోతే ఆ జీవితం అక్క‌డితో ఆగిపోతుందా..? ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించ‌లేని పిల్లవాడు ఆట‌ల్లో అభివృద్ధి సాధిస్తాడు, సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. చిత్ర‌లేఖ‌నంలో మెరుపులు చూపిస్తాడు, వ్యాపారంలో ముందుకువెళ‌తాడు. భ‌గ‌వంతుడు ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక అద్భుతమైన క‌ళ‌ని అందించే ఉంటాడు. అయితే, మీలో దాగివున్న ఆ శ‌క్తిని మీరు గుర్తించండి. దానికి మ‌రింత బ‌లాన్ని అందించండి. మీరు ముంద‌డుగు వేయ‌డం ఖాయం. జీవితంలో ఇది ఎదురుప‌డుతూనే ఉంటుంది. సంతూర్ అనే వాద్య‌ప‌రిక‌రం గురించి మీరు వినే ఉంటారు. ఒక‌ప్పుడు దీన్ని కశ్మీర్ లోయ‌లో జాన‌ప‌ద సంగీతంలో మాత్ర‌మే వాడేవారు దానిని. కానీ పండిట్ శివ‌కుమార్ అనే ఆయన దీన్ని వాడారు. ఫ‌లితం…? మొత్తం ప్ర‌పంచంలోనే అది ఒక గొప్ప వాద్య‌ప‌రిక‌ర‌మైంది. మ‌రి షెహ‌నాయి? ఒక‌ప్పుడు కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మై, మ‌హారాజుల కోట‌ గోడ‌ల మీద వాయింప‌బ‌డేది. కానీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మ‌హోద‌యుడు దాని మీద చేయి వేసిన తరువాత అది ఒక ఉత్త‌మ వాద్యంగా గుర్తించ‌బ‌డి ,విశ్వ‌విఖ్యాత‌మైంది. అందుక‌ని, మీలో ఏం ఉంది… ఎలా ఉంది.. అన్న చింత వ‌దిలి, ఉన్న‌దాన్ని బ‌లోపేతం – మ‌రింత బ‌లోపేతం చెయ్యండి. ఫ‌లితం దానంత‌ట అదే వ‌స్తుంది.

ప్రియ‌మైన దేశ‌వాసులారా .. మ‌న దేశంలో బీద కుటుంబాల‌లో ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి అయ్యే ఖ‌ర్చు ఒక్కొక్క‌ సారి వాళ్ల జీవ‌న‌ రీతుల్ని ఛిన్నభిన్నం చేయ‌డం అప్పుడ‌ప్పుడూ చూస్తుంటాం. రోగం రాకుండా ఉండేందుకు అయ్యే ఖ‌ర్చు నిజానికి చాలా త‌క్కువే. కానీ రోగం బారిన‌ప‌డి, దానిని న‌యం చేసుకోవ‌డానికయ్యే ఖ‌ర్చు మాత్రం చాలా ఎక్కువ‌. మ‌రి రోగాలే రాకుండా జాగ్ర‌త్త‌ప‌డి, మ‌న కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుప‌ర్చుకునేలా మ‌నం ఎందుకని జీవించకూడ‌దు…? రోగాల నుండి కాపాడుకోవాలంటే అన్నిటిక‌న్నా పెద్ద ఆయుధం శుభ్ర‌త‌. పేద‌వారికి ఎక్కువ‌గా లాభం చేకూర్చేది కేవ‌లం శుభ్ర‌తే. రెండో ఆయుధం ఏమిటంటే, నేను ప్ర‌తిసారి చెబుతుంటానే యోగం. దాన్ని యోగా అంటారు. జూన్ 21 అంత‌ర్రాష్ట్రీయ యోగా దినం. ప్ర‌పంచ‌మంత‌టా ఈ యోగా ప‌ట్ల ఒక ఆక‌ర్ష‌ణ‌, ఒక శ్ర‌ద్ధ ఉన్నాయి. ఎంతో మంది దీనిని స్వీక‌రించారు కూడా. స‌మ‌స్య‌ల‌తో నిండిపోయిన ఈ ప్ర‌పంచంలో సుఖంగా జీవించ‌డానికి కావ‌ల‌సిన శ‌క్తిని యోగా ఇస్తుంది. చికిత్స కంటే నివార‌ణ ముఖ్యం అన్నారు. యోగ‌ సాధ‌న చేసే వ్య‌క్తి ఆరోగ్యంగా ఉండ‌గ‌ల‌డు. తృప్తితో ఉండ‌గ‌ల‌డు, చ‌లించని మ‌నోనిబ్బ‌రాన్ని, ఏకాగ్ర‌త‌ను పెంపొందించుకోగ‌లడు, అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌డు- ఇవ‌న్నీ అత‌నికి సాధ్య‌మ‌వుతాయి. జూన్ 21న యోగా దినం. ఇది ఒక కార్య‌క్ర‌మం కాదు. ఇదేమిట‌నేది అంద‌రికీ తెలియాలి. ప్ర‌తిఒక్క‌రూ యోగాని వారి జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వారి దినచ‌ర్య‌లో 20, 25, 30 నిమిషాలు దీని కోసం కేటాయించాలి. మ‌న జీవితాల‌ను ఇలా మార్చుకోవ‌డానికి జూన్ 21 మ‌న‌కు ప్రేరణ కావాలి. ఒక్కొక్క‌ సారి సామూహిక వాతావ‌ర‌ణం మ‌నిషి జీవితంలో మార్పు తీసుకురావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. నేను కోరేది ఏమిటంటే.. జూన్ 21న‌, మీరుండేది ఏ ప్రాంత‌మైనా స‌రే. మీకు ఇంకా ఒక నెల‌ రోజులు స‌మ‌యం ఉంది. మీరు భార‌త ప్ర‌భుత్వ‌పు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈసారి యోగా సిలబ‌స్ ఏమిటి..? ఏ ఏ ఆస‌నాలు ఏ విధంగా చేయాలి.. ఈ వివ‌రాలన్నీ పూర్తిగా వివ‌ర‌ణ‌ల‌తో ఉన్నాయి. వాటిని చూడండి. మీ గ్రామంలో వేయించండి. మీ ప్రాంతంలో వేయించండి. మీ ప‌ట్ట‌ణంలో వేయించండి. మీ బ‌డిలో వేయించండి. మీరు ఎక్క‌డుంటే అక్క‌డ వేయించండి ఇవాళ్టి నుంచి ఒక‌నెల ! ప్రారంభించండి ! చూస్తుండండి, జూన్ 21న మీరూ ఒక భాగ‌స్వామి అవుతారు. నేను చాలా చోట్ల చ‌దివాను కార్యాలయాలలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఉద‌యాన్నే సామూహికంగా వ్యాయామం లాంటివి చేసిన‌ప్పుడు అక్క‌డివారు ఎంతో అభివృద్ధిని సాధించార‌ట‌. ఆ ఆఫీసు వాతావ‌ర‌ణ‌మే పూర్తిగా మారిపోయిందంట‌. మ‌రి మ‌న జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేసుకోవ‌డానికి జూన్ 21ను మ‌నం ఉప‌యోగించుకోలేమా? మ‌న చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల్లో యోగాను వ్యాప్తి చేయ‌లేమా? చెయ్య‌గ‌లం! చెయ్యాలి! ఈసారి నేను చండీగ‌ఢ్‌లో జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మానికి వెళ్ల‌బోతున్నాను. జూన్ 21న చండీగ‌ఢ్‌ వాసుల‌తో క‌లసి యోగాస‌నాలు వెయ్య‌బోతున్నాను. ఆరోజు మీరు కూడా అంద‌రితో పాటు విశ్వ‌వ్యాప్తంగా యోగ‌స‌నాలు వెయ్య‌బోతున్నారు. ఎటువంటి స్థితిలోనైనా వెనుక‌బ‌డిపోవొద్దు. ఇదే నా కోరిక‌. భార‌త‌దేశం ఆరోగ్యంగా ఉండాలంటే, మీరంద‌రూ ఆరోగ్యంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం.

ప్రియమైన నా దేశ ప్రజలారా.. ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమం ద్వారా నిరంత‌రం మిమ్మ‌ల్ని క‌లుస్తుంటాను. చాలా కాలం క్రింద‌ట నేను మీకు ఒక మొబైల్ నంబ‌ర్ ను ఇచ్చాను. దానికి మీరు మిస్ డ్ కాల్ ఇచ్చి ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని విన‌వ‌చ్చు అని చెప్పాను. ఇప్పుడ‌ది మ‌రింత సుల‌భ‌త‌రం అయింది. మీరు కేవ‌లం నాలుగంకెల నంబ‌ర్‌కు మిస్ డ్ కాల్ ఇచ్చి, ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమం విన‌వ‌చ్చు. ఆ నంబ‌ర్ 1922. మీరు ఎక్క‌డుంటే అక్క‌డ‌, ఎప్పుడంటే అప్పుడు, ఏ భాషలో అంటే ఆ భాష‌లో ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని విన‌వ‌చ్చు.

ప్రియమైన నా దేశ ప్రజలారా.. మీ అంద‌రికీ మ‌రొక‌సారి నమస్కారములు. దయచేసి నేను నీటిని గురించి చెప్పిన మాట‌లను మీరు మ‌రిచిపోకండి. వాటిని మీరు జ్ఞాప‌కం పెట్టుకొనే తీరుతారు, కదూ? సరేనా ! మరి ఇక, ధ‌న్య‌వాదాలు. న‌మ‌స్తే!