Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘అటల్ భూజల యోజన’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


   కీర్తిశేషులైన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అటల్ భూజల యోజన’ (అటల్ జల్)కు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా, న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో భాగం గా రోహతంగ్ కనుమ వ్యూహాత్మక సొరంగానికి వాజ్‌పేయి పేరు పెట్టారు.

 PM India

అనంతరం ప్రసంగిస్తూ- హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మనలి-జమ్ము, క‌శ్మీర్‌, లద్దాఖ్, లేహ్ ప్రాంతాలను అనుసంధానించే, దేశాని కి అత్యంత ప్రధానమైన అతిపెద్ద ప్రాజెక్టు రోహతంగ్ సొరంగానికి ‘వాజ్‌పేయి సొరంగం’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహాత్మక సొరంగం తో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం లో పర్యాటకానికి విశేష ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

 

 ‘అటల్ భూజల యోజన’ గురించి వివరిస్తూ- మానవాళికి ప్రాణాధారమైన నీటిని అత్యంత ప్రధానాంశం గా అటల్ భావించేవారని, ఇది ఆయన హృదయానికి ఎంతో చేరువైన అంశమని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ మేరకు ఆయన దార్శనికతను సాకారం చేయడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. దేశం లోని ప్రతి కుటుంబానికీ 2024 నాటికల్లా నీరు సరఫరా చేయాలన్న సంకల్పం నెరవేర్చే దిశగా ‘అటల్ జలయోజన’ లేదా ‘జల్ జీవన్ మిషన్’ సంబంధిత మార్గదర్శకాలు అతిపెద్ద ముందడుగని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జల సంక్షోభం ఒక కుటుంబం గా, ఒక పౌరుడు గా, ఒక దేశం గా అందరినీ కలతపెట్టే సమస్యేనని, ఇది అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. కాబట్టి జల సంక్షోభానికి సంబంధించిన ప్రతి పరిస్థితినీ చక్కదిద్దడానికి నవభారతం మనను సిద్ధంచేయాలని సూచించారు. ఇందుకోసమే తాము ఐదు స్థాయుల లో సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు.

PM India

 

నీటికి సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ విభాగీకరణ విధానాని కి స్వస్తి చెప్పి విపుల, విశిష్ట విధానాలపై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి వివరించారు. ఆ మేరకు ప్రస్తుత వర్షాకాలం లో జల సంరక్షణ కోసం సమాజం తరఫున జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంత విస్తృతం గా కృషి చేసిందో మనమంతా ప్రత్యక్షం గా చూశామని గుర్తు చేశారు. జల జీవన్ మిషన్ ఒకవైపు కొళాయిల ద్వారా ఇంటింటి కీ నీరు సరఫరా చేస్తే… మరొకవైపు భూగర్భ జలాలు అతి తక్కువగా ఉన్న ప్రాంతాలపై అటల్ జల్ యోజన ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని ఆయన చెప్పారు. జల నిర్వహణలో పంచాయతీలు చక్కగా పని చేసే విధంగా ప్రోత్సహించడం కోసం అటల్ జల యోజన లో ఒక నిబంధనను చేర్చామని ప్రధాన మంత్రి తెలిపారు. ఆ మేరకు మెరుగైన పనితీరు కనబరచే పంచాయతీలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

 

దేశంలోని మొత్తం 18 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను గడచిన 70 సంవత్సరాల్లో 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే కొళాయిల ద్వారా నీరు సరఫరా అవుతున్నదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యం లో తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్ల కాలంలో 15 కోట్ల కుటుంబాలకు కొళాయిల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాను లక్ష్యంగా నిర్దేశించుకున్నదని తెలిపారు.

 

జల సంబంధ పథకాలను ప్రతి గ్రామం స్థాయిలో పరిస్థితులకు తగినట్లుగా రూపొందించుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జల జీవన్ మిషన్ మార్గదర్శకాల రూపకల్పన లో శ్రద్ధ తీసుకున్నామని ఆయన వివరించారు. తదనుగుణంగా ఐదేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల సంబంధ పథకాల కోసం రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాయని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ జల కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకుని, జల నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జల బడ్జెట్ రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. 

 

అటల్ భూజల యోజన (అటల్ జల్)

 

భాగస్వామ్య పూర్వక భూగర్భ జల నిర్వహణ కోసం వ్యవస్థీకృత చట్రాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ‘‘అటల్ జల్’’ పథకాని కి ప్రభుత్వం రూపుదిద్దింది.  అలాగే సుస్థిర భూగర్భజల నిర్వహణతోపాటు సామాజిక స్థాయి లో ప్రవర్తన పూర్వక మార్పులు తేవడం కూడా దీని ప్రధానోద్దేశం. ఈ మేరకు గుజరాత్, హరియాణా, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ పథకం అమలవుతుంది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లోని 78 జిల్లాల పరిధిలో గల 8,350 పంచాయతీలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. జల అవసరాల వైపు నిర్వహణ పై ప్రధానం గా దృష్టి సారిస్తూ పంచాయతీల నేతృత్వం లో భూగర్భజల సమర్థ నిర్వహణ, ప్రవర్తన పూర్వక మార్పుల కోసం ‘అటల్ జల్’ కృషి చేస్తుంది.

 

ఏడు రాష్ట్రాల్లో మొత్తం రూ. 6,000 కోట్లతో ఐదేళ్ల పాటు (2020-21 నుంచి 2024-25వరకు) ఈ పథకం అమలవుతుంది.  ఈ నిధుల్లో 50 శాతం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం గా లభిస్తుండగా, దీన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 50 శాతం నిధులను సాధారణ బడ్జెట్ మద్దతుకింద కేంద్ర సాయంగా అందజేస్తుంది. ప్రపంచ బ్యాంకు రుణం, కేంద్ర సాయం రూపం లో నిధులను గ్రాంటు కింద కేంద్రం రాష్ట్రాల కు మంజూరు చేస్తుంది.

 

రోహతంగ్ కనుమకింద సొరంగం

 

టల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి గా ఉన్న సమయం లో  రోహతంగ్ కనుమ కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8.8 కిలో మీటర్ల దూరం, భూమి కి 3,000 మీటర్ల ఎత్తున నిర్మితమవుతున్న ఈ సొరంగం ప్రపంచం లోనే అత్యంత పొడవైనది. దీనివల్ల మనలి నుంచి లేహ్ వరకూ 46 కిలో మీటర్ల మేర దూరం తగ్గి, కోట్ల రూపాయల మేర రవాణా వ్యయం ఆదా అవుతుంది. మొత్తం 10.5 మీటర్ల వెడల్పు తో, రెండు వరుసల మార్గం గా సిద్ధమవుతున్న ఈ ప్రధాన సొరంగం లోనే అత్యవసర అగ్ని నిరోధక సొరంగం కూడా అంతర్భాగం గా ఉంటుంది. సొరంగం తొలిచే పనులు రెండువైపుల నుంచీ ప్రారంభం కాగా, 2017 అక్టోబరు 15 నాటికి సంపూర్ణ మార్గం ఏర్పడింది. సాధారణం గా ప్రతి శీతాకాలం లో హిమాచల్ ప్రదేశ్-లద్దాఖ్ సరిహద్దున గల మారుమూల ప్రాంతాల మధ్య ఆరు నెలలపాటు సంబంధాలు తెగిపోతుంటాయి. ఈ నేపథ్యం లో సొరంగం పనులు త్వరలో పూర్తి కానుండటంతో కాలాలతో నిమిత్తం లేకుండా నిరంతర సంధానం సుగమం కానుంది.

***