దేశ రక్షణ దళాలను అజమాయిషీ చేసే ఉన్నతాధికారవర్గంలో సంస్కరణలు చేపట్టే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన్ కేంద్ర మంత్రిమండలి ఫోర్ స్టార్ జనరల్ హోదాలో రక్షణ సిబ్బంది ప్రధానాధికారి పదవిని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోర్ స్టార్ జనరల్ వేతనం, ప్రత్యేక భత్యాలు, పరిలబ్ధి తదితర సౌకర్యాలు సైనిక విభాగం అధిపతితో సమానంగా ఉంటాయి. రక్షణ మంత్రిత్వ శాఖలో ఏర్పాటుచేసే సైనిక వ్యవహారాల శాఖకు (డిఎంఎ) రక్షణ సిబ్బంది ప్రధానాధికారి అధిపతిగా ఉంటారు. ఆయన దాని కార్యదర్శిగా విధులు నిర్వహిస్తారు.
సిడిఎస్ నేతృత్వంలోని సైనిక వ్యవహారాల శాఖ పర్యవేక్షణలో :
i. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైనిక దళాలు అనగా సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళం
ii. సైన్యం, నౌకాదళ. వైమానికదళ మరియు రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయాలతో కూడిన రక్షణ మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్రధాన కార్యాలయం
iii. ప్రాదేశిక సైన్యం
iv. సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలకు సంబందించిన పనులు
v. ప్రస్తుతం అమలులో ఉన్న నియమనిబంధనల ప్రకారం పెట్టుబడి వస్తువులను పొందడం మినహా సైనిక విభాగాల అవసరాల కోసం ప్రత్యేక సేకరణ
పైన తెలిపినవి కాకుండా సైనిక వ్యవహారాల శాఖ అధికార పరిధి (ఫర్మానా) ఈ దిగువ పేర్కొన్న వాటికి కూడా వర్తిస్తుంది.
ఎ. ఉమ్మడి ప్రణాళిక మరియు వాటి అవసరాలను ఏకీకృతం చేయడం ద్వారా సేకరణ, శిక్షణ మరియు రక్షణ దళాలకు సిబ్బంది నియామకంలో ఉమ్మడి పద్దతిని ప్రోత్సహించడం.
బి. పూర్తిస్థాయిలో, అభిలషణీయ రీతిలో వనరులను వినియోగించడానికి వీలుగా సైనిక దళ కమాండ్ల పునర్నిర్మాణం. ఇందుకోసం కార్యకలాపాల నిర్వహణకు ఉమ్మడి కమాండ్ల ఏర్పాటుతో సహా ఉమ్మడి సైనిక చర్య
సి. రక్షణ దళాలు దేశీయ ఉపకరణాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం
రక్షణ సిబ్బంది ప్రధానాధికారి హోదాలో సైనిక వ్యవహారాల శాఖ అధిపతిగానే కాక త్రివిధ దళాల సిబ్బంది అధిపతుల సంఘం శాశ్వత చైర్మనుగా కూడా ఉంటారు. త్రివిధ దళాలకు సంబందించిన విషయాలపై రక్షణ మంత్రికి ఆయన ప్రధాన సైనిక సలహాదారుగా ఉంటారు. ఆయా దళానికి సంబంధించిన విషయాలపై వాటి అధిపతులు కూడా రక్షణ మంత్రికి సలహాలు ఇస్తుంటారు. రాజకీయ నాయకత్వానికి నిష్పాక్షిక సలహాలు ఇవ్వడానికి వీలుగా రక్షణ సిబ్బంది ప్రధానాధికారి ఏ ఒక్క దళానికో ప్రాతినిధ్యం వహించకుండా సమగ్ర నాయకత్వాన్ని అందిస్తారు.
త్రివిధ దళాల సిబ్బంది అధిపతుల సంఘం శాశ్వత చైర్మన్ హోదాలో రక్షణ సిబ్బంది ప్రధానాధికారి ఈ దిగువ విధులను
నిర్వహిస్తారు :
• త్రివిధ దళాలకు సంబందించిన సంస్థల పరిపాలనా వ్యవహారాలను సిడిఎస్ చూస్తారు. త్రివిధ దళాల ఏజెన్సీలు/సంస్థలు/కమాండ్ల పరిధిలోని సైబర్, రోదసీకి సంబంధించినవి అన్ని కూడా సిడిఎస్ ఆజ్ఞాపాలన చేస్తుంటాయి.
రక్షణ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే రక్షణ సేకరణ మండలిలో, జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షతన జరిగే రక్షణ ప్రణాళికా కమిటీలో సిడిఎస్ సభ్యుడుగా ఉంటారు. అణుశక్తి వ్యవహారాలకు ఆధిపత్యం వహించే సాధికార సంస్థకు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
మొదటి సిడిఎస్ బాధ్యతలు చేపట్టిన మూడేళ్ళ లోపల త్రివిధ దళాలకు సంబంధించిన సైనికచర్యలు, వ్యూహరచన, సైనిక వసతి తంత్రం, రవాణా, శిక్షణ, మద్దతు సేవలు, కమ్యునికేషన్లు, మరమ్మతులు మరియు నిర్వహణ మొదలగునవి సంయుక్తం చేయడం. మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించడం మరియు త్రివిధ దళాలను ఏకీకృతం చేయడం ద్వారా హేతుబద్దంగా మార్చడం.
అయిదేళ్ళ రక్షణ యంత్రాలు, భూవసతి, మూలధన సముపార్జన ప్రణాళిక, సమగ్ర సామర్ధ్య అభివృద్ధి ప్రణాళిక తదుపరి చర్యగా రెండేళ్ళ వార్షిక సేకరణ ప్రణాళిక అమలు చేయాలి. ఆశిస్తున్న బడ్జెట్ అంచనాలను దృష్టిలో ఉంచుకొని మూల ధన సముపార్జన ప్రతిపాదనలలో అంతర్ సేవల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించిపెట్టాలి.
• దుబారా ఖర్చును తగ్గించడం ద్వారా సాయుధ దళాల పోరాట సామర్ధ్యాన్ని పెంచే లక్ష్యంతో త్రివిధ దళాల విధినిర్వహణలో సంస్కరణలు తేవడం.
రక్షణ దళాల ఉన్నతాధికారవర్గంలో/యాజమాన్యంలో ఈ సంస్కరణ ద్వారా సాయుధ దళాలు రక్షణ సిద్ధాంతాలను, పద్ధతులను సమన్వయంతో అమలు చేయడానికి దోహదం చేసి త్రివిధ దళాలలో సంయుక్తతకు దోహదం చేస్తుంది. శిక్షణ, వ్యూహరచన, సైనికచర్యలలో సమన్వయంతో వ్యవహరించడంతో పాటు ప్రాధాన్యతా క్రమంలో ఆయుధాలు, యంత్రపరికరాల సేకరణ ద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
నేపధ్యం
2019 ఆగస్టు 15వ తేదీన ప్రధాన మంత్రి చేసిన ప్రకటన దరిమిలా కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ప్రధానమంత్రి ఇతర విషయాలతో పాటు “ఇండియా చేపట్టే విధానాలన్నీ ముక్కలు చెక్కలుగా కాకుండా సమష్టిగా ఉండాలి. మన మొత్తం సైనిక శక్తి ఏకీకృతంగా పనిచేస్తూ ముందంజవేయాలి. త్రివిధ దళాలు అన్నీ ఒకే సారి కదలాలి, ఒకే వేగంతో ముందుకు సాగాలి. వాటి మధ్య మంచి సమన్వయము ఉండాలి. అది దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సాంగత్యంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధరీతులు, భద్రతా వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. సిడిఎస్ పదవి ఏర్పాటు తరువాత అన్ని దళాలకు పై స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వం లభిస్తుంది” అని అన్నారు.
******