భవిష్యత్‌లో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా జామ్ ఉపయోగపడుతుంది.
నా దృష్టిలో జామ్ అంటే అధికంగా లబ్ధి పొందడం.
ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నుంచి ఎంత వీలైతే అంత విలువను పొందడం. మన పేదలకు అధిక సాధికారితను సాధించడం.
సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం.
– ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
భారతదేశానికి స్వాతంత్ర్యంవచ్చి 67 సంవత్సరాలైన తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేవు. దాంతో వారు తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోలేకపోతున్నారు. అంతే కాదు వారికి సంస్థాగత రుణాలను తీసుకునే అవకాశం కూడా లేదు. ఈ ప్రాథమికమైన సమస్యను పరిష్కరించడానికిగాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 28 ఆగస్టున ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే ఈ పథకం అనేక మంది ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చి లక్షలాది మంది బారతీయుల భవిష్యత్‌కు ఆసరాగా నిలిచింది. ఒక సంవత్సరంలోనే 19.72 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఇంతవరకూ 16.8 కోట్ల రుపే కార్డులను వినియోగదారులకు అందించడం జరిగింది. ఈ పథకం ద్వారా 28,699.65 కోట్ల రూపాయల డిపాజిట్లు సమకూరాయి. రికార్డు స్థాయిలో 1,25,697 బ్యాంక్ మిత్రల (బ్యాంక్ కరస్పాండెంట్లు)ను నియమించడం జరిగింది. రికార్డు స్థాయిలో ఒక వారంలో కొత్తగా 1,80,96, 130 బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ రికార్డు ప్రతిష్టాత్మక గిన్నీస్ వరల్డ్ రికార్డు పుస్తకంలో నమోదైంది.
మిలియన్ల కొద్దీ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించేలా చేయడం ఒక సవాల్. అయితే ఆ కొత్త అకౌంట్లను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవడం మరొక ప్రధానమైన సవాల్. ఈ పథకం కింద ప్రారంభమైన అకౌంట్లలో 2014 సెప్టెంబర్‌నాటికి 76.8 శాతం అకౌంట్లలో జీరో బాలెన్స్ ఉండేది. అయితే 2015 డిసెంబర్ నాటికి ఈ శాతం 32.4 శాతానికి పడిపోయింది. ఇంతవరకు 131 కోట్ల రూపాయలకు పైగా డబ్బును ఓవర్ డ్రాప్ట్ కింద తీసుకోవడం జరిగింది. ప్రధాన మంత్రికున్న బలమైన సంకల్పం, ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా, ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు వచ్చేలా ఆయన చేసిన ప్రచారం కారణంగా ఇదంతా సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ బృహత్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ప్రజలు, ప్రభుత్వ అధికారులు విశిష్టమైన భాగస్వామ్యంతో వ్యవహరించడంవల్ల ఈ స్కీము భారీగా విజయం సాధించింది.
ఈ స్కీము కింద ప్రారంభమైన బ్యాంకు అకౌంట్ల ద్వారా మిలియన్లకొద్దీ భారతీయులకు బ్యాంకుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతే కాదు ఈ అకౌంట్లు అవినీతిని అడ్డుకోవడంలో కూడా ప్రధాన పాత్రను పోషించాయి. ప్రజలకు చేరాల్సిన రాయితీ తాలూకా డబ్బులు నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతున్నాయి. దాంతో రాయితీల వినియోగంలో పారదర్శకత వచ్చింది. నేరుగా నగదు బదిలీకి సంబంధించిన పహల్ యోజన ఈ మధ్యనే ప్రతిష్టాత్మక గిన్నీస్ వరల్డ్ రికార్డుల పుస్తకంలో నమోదైంది. ఈ స్కీము కింద 14.62 కోట్ల మంది నేరుగా నగదు రాయితీలను పొందుతున్నారు. ఈ స్కీము కారణంగా ఇప్పటికే 3.34 కోట్ల డూప్లికేట్ అకౌంట్లకు తెరపడింది. దాంతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగానికి అడ్డుకట్టపడింది. ప్రస్తుతం ప్రభుత్వం 35-40 స్కీముల అమలుకుగాను నేరుగా నగదు బదిలీ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ విధంగా 2015లో దాదాపుగా 40 వేల కోట్ల రూపాయల నగదు నేరుగా లబ్ధిదారులకే చేరింది.
ప్రాథమికమైన బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం మొదలుకాగానే ఎన్‌డిఏ ప్రభుత్వం మరో చరిత్రాత్మక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రజలందరికీ బీమా, పెన్షన్ అందడానికి చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల రూపాయల ప్రమాద బీమాను అందజేయడం జరుగుతోంది. దీనికి గాను వినియోగదారుడు సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లిస్తే చాలు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద జీవిత బీమాను అందించడం జరుగుతోంది. దీనికి గాను వినియోగదారుడు సంవత్సరానికి 330 రూపాయల ప్రీమియం చెల్లిస్తే చాలు. అటల్ పెన్షన్ యోజన కింద.. వినియోగదారులు చెల్లించే వారి వారి వాటాలను బట్టి.. ప్రతి నెలా రూ.5,000 వరకు కూడా పింఛనుగా పొందవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం కింద 9.2 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద దాదాపుగా 3 కోట్ల మంది పేర్లను నమోదు చేయించుకున్నారు. అటల్ పెన్షన్ యోజన కింద 15.85 లక్షల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.