Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌదీ అరేబియా తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందమనేది ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేయగలదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పై భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య కుదిరిన ఒప్పందం పై సంతకాలు కావడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇప్పటికే గల బలమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సౌదీ అరేబియా ను సందర్శిస్తున్న ప్రధాన మంత్రి, అక్కడి అరబ్ న్యూస్ తో మాట్లాడారు.

గత మూడు సంవత్సరాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా లో పర్యటించడం ఇది రెండో సారి. జి20 లో భాగమైన ఇరు దేశాలు అసమానతల ను తొలగించి, సుస్థిరమైన అభివృద్ధి ని ప్రోత్సహించడానికిగాను ఇరు దేశాలు కలసి పని చేస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రపంచ ఆర్ధిక రంగం లో వృద్ధి ని సాధించాలంటే చమురు ధరలు స్థిరం గా ఉండటం చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ ఇంధన అవసరాల ను తీర్చడం లో సౌదీ అరేబియా పాత్ర ముఖ్యమైందని, విశ్వసనీయమైనటువంటి వనరు గా ఉందని ఆయన అన్నారు.

సౌదీ అరేబియా యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ కు, తనకు మధ్య ఉన్నతమైన వ్యక్తిగత అనుబంధం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. 2016వ సంవత్సరం లో తాను ప్రప్రథమం గా సౌదీ అరేబియా ను సందర్శించినప్పటి నుండి ఇరు దేశాల మధ్య గల ద్వైపాక్షి సంబంధాలు విశిష్టమైన రీతి లో వృద్ధి చెందాయని ప్రధాన మంత్రి అన్నారు. యువరాజు శ్రీ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్ మాన్ తో నేను ఐదు సార్లు భేటీ అయ్యాను. ఆయన తో జ‌రిగిన నా స‌మావేశాల‌ ను ఎంతో సంతోషం గా గుర్తు చేసుకుంటూ ఈ ప‌ర్య‌ట‌న‌ లో మరో సారి ఆయ‌న‌తో స‌మావేశం కోసం ఎదురు చూస్తున్నాను అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

రాజు స‌ల్ మాన్‌, యువరాజు శ్రీ మొహ‌మ్మ‌ద్ బిన్ సల్ మాన్ ల నాయ‌క‌త్వం లో భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మ‌ధ్య‌ ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత‌ గా పటిష్టం అవుతాయ‌న్న న‌మ్మ‌కం నాలో బలం గా ఉంది అంటూ ప్ర‌ధాన మంత్రి ధీమా ను వ్య‌క్తం చేశారు.

‘‘నేబర్ హుడ్ ఫస్ట్’’ విధానం నా ప్ర‌భుత్వం యొక్క విదేశీ విధానాని కి మార్గ‌ద‌ర్శ‌నం క‌లిగించే అంశ‌ం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ నేప‌థ్యం లో చూసిన‌ప్పుడు సౌదీ అరేబియా తో భార‌త‌దేశం ద్వైపాక్షిక సంబంధాలు త‌న‌ కు చాలా ముఖ్య‌మైన అంశ‌ం అని ఆయ‌న వివ‌రించారు. వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి కి సంబంధించి ఈ ప‌ర్య‌ట‌న‌ లో చేయ‌బోయే సంత‌కాలు ప‌లు రంగాల లో స‌హ‌కారాని కి సంబంధించి నూత‌న అధ్యాయాని కి నాంది పలుకుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబ‌డులు, భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారం మొద‌లైన రంగాల లో ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల బంధాలు చాలా బ‌ల‌మైన‌వి, ఎంతో లోతైన‌వి, అవి మ‌రింత‌ గా బ‌లోపేత‌ం అవుతాయి’’ అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

‘‘ఆసియా ఖండం లో బ‌ల‌మైన దేశాలైన భార‌త‌దేశం మరియు సౌదీ అరేబియా రెండూ త‌మ ఇరుగు పొరుగు దేశాల‌ కు సంబంధించి ఒకే విధ‌మైన భ‌ద్ర‌తప‌ర‌మైన ఆందోళ‌న‌ల ను ఎదుర్కొంటున్నాయ‌ని నేను అనుకుంటున్నాను. ఆ విధం గా చూసిన‌ప్పుడు, మ‌న దేశాల మ‌ధ్య‌ స‌హ‌కార‌మ‌నేది ముఖ్యం గా ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డం లో, భ‌ద్ర‌త‌, వ్యూహాత్మ‌క అంశాల లో ఇరు దేశాలు చ‌క్క‌ని ప్ర‌గ‌తి ని సాధించ‌డం సంతోష‌దాయ‌కం గా ఉంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మంచి ఫ‌లితాల‌ ను సాధించేందుకుగాను భార‌త‌దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు రియాద్‌ ను సంద‌ర్శించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

భార‌త‌దేశం మరియు సౌదీ అరేబియా కు సంబంధించి భ‌ద్ర‌త సంబంధ స‌హ‌కారం లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికిగాను నియ‌మించిన‌ సంయుక్త సంఘం త‌ర‌చు గా స‌మావేశాల ను నిర్వ‌హిస్తోందని, ర‌క్ష‌ణ‌- భ‌ద్ర‌త రంగాని కి సంబంధించి ఇరు దేశాలు ప‌ర‌స్ప‌ర ప్రాధాన్య‌ం గ‌ల ప‌లు అంశాల‌ ను, స‌హ‌కార రంగాల‌ ను గుర్తించాయ‌ని ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

భ‌ద్ర‌త పరమైనటువంటి స‌హ‌కారం, ర‌క్ష‌ణ రంగ ప‌రిశ్ర‌మ‌ ల పొత్తు ల‌కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాల‌ ను కుదుర్చుకొనే ప్ర‌క్రియ‌ ను ప్రారంభించ‌బోతున్నాము. అలాగే రెండు దేశాల‌ కు మ‌ధ్య‌ భ‌ద్ర‌త చ‌ర్చ‌ లకు సమగ్రమైన వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేయ‌డానికిగాను ఇరు దేశాలు అంగీక‌రించ‌డం జ‌రిగింది’’ అని ఆయన అన్నారు.

ప‌శ్చిమ ఆసియా కు సంబంధించిన ప‌లు ప్రాంతాల లో ఆందోళ‌న‌కర ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యం లో ఘ‌ర్ష‌ణ‌ల‌ ను నివారించ‌డానికిగాను స‌మ‌తుల్య‌త‌ తో కూడిన విధానాన్ని ఏర్పాటు చేసుకొందాం అంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు. ఆయా దేశాలు ఇత‌ర దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని గౌర‌విస్తూనే, ఇత‌ర దేశాల అంత‌ర్గ‌త విష‌యాలలో జోక్యం చేసుకోకుండా ఈ ప‌ని ని చేయాలి అని ఆయ‌న కోరారు.

ప‌శ్చిమ ఆసియా ప్రాంతంలోని దేశాల‌న్నిటి తో భార‌త‌దేశాని కి విశిష్ట‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని, దాదాపు 8 మిలియ‌న్ కు పైగా భారతీయులు ఈ ప్రాంతం లో నివ‌సిస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతాని కి సంబంధించిన ముఖ్య‌మైన‌ వారంద‌రి భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేలా చ‌ర్చ‌ లు అవ‌స‌ర‌మ‌ని, త‌ద్వారా ఈ ప్ర‌ధాన ప్రాంతం లో శాంతి, భ‌ద్ర‌త‌ లు నెల‌కొంటాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

వర్తమాన అంత‌ర్జాతీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. అంత‌ర్జాతీయం గా ఆర్ధిక వ్య‌వ‌స్థ అనేది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలు రూపొందిస్తున్న మార్గం పైన ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. మొన్న సెప్టెంబ‌ర్ లో ఐక్య‌ రాజ్య‌ స‌మితి సాధారణ సభ లో తాను ఇచ్చిన ఉప‌న్యాసాన్ని ఈ సంద‌ర్భం గా ప్ర‌స్తావించారు. అంద‌రి అభ్యున్న‌తి కోసం ఉమ్మ‌డి గా కృషి చేయాల‌ని, ఇందుకోసం అంద‌రి న‌మ్మ‌కాన్ని చూర‌గొని ముందుకు సాగాల‌నే విష‌యాన్ని భార‌త‌దేశం న‌మ్ముతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి గుర్తు చేవారు.

స‌మ‌తుల్యత లేని బ‌హుపాక్షిక వాణిజ్య వ్య‌వ‌స్థ‌ ల కార‌ణంగానే ఆర్ధిక‌ రంగం లో అనిశ్చితి నెల‌కొంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. జి 20 లో భాగం గా ప‌ని చేస్తున్న భారతదేశం, సౌదీ అరేబియా లు క‌లసిక‌ట్టు గా కృషి చేస్తూ అస‌మాన‌త‌ల ను త‌గ్గిస్తున్నాయ‌ని, సుస్థిర‌మైన అభివృద్ధి ని ప్రోత్స‌హిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. వ‌చ్చే సంవత్సరం లో సౌదీ అరేబియా లో జి 20 శిఖ‌ర సమ్మేళనం జ‌రుగనుండటం సంతోషదాయ‌కం, 2022వ సంవత్సరం లో ఈ సమ్మేళనాన్ని భార‌త‌దేశం లో నిర్వ‌హించ‌బోతున్నాం అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఆ సంవత్సరం లో భారతదేశ స్వాతంత్ర్యాని కి 75 వ వార్షికోత్సవం కూడా అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పాశ్చాత్య దేశాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల లో ప్రస్తుత మంద‌గ‌తి ని గురించి, ఈ నేప‌థ్యం లో భార‌త‌దేశం, సౌదీ అరేబియా నిర్వ‌హిస్తున్న పాత్ర‌ల ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు. వ్యాపారం, వాణిజ్యం రంగాల కు అనుకూలమైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డానికిగాను భార‌త‌దేశం అనేక సంస్క‌ర‌ణ‌ల ను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. అంత‌ర్జాతీయం గా ప్ర‌ధాన భూమిక ను పోషించ‌డాన్ని కొన‌సాగించ‌డానికిగాను, స్థిర‌త్వాన్ని తేవ‌డానికిగాను తాము ఈ ప‌ని ని చేశామ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. వ్యాపార నిర్వ‌హ‌ణ సులువుగా సాగ‌డానికిగాను , పెట్టుబ‌డిదారుల కు అనుకూలమైనటువంటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డానికిగాను చేసిన‌ సంస్క‌ర‌ణ‌ ల కార‌ణంగా ప్ర‌పంచ‌ బ్యాంకు ప్ర‌క‌టించిన ‘ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’లో భార‌త‌దేశం యొక్క స్థానం బాగా మెరుగైంది. అది 2014వ సంవత్సరం లో 142వ స్థానంగా ఉంటే, 2019వ సంవత్సరం కల్లా 63వ‌ స్థానానికి చేరుకొన్నద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఇప్ప‌టికే భార‌త‌దేశం లో చేప‌ట్టిన ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మాల ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వ‌చ్ఛ్ భార‌త్‌, స్మార్ట్ సిటీస్, స్టార్ట్- అప్ ఇండియా మొద‌లైన కార్య‌క్ర‌మాలు విదేశీ పెట్టుబ‌డిదారుల‌ కు అనేక అవ‌కాశాల ను ఇవ్వజూపుతున్నాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అలాగే సౌదీ అరేబియా కూడా త‌న 2030 విజ‌న్ కార్య‌క్ర‌మం లో భాగం గా సంస్క‌ర‌ణ‌లను చేప‌ట్ట‌డం సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.

ఇంధ‌న రంగం లో సౌదీ అరేబియా తో భార‌త‌దేశాని కి సుదీర్ఘ‌ కాలం గా ఉన్న సంబంధాల గురించి మాట్లాడిన‌ ప్ర‌ధాన మంత్రి, భార‌తదేశాని కి భారీ స్థాయి లో చ‌మురు ను స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశం సౌదీ అరేబియా అన్నారు. భారతదేశాని కి అవ‌స‌ర‌పడే చ‌మురు లో 18 శాతం ఒక్క సౌదీ అరేబియా నుండే వ‌స్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ విష‌యం లో సౌదీ అరేబియా రెండో అతి పెద్ద చ‌మురు వ‌న‌రు అయింద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఇరు దేశాల‌కు మ‌ధ్య‌ శుద్ధ‌మైన అమ్మ‌కందారు-వినియోగ‌దారు బంధ‌ం ఉంద‌ని.. అయితే ఈ ద‌శ‌ నుండి స‌న్నిహిత వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశాలు గా మారుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. త‌ద్వారా సౌదీ పెట్టుబ‌డులు భార‌త‌దేశం లోని చ‌మురు, గ్యాస్ ప్రాజెక్టుల లోకి రానున్నాయ‌ని వివ‌రించారు.

భార‌త‌దేశాని కి సౌదీ అరేబియా ఎంతో ముఖ్య‌మైన‌టువంటి, విశ్వసనీయమైనటువంటి వ‌న‌రు గా ఉంటూ ఇంధ‌న అవ‌స‌రాల‌ ను తీరుస్తోంద‌ని, ఆ విధం గా చూసిన‌ప్పుడు సౌదీ అంటే త‌మ‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ వృద్ధి చెంద‌డానికి నిలుక‌డ‌ గా వుండే చ‌మురు ధ‌ర‌లు కూడా ముఖ్య‌మేన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల‌ కు ఇది మ‌రీ ముఖ్య‌ం అన్నారు. భార‌త‌దేశం లోని ప‌శ్చిమ తీర ప్రాంతం లో చేప‌ట్టిన ఒక పెద్ద శుద్ధి కర్మాగారం మరియు పెట్రోరసాయనిక ప్రాజెక్టు లో సౌదీ అరామ్ కో పాలు పంచుకొంటున్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేవారు. ఇక ముందు భార‌త‌దేశం లో చేప‌ట్ట‌బోయే వ్యూహాత్మ‌క పెట్రోలియమ్ నిలువ‌ ల విష‌యం లో కూడా సౌదీ అరామ్ కో భాగ‌స్వామ్యంకోసం మేం ఎదురు చూస్తున్నామని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

భార‌త‌దేశం భారీ స్థాయి లో చేప‌ట్టిన ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల నిర్మాణ ప్రాజెక్టు లో సౌదీ అరేబియా కు భాగ‌స్వామ్యాన్ని క‌ల్పించ‌డానికి భార‌త‌దేశం ముందుకు వ‌స్తుందా అనే ప్ర‌శ్న‌ కు ప్ర‌ధాన మంత్రి ఇలా స‌మాధాన‌మిచ్చారు. భార‌త‌దేశాని కి, సౌదీ అరేబియా కు మ‌ధ్య‌ గ‌ల ముఖ్య‌మైన స‌హ‌కార రంగాల లో ఒక‌టి భార‌త‌దేశ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ప్రాజెక్టుల లో పెట్టుబ‌డులు పెట్ట‌డం. ఈ సంవత్సరం ఫిబ్ర‌వ‌రి లో సౌదీ యువ‌రాజు భార‌త‌దేశాన్ని సందర్శించిన స‌మ‌యం లో ఇదే విష‌యం పై మాట్లాడుతూ, భారతదేశ మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల్లో 100 బిలియ‌న్ డాలర్ మేర పెట్టుబ‌డుల ను పెట్ట‌బోతున్న‌ట్టు చెప్పిన విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

స్మార్ట్ సిటీస్ కార్య‌క్ర‌మం తో పాటు భార‌త‌దేశాని కి సంబంధించిన ఇత‌ర మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల లో సౌదీ అరేబియా పెట్టుబ‌డుల‌ ను స్వాగ‌తిస్తున్నాము. అలాగే భార‌త‌దేశాని కి సంబంధించిన నేశన‌ల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సౌదీ అరేబియా ఆస‌క్తి చూపడాన్ని స్వాగ‌తిస్తున్నాము అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఇంధ‌న రంగ‌మే కాకుండా ఇత‌ర రంగాల లో భార‌త‌దేశం మరియు సౌదీ అరేబియా స‌హ‌కారాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు. ఈ సారి నా సౌదీ అరేబియా సందర్శన‌ లో ప‌లు రంగాల లో ఇండియా మరియు సౌదీ అరేబియా మ‌ధ్య‌ ఒప్పందాలు కుద‌ర‌బోతుండ‌టం చాలా సంతోషం గా ఉంద‌ని, రక్షణ‌, భ‌ద్ర‌త‌, నవీకరణయోగ్య శక్తి మొద‌లైన రంగాల లో ఇరు దేశాల మ‌ధ్య‌ ఈ ఒప్పందాలు ఉంటాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

అంతే కాకుండా త‌న సందర్శన సంద‌ర్భం గా చేప‌ట్ట‌బోతున్న మ‌రిన్ని కార్య‌క్ర‌మాల ను గురించి మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి సౌదీ అరేబియా లో రూపే కార్డు ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నట్టు ప్ర‌క‌టించారు. ఇక్క‌డ నివ‌సించే ప్ర‌వాసీ భారతీయుల‌ కు దీని వల్ల లబ్ధి చేకూరుతుంద‌ని, చెల్లింపు లు సులువుగా జ‌రుగుతాయ‌ని ఆయ‌న అన్నారు. ఇ- మైగ్రేట్‌, ఇ-తౌసీఫ్ పోర్ట‌ల్స్ ను ఏకం చేయ‌డం జ‌రుగుతుంద‌ని, త‌ద్వారా భార‌తీయ కార్మికులు సులువు గా సౌదీ కి రావొచ్చ‌ని తెలిపారు. అంతే కాకుండా ఇరు దేశాల లోని సంస్థ‌ల లో దౌత్యాధికారుల శిక్ష‌ణ‌ కు సంబంధించిన ఒప్పందం కూడా కుదురుతుంద‌న్నారు.

అంత‌ర్జాతీయ స్థాయి సామ‌ర్థ్య నిర్మాణ కేంద్రాల‌ కు భార‌త‌దేశం నిల‌య‌మ‌ని, వివిధ‌ రంగాల లో సౌదీ యువ‌త‌ కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికిగాను భార‌త‌దేశం లో అనేక కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. అలాగే అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం ఉభయ దేశాల మ‌ధ్య‌ చ‌ర్చ‌ లు జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు.

సౌదీ అరేబియా లో నివ‌సించే ప్ర‌వాసీ భార‌తీయుల‌ కు ఇచ్చిన సందేశం లో ప్ర‌ధాన మంత్రి ఈ విధం గా చెప్పారు. దాదాపు 2.6 మిలియ‌న్ భార‌తీయులు సౌదీ అరేబియా లో నివ‌సిస్తున్నార‌ని, ఇది వారి కి రెండో మాతృభూమి గా మారింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆ విధం గా వారు సౌదీ అరేబియా అభివృద్ధి కోసం, ప్ర‌గ‌తి కోసం కృషి చేస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అలాగే ప్ర‌తి సంవత్సరం వేలాది భార‌తీయులు హజ్‌, ఉమ్రా ప‌విత్ర‌ యాత్ర‌ ల‌ కోసం, ఇత‌ర వ్యాపార అవ‌స‌రాల‌ కోసం సౌదీ అరేబియా ను సంద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. సౌదీ అరేబియా లో నివ‌సిస్తున్న ప్ర‌వాస భారతీయుల‌ ను ఉద్దేశించి మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి మిమ్మ‌ల్ని చూసి భార‌త‌దేశం గ‌ర్విస్తోంద‌న్నారు. సౌదీ లో మీరు సాధించిన స్థానం గొప్ప‌ద‌ని చెప్పిన ఆయ‌న, మీరు చేసిన క‌ఠోర ప‌రిశ్ర‌మ‌, మీరు చూపిన నిబ‌ద్ద‌త ల కార‌ణంగా భార‌త‌దేశాని కి మంచి పేరు వ‌చ్చింద‌ని, త‌ద్వారా ఇరు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక బంధం దృఢం గా మారింద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.

ఇరు దేశాల మ‌ధ్య‌ బంధం బ‌లోపేతం కావ‌డానికి మీరు చేసిన కృషి ఇలాగే కొన‌సాగుతుంద‌నే న‌మ్మ‌కం త‌న‌లో ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌ వున్న చరిత్రాత్మ‌క సంబంధాల‌ ను మ‌రింత బలోపేతం చేయ‌డానికి మీరు మ‌రింత‌ గా కృషి చేయాలంటూ ప్ర‌ధాన మంత్రి ఆకాంక్ష ను వ్య‌క్తం చేశారు. ఎన్నో ద‌శాబ్దాలు గా ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ గ‌ల బంధాల ఆధారం గా దేశాల మ‌ధ్య‌ చరిత్రాత్మ‌క సంబంధాలు వృద్ధి చెందాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ప్ర‌స్తుత సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న‌ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, మాన్య రాజు స‌ల్ మాన్ కు మ‌ధ్య‌ ద్వైపాక్షిక చ‌ర్చ‌ లు జ‌రుగ‌నున్నాయి. అలాగే యువ‌రాజు తో ప్ర‌తినిధుల స్థాయి చ‌ర్చ‌ లు జ‌రుగ‌నున్నాయి. ఈ చ‌ర్చ‌ల‌ కు తోడు, మూడో ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ టిఐ) వేదిక ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రధానోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. ఈ వేదిక మ‌ధ్య ప్రాచ్యం లో అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఆర్ధిక రంగ వేదిక‌ గా అవ‌త‌రించింది.

భ‌ద్ర‌త మ‌రియు వ్యూహాత్మ‌క స‌హ‌కారం, ర‌క్ష‌ణ‌, ఇంధ‌న భ‌ద్ర‌త‌, నవీకరణయోగ్య శక్తి, పెట్టుబ‌డులు, వాణిజ్యం- వ్యాపార రంగాలు, చిన్న- మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయం, పౌర విమాన‌యానం, ప్రాథమిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, గృహ‌ నిర్మాణం, ఆర్ధిక స‌హాయ సంబంధిత సేవ‌ లు, శిక్ష‌ణ మ‌రియు సామ‌ర్థ్య నిర్మాణం, సంస్కృతి మ‌రియు ప్ర‌జ‌ల మ‌ధ్య‌ సంబంధాలు మొద‌లైన రంగాల లో ఇరు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక సంబంధాల‌ ను బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి సందర్శన దోహ‌దం చేయ‌బోతోంది. ఈ రంగాల‌ కు సంబంధించి రెండు దేశాల మ‌ధ్య‌ డ‌జ‌ను దాకా ఒప్పందాల పై సంత‌కాలు జ‌రుగ‌నున్నాయి. అలాగే ప్ర‌భుత్వాల‌ కు, వ్యాపార సంస్థ‌ల‌ కు మ‌ధ్య‌ ప‌లు ఒప్పందాలు కుదరనున్నాయి.

ప్ర‌ధాన మంత్రి సందర్శట‌న‌ ద్వారా ఒన‌గూర‌బోతున్న ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల లో ఒక‌టి ఇరు దేశాల మ‌ధ్య‌ ఏర్పాటు చేయ‌బోతున్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి (ఎస్ పిసి). ఈ విష‌యం లో సౌదీ అరేబియా గ‌తం లో బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, చైనా ల‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ వ‌రుస‌ లో భార‌త‌దేశం నాలుగో దేశం.

ఈ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి ( ఎస్ పిసి)కి రెండు స‌మాంత‌ర విభాగాలు ఉన్నాయి. రాజ‌కీయ‌, భ‌ద్ర‌త‌, సంస్కృతి మ‌రియు స‌మాజం విభాగాని కి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నేతృత్వం వ‌హిస్తారు. ఇక మ‌రో విభాగం ఆర్ధిక మ‌రియు పెట్టుబ‌డుల రంగం. దీని కి భార‌త‌దేశ వ్యాపార వాణిజ్య శాఖ మంత్రి, సౌదీ శక్తి శాఖ మంత్రి నేతృత్వం వ‌హిస్తారు.

సౌదీ అరేబియా తో భార‌త‌దేశ సంబంధాల‌ లో ముఖ్య‌మైంది శక్తి భ‌ద్ర‌త‌. భార‌దేశాని కి సౌదీ అరేబియా సుదీర్ఘ‌ కాలం గా చ‌మురు ను స‌ర‌ఫ‌రా చేస్తోంది. అంతే కాదు ఈ విష‌యం లో భార‌త‌దేశాని కి సౌదీ అరేబియా అత్యంత విశ్వసనీయమైనటువంటి వనరు గా కూడా ఉంది. భార‌త‌దేశాని కి కావ‌ల‌సిన 18 శాతం ముడి చ‌మురు అవ‌స‌రాల‌ ను సౌదీ అరేబియా తీరుస్తోంది. అలాగే ఎల్ పిజి విష‌యం లో 30 శాతం సౌదీ నుండే భార‌త‌దేశాని కి స‌ర‌ఫ‌రా అవుతోంది. ఈ నేప‌థ్యం లో అమ్మ‌కందారు- వినియోగ‌దారు అనే స్థాయి నుండి మ‌రింత విస్తృత‌మైనటువంటి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశాలు గా ఇరు దేశాలు ఎద‌గ‌డానికి ప్ర‌ధాన మంత్రి తాజా ప‌ర్య‌ట‌న దోహ‌దం చేయ‌బోతోంది. ఈ భాగ‌స్వామ్య‌ాన్ని పర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌క‌రం గా ఉండేటట్టు తీర్చిదిద్దుతున్నారు.

**