భారత్ ఓమాన్ రిఫైనరీస్ లిమిటెడ్ (బి ఒ ఆర్ ఎల్) లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి పి సి ఎల్ ) పెట్టుబడిని పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పెట్టుబడి రాశిని గరిష్ఠంగా రూ. 3000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. 2005 ఆగస్టు 5 వ తేదీ నాటి డి పి ఇ మార్గదర్శక సూత్రాలకు అతీతంగా, కన్వర్టిబుల్ వారంట్స్/ ఇతర పత్రాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ పెట్టుబడిని పెడతారు. ఈ పత్రాలను బి ఒ ఆర్ ఎల్ జారీ చేసే ఈక్విటీ షేర్స్ లోకి మార్చుకొనే వీలు ఉంటుంది.
బి పి సి ఎల్ సమకూర్చే నిధులు బి ఒ ఆర్ ఎల్ కు తన నికర విలువకు గండి పడటం వల్ల ఎదురయ్యే చిక్కులను అధిగమించడానికి తోడ్పడగలవు. అంతే కాకుండా, దేశంలోని ఉత్తర ప్రాంతంలోను, మధ్య ప్రాంతంలోను పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను ఇది పెంచగలదు కూడా. మధ్య ప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి, ఆ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరగడానికి, పన్నుల సంబంధ రాబడి మెరుగవడానికి సైతం ఆస్కారం ఉంటుంది.
పూర్వ రంగం
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి పి సి ఎల్ ) ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి. పెట్రోలియమ్, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఓమాన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ (ఒ ఒ సి ఎల్)తో కలసి భారత్ ఓమాన్ రిఫైనరీస్ లిమిటెడ్ (బి ఒ ఆర్ ఎల్) పేరుతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ప్రమోట్ చేసింది. బి ఒ ఆర్ ఎల్ రూ. 12,754 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 2011 జూన్ నెలలో మధ్య ప్రదేశ్లోని బీనాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించింది. 6 ఎమ్ఎమ్ టి పి ఎ ( రోజుకు 120 వేల పీపాల) ఇన్ స్టాల్ డ్ కెపాసిటీ కలిగిన చమురు శుద్ధి కర్మాగారం ప్రస్తుతం 100 % ఇన్ స్టాల్ డ్ కెపాసిటీతో పని చేస్తున్నది.
రిఫైనరీ చమురుశుద్ధి సామర్థ్యాన్ని 6 ఎమ్ ఎమ్ టి పి ఎ నుంచి 7.8 ఎమ్ ఎమ్ టి పి ఎ కు పెరిగేటట్లు చూడాలని కంపెనీ తాజాగా ప్రతిపాదించింది. అందుకు ఉత్పాదకత స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం రూ. 3,072 కోట్ల అంచనా వ్యయం అవసరం అవుతుందని భావించారు. పర్యావరణ సంబంధ అనుమతులు అందిన నాటి (జీరో డేట్) నుంచి 36 నెలల లోపల ఈ ప్రాజెక్టును పనిచేయించాలనుకున్నారు. నూతన వాహన ఇంధన విధానానికి అనుగుణంగా ఉండే ఉత్పత్తులను తయారు చేయడానికి కొన్ని మార్పుచేర్పులను చేపట్టడం అనేది ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రధానాంశాలలో ఒకటిగా ఉంది.
ఇందువల్ల బి ఒ ఆర్ ఎల్ కు వాటాదారులు నిధులను తక్షణం సమకూర్చవలసిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు కు ఒ ఒ సి ఎల్ తన అండ ఉంటుందని తెలిపింది. అయితే, ఈ దశలో ప్రాజెక్టు కు మరిన్ని నిధులను సమకూర్చడానికి తాము సిద్ధంగా లేమని సూచించింది. దానితో బి పి సి ఎల్ బోర్డు ఉత్పాదకత స్థాయిని మెరుగుపరిచే ప్రాజెక్టుకు, ముడి చమురు, ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తుల ధరల పతనం కారణంగా వాటిల్లిన అసాధారణ నష్టాలను పూడ్చడానికి రూ.3,000 కోట్ల మేరకు నిధులను అందించాలని నిర్ణయించింది.
తదనుగుణంగా బి ఒ ఆర్ ఎల్ లో బి పి సి ఎల్ పెట్టుబడిని అదనంగా రూ.3,000 కోట్ల వరకు పెంచే ప్రతిపాదనకు అనుమతిని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.