దేశం లో ఆరోగ్యాని కి మరియు శ్రేయస్సుకు సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం లో భాగం గా ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయం, పంపిణీ, నిల్వ చేయడం మరియు ప్రకటన ల) యొక్క నిషేధం ఆర్డినెన్స్, 2019 ని జారీ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఇలెక్ట్రానిక్ సిగరెట్ అనేది బ్యాటరీ తో పనిచేసే ఉపకరణం. ఇది వ్యసనకారక పదార్థం అయిన నికొటిన్ ను కలిగివున్న ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా గాలితుంపర (ఎయరోసోల్)ను ఉత్పత్తి చేస్తుంది. ఎయరోసోల్, సామాన్యం గా సిగరెట్ లలోని ఒక వ్యసనకారి పదార్థం. ఈ ఉపకరణాల లోకి.. ఇలెక్ట్రానిక్ నికోటిన్ డిలివరీ సిస్టమ్స్ తాలూకు అన్ని రకాలు, కాల్చడం కాక వేడి అయ్యే (హీట్ నాట్ బర్న్) ఉత్పత్తులు, ఇ-హుక్కా స్, ఇంకా ఇటువంటివే ఇతర ఉపకరణాలు కూడా.. వస్తాయి. ఈ విధమైనటువంటి నూతన ఉత్పత్తులు ఆకర్షణీయమైన రూపాల లోను, వివిధ సుగంధాల లోను లభ్యం అవుతాయి. వీటి వాడకం పెద్ద ఎత్తున అధికమైంది. అభివృద్ధి చెందిన దేశాల లో, ప్రత్యేకించి యువతీయువకులు మరియు చిన్న పిల్లల లోను ఇది ఒక మహమ్మారి గా ప్రబలిపోయింది.
కార్యాచరణ:
ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసిన అనంతరం, ఇ-సిగరెట్స్ ను ఏ మాదిరిగానైనా ఉత్పత్తి చేయడం, వాటి తయారీ, దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేయడం, రవాణా, విక్రయం (ఆన్ లైన్ విక్రయం సహా), పంపిణీ చేయడం, లేదా ప్రకటన లు (ఆన్ లైన్ ప్రకటన లు సహా) ఇవ్వడాన్ని కేసు పెట్టదగిన అపరాధ కార్యకలాపాలు గా పరిగణిస్తారు. ఈ విధమైన నేరాని కి తొలి సారి పాల్పడినప్పుడు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ను గాని, లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ను గాని, లేదా ఈ రెంటి ని కలిపి గాని విధిస్తారు. ఆ తరువాత కూడా ఇదే విధమైన నేరాల కు ఒడిగడితే గనుక అప్పుడు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ను మరియు 5 లక్షల రూపాయల వరకు జరిమానా ను విధించేందుకు ఆస్కారం ఉంది. ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ ను నిల్వ చేయడం సైతం శిక్షార్హమే. ఈ అపరాధాని కి 6 నెలల వరకు జైలు శిక్షను గాని, లేదా 50,000 రూపాయల వరకు జరిమానా ను గాని, లేదా ఈ రెంటి ని కలిపి కూడాను విధించేందుకు వీలు ఉంది.
ఆర్డినెన్స్ అమలు లోకి వచ్చే తేదీ నాటి కి, ఇ-సిగరెట్స్ యొక్క భండారాల యజమానుల కు ఈ నిల్వల ను గురించి వారంతట వారు గా వెల్లడి చేయడం తో పాటు వీటి ని దగ్గర లోని పోలీస్ ఠాణా లో అప్పగించవలసివుంటుంది. ఆర్డినెన్స్ ప్రకారం సబ్- ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ను అధీకృత అధికారి గా నియమించడమైంది. ఈ ఆర్డినెన్స్ యొక్క నిబంధనల ను అమలు లోకి తీసుకు రావడం కోసం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రాల ప్రభుత్వాలు మరే ఇతర తత్సమాన అధికారి ని (అధికారుల ను) అయినా సరే నియమించవచ్చును.
ముఖ్య ప్రభావం:
ఇ-సిగరెట్స్ ను నిషేధించాలన్న నిర్ణయం ద్వారా ప్రజల ను, మరీ ముఖ్యం గా యువతీయువకుల ను మరియు చిన్న పిల్లల ను ఇ-సిగరెట్స్ యొక్క వ్యసనాని కి లోనయ్యే అపాయం నుండి కాపాడడం లో సహాయం లభించగలదు. పొగాకు నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు ఈ ఆర్డినెన్స్ యొక్క అమలు తో ఊతం లభిస్తుంది. అలాగే, పొగాకు వినియోగాన్ని తగ్గించడం లోను, దీని తో ముడిపడివున్న ఆర్థిక భారాన్ని మరియు రోగాల ను కూడా తగ్గించడానికి వీలు చిక్కుతుంది.
పూర్వరంగం:
ఇ-సిగరెట్స్ ను నిషేధించాలన్న అంశాన్ని పరిశీలించవలసిందంటూ 2018వ సంవత్సరం లో ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కు ఒక సూచన ను జారీ చేసిన నేపథ్యం లో ప్రస్తుత నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. 16 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఇప్పటికే వాటి యొక్క అధికార పరిధి లో ఇ-సిగరెట్స్ పైన నిషేధాన్ని విధించాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎమ్ ఆర్) ఇటీవల ఈ విషయమై వెలువరించిన ఒక శ్వేతపత్రం లో ప్రస్తుతం అందుబాటు లో ఉన్న వైజ్ఞానిక నిదర్శనాల ఆధారం గా ఇ-సిగరెట్స్ పై సంపూర్ణ స్థాయి లో నిషేధాన్ని విధించాలని సిఫారసు చేసిన సంగతి గమనించదగ్గది. ఈ ఉత్పత్తుల ను నిషేధించడం సహా తగిన చర్యల ను తీసుకోవలసింది గా డబ్ల్యుహెచ్ఒ సైతం తన సభ్యత్వ దేశాల కు విజ్ఞప్తి చేసింది. ఈ కోవ కు చెందిన ఉత్పత్తుల ను సాధారణం గా సంప్రదాయ సిగరెట్ లతో పోలిస్తే సురక్షితమైన ప్రత్యామ్నాయాలు గా చెప్తూ విక్రయించడం జరుగుతోంది. కానీ అటువంటి సురక్ష లభిస్తుందన్న ప్రకటన లు అసత్యాలు. దీని కి భిన్నం గా, ఈ ఉత్పత్తులు పొగ తాగే అలవాటు లేని వారి ని.. ప్రత్యేకించి యువత మరియు కిశోర వయస్కుల ను.. నికోటిన్ వినియోగించేటట్టు ప్రేరేపించి, తద్వారా వారు ఆ తరువాత సాంప్రదాయక పొగాకు ఉత్పత్తుల ను వాడుతూ వాటి వ్యసనాని కి లోనయ్యేలా చేస్తాయి. ఇ-సిగరెట్స్ ను పొగ తాగడాన్ని నిలిపివేసే ఉపకరణాలు అంటూ పరిశ్రమ పరిపాటి గా ప్రోత్సహిస్తోంది; కానీ, అవి ఒక నివారక సాధనం గా ఎంత సమర్ధమైన మరియు ఎంత సురక్షితమైన రీతి లో పని చేస్తోందీ ఇప్పటి కి ఇంకా నిరూపితం కావాల్సివుంది.
పొగాకు వాడకం అలవాటు ను వదలివేయడం లో ప్రజల కు తోడ్పడుతాయని పేరున్న పరీక్షించినటువంటి మరియు ప్రయోగించి చూసినటువంటి నికోటిన్, నాన్-నికోటిన్ ఫార్మాకోథెరెపీస్ కు భిన్నంగా, డబ్ల్యుహెచ్ఒ ఇ- సిగరెట్స్ కు నివారక సాధనాలు గా అనుమతి ని మంజూరు చేయనేలేదు. ఆ ఉత్పత్తుల వల్ల ఒనగూరే సంభావ్య ప్రయోజనాల ను గురించిన దుష్ప్రచారానికి పాల్పడడం ద్వారా పొగాకు అలవాటు ను మానివేసే ప్రయత్నాల లో పొగాకు పరిశ్రమ తాను జోక్యం చేసుకోగలదన్న సంభావన కు తావు ఉన్నది. ఈ సాధనాల ను ప్రత్యామ్నాయాలు గా చిత్రిస్తున్నారు కానయితే, చాలా సందర్భాల లో ఇవి సాంప్రదాయక పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంపూరకాలు గా ఉండడం తో పాటు వర్తమాన సంభావన గానే కాక వాస్తవిక సంభావన గా కూడా ఉన్నాయి. నికోటిన్ కు అదనం గా, ఇతర సైకోఏక్టివ్ సబ్ స్టన్సెస్ యొక్క పంపిణీ కోసం కూడా ఇ- సిగరెట్స్ ను ఉపయోగించే వీలు ఉంది. ఇ- సిగరెట్స్ తో ముడివడ్డ అపాయాల తో ఆస్కారం లేకుండా, విజ్ఞానశాస్త్ర పూర్వకం గా రుజువు అయినటువంటి నికోటిన్ రిప్లేస్ మెంట్ థెరెపీ లు, పొగాకు వినియోగాన్ని వదలిపెట్టాలన్న అభిలషించే వారి కోసం చూయింగ్ గమ్ లు, పులుపు మరియు తీపి లతో కూడినటువంటి బిళ్ల లు, ఇంకా పౌచ్ ల రూపాల లో లభ్యం అవుతున్నాయి. ఇ- సిగరెట్ ల ను విరివి గా వాడడం అంటూ జరిగితే, అడ్డూ అదుపూ లేని రీతి లో ఇ- సిగరెట్ లు మరియు వాటి ని పోలిన ఉపకరణాల విస్తృత వినియోగం మరియు అదుపు లేనటువంటి వ్యాప్తి ల వల్ల, పొగాకు వాడకాన్ని క్షీణింపచేసే దిశ గా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిష్ప్రభావం పాలబడే ప్రమాదం పొంచి ఉంటుంది.
నికోటిన్ యొక్క అత్యధిక వ్యసనకారి స్వభావాన్ని; నికోటిన్ తో పాటు మిశ్రిత సుగంధాల యొక్క సురక్ష కు సంబంధించిన చింతలను, ఈ ఉపకరణాల ద్వారా అన్య సైకోఏక్టివ్ సబ్ స్టన్సెస్ ను సేవించడం వల్ల ఎదురు కాగల ప్రమాదాల ను; పొగ తాగని వ్యక్తులు, మరీ ముఖ్యం గా, కిశోర వయస్కులు మరియు యువతీయువకులు నికోటిన్ సేవనాని కి గాని, లేదా సైకోఏక్టివ్ సబ్ స్టన్సెస్ సేవనాని కి గాని మొగ్గు చూపడం మొదలుపెట్టడాన్ని; సాంప్రదాయక సిగరెట్ లను మరియు ఇ- సిగరెట్స్ ను ఈ రెంటి ని కూడా ఉపయోగించడాన్ని; ఇ- సిగరెట్స్ వాడితే అవి పొగాకు వినియోగాన్ని మానివేయడం లో తోడ్పడగల సమర్ధమైన సాధనాలు గా పనికివస్తాయన్న వైజ్ఞానిక నిదర్శనం ఏదీ లేకపోవడాన్ని; పొగాకు నియంత్రణ కు ప్రభుత్వం చేస్తున్న కృషి కి ఎదురవుతున్న సవాలు ను; స్థిర అభివృద్ధి ధ్యేయాలు (ఎస్ డిజిస్), నేశనల్ మానిటరింగ్ ఫ్రేంవర్క్ ఫర్ ప్రివన్శన్ ఎండ్ కంట్రోల్ ఆఫ్ నాన్- కమ్యూనికబల్ డిజీజెస్ మరియు 2017వ సంవత్సర ఆరోగ్య విధానం లలో భాగం గా నిర్దేశించుకొన్నటువంటి లక్ష్యాల సాధన లోని ఆటంకాన్ని; ఇంకా భారతదేశ రాజ్యంగం లోని 47వ అధికరణం లో ఉల్లేఖించబడినటువంటి ప్రజారోగ్య సమగ్ర హితాన్ని దృష్టి లో పెట్టుకొని ఇ- సిగరెట్స్ ను, అన్ని విధాలైన ఇలెక్ట్రానిక్ నికోటిన్ డిలివరీ సిస్టమ్స్ (ఇఎన్ డిఎస్) ను, హీట్ నాట్ బర్న్ ప్రోడక్ట్స్ ను, ఇ- హుక్కా స్ ను మరియు వీటిని పోలివుండేటటువంటి ఇతర ఉపకరణాల ను నిరోధించాలన్న/నిషేధించాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమైంది.
**