ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ లో కెపాసిటీ బిల్డింగ్, బెంచ్ మార్కింగ్, మరియు ద్వైపాక్షిక ఆదాన ప్రదానాల రంగంలో సాంకేతిక సహకారంపై భారతదేశం, భూటాన్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం కుదుర్చుకొనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
భారతదేశం, భూటాన్ ల మధ్య దౌత్య పరంగాను, ఆర్ధిక పరంగాను, సాంస్కృతిక పరంగాను సంబంధాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. 2007 ఫిబ్రవరి లో న్యూ ఢిల్లీ లో కుదిరిన భారత, భూటాన్ మైత్రి ఒడంబడిక పరస్పర సంబంధాలను మరింత బలపరచేదే. గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014 జూన్ లో భూటాన్ ను ఆధికారికంగా సందర్శించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య క్రమం తప్పక కొనసాగుతున్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసింది. భారతదేశ ప్రధాన మంత్రి పర్యటన సమయంలో ఇరు పక్షాలూ తమ తమ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన రంగాలలో సన్నిహిత సమన్వయాన్ని, సహకారాన్ని కొనసాగించాలని ఒక అంగీకారానికి వచ్చాయి.
భారతదేశం- భూటాన్ మైత్రి ఒడంబడిక లోని 2వ, 7వ, 8వ అధికరణాలకు ప్రోత్సాహంగా తాజా ఎమ్ ఒ యు ఉంది. ఈ అవగాహన ఒప్పందం ఇరు పక్షాల విద్యాసంబంధ, శాస్త్ర సంబంధ, సాంకేతిక సంబంధ పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణ లకు ఒక ఛత్రాన్ని అందిస్తుంది. 2003 ఆగస్టు లో ఏర్పాటు చేసుకున్న ఇండియా- భూటాన్ ఫౌండేషన్ ఉద్దేశాలు కూడా ఇవే.
జల విద్యుత్తు రంగంలో ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే సహకారం కొనసాగుతోంది. ఇది పరస్పర సహకారంలో ఓ ఆదర్శప్రాయమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది.
ఈ అవగాహనపూర్వక ఒప్పందం ద్వారా కేంద్ర ప్రజా పనుల శాఖ (సి పి డబ్ల్యు డి) కి పర్వత ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో మంచి అనుభవాన్ని సంపాదించుకొనే అవకాశం లభించనుంది; ఈ తరహా నిర్మాణానుభవం జమ్ము & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇంకా ఈశాన్య ప్రాంతం లోని పలు ఇతర రాష్ట్రాలలో ఎంతగానో అక్కరకు రానుంది. సి పి డబ్ల్యు డి భూటాన్ లోనూ కొన్ని రహదారి నిర్మాణ ప్రాజెక్టులను చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది.