Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2019వ సంవత్సరం జులై 28వ తేదీ నాడు ఆకాశవాణి లో ‘మన్ కీ బాత్ 2.0’ (మనసు లో మాట) కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


నా ప్రియ‌మైన దేశవాసులారా, నమస్కారము. ‘మన్ కీ బాత్’ ఎప్పటిలాగే నేను, మీరు కూడా ఎదురు చూసే కార్య‌క్ర‌మ‌. ఈ సారి కూడా అనేక సంఖ్య లో ఉత్తరాలు, వ్యాఖ్యలు, ఫోన్ కాల్స్ వచ్చాయి – చాలా కథలు, సలహాలు, ప్రేరణలు ఉన్నాయి. ప్రతి ఒక్క‌రూ ఏదో చెప్పాల‌నుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు. వీట‌న్నిటి లో ఉన్న విషయాలను కూర్చాల‌ని ఎంతో ఆవేశం క‌లుగుతుంది, కానీ స‌మ‌యం చాల‌దు. అన్నీ కూర్చ‌లేక‌పోతున్నాను. మీరు న‌న్ను ప‌రీక్షిస్తున్నార‌ని అనిపిస్తుంది. కానీ మీ మాటలనే, ఈ ‘మన్ కీ బాత్’ యొక్క దారం లో కూర్చి మీకు మ‌రొక‌సారి పంచాల‌నుకుంటున్నాను.

క్రితం సారి నేను ప్రేమ్ చంద్ క‌థ‌ల పుస్త‌కాన్ని గురించి చ‌ర్చించాను. అప్పుడు ఏ పుస్త‌క‌మైనా చదివితే దాన్ని గురించి ఒక నాలుగు మాటలను NarendraModi App ద్వారా అందరితో పంచుకోవాల‌ని మనం నిశ్చ‌యించుకున్న విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది. పెద్ద సంఖ్య‌ లో ప్రజలు అనేకరకాల పుస్త‌కాల‌ ను గురించి వివరాల ను పంచుకున్నారు. ప్రజలు సైన్స్‌, టెక్నాలజీ, ఇనవేశ‌న్‌, చరిత్ర, సంస్కృతి, బిజినెస్, జీవన చరిత్రలు వంటి అనేక విషయాల ను గురించి వ్రాసిన పుస్త‌కాల‌ ను గురించి చ‌ర్చిస్తున్నారు. కొంద‌ర‌యితే న‌న్ను మ‌రికొన్ని పుస్త‌కాల‌ను గురించి మాట్లాడ‌మ‌ని కూడా స‌ల‌హా ఇచ్చారు. అలాగే, త‌ప్ప‌కుండా మ‌రిన్ని పుస్త‌కాల గురించి నేను మీతో మాట్లాడుతాను. కానీ, ఎక్కువ పుస్త‌కాలు చ‌ద‌వ‌డానికి ఇప్పుడు స‌మ‌యం అంత కేటాయించ‌లేక‌పోతున్నాన‌ని ఒప్పుకుంటాను. కానీ, ఒక లాభం క‌లిగింది, అదేమిటంటే మీరు వ్రాసి పంపుతున్న వివ‌రాలు చూస్తుంటే చాలా పుస్త‌కాల వివ‌రాలు నాకు తెలుసుకొనే అవ‌క‌శాం క‌లుగుతోంది. ఈ నెల రోజుల అనుభవం వ‌ల్ల మ‌నం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అనిపిస్తోంది. మ‌నం ఈ NarendraModi App లో కొత్త పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, అక్క‌డ వ్రాయ‌డం, చ‌ర్చించ‌డం చేయ‌గ‌లిగేలా ఒక శాశ్వ‌త‌మైన బుక్స్ కార్న‌ర్ ఎందుకు పెట్ట‌కూడ‌దు? మ‌న ఈ బుక్స్ కార్నర్ కు మీరే ఒక మంచి పేరు సూచించ‌గ‌ల‌రు. పాఠ‌కుల‌ కు, లేఖ‌కుల‌ కు ఇది ఒక క్రియాశీల వేదిక గా త‌యారు చేద్దాం. మీరు చ‌దువుతూ, వ్రాస్తూ ఉండండి, అలాగే ‘మన్ కీ బాత్’ యొక్క అంద‌రు స‌హ‌చ‌రుల‌తో పంచుకుంటూ ఉండండి.

సహచరులారా, నాకేమనిపిస్తుందంటే జల సంరక్ష‌ణ – ‘మన్ కీ బాత్’ లో నేను ఈ విషయాన్ని ప్ర‌స్తావించ‌క ముందు నుంచే మీ అంద‌రి మనసును తాకే మాట, సామాన్య‌ మానవులకు న‌చ్చిన‌ మాట అని నాకు అనిపిస్తూ ఉంది. నీటి విష‌యం ఈ మ‌ధ్య కాలం లో హిందుస్తాన్ మనసుల ను ప‌ట్టి ఊపేసిన సంగ‌తి నా అనుభ‌వం లోకి వ‌స్తూంది. జ‌ల సంర‌క్ష‌ణ గురించి దేశ‌మంత‌టా అనేక‌మైన ఎరుక క‌లిగిన‌, ప్ర‌భావ‌వంత‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్రజలు సాంప్రదాయ‌క విధివిధానాల గురించిన వివరాల‌న‌యితే పంచుకున్నారు. మాధ్యమాలు కూడా జలసంరక్షణ మీద ఎన్నో నవీన ప్రచారాల ను ప్రారంభించాయి. ప్ర‌భుత్వ‌మైనా, ఎన్‌జిఒ లు అయినా – యుద్ధ ప్రాతిప‌దిక మీద ఎంతో కొంత ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. సంఘ‌టిత సామ‌ర్థ్యాన్ని చూసి నా మ‌న‌సు కు ఎంతో న‌చ్చుతోంది. సంతోషం క‌లుగుతోంది. ఉదాహరణ కు ఝార్‌ఖండ్ లో రాంచీ నుంచి కొంచెం దూరంగా ఓర్ మాంఝీ బ్లాక్ లో ఆరా కేర‌మ్ గ్రామం లో అక్క‌డి గ్రామీణులు నీటి ఏర్పాట్ల గురించి ఎంత స్ఫూర్తి చూపించారంటే, అది అంద‌రికీ ఆద‌ర్శం అయిపోయింది. ఆ గ్రామ వాసులు కొండ మీద నుంచి ప‌డుతున్న జ‌ల‌పాతాన్ని ఒక దిశ వైపు తీసుకువెళ్ళే ప‌ని చేశారు. అది కూడా అస‌లైన దేశీయ ప‌ద్ధ‌తుల లో. దీనివ‌ల్ల మ‌ట్టి కోసుకుపోవ‌డం, పంట న‌ష్టం ఆగి, పొలాల‌కు నీళ్ళు అందుతున్నాయి. గ్రామీణుల ఈ శ్ర‌మ‌దానం గ్రామాని కి అంత‌టికీ జీవ‌న‌దానం క‌న్నా త‌క్కువేమీ కాదు. ఒక విషయం తెలిసి మీరంతా ఆనందప‌డ‌గ‌ల‌రు. అదేమిటంటే నార్త్ ఈస్ట్ లోని అంద‌మైన రాష్ట్రం మేఘాల‌య త‌న జ‌ల విధానం, వాట‌ర్ పాల‌సీ త‌యారు చేసుకొన్న దేశం లోనే మొట్ట మొద‌టి రాష్ట్రం అయింది. ఆ ప్ర‌భుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.

హ‌రియాణా లో నీటి అవ‌స‌రం త‌క్కువ ఉండి, రైతుకు కూడా న‌ష్టం లేన‌టువంటి పంట‌ల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది. అక్క‌డి ప్ర‌భుత్వం రైతుల తో చ‌ర్చ‌లు జ‌రిపి, వారి సాంప్ర‌దాయక‌మైన వ్య‌వ‌సాయ విధానాల‌కు బ‌దులుగా, త‌క్కువ నీటి అవ‌స‌రం ఉన్న పంట‌ల ను ప్రోత్స‌హించినందుకు నేను వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తాను.

ఇప్పుడు పండుగ‌ల స‌మ‌యం వ‌చ్చేసింది. పండుగ‌ల స‌మ‌యంలో అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లు/మేళాలు కూడా జ‌రుగుతాయి. అటువంటి చోట్ల‌ను జ‌ల సంర‌క్ష‌ణ కోసం ఎందుకు ఉప‌యోగించ‌కూడ‌దు? స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారు అక్క‌డ గుమిగూడ‌తారు. అక్క‌డ నీటిని పొదుపుగా వాడ‌డం గురించిన సందేశాలు చాలా ప్ర‌భావవంతంగా వినిపించ‌వ‌చ్చు. ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయ‌వ‌చ్చు. వీధి నాట‌కాలు వేయ‌వ‌చ్చు. ఉత్స‌వాల‌తో పాటు, జ‌ల సంర‌క్ష‌ణ సందేశం కూడా సులువుగా మ‌నం వారికి చేర్చ‌వ‌చ్చు.

స‌హ‌చ‌రులారా, జీవితం లో కొన్ని విష‌యాలు ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. ముఖ్యంగా పిల్ల‌ల సాధ‌న‌లు, విజ‌యాలు మ‌న‌కంద‌రికీ కొత్త శ‌క్తి ని ఇస్తాయి. కాబ‌ట్టి నాకు ఈ రోజు కొంద‌రు పిల్ల‌ల గురించి మాట్లాడాల‌ని అనిపిస్తోంది. ఈ పిల్ల‌లు – నిధి బాయిపోటు, మోనీశ్ జోషి, దేవాంశీ రావ‌త్‌, త‌నుశ్ జైన్‌, హ‌ర్ష్ దేవ‌ధ‌ర్ క‌ర్‌, అనంత్ తివారీ, ప్రీతి నాగ్‌, అథ‌ర్వ్ దేశ్ ముఖ్‌, అరోన్య‌తేశ్ గంగూలీ, హృదిక్ అలామందా.

వీరి గురించి నేను చెప్పేది వింటే మీకు ఎంతో గ‌ర్వం క‌లుగుతుంది. ఉత్సాహం వ‌స్తుంది. కేన్స‌ర్ మాట వింటేనే ప్ర‌పంచ‌మంతా ఎంత భ‌య‌ప‌డుతుందో మ‌న‌కంద‌రికీ తెలుసు. మృత్యువు గుమ్మంలో వేచి ఉంది అని తెలిసినా, ఈ ప‌ది మంది పిల్ల‌లు త‌మ జీవ‌న పోరాటంలో కేన్స‌ర్ ని, ఇంకా అటువంటి ఘాతుక‌మైన వ్యాధుల‌ని ఓడించి త‌మ సాధ‌న‌తో ప్ర‌పంచ‌మంత‌టా భార‌త‌దేశానికి పేరు తెచ్చారు. ఆట‌ల్లో ఒక ఆట‌గాడు టోర్న‌మెంట్ గెలిచిన త‌ర్వాత మెడ‌ల్ తెచ్చుకున్నాకే చాంపియ‌న్ అవ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ అరుదైన ఘ‌ట‌న‌లో వీరంతా ఆట‌ల పోటీలో పాల్గొన‌క‌ముందే చాంపియ‌న్లు. వాళ్ళు జీవిత పోరాటంలో చాంపియ‌న్లు.

ఈ నెల‌లో మాస్కోలో ప్ర‌పంచ బాల విజేత‌ల ఆట‌లు ఏర్పాటు చేశారు. ఇది ఒక విశిష్టమైన ఆట‌. ఇందులో కేన్స‌ర్ తో పోరాడి బ‌య‌ట‌ప‌డిన‌వాళ్ళే పాల్గొనే యంగ్ కేన్స‌ర్ స‌ర్వైవ‌ర్స్ పాల్గొనే స్పోర్ట్స్ టోర్న‌మెంట్‌. వీటిలో షూటింగ్‌, చ‌ద‌రంగం, ఈత‌, ప‌రుగుపందెం, ఫుట్ బాల్ మ‌రియు టేబిల్ టెన్నిస్ వంటి పోటీల ఏర్పాటు జ‌రిగింది. మ‌న దేశ‌స్తులైన ఈ ప‌ది మంది చాంపియ‌న్లు ఈ టోర్న‌మెంట్ లో మెడ‌ల్స్ గెలిచారు. కొంద‌రికైతే ఒక‌టి క‌న్నా ఎక్కువ మెడ‌ల్స్ కూడా వ‌చ్చాయి.

నా ప్రియ దేశ‌వాసులారా, ఆకాశాన్ని దాటి అంత‌రిక్షంలో భార‌త‌దేశ‌పు స‌ఫ‌ల‌త గురించి మీరంతా గ‌ర్వ‌ప‌డి ఉంటార‌ని నాకు న‌మ్మ‌కం ఉంది – చంద్ర‌యాన్-2.

రాజ‌స్థాన్ లోని జోధ్‌పుర్ నుంచి సంజీవ్ హ‌రీపురా, కోల్‌క‌త్తా నుంచి మ‌హేంద్ర‌కుమార్ డాగా, తెలంగాణ నుంచి పి. అర‌వింద‌రావు వంటి అనేకులు, దేశ‌మంతా వివిధ భాగాల నుంచి NarendraModi App & MyGov లలో వ్రాశారు. వారెంతా ‘మన్ కీ బాత్’ లో చంద్ర‌యాన్ -2 గురించి రిక్వెస్ట్ చేశారు.

నిజానికి అంత‌రిక్ష విష‌యం తీసుకుంటే 2019 భార‌త‌దేశానికి చాలా మంచి ఏడాదిగా చెప్పుకోవ‌చ్చు. మ‌న శాస్త్రవేత్త‌లు మార్చ్ లో A-Sat లాంచ్ చేశారు. త‌ర్వాత చంద్ర‌యాన్‌-2. కానీ ఎన్నిక‌ల హ‌డావిడి లో అప్పుడు A-Sat గురించి గొప్పగా చెప్పుకోద‌గినంత చ‌ర్చ‌ జరగలేదు. చెప్పాలంటే A-Sat మిస్సైల్ కేవ‌లం మూడు నిమిషాల్లో మూడొందల కిలో మీట‌ర్ల దూరం ఉన్న శాటిలైట్ ను ప‌డ‌గొట్టే సామ‌ర్ధ్యం క‌లిగి ఉంది. ప్ర‌పంచం లోనే దీనిని సాధించిన నాలుగో దేశం గా భార‌త్ నిలిచింది. ఇక ఇప్పుడు జులై 22వ తేదీన దేశ‌మంతా శ్రీ‌హ‌రికోట నుంచి అంత‌రిక్షం వైపు చంద్ర‌యాన్‌-2 ఎలా అడుగులు వేసిందో దేశ‌మంతా గ‌ర్వంగా చూసుకుంది. చంద్ర‌యాన్‌-2 లాంచ్ యొక్క ఫొటోలు దేశ‌వాసుల‌కు గౌర‌వం, ఉత్సాహం, సంతోషం చేకూర్చాయి.

చంద్ర‌యాన్‌-2 ఈ మిష‌న్ అనేక ర‌కాలుగా విశిష్ట‌మైన‌ది. చంద్ర‌యాన్‌-2 చంద్రుని గురించి మ‌న అవ‌గాహ‌న‌కు మ‌రింత స్ప‌ష్టత చేకూర్చుతుంది. దీని ద్వారా మ‌న‌కు చంద్రుడి గురించి మ‌రింత విస్తార‌మైన స‌మాచారం దొరుకుతుంది. అయితే, న‌న్న‌డిగితే చంద్ర‌యాన్-2 వ‌ల్ల మ‌న‌కు రెండు గొప్ప పాఠాలు ల‌భించాయ‌ని నేను చెప్ప‌గ‌ల‌ను. అవేమిటంటే – ఫెయిత్ మ‌రియు ఫియ‌ర్‌లెస్‌నెస్.. అంటే విశ్వాసం, నిర్భీక‌త‌, మ‌న‌కు మ‌న టాలెంట్‌, కెపాసిటీ ల గురించి న‌మ్మ‌కం ఉండాలి. మ‌న ప్ర‌తిభ‌, సామ‌ర్ధ్యాల గురించి విశ్వాసం ఉండాలి. చంద్ర‌యాన్‌-2 పూర్తిగా భార‌తీయ ప్ర‌తిభ తో రూపొందించ‌బ‌డింది అని తెలిస్తే మీరు త‌ప్ప‌క సంతోషిస్తారు. ఈ heart, spirit (హృదయం, ఉత్తేజం) భార‌తీయ‌మైన‌వి. ఇది పూర్తిగా స్వ‌దేశీ మిష‌న్‌, కొత్త కొత్త రంగాల్లో కొత్త ర‌కంగా ఏద‌న్నా సాధించడానికి గానీ, ఇనొవేటివ్ జీల్ లో గానీ మన శాస్త్రవేత్తలు సర్వ శ్రేష్ఠులని, విశ్వ-స్తరీయులనీ ఇది మరొకసారి నిరూపించింది.

మరొక ముఖ్యమైన పాఠం ఏమిటంటే ఏ ఒక ఆటంకానికి మ‌నం బెద‌రిపోకూడదు. మ‌న శాస్త్రజ్ఞులు రికార్డ్ టైమ్ లో ప‌గ‌లు రాత్రి ఏకం చేసి సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి చంద్ర‌యాన్‌-2 ను లాంచ్ చేయ‌డం అపూర్వ‌మైన విష‌యం. శాస్త్రజ్ఞుల ఈ మ‌హా త‌ప‌స్సును ప్ర‌పంచం గ‌మ‌నిస్తోంది. ఆటంకం వ‌చ్చినా కూడా చేరే స‌మ‌యాన్ని మార్చ‌కుండా వెళ్ళ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యంగా క‌నిపిస్తుంటే అది మ‌న‌కు గ‌ర్వ‌ప‌డాల్సిన విష‌యం. మ‌న జీవితంలో temporary set backs అంటే తాత్కాలిక క‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కానీ, వాటిని దాటి వెళ్ళ‌గ‌ల సామ‌ర్ధ్యం కూడా మ‌న లోప‌లే ఉంటుంద‌ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం దేశంలోని యువ‌కుల‌కు సైన్స్ మ‌రియు ఇన‌వేశ‌న్ వైపు ప్రేర‌ణ క‌లిగిస్తుంది. విజ్ఞాన‌మే అభివృద్ధికి మార్గం. ఇక చంద్రుని ఉప‌రితం మీద లాండ‌ర్ విక్ర‌మ్ మ‌రియు రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్ లాండ్ అయ్యే సెప్టెంబ‌ర్ నెల కోసం మ‌నం ఎదురుచూద్దాం.

ఈ రోజు ‘మ‌న్ కీ బాత్’ మాధ్య‌మం ద్వారా దేశంలోని విద్యార్థి మిత్రుల‌తో, యువ స‌హ‌చ‌రుల‌తో ఒక ఆస‌క్తిక‌ర‌మైన పోటీ గురించి, కాంపిటీష‌న్ గురించి వివ‌రాలు పంచుకుందామ‌నుకుంటున్నాను. దేశంలో యువ‌తీ యువ‌కుల‌ను ఆహ్వానిస్తున్నాను – ఒక క్విజ్ కాంపిటీష‌న్‌. అంత‌రిక్షానికి చెందిన జిజ్ఞాస‌, భార‌త్ యొక్క స్పేస్ మిశ‌న్‌, సైన్స్ & టెక్నాల‌జీ – ఈ క్విజ్ కాంపిటీష‌న్ యొక్క ముఖ్య విష‌యం. ఉదాహ‌ర‌ణ‌కు రాకెట్ లాంచ్ చేయ‌డానికి ఏమేం చేయాల్సి ఉంటుంది? శాటిలైట్ ఎలా ఆర్బిట్ లో ప్ర‌వేశ‌ పెట్ట‌బ‌డుతుంది? ఇంకా శాటిలైట్ తో మ‌నకు ఏఏ వివ‌రాలు అందుబాటులోకి వ‌స్తాయి? A-Sat ఏమిటి? చాలా విష‌యాలున్నాయి. MyGov Website లో ఆగ‌స్టు 1వ తేదీన ఫ‌లితాలు ఇవ్వ‌బ‌డ‌తాయి.

యువ సహచరులకు, విద్యార్థులకు ఇందులో పాల్గొన‌మ‌ని, ఈ క్విజ్ కాంపిటీష‌న్ లో పాల్గొని దీన్ని ఆస‌క్తిక‌రంగా, అవిస్మ‌ర‌ణీయంగా మార్చ‌మ‌ని నేను మ‌న‌వి చేస్తున్నాను. త‌మ త‌మ స్కూళ్ళ‌కు విజ‌యం క‌ల‌గ‌డానికి పూర్తి ప్ర‌య‌త్నం చేయ‌మ‌ని నేను పాఠ‌శాల‌ల‌ కు, ఉత్సాహ‌వంతులైన అధ్యాప‌కుల‌ కు, ఉపాధ్యాయుల‌ కు, సంర‌క్ష‌కుల‌ కు ప్ర‌త్యేక‌మైన విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. అందరు విద్యార్థుల‌ ను ఇందులో పాల్గొనేలా ప్రోత్స‌హించండి. ఇంకా ఆక‌ర్ష‌ణీయ‌మైన విష‌యం ఏమిటంటే ఇందులో ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల‌ కు ప్ర‌తి రాష్ట్రం నుంచి, భార‌త ప్ర‌భుత్వ‌మే ఖ‌ర్చు భ‌రించి శ్రీ‌హ‌రికోట కు తీసుకు వెళుతుంది. సెప్టెంబ‌ర్ లో చంద్ర‌యాన్ చంద్రుని ఉప‌రిత‌లం మీద లాండ్ అయ్యే క్ష‌ణాల‌ను స్వ‌యం గా చూసే అవ‌కాశం వారికి క‌లిగిస్తుంది. గెలిచిన విద్యార్థుల‌ కు ఈ విజ‌యం ఒక చారిత్ర‌క ఘ‌ట‌న‌ గా ఉండిపోతుంది. కానీ, ఇందుకు మీరు క్విజ్ కాంపిటీష‌న్ లో పాల్గొనాలి. అంద‌రికన్నా ఎక్కువ మార్కులు పొంద‌గ‌ల‌గాలి. విజ‌యం సాధించ‌గ‌ల‌గాలి.

స‌హ‌చ‌రులారా, నా ఈ స‌ల‌హా మీకు బాగా న‌చ్చి ఉండాలి. మ‌జా అయిన అవ‌కాశం క‌దూ. అయితే మ‌నం క్విజ్ లో పాల్గొన‌డం మ‌ర‌చిపోవ‌ద్దు. వీల‌యినంత ఎక్కువ మందిని పాల్గొనేలా ప్రేరేపిద్దాం.

నా ప్రియ దేశ‌వాసులారా, మీరు ఒక విష‌యం గ‌మ‌నించి ఉంటారు. మ‌న ‘మ‌న్‌ కీ బాత్’ లు అన్నీ స్వ‌చ్ఛ‌తా ఉద్య‌మాన్ని అడుగ‌డుగునా ముందుకు న‌డిపించాయి. అలాగే స్వ‌చ్ఛ‌త కోసం చేస్తున్న ప్‌ియ‌త్నాల‌న్నీ ‘మ‌న్ కీ బాత్’ కు ప్రేర‌ణ‌ గా నిలిచాయి. అయిదేళ్ళ క్రితం ప్రారంభ‌మైన ఈ ప్ర‌యాణం జ‌నులంద‌రి స‌హ‌కారం వ‌ల‌న స్వ‌చ్ఛ‌త యొక్క కొత్త కొత్త మైలురాళ్ళ‌ను చేరుకుంటున్న‌ది. స్వ‌చ్ఛ‌త లో మనం ఆద‌ర్శ స్థితి కి చేరామ‌ని కాదు గానీ, ఎలాగైనా ఇది ఒడిఎఫ్ నుంచి మొద‌లుకొని, ప‌బ్లిక్ స్థలాలో స్వ‌చ్ఛ‌త ఉద్య‌మం వ‌ర‌కు ల‌భించిన సాఫ‌ల్య‌త 130 కోట్ల దేశ‌వాసుల సంక‌ల్ప బ‌లం. అయితే మ‌నం ఇక్క‌డే ఆగిపోము. ఈ ఉద్య‌మం స్వ‌చ్ఛ‌త నుంచి సుంద‌ర‌త వ‌ర‌కు సాగుతుంది. ఈ మ‌ధ్యే కొన్ని రోజుల ముందు మీడియా లో శ్రీ‌మాన్ యోగేశ్ సైనీ, వారి బృందం, వారి క‌థ చూశాను. యోగేశ్ సైనీ ఇంజినీర్‌. అమెరికా లో త‌న ఉద్యోగం వ‌దులుకొని, భార‌త‌ మాత సేవకై తిరిగి వ‌చ్చారు. వారు కొంత కాలం క్రింద‌ట ఢిల్లీ ని స్వ‌చ్ఛంగా మాత్ర‌మే కాదు, అందంగా చేసే ప్ర‌య‌త్నాన్ని మొద‌లు పెట్టారు. వారు త‌మ బృందం తో పాటు, లోథీ గార్డెన్ యొక్క చెత్త‌కుండీల నుంచి ప‌ని మొద‌లు పెట్టారు. స్ట్రీట్ ఆర్ట్ ద్వారా, ఢిల్లీ లోని చాలా ప్రాంతాల‌ ను అంద‌మైన పెయింటింగ్స్ ద్వారా అలంక‌రించే ప‌ని చేప‌ట్టారు. ఓవ‌ర్ బ్రిడ్జ్‌, బ‌డి గోడ‌ల ద‌గ్గ‌ర నుండి స్ల‌మ్ లోని గుడిసెల వ‌ర‌కు త‌మ క‌ళ ద్వారా అందం గా చెక్క‌డం మొద‌లు పెట్టాక ప్ర‌జ‌ల స‌హ‌కారం కూడా ల‌భిస్తుండ‌గా ఈ ప‌రంప‌ర కొన‌సాగింది. కుంభమేళా లో ప్ర‌యాగ్‌రాజ్ ని ఏ విధంగా స్ట్రీట్ పెయింటింగ్ ద్వారా అలంక‌రించారో మీకు గుర్తుండే ఉంటుంది. నాకు తెలిసింది. భాయి యోగేశ్ సైనీ, వారి బృందం ఇందులో పెద్ద పాత్ర వ‌హించింది. రంగుల్లో, రేఖ‌ల్లో ఏ స్వ‌ర‌ము ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, వీటితో త‌యారైన చిత్రాల‌తో త‌యారైన ఇంద్ర‌ధ‌నుస్సు ఇచ్చే సందేశం వేల మాట‌ల క‌న్నా ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌ని నిరూపించ‌బ‌డుతుంది. స్వ‌చ్ఛ‌తా ఉద్య‌మ‌పు అందం లో కూడా మ‌న‌కు ఈ మాట అనుభ‌వం లోకి వ‌స్తుంది. వేస్ట్ నుంచి వెల్త్ (చెత్త నుంచి విత్తం) త‌యారు చేసే సంస్కృతి మ‌న స‌మాజం లో డెవ‌ల‌ప్ కావాలి. ఒక ప్ర‌కారం గా మ‌నం వ్య‌ర్థం నుంచి అర్థం త‌యారు చేసే దిశ‌లో ముందుకు న‌డ‌వాలి.

నా ప్రియ దేశ‌వాసులారా, కొన్ని రోజుల క్రింద‌ట MyGov లో నేను ఒక ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చ‌దివాను. జ‌మ్ము, క‌శ్మీర్ లోని శోపియా లోని మ‌హ‌మ్మ‌ద్ అస్ల‌మ్ భాయి వ్రాసిన వ్యాఖ్య అది.

వారు వ్రాశారు, ‘మ‌న్ కీ బాత్’ కార్య‌క్ర‌మం విన‌డం బాగుంటుంది. మా జ‌మ్ము,క‌శ్మీర్ రాష్ట్రం లో క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్ ప్రోగ్రామ్ – బాక్ టు విలేజ్ (ప‌ల్లె వైపు ప‌య‌నం) ఏర్పాటు లో నేను క్రియాశీల‌మైన పాత్ర పోషించాన‌ని చెప్ప‌డానికి నాకు చాలా సంతోషం గా ఉంది. ఈ కార్య‌క్ర‌మం జూన్ నెల‌ లో ఏర్పాట‌యింది. ప్ర‌తి మూడు నెల‌ల‌ కు ఒక‌సారి ఇటువంటి కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాల‌ని నాకు అనిపిస్తుంది. దాంతో పాటు, ఈ కార్య‌క్ర‌మం పై ఆన్‌లైన్ మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ కూడా ఉండాలి. నాకు తెలిసి ప్ర‌జ‌లు నేరుగా ప్ర‌భుత్వం తో సంధానించే కార్య‌క్ర‌మం ఇదే మొద‌టిది అనుకుంటున్నాను.
మ‌హ‌మ్మ‌ద్ అస్ల‌మ్ భాయి వ్రాసిన ఈ సందేశం నాకు పంపారు. ఇది చదివాక ‘బాక్ టు విలేజ్‌’ కార్య‌క్ర‌మం గురించి తెలుసుకోవాల‌ని నాకు ఉత్సాహం పెరిగిపోయింది. దీని గురించి వివ‌రంగా తెలుసుకున్నాక ఇది దేశ‌మంతా తెలుసుకోవాల్సిన విష‌యం అని నాకు అనిపించింది. క‌శ్మీరు ప్ర‌జ‌లు అభివృద్ధి యొక్క ముఖ్య స్ర‌వంతి లో క‌ల‌వ‌డానికి ఎంత త‌పిస్తున్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ కార్య‌క్ర‌మం ద్వారా తెలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మం లో మొద‌టిసారిగా పెద్ద పెద్ద అధికారులు నేరుగా ప‌ల్లెల‌ కు చేరారు. ఏ అధికారుల‌నైతే ప్ర‌జ‌లు ఎప్పుడూ చూడ‌లేదో, వారు స్వ‌యం గా బ‌య‌లుదేరి త‌మ గుమ్మం ముందుకు వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ కు గ‌ల ఆటంకాల‌ను తెలుసుకొని దూరం చేయ‌డానికి వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మం వార‌మంతా జ‌రిగింది. రాష్ట్రం లోని దాదాపు నాలుగున్‌రర వేల పంచాయ‌తీల్లో ప్ర‌భుత్వ అధికారులు గ్రామీణుల‌ కు ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల‌ ను, కార్య‌క్ర‌మాల‌ ను గురించిన వివ‌రాల‌న్నీ విశ‌దం గా తెలిపారు. ఈ ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వారి వ‌ర‌కు చేరుతున్నాయా, లేదా? అని ప‌రిశీలించారు. పంచాయ‌తీల సామ‌ర్థ్యం ఇంకా ఎలా పెంచ‌వ‌చ్చు? వాటి ఆదాయాన్ని ఎలా పెంచ‌వ‌చ్చు? వాటి సేవ‌లు సామాన్య మాన‌వుల జీవితాల‌పై ఎటువంటి ప్ర‌భావాన్ని చూపించ‌గ‌ల‌వు? గ్రా మీణులు కూడా తమ స‌మ‌స్య‌ల‌ ను విపులం గా తెలిపారు. సాక్ష‌ర‌త‌, సెక్స్ రేషియో, ఆరోగ్యం, స్వచ్ఛ‌త‌, జ‌ల సంర‌క్ష‌ణ‌, విద్యుత్తు, నీరు, బాలిక‌ల విద్య‌, వృద్ధుల పెన్ష‌న్ కు.. సంబంధించిన ప్ర‌శ్న‌లు ఇటువంటి అనేక విష‌యాల పైన చ‌ర్చ జ‌రిగింది.

స‌హ‌చ‌రులారా, ఇది కేవ‌లం ప్ర‌భుత్వం సాంప్ర‌దాయం కోసం ఒక రోజు గ్రామం లో తిరిగి వ‌చ్చారు అన్న‌ట్టు కాకుండా, ఈ సారి అధికారులు రెండు రోజులు, ఒక రాత్రి పంచాయ‌తీలోనే ఉన్నారు. దీంతో వారికి గ్రామం లో స‌మ‌యం గ‌డ‌ప‌డానికి త‌గిన అవ‌కాశం దొరికింది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ప్ర‌తి సంస్థానాని కి చేరే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కార్య‌క్‌ మాన్ని ఆస‌క్తిక‌రం గా త‌యారు చేయ‌డానికి, ఇంకా చాలా విష‌యాలు చేర్చారు. ఖేలో ఇండియా త‌ర‌ఫున పిల్ల‌ల‌ కు ఆట‌ల పోటీలు నిర్వ‌హించారు. అక్క‌డే స్పోర్ట్స్ కిట్స్‌, మ‌న్ రేగా యొక్క జాబ్ కార్డ్ స్, ఎస్‌సి, ఎస్‌టి స‌ర్టిఫికెట్స్ పంచిపెట్టారు. ఫైనాన్షియ‌ల్ లిట‌ర‌సీ (ఆర్థిక అక్ష‌రాస్య‌త‌) క్యాంపులు ఏర్పాటు చేశారు. వ్య‌వ‌సాయం, తోట‌ల పెంప‌కం వంటి ప్ర‌భుత్వ విభాగాల త‌ర‌ఫు నుంచి స్టాల్స్ ఏర్పాటు చేసి, ప‌లు ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల గురించి వివ‌రాల‌ ను అందించారు. ఒక ర‌కం గా ఈ కార్య‌క్ర‌మం ఒక అభివృద్ధి ఉత్స‌వం అయింది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌పు ఉత్స‌వం అయింది. జ‌న‌జాగృతి ఉత్స‌వం అయింది. క‌శ్మీర్ ప్ర‌జ‌లు అభివృద్ధి యొక్క ఈ ఉత్స‌వం లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా సంతోష‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే చేరుకోవ‌డానికే ఒక రోజు, ఒక‌టిన్నర రోజు ప‌ట్టే దుర్గ‌మ‌మైన కొండ దారుల్లో వెళ్ళాల్సిన గ్రామాల‌ కు కూడా ప్ర‌భుత్వాధికారులు చేరుకుని ‘బాక్ టు విలేజ్’ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ స‌రిహ‌ద్దు లో కాల్పులు జ‌రిగే ప్రాంతం లో ఉన్న స‌రిహ‌ద్దు గ్రామ పంచాయ‌తీల‌కు కూడా ఈ అధికారులు వెళ్ళారు. అంతేగాక‌, శోపియా, పుల్వామా, కుల్గామ్ మ‌రియు అనంత్‌ నాగ్ జిల్లాల లోని అతి ఉద్రిక్త‌మైన ప్రాంతాల‌ కు కూడా అధికారులు నిర్భ‌యం గా చేరుకున్నారు. చాలా మంది అధికారులు గ్రామాల్లో త‌మ‌కు ల‌భించిన స్వాగ‌త స‌త్కారాల‌ కు ముగ్ధులై రెండు రోజులు అక్క‌డే ఉండిపోయారు. ఈ ప్రాంతాల్లో గ్రామ స‌భ‌లు ఏర్పాటు కావ‌డం, వాటి లో పెద్ద సంఖ్య లో ప్ర‌జ‌లు పాల్గొన‌డం అందులో త‌మ కోసం ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసుకోవ‌డం ఇవ‌న్నీ సంతోష‌క‌ర‌మైన విష‌యాలు. కొత్త సంక‌ల్పం, కొత్త ఉత్సాహం మ‌రియు గొప్ప ఫ‌లితాలు.. ఈ కార్య‌క్ర‌మం, ఇందులో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం చెప్తున్నాయి. స్ప‌ష్టం గా మ‌న సోద‌ర సోద‌రీమ‌ణులు గుడ్ గ‌వ‌ర్నెన్స్ కోరుకుంటున్నారు అని. అభివృద్ధి యొక్క శ‌క్తి.. బాంబులు, తుపాకుల శ‌క్తి క‌న్నా బ‌ల‌మైన‌ద‌ని ఈ విష‌యం నిరూపిస్తుంది. ఎవ‌రైతే అభివృద్ధి మార్గం లో ద్వేషాల ను పెంచాల‌నుకుంటారో, ఆటంకం తేవాల‌నుకుంటారో వారు త‌మ చెడు ఉద్దేశాల‌ లో ఎప్పటికీ స‌ఫ‌లం కాలేర‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌వుతుంది.

నా ప్రియ దేశ‌వాసులారా, జ్ఞాన‌పీఠ పుర‌స్కారం తో గౌర‌వించ‌బ‌డిన శ్రీ‌మాన్ ద‌త్తాత్రేయ రామ‌చంద్ర బెంద్రే త‌న ఒక క‌విత లో శ్రావ‌ణ మాస మ‌హిమ ను ఇలా కీర్తిస్తారు.

కవితలో వారంటారు.

హొళిగె మళిగె ఆగ్యేద ల‌గ్న‌. అద‌రాగ భూమి మ‌గ్న‌.

అర్థ‌మేమిటంటే – వాన తుంప‌ర కు, నీటి ధార కు ఉన్న బంధ‌నం విశిష్ట‌మైన‌ది. ఆ సౌంద‌ర్యం చూడ‌డం లో భూమి నిమ‌గ్న‌మైంది.

భార‌త‌దేశ‌మంత‌టా వేర్వేరు సంస్కృతులు మ‌రియు భాష‌ల ప్ర‌జ‌లు శ్రావ‌ణ మాసాన్ని త‌మ త‌మ ప‌ద్ధ‌తుల లో సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఈ రుతువు లో మ‌న చుట్టుప‌క్క‌ల చూశామంటే, భూమి ప‌చ్చ‌టి వ‌స్త్రం క‌ప్పుకున్న‌ట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు దిక్కులా ఒక కొత్త శ‌క్తి సంచారం అవ‌డం మొద‌ల‌వుతుంది. ఈ ప‌విత్ర మాసం లో ఎందరో భ‌క్తులు కాఁవ‌డ్ (హ‌రిద్వార్‌) యాత్ర, అమ‌ర‌నాథ్ యాత్ర‌ల‌ కు వెళ్తారు. కొంద‌రు నియ‌మానుసారం ఉప‌వాసాలు చేస్తారు. ఉత్సాహం గా జ‌న్మాష్ట‌మి, నాగ‌ పంచ‌మి వంటి పండుగ‌ల కోసం వేచి చూస్తారు. ఈ స‌మ‌యం లో సోద‌రీ సోద‌రుల ప్రేమ‌ కు ప్ర‌తీక అయిన ర‌క్షాబంధ‌న్ పండుగ కూడా వ‌స్తుంది. శ్రావ‌ణ మాసం మాట వ‌చ్చిన‌ప్పుడు ఇంకో విష‌యం కూడా వింటే మీకు సంతోషం క‌లుగుతుంది. ఈసారి అమ‌ర‌నాథ్ యాత్ర కు క్రింద‌టి నాలుగు ఏళ్ళ క‌న్నా ఎక్కువ మంది భ‌క్తులు వెళ్ళారు. జులై 1వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ల‌క్ష‌ల కంటే ఎక్కువ మంది తీర్థ‌ యాత్రికులు ప‌విత్ర అమ‌ర‌నాథ్ గుహ యొక్క ద‌ర్శ‌నం చేసుకున్నారు. 2015 లో 60 రోజుల‌ లో ఈ యాత్ర‌ లో ఎంత మంది పాల్గొన్నారో, అంత‌కంటే ఎక్కువ‌గా ఈ సారి 28 రోజుల‌ లోనే పాల్గొన్నారు.

అమ‌ర‌నాథ్ యాత్ర స‌ఫ‌ల‌త విష‌యం లో నేను ముఖ్యం గా జ‌మ్ము, క‌శ్మీర్ ప్ర‌జ‌ల ను, వారి అతిథి స‌త్కారాల ను ప్ర‌శంసిస్తాను. అక్క‌డి కి వెళ్ళి యాత్ర నుంచి తిరిగి వ‌చ్చిన వారంతా, ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల యొక్క ఉత్సాహం, ఆత్మీయ‌త చూసి సంతోషిస్తారు. ఈ విష‌యాల‌న్నీ భ‌విష్య‌త్తు లో ప‌ర్యాట‌క రంగాని కి ఎంతో లాభ‌దాయ‌కం గా నిరూపించ‌ బ‌డ‌నున్నాయి. ఉత్త‌రాఖండ్ లో కూడా ఈ సారి చార్‌ధామ్ యాత్ర ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నెల‌న్న‌ర లోప‌లే ఎనిమిది ల‌క్ష‌ల మంది క‌న్నా ఎక్కువ భ‌క్తులు కేదార్‌నాథ్ ధామ్ ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని నాకు తెలిసింది. 2013 లో వ‌చ్చిన భ‌యంక‌ర‌మైన విప‌త్తు త‌ర్వాత మొద‌టిసారి ఇంత రికార్డు సంఖ్య లో తీర్థ యాత్రికులు అక్క‌డికి చేరుకున్నారు.

మీ అంద‌రికీ నా ఒక విన్న‌పం ఏమిటంటే, దేశం లో వ‌ర్షాకాలం లో ఏ ప్ర‌దేశాలు అందం గా ఉంటాయో, ఆ ప్రాంతాల‌ కు మీరంతా త‌ప్ప‌కుండా వెళ్ళండి.

మ‌న దేశం లో ఈ అందాల‌ను చూడ‌డానికి మ‌న దేశం లోని జ‌నాల ఆత్మ‌ ను తెలుసుకోవ‌డానికి టూరిజం యాత్ర వీటిక‌న్నా పెద్ద ఉపాధ్యాయులు ఎవ‌రూ ఉండ‌రు.

ఈ అంద‌మైన‌, జీవంత‌మైన శ్రావ‌ణ మాసం మీ అంద‌రిలో కొత్త శ‌క్తి, కొత్త ఆశ‌, కొత్త ఆకాంక్ష‌ల‌ ను చేర్చాల‌ని, మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ఆగ‌స్టు నెల భార‌త్ ఛోడో ను కూడా అలాగే గుర్తు చేస్తుంది. ఈ ఆగ‌స్టు 15 మీరు ప్ర‌త్యేక ప్ర‌య‌త్నాలు ఏమైనా చేయండి. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డానికి కొత్త ప‌ద్ధ‌తుల‌ ను ఆలోచించండి. జ‌నులు ఎక్కువ‌ గా పాల్గొనాలి. 15 ఆగ‌స్టు ప్ర‌జ‌ల పండుగ గా, అంద‌రి పండుగ గా ఎలా చేయాలి? దీని గురించి త‌ప్ప‌క ఆలోచించండి. ఇంకో ప‌క్క దేశం లోని చాలా చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్న స‌మ‌య‌మిది. చాలా ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం ఉంది. వ‌ర‌ద వ‌ల్ల అనేక న‌ష్టాల‌ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ‌ర‌ద సంక్షోభం లో ఇరుక్కున్న ప్ర‌జ‌ల కు నేను హామీ ఇస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి బాధితులైన ప్ర‌జ‌ల‌ కు ప్ర‌తి యొక్క స‌హాయం అందించేట‌ట్లు ప‌నులు వేగం గా జరుగుతున్నాయి. మ‌నం టివి లో వ‌ర్షాల యొక్క ఒక ప‌క్ష‌మే చూస్తాం. అన్ని చోట్లా వ‌ర‌ద‌లు, నీరు నిల‌చిపోవ‌డం, ట్రాఫిక్ జామ్‌. వ‌ర్ష రుతువు యొక్క ఇంకొక చిత్రం.. దీనివ‌ల్ల ఆనందం పొందే మ‌న రైతులు, కువ‌కువ‌లాడే ప‌క్షులు, పారే సెల‌యేళ్ళు, ప‌చ్చ‌ద‌న‌పు వ‌స్త్రం అలంక‌రించుకున్న భూమి.. దీన్ని చూడ‌డానికి మీరు కుటుంబం తో స‌హా యాత్ర కు వెళ్ళాల్సి ఉంటుంది. వ‌ర్షం – తాజాద‌నం, సంతోషం అంటే, ఫ్రెష్ నెస్‌, హాపీనెస్ రెండింటినీ త‌న వెంట తెస్తుంది. ఈ వ‌ర్షాకాలం మీకు నిరంత‌ర సంతోషాల‌ ను ఇవ్వాల‌ని నా ఆకాంక్ష‌. మీరంతా ఆరోగ్యం గా ఉందురుగాక‌.

నా ప్రియ దేశ‌వాసులారా, ‘మ‌న్ కీ బాత్’ – ఎలా మొద‌లు పెట్టాలి, ఎక్క‌డ ఆపాలి. చాలా క‌ష్టం గా అనిపిస్తుంది. కానీ, స‌మ‌యానికి హ‌ద్దు ఉంటుంది. ఒక నెల ఎదురు చూశాక మ‌ళ్ళీ వ‌స్తాను. మ‌ళ్ళీ క‌లుస్తాను. నెలంతా మీరు నాకు చాలా మాట‌లు చెప్పండి. వ‌చ్చే ‘మ‌న్ కీ బాత్’ లో వాటిన‌న్నింటిని చేర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. యువ స‌హ‌చ‌రుల‌కు గుర్తు చేస్తున్నా, మీరు క్విజ్ కాంపిటీష‌న్ అవ‌కాశాన్ని పోగొట్టుకోకండి. మీరు శ్రీ‌హ‌రికోట వెళ్ళే అవ‌కాశం ఉంది. దీన్ని ఎట్టి ప‌రిస్థితి లోను పోనివ్వ‌కండి.

మీకంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు. న‌మ‌స్కారాలు.