బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ ను నివారించే పన్ను ఒప్పందం అమలుకు సంబంధించిన చర్యల బహుముఖీన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ప్రభావం:
వివిధ దేశాలతో పన్ను ఒప్పందాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం నష్టం కలిగిస్తున్న భారతదేశానికి చెందిన ఒప్పందాలన్నింటినీ ఈ ఒడంబడిక సవరిస్తుంది. తద్వారా బేస్ ఎరోజన్, లాభాల తరలింపు వ్యూహాలకు అడ్డుకట్ట వేసి ఎక్కడైతే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించి లాభాలు ఆర్జిస్తున్నారో, విలువ జోడించుకుంటున్నారో అక్కడే పన్నులు విధించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
వివరాలు:
i. పన్ను ఒప్పందాలకు సంబంధించిన చర్యలను పటిష్ఠంగా అమలుపరచడం ద్వారా బేస్ ఎరోజన్, లాభాల తరలింపు చర్యలను నిలువరించే బహుముఖీన ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. 2017 జూన్ ఏడో తేదీన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ప్యారిస్ లో దీనిపై భారతదేశం తరఫున సంతకం చేశారు.
ii. బేస్ ఎరోజన్, లాభాల తరలింపు (బిఇపిఎస్ ప్రాజెక్టు) చర్యల నిరోధానికి ఒఇసిడి/ జి20 దేశాలు చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ బహుముఖీన ఒప్పందం కుదిరింది. వివిధ దేశాల్లో అమలులో ఉన్న పన్ను నిబంధనల్లో లోటుపాట్లు, తేడాలను ఉపయోగించుకుని అసలు పన్నుభారం లేని లేదా తక్కువ పన్ను భారం ఉన్న దేశాలకు లాభాల తరలింపునకు అనుసరించే పన్ను ప్రణాళికల వ్యూహాన్నే బిఇపిఎస్ గా వ్యవహరిస్తారు. ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు లేని లేదా స్వల్పంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే దేశాలకు లాభాల తరలింపు వల్ల అసలు పన్నులే చెల్లించాల్సిన అవసరం లేకపోవడం లేదా స్వల్ప మొత్తంలోనే పన్నులు చెల్లించడం జరుగుతోంది. సమగ్ర దృక్పథంతో బేస్ ఎరోజన్, లాభాల తరలింపు చర్యలను నిరోధించగల 15 కార్యాచరణలకు బిఇపిఎస్ ప్రాజెక్టు గుర్తించింది.
iii. జి20, ఒఇసిడి దేశాలు, బిఇపిఎస్ అసోసియేట్లు, ఇతర ఆసక్తి గల దేశాలకు భాగస్వామ్యం గల 100కి పైగా దేశాల అడ్ హాక్ బృందంలో భారత్ కూడా భాగస్వామిగా ఉంది. 2015 నుంచి కృషి చేసిన ఈ సంస్థ బహుముఖీన ఒప్పందం ప్రతిని తయారుచేసింది. 2016 నవంబర్ 24న ఈ అడ్ హాక్ బృందం బహుముఖీన ఒప్పందం ముసాయిదా, అందుకు సంబంధించిన వివరణ పత్రాలను ఆమోదించింది.
iv. కార్యాచరణ 6 కింద ఒప్పందాలను దుర్వినియోగం చేయడాన్ని నిలువరించేందుకు కనీస ప్రమాణాల రూపకల్పనతో సహా బిఇపిఎస్ ప్యాకేజిలో భాగమైన పన్ను సంబంధిత కనీస ప్రమాణాలకు సంతకాలు చేసిన దేశాలన్నీ కట్టుబడేందుకు ఈ బహుముఖీన ఒప్పందం దోహదకారి అవుతుంది.
v. ఈ బహుముఖీన ఒప్పందంలో భాగస్వాములైన రెండు లేదా అంతకు మించిన దేశాల మధ్య పన్ను ఒప్పందాల సవరణకు ఇది అనుమతిస్తుంది. ఇప్పటికే అమలులో ఉన్న ఒక ఒప్పందంలో సవరణలకు సంబంధించిన ప్రొటోకాల్ వర్తించే ధోరణిలోనే అన్నింటికీ ఇది వర్తించదు. అందుకు భిన్నంగా వర్తమాన పన్ను ఒప్పందాలతో పాటుగా బిఇపిఎస్ చర్యలకు అనుగుణంగా వివిధ ఆచరణీయ అంశాలను సవరించేందుకు ఇది దోహదకారి అవుతుంది.
vi. పన్ను ఒప్పందాల దుర్వినియోగం ద్వారా ఆదాయ నష్టాన్ని నిలువరించడం, బేస్ ఎరోజన్, లాభాల తరలింపు వ్యూహాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న లేదా విలువ జోడించుకుంటున్న ప్రదేశాల వద్ద పన్ను ఎగవేయడం వంటి చర్యలను నిరోధించేందుకు భారతదేశం ఒప్పందాలను సవరించుకునేందుకు ఈ బహుముఖీన ఒప్పందం సహాయకారి అవుతుంది.
పూర్వరంగం:
ఒఇసిడి/ జి 20 దేశాలు చేపట్టిన ప్రాజెక్టు సాధించిన ప్రయోజనాల్లో ఈ ఒప్పందం కూడా ఒకటి. ఈ ఒప్పందంలో భాగస్వామి కావడం ద్వారా భారతదేశం బేస్ ఎరోజన్, లాభాల తరలింపు ప్రయత్నాలను సమర్థవంతంగా నిలువరించగలుగుతుంది. బిఇపిఎస్ ఫలితాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి వీలుగా పన్ను ఒప్పందాలను సవరించుకునేందుకు భాగస్వామ్య దేశాలకు ఈ ఒప్పందం స్వేచ్ఛ కల్పిస్తుంది. దీని వల్ల ద్వైపాక్షికంగా ఒప్పందాల కోసం మళ్లీ మళ్లీ చర్చలు నిర్వహించాల్సిన పని లేకుండానే బహుముఖీన మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేసే వీలు కలుగుతుంది. ఇలాంటి ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల అదనపు భారమే కాకుండా కాలయాపన కూడా జరుగుతోంది. బహుముఖీన ధోరణిలో బిఇపిఎస్ ప్రాజెక్టు అమలుపరచడంలో నిలకడ, స్థిరత్వం కల్పిస్తుంది. బిఇపిఎస్ ప్రయోజనాల పరిధిలో ప్రస్తుత పన్ను ఒప్పందాలను సవరించుకోవడానికి బహుముఖీన ఒప్పందం దోహదపడుతుంది. ఎంఎల్ఐని ధ్రువీకరించాలని కోరుతూ 2019 ఏప్రిల్ 26వ తేదీన కేబినెట్ నోట్ పంపారు. అయితే దానికి గల అత్యవసర ప్రాధాన్యం దృష్ట్యా గౌరవ ప్రధానమంత్రి కేబినెట్ సచివాలయం ఉత్తర్వు 216/1/2/2019-Cab ద్వారా 2019 మే 27న దాన్ని ఆమోదించారు. అయితే భారత ప్రభుత్వ (కార్యకలాపాల నిర్వహణ) నిబంధనలు 1961, నిబంధన 12 కింద తుది ఆమోదం కోసం నెల రోజుల లోపు కేబినెట్ ముందుంచడం తప్పనిసరి అయింది. ఆ నిబంధనకు అనుగుణంగానే ఎల్ అండ్ టి విభాగం, ఎంఇఏలకు భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వు OM F.No. 500/71/2015-FTD-I/150 కింద 2019 మే 31వ తేదీన ధ్రువీకరణ ప్రతి కేబినెట్ కి అందింది.