ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోతే షేరింగ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నేడు దేశాధినేతలిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయంద్వారా మరోసారి ఆ పదవిని చేపట్టడంపై డాక్టర్ లోతే షేరింగ్ అభినందనలు తెలిపారు. అలాగే మాననీయులైన భూటాన్ రాజు తరఫున ప్రధానికి అభినందనలు అందజేశారు. అంతేకాకుండా ఆ దేశ ప్రజల తరఫున ఆయనతోపాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ, సౌహార్దతను ప్రకటించారు. రెండు దేశాల సౌభాగ్యం దిశగా భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీతో సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని డాక్టర్ లోతే షేరింగ్ చెప్పారు. ఇందులో భాగంగా వీలైనంత త్వరగా భూటాన్ పర్యటనకు రావాలని ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం పలికారు. కాగా, తన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై, శుభాకాంక్షలు తెలిపినందుకుగాను భూటాన్ ప్రధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భాగస్వామ్యంతోపాటు జలవిద్యుత్ రంగంలో భూటాన్‘తో సహకారానికి భారత్ ఎంతో విలువనిస్తున్నదని ఆయనకు తెలియజేశారు. భూటాన్ సౌభాగ్యం, శ్రేయస్సు దిశగా భాగస్వామ్యానికి భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. భూటాన్ పర్యటనకు అందిన ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఉభయులకూ వెసులుబాటుగల తేదీలను నిర్ణయిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. కాగా, ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన సమావేశం- రెండు దేశాల మధ్యగల సన్నిహిత, స్నేహ సంబంధాలకు ప్రతీకగా… సాదర, స్నేహపూర్వక వాతావరణంలో పరస్పర విశ్వాసం, సహకారం, అవగాహనల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సాగింది.