1925 సంవత్సర సిక్కు గురుద్వారాల చట్టంలో సవరణ కోసం దేశీయాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి పరిశీలించి, దానిపై ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. 1925 సంవత్సర సిక్కు గురుద్వారాల చట్టం ద్వారా ఏర్పాటు చేసిన బోర్డు, కమిటీల సభ్యుల ఎన్నికలలో ఓటు వేసేందుకు 1944 సంవత్సరంలో సహజధారి సిక్కులకు ఇచ్చిన మినహాయింపును ఎత్తివేయాలని, ఇందుకోసం సదరు చట్టాన్ని పార్లమెంట్ మాధ్యమం ద్వారా సవరించాలన్నది దేశీయాంగ మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ప్రతిపాదన సారాంశం.
దీనికి అనుగుణంగా పార్లమెంట్ ద్వారా 1925 సంవత్సర సిక్కు గురుద్వారాల చట్టంలో సవరణ చేయాలన్న దేశీయాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ 08.10.2003 నాటి నుంచి అమలులోకి వచ్చినట్లుగా లెక్క లోకి తీసుకుంటారు.
ప్రతిపాదిత చట్ట సవరణను 08.10.2003 తేదీ నాటి నోటిఫికేషన్ లో దేశీయాంగ మంత్రిత్వ శాఖ వెల్లడి చేసింది. ఇందుకోసం 1966 సంవత్సర పంజాబ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోని 72వ సెక్షన్ కింద పార్లమెంటుకు ధారదత్తమైన అధికారాలను వినియోగించుకోవడమైనది. అయితే, ఈ నోటిఫికేషన్ ను పంజాబ్ అండ్ హరియాణా ఉన్నత న్యాయస్థానం 20.12.20111 తేదీ నాటి ఉత్తర్వులో రద్దు చేసింది. చట్టంలో పైన ప్రస్తావించిన మేరకు సవరణను చేయాలో, లేక వద్దో అనేది నిర్ణయించేందుకు తగిన అధికారం లెజిస్లేచర్ కే ఉన్నట్లు ఉన్నత న్యాయస్థానం తన ఆదేశంలో పేర్కొన్నది.